శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పారదర్శకంగా బిసిల వర్గీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 23: బిసిల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తుందని బిసి కమిషన్ చైర్మన్ కెఎల్ మంజునాథ్ వెల్లడించారు. సోమవారం ఉదయం స్థానిక తిరుమల తిరుపతి కల్యాణ మండపంలో ప్రజాసేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తరువాత ఫిబ్రవరి 2016లో బిసి కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. బిసిల్లో చేరాలంటే కుల గణన జరగాలని కమిషన్ ప్రభుత్వాన్ని కోరగా, ప్రజాసాధికార సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఇతర కులాలను బిసిల్లో చేర్చాలంటే రాజ్యాంగపరంగా రెండు అంశాలు పరిగణనలోకి తీసుకోనున్నట్లు చెప్పారు. సామాజికంగా వెనుకబడిన తరగతుల తీరు, విద్యాపరంగా వెనుకబాటు ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, మంగళవారం జరగబోయే క్షేత్రస్థాయి పర్యటనలో ముఖాముఖిగా వచ్చిన అంశాలు, ప్రజాసాధికార సర్వే మూడు అంశాల నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బిసిలకు చెందిన కొన్ని కులాలను కలిపి గ్రూపులుగా మార్పు చేయాలని కోరుతున్నారని చెప్పారు. నూతనంగా బిసిల జాబితాలో చేర్చాలని కోరుతూ పలు సంఘాల వారు కమిషన్‌కు దరఖాస్తులు అందజేశారు. ఈసమావేశంలో కమిషన్ మెంబర్లు ప్రొఫెసర్లు వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, మెంబరు సెక్రటరీ కృష్ణమోహన్, బిసి సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

కరవు పరిస్థితి తీవ్రం
* గూడూరు, నాయుడుపేట డివిజన్లలో విస్తృతంగా పర్యటించిన కేంద్ర బృందం
* వాకాడు, కోట, చిట్టమూరు మండలాలను కరవు మండలాల్లో చేర్చండి
* కేంద్ర బృందానికి ఎమ్మెల్యే పాశం వినతి
గూడూరు, జనవరి 23: తీవ్ర దుర్భిక్షం కారణంగా జిల్లాలో వర్షాలు లేక పంటలు పండించుకోలేని రైతాంగం దుస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల్లో సోమవారం కేంద్ర బృందం గూడూరు, నాయుడుపేట డివిజన్లలో పర్యటించింది. ఉదయం నుండి కేంద్ర కరవు అధ్యయన బృందం తడ నుండి దొరవారిసత్రం, ఓజిలి, చిల్లకూరు, గూడూరు మండలాల్లో విస్తత్రంగా పర్యటించి ఎండిన పంట పొలాలను చూసి ఆశ్చర్యపోయారు. ముందుగా వారు చిల్లకూరు మండలంలోని ముత్యాలపాడు గ్రామాన్ని సందర్శించారు. ప్రభుత్వం ఈ మండలాన్ని కరవు మండలంగా ప్రకటించడంతో ముందుగా నియోజకవర్గంలోని చిల్లకూరు మండలంలో పర్యటించి అక్కడ రైతుల నుండి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ ప్రాంతమంతా వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేసుకొంటామని, గత సంవత్సరం చాలినంత వర్షాలు పడకపోవడంతో బావుల్లో, చెరువుల్లో నీరు రాక కనీసం తాగేందుకు కూడా నీరు లేక నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వ్యవసాయ భూములను బీడు భూములుగా చూసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని వారు కేంద్రబృందం ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అక్కడ నుండి గూడూరు మండలంలోని పోటుపాలెం, చెన్నూరు గ్రామాల్లో కరవు నిర్ధారణ బృందం పర్యటించి పంట పొలాలను పరిశీలించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఏడు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం గూడూరు నియోజక వర్గానికి సంబంధించి గూడూరు, చిల్లకూరు మండలాలను కరవు మండలాలుగా ప్రకటించిందని, నియోజకవర్గ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో కూడా వర్షాలు లేక పంటలు ఎండి పోయాయని, పైమూడు మండలాలను కూడా కరవు మండలాలుగా ప్రకటించే విధంగా కేంద్రానికి నివేదిక పంపాలని కరవు బృందాన్ని ఎమ్మెల్యే కోరారు. అనంతరం కరవు బృందం టీం లీడర్ రాంబాబు మాట్లాడుతూ తాము పర్యటించిన ప్రాంతాల్లో కరవు పరిస్థితి తీవ్రంగా ఉందని, వీటిన్నింటిని కేంద్రానికి నివేదిక తయారుచేసి ఇస్తామని చెప్పారు. వీరి వెంట కలెక్టర్ రేవు ముత్యాలరాజు, వ్యవసాయ శాఖ జెడి హేమమహేశ్వరరావు, పెంచలకోన దేవస్థాన ట్రస్టు బోర్డు చైర్మన్ తానంకి నానాజీ, ఆర్డీవో వెంకటసుబ్బయ్య, చిల్లకూరు ఎంపిపి రమాదేవి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి, చెన్నూరు సర్పంచ్ శ్రీనివాసులు తదితరులున్నారు.

ఓడిఎఫ్‌గా మార్చడానికి ఉద్యమంలా పని చేస్తున్నారు
* యూనిసెఫ్ అధికారి వెంకటేష్ కితాబు
మనుబోలు, జనవరి 23: నెల్లూరు జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలు ఉద్యమంలా పని చేస్తున్నారని యూనిసెఫ్ అధికారి వెంకటేష్ కితాబు ఇచ్చారు. సోమవారం స్థానిక హైస్కూల్‌లో ఓడిఎఫ్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ ఒక కార్యక్రమాన్ని పథకంలా చూస్తే దాని లక్ష్యం నెరవేరదని, ఉద్యమంలా చేస్తే దాని లక్ష్యం నెరవేరుతుందన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఓ ఉద్యమంలా చేపట్టారని, దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీలకతీతంగా వివిధ రాజకీయపార్టీల నాయకులు అందరూ సహకరించడం చూస్తోంటే రాష్ట్రంలో మొట్టమొదటి ఓడిఎఫ్ జిల్లా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన సమయంలో తాను ఈ విషయం గమినించినట్లు తెలిపారు. ఇల్లు అలకగానే పండుగ కాదనే సామెత ఉందని, మరుగుదొడ్లు నిర్మించినంత మాత్రాన లక్ష్యం నెరవేరదన్నారు. దానిని వాడుకలోకి తెచ్చినపుడే అసలైన లక్ష్యం నెరవేరినట్లని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో పెళ్లకూరు, దుత్తలూరు మండలాలు ఓడిఎఫ్ మండలాలుగా మారాయని, నేడు దాని జాబితాలో మనుబోలు మండలం చేరిందన్నారు. మనుబోలు మండలంలో అధికారులు, నాయకులు, ప్రజలు రాత్రింబవళ్లు కృషి చేసి ఓడిఎఫ్ మండలంగా తీర్చిదిద్దారన్నారు. మండలంలో 1554 మరుగుదొడ్లు నిర్మించారని, వీరు పనిచేసిన తీరును చూస్తే రెండువేల మరుగుదొడ్లు కూడా నిర్మించవచ్చునన్నారు. ఈనెల 31వతేదీలోపల జిల్లాలో మరో 4 మండలాలను ఓడిఎఫ్ మండలాలుగా మార్చడానికి యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తున్నామన్నారు. మార్చి 31వతేదీ లోపల జిల్లాను అధికారులు, నాయకుల కృషితో ఓడిఎఫ్ జిల్లాగా మార్చడం తధ్యమన్నారు. ఎంఎల్‌సి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ పొదలకూరు మండలాన్ని కూడా ఈ నెల 31వతేదీలోపల ఓడిఎఫ్ మండలంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోది స్వచ్ఛ్భారత్‌ను మొదలుపెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. నాబార్డు కింద మనుబోలు మండలాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. నియోజక వర్గంలో సాగునీటి విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సమావేశానికి ముందు ఆత్మగౌరవం తెలిపే కళాకారులు చేసిన నృత్యాలు, పాటలు ప్రజలను అలరించాయి. చివరగా మండలాన్ని ఓడిఎఫ్ మండలంగా తీర్చిదిద్దడానికి కృషి చేసిన పలు గ్రామాల సర్పంచ్‌లను, నాయకులను, అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ అధికారి రవికాంత్, జిల్లాపరిషత్ సిఇఓ రామిరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ కృష్ణారెడ్డి, ఇఇ రామిరెడ్డి, స్థానిక ఎంపిడిఓ కె.హేమలత, తహశీల్దారు కెవి రమణయ్య, ఎంపిపి చిట్టమూరు అనితమ్మ, సర్పంచ్ కంచి పద్మమ్మ, ఉపసర్పంచ్ దండు చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపిటిసి చెంచమ్మలతోపాటు వివిధ రాజకీయపార్టీల నాయకులు పాల్గొన్నారు.

చైర్‌పర్సన్‌పై పోలీసులకు ఫిర్యాదు
సూళ్లూరుపేట, జనవరి 23: సూళ్లూరుపేట చైర్‌పర్సన్ నూలేటి విజయలక్ష్మిపై సోమవారం వైఎస్‌ఆర్‌సి కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 21వ తేదీన 18వ వార్డు కౌన్సిలర్ దశయ్యకు ఫోన్ చేసి దుర్భాషలాడటమేగాక బెదిరించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ముత్తుకూరు లక్ష్మమ్మ, కౌన్సిలర్ చిట్టిబాబుతో కలసి సోమవారం చైర్‌పర్సన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.

జల్లికట్టు వివాదంతో ఆగిన రైళ్లు
సూళ్లూరుపేట, జనవరి 23: తమిళనాడులో జల్లికట్టు వివాదంతో నెల్లూరు వైపునకు వస్తున్న పలు రైళ్లను సోమవారం రద్దు చేశారు. జల్లికట్టుకు చట్టబద్ధత కల్పించాలంటూ చెన్నై నగరంలో విద్యార్థులు భారీగా నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సంఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. దీంతో అల్లర్లకు దిగిన తమిళులు రైళ్లు, బస్సులు దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు చెన్నైనుంచి నెల్లూరు వైపునకు వెళ్లే హైదరాబాద్, చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లను అక్కడే నిలిపివేశారు. విజయవాడకు వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్‌ను పొనే్నరి నుంచి తిరిగి విజయవాడకు మళ్లించారు. అదేవిధంగా చెన్నై నుంచి వచ్చే మెము రైళ్లను నిలిపివేశారు. నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను చెన్నైకు వెళ్లకుండా సూళ్లూరుపేట స్టేషన్‌లోనే నిలిపివేశారు. అదేవిధంగా తమిళనాడు బస్సులను ఆంధ్రాకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

నారా లోకేష్‌కు మేయర్ జన్మదిన శుభాకాంక్షలు
నెల్లూరు కలెక్టరేట్, జనవరి 23: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ఆయనకు సోమవారం జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తమ యువ నాయకుని జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడకు వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపానన్నారు.

ప్రత్యేక హోదా కోసం ఒకే తాటిపై నిలవండి
* ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపు
కలిగిరి, జనవరి 23: తమిళనాడులో జల్లికట్టుపై ఏకతాటిపై నిలిచినట్లు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేక హోదాపై ఏకతాటిగా నిలవాలని, అందువలన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని పరిశ్రమలు ఎక్కువుగా వస్తాయని ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం మండలంలోని నాగసముద్రం పంచాయతీలో సిమెంట్‌రోడ్లు, వాటర్ ప్లాంట్‌ను ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, ఇందుకు గాను ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. నాగ సముద్రం పంచాయతీలో ప్రజల ఆదరణ బాగుందని, పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతామన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మల్లు సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ రావమ్మ, పాలూరి మాల్యాద్రిరెడ్డి, కాటం రవీంద్ర, హజరత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మానసిక ప్రశాంతత, మెడిటేషన్‌పై అవగాహన అవసరం
* జిల్లా ఎస్‌పి విశాల్ గున్నీ సూచన
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జనవరి 23: మానసిక ప్రశాంతత, మెడిటేషన్ వంటి వాటి మీద అవగాహన కల్పించే హిప్నో కమలాకర్ కార్యక్రమం సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్‌పి విశాల్ గున్నీ తెలిపారు. సోమవారం డిమోబిలైజేషన్ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న ఎఆర్ సిబ్బందికి అచ్యుత సుబ్రహ్మణ్యం కల్యాణ మండపంలో హిప్నో కమలాకర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ, డిమోబిలైజేషన్ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కమలాకర్ వచ్చినందుకు ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం కమలాకర్‌ను పూలమాలలు, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎఆర్ ఎస్‌పి వీరభద్రుడు, ఎఆర్ డిఎస్‌పి చెంచురెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాసులు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వాహన చోదకులు నిబంధనలు పాటించాలి
జిల్లా రవాణాశాఖ ఉపకమిషనర్ శివరాం ప్రసాద్ సూచన
కావలి, జనవరి 23: వాహన చోదకులు తప్పనిసరిగా రవాణా శాఖ నిర్దేశించిన నియమ నిబంధనలు పాటించాలని, తద్వారా ప్రమాదాలకు గురికాకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చని జిల్లా రవాణాశాఖ ఉపకమిషనర్ శివరాంప్రసాద్ అన్నారు. సోమవారం ఆ శాఖ నేతృత్వంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో నిర్వహించిన 28వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో కావలి డిఎస్పీ రాఘవరావు, మున్సిపల్ కమిషనర్ అన్నవరపు వెంకటేశ్వర్లు, ఎంవిఐలు మురళీమోహన్, ఆదినారాయణ, మాధవరావు ఎఎంవిఐ భాస్కర్‌రావు తదితరులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల ప్రార్ధన అనంతరం ఎంవిఐ మురళీమోహన్ అధ్యక్షతన ప్రారంభమైన సదస్సులో ఉప కమిషనర్ మాట్లాడారు. జీవితం అత్యంత విలువైనదని వాహనం ఎక్కేముందు దాన్ని గుర్తుచేసుకోవాలని, వాహనం కండీషన్‌ను ప్రతి రోజూ గమనించాలన్నారు. తప్పనిసరిగా వాహనాన్ని నడిపేందుకు లైసెన్స్ తీసుకోవాలని, నియమ నిబంధనల విషయమై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రాథమిక అంశాలపై అవగాహన కలిగి ఉండి, కనీస జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు దరిచేరవన్నారు. డిఎస్పీ రాఘవరావు మాట్లాడుతూ వాహనాన్ని నడిపే వ్యక్తి జాగ్రత్తగా ఉంటే రోడ్డుపై నడిచే వారు సైతం సురక్షితంగా ఉంటారన్నారు. వాహనం ఎక్కేముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నారు. ఏవైనా బాదరబందీలు, మానసిక సంఘర్షణలు ఉంటే అలాంటి వాటిని మనస్సులోంచి పూర్తిగా తొలగించుకుని అటు తర్వాతే చోదక బాధ్యతలు తీసుకోవాలని, వీలు కాకుంటే దూరంగా ఉండాలన్నారు. ఇవికాక నిర్లక్ష్య డ్రైవింగ్ అనర్థాలకు మూలహేతువుకాగా వాహన యజమానులు తమ డ్రైవర్లను తరచూ గమనిస్తుండాలన్నారు. మద్యం, గుట్కా, పరాగ్ తదితర అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. వాటికి బానిసలైన వారిని అనుమతించవద్దన్నారు. కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిలకడలేని, పరిణతి చెందని నిర్లక్ష్య డ్రైవింగ్ మనుషుల ప్రాణాలను బలిగొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదమని తెలిసినా ఆటోవాలాలు నలుగురికి బదులుగా 20 మందిని ఎక్కించుకుని, పెద్ద లౌడ్‌స్పీకర్లు పెట్టుకుని అంతటితో ఆగకుండా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ నడుపుతున్నారని అన్నారు. తద్వారా వారు ప్రమాదాలకు గురై చావు మీదకు తెచ్చుకోవడమేకాక ఎదురొచ్చిన వారిని చంపుతున్నారన్నారు. యువత ద్విచక్ర వాహనాలను అడ్డదిడ్డంగా నడుపుతూ పాదచారులను భయకంపితులను చేయడం పరిపాటైందని చెప్పారు. ప్రాథమిక స్థాయి నుంచి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విధిగా రవాణా విషయాలపైనా పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. డ్రైవింగ్ వృత్తిగా ఉండేవారంతా యోగా, ప్రాణాయామం చేయాలని, ఏకాగ్రత పెంచుకోవాలని కోరారు. ఇందులో వాహన యజమానులు పలువురు మాట్లాడుతూ ప్రమాదాల నియంత్రణ, నిర్మూలనకు పలు సూచనలు చేశారు.