శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రమాద రహిత సమాజమే రవాణాశాఖ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జనవరి 20: ప్రతి ఒక్కరూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరడమే రవాణాశాఖ లక్ష్యమని జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎన్ శివరామ్‌ప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో 28వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ రహదారి సూత్రాలు పాటించి గమ్యస్థానం క్షేమంగా చేరేందుకు కంకణబద్దులై ఉండాలని సూచించారు. వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి లైసెన్సు కలిగి ఉండి, రహదారి సూత్రాలు పాటించాలని పేర్కొన్నారు. చిన్న పొరపాటు జరిగినా వాహనం నడిపే వ్యక్తితో పాటు వాహనంలో ఉన్న వారు సైతం ప్రాణాలు పోగొట్టుకోవడమో, అంగవికలరులు కావడమో జరుగుతుందని, జరిగిన తరువాత బాధపడే కంటే ప్రమాదం జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు వహించడం ఎంతైనా అవసరమన్నారు. గతంలో రోడ్లు, వాహనాల పరిస్థితి వేరు, ప్రస్తుత రహదారులు, వాహనాల పరిస్థితులు వేరని, రోడ్లపై అతివేగంతో ఏ చిన్న పొరపాటు జరిగినా నిండునూరేళ్లు గాలిలో కలసి పోతాయని, ప్రాణాలు పోయిన తరువాత చేసేది లేదని, కేవలం ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు వహిస్తే చాలని పేర్కొన్నారు. గత ఏడాది 5వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని, అందులో ద్విచక్రవాహన చోదకుల సంఖ్య 27శాతం ఉందన్నారు. దీనికి మితిమీరిన వేగం, యువత అదుపులేని డ్రైవింగ్, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలని చెప్పారు. చట్టాలెన్ని ఉన్నా వాటిని ఆచరించే వారిలో చిత్తశుద్ది ఉంటేనే చట్టాలు పటిష్టంగా అమలు జరుగుతాయన్నారు. కేవలం అధికారులే అన్నింటికి బాధ్యత వహించినా వాహనం తోలే వ్యక్తి జాగ్రత్త వహించకుంటే ప్రయోజనం ఉండదన్నారు. ఆర్డీవో వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీటు బెల్టు పెట్టుకోవాలని, సెల్‌ఫోన్ డ్రైవింగ్ పనికిరాదని, ద్విక్రవాహనంపై ముగ్గురు వెళ్లడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి నిషేధమైనా ఎంత మంది వాహన చోదకులు వీటిని ఆచరిస్తున్నారన్నారు. రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తమ శాఖ ఆధ్వర్యంలో పలు చర్యలు తీసుకుంటున్నామని, జాతీయ రహదారి సర్వీసు రోడ్ల పాయింట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటుచేయడం వలన రోడ్డు ప్రమాదాల నివారణకు కొంతలో కొంత మెరుగు కనిపించిందన్నారు. నేడు వాహనాలు ఆధునిక టెక్నాలజీతో తయారవుతున్న కారణంగా ప్రమాదం జరిగితే మనిషి ప్రాణాలు కోల్పోవడమేనన్నారు. అలా జరగకుండా వాహనాలు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. గూడూరు ఆర్టీవో బి చందర్ మాట్లాడుతూ అన్నీ అధికారులే చేయాలంటే చేయలేరని, తమ ఉద్దేశం వాహనాలకు సంబంధించిన అన్ని రికార్డులుపక్కాగా ఉంచుకొనడం, నిబంధనల ప్రకారం వాహనాలు నడపం, అతి వేగం వంటివి లేకుండా పరిమితికి లోబడి ప్రయాణికులను ఎక్కించుకొని ఆటోలను నడపాలని అన్నారు. వాహనాలు, జనాభా పెరిగినంత రోడ్ల విస్తీర్ణం పెరగనందున రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి వాహనం నడపడం వలన ప్రమాదం సంభవిస్తే మృత్యువు నుండి కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శీతారామిరెడ్డి, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్, మోటార్ వాహనాల ఇన్‌స్పెక్టర్లు జకీర్, కరుణాకర్, సౌజన్యలు పాల్గొన్నారు. అనంతరం రహదారి భద్రతా వారోత్సవాలకు సంబంధించి గోడపత్రికలను ఆవిష్కరించారు.