శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సమస్యలు పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 6: సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోతున్నా తమ సమస్యలకు పరిష్కారం దొరకటం లేదని పలువురు అర్జీదారులు సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో కలెక్టర్‌కు తమ సమస్యలు విన్నవించారు. అలాగే వివిధ ప్రజా సంఘాలు చేపట్టిన ధర్నాలు, నిరసనలతో కలెక్టరేట్ హోరెత్తింది. కలెక్టరేట్ ప్రాంగణంలోని గ్రీవెన్స్ డే హాల్లో కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు, జెసి ఎఎండి ఇంతియాజ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. హమాలీ వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కార్మిక చట్టాలు అమలు పరచాలని హమాలీ వర్కర్స్ యూనియన్, ఎఐటియుసి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. రవాణా రంగాన్ని దెబ్బతీసే జీవో సంఖ్య 894ను రద్దు చేయాలని సిఐటియు అనుబంధ లారీ యజమానుల సంఘం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పొదలకూరు మండల కేంద్రంలో ఎంఆర్‌వో కాలనీలో నివసిస్తున్న మహిళలను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎరుకల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మరుగుదొడ్లు సొంతంగా నిర్మించుకున్న వారికి ఇంతవరకు నగదు అందించకపోగా, గుత్తేదారు ద్వారా నిర్మించిన మరుగుదొడ్లకు నగదు పంపిణీ వేగవంతంగా అందజేస్తున్నారని, లబ్ధిదారులకు నేరుగా నగదు పంపిణీ చేయాలని వివిధ మండలాలకు చెందిన బాధితులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అలాగే వివిధ రకాలైన సామాజిక పింఛన్లు అందడం లేదని, నూతన పింఛన్లు మంజూరు చేయాలని పలువురు అర్జీలు సమర్పించారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని పలు వ్యక్తిగత, ఉమ్మడి అర్జీలు సమర్పించారు.

నేర నియంత్రణ అందరి బాధ్యత
* కావలి డిఎస్‌పి రాఘవరావు పిలుపు
కావలి, ఫిబ్రవరి 6: సమాజం శాంతియుతంగా ఉండేందుకు ముందస్తు నేర నియంత్రణ ముఖ్యమని, ఇందుకోసం యువత పోలీసులతో స్నేహ సంబంధాలు పెంపొందించుకుని అన్ని విధాలుగా సహకరించాలని డిఎస్‌పి రాఘవరావు సూచించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో సిఐలు అశోక్‌వర్దన్‌రెడ్డి, శ్రీనివాసరావు, రోశయ్య, ఎస్‌ఐలు పుల్లారావు, నాగరాజు తదితరులతో కలిసి పట్టణంలోని 40 వార్డుల్లో గల యువతకు ఈ విషయమై సమావేశం నిర్వహించారు. ఇందులో డిఎస్‌పి ఉపాధ్యాయుడి అవతారమెత్తి భారతదేశంలో ఐపిసి కింద 511 సెక్షన్లు ఉన్నట్లు చెప్పారు. ఏ చిన్న విషయం జరిగినా దానిని నేరంగా పరిగణించి అంత విస్తృత స్థాయిలో శాంతియుత సమాజం కోసం నేరాల చిట్టా, దానికి శిక్షలను రాజ్యాంగం నిర్దేశించిందని చెప్పారు. అయితే నేరాలు జరిగే క్రమంలో నియంత్రించే విషయంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రజల నుంచి సరైన సహకారం, సాక్షాలు లేకపోవడం కారణంగా అనేకమంది నిందితులు తప్పించుకుంటున్నారని వివరించారు. ఒక వ్యక్తి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదుచేస్తే పోలీసులు విచారణ చేసే తీరును సవివరంగా తెలియచేస్తూ సాక్షాల లేమి, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షాలు తమకెందుకులే అన్న భావన చూపడం కారణంగా న్యాయస్థానంలో కేసులు ఏ విధంగా నిలవకుండా పోతున్నాయో ఉదాహరణలతో వివరించారు. జిల్లాలో సంచలనంగా మారిన నరహంతకుడి కేసుకు సంబంధించి మాట్లాడుతూ పాతవూరు రాజీవ్‌నగర్‌లో స్థానికంగా పనిచేసే వారి వద్ద హంతకుడు సుత్తి తీసుకెళ్లి ఉపయోగించిన తర్వాత తెచ్చి ఇచ్చారని, అతను ముఖ పరిచయస్తుడే అయినప్పటికీ స్థానికులు ఎవరూ సమాచారం ఇవ్వలేదన్నారు. ఫలితంగా అతను మరో మూడు హత్యలు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లయిందని, సకాలంలో సమాచారం ఇచ్చి స్థానికులు సహకరించి ఉంటే ఘోరాలు జరిగి ఉండేది కాదన్నారు. యువత ఈవ్‌టీజింగ్, అసహజం అనిపించే సన్నివేశాలు, సందర్భాలు, బహిరంగ మద్యపానం, అలాగే గుట్కా తదితర నిషేదిత వస్తువుల అమ్మకాలు, అనుకోకుండా జరిగే ప్రమాదాల విషయంలో తమ బాధ్యతగా భావించి పోలీసులకు సహకరించాలని కోరారు. పలు విషయాలను మరింత వివరంగా తెలియచేశారు.
జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లో
కంప్యూటర్ ఆపరేటర్ల హవా
* కుల, రేషన్ కార్డులు కావాలంటే చేయి తడపాల్సిందే

నెల్లూరు, ఫిబ్రవరి 6 : జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లో రేషన్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరులో కంప్యూటర్ ఆపరేటర్ల హవా కొనసాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు రేషన్ కార్డుల కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకుంటున్నారు. సంవత్సరాలు గడిచినప్పటికీ రేషన్ కార్డుల మంజూరులో జాప్యం తప్పడంలేదు. తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నప్పటికి తమకు రేషన్ కార్డు మంజూరు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ క్రమంలో కార్యాలయాల వద్ద దళారులను మీ సేవ రసీదులతో ఆశ్రయిస్తే నిమిషాల్లో ఆపరేటర్ల ద్వారా ఆర్‌సి నెంబర్లు, కులధ్రువీకరణ పత్రాలు అప్రూవల్ అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దళారులు, కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కై ఈ పనులు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. రేషన్‌కార్డు కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకొని ఏళ్ల తరబడి నిరీక్షించేకన్నా దళారుల వద్దకు వెళ్తే రెండు మూడు రోజుల్లో కొత్త రేషన్‌కార్డు, ఆర్‌సి నెంబరు లబ్ధిదారుని చేతికి అందుతుంది. అందుకు దళారి చెప్పిన నగదు మొత్తాన్ని ముట్టచెప్పాల్సి ఉంటుంది. ఆ నగదును దళారి, ఆపరేటర్లు పంచుకుంటున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. కొన్ని మండలాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు హవా కొనసాగుతోంది. మర్రిపాడు మండలంలో కంప్యూటర్ ఆపరేటర్ హవా ఎక్కువగా ఉందన్న ఆరోపణలున్నాయి. అడంగళ్లలో పేర్లు మార్పుచేసి కొత్త వారి పేర్లను ఎక్కిస్తున్నారని జిల్లా అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ లెక్కలో ఒక్కొక్క ఆపరేటర్ రోజుకు రెండు వేలు అక్రమంగా ఆర్జిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇదే తరహాలో వివిధ కులాలకు చెందిన ధ్రువీకరణ పత్రాలు ఆపరేటర్ మంజూరు చేస్తూ లబ్ధిదారుల నుంచి ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కుల ధ్రువీకరణ పత్రానికి తొలుత విఆర్‌ఓ, ఆర్‌ఐలు సంతకాలు చేయాల్సి ఉంది. ఒక్కో పత్రానికి ఒక్కో ధర ప్రకారం వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు పొందాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆపరేటర్లపై అధికారులు నిఘా ఉంచాల్సి ఉంది. కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అవినీతికి తావులేకుండా తమకు రేషన్‌కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు అందేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

గ్రామ కమిటీ ఎన్నికల్లో సమర్థులను ఎంపిక చేయాలి
* టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి పిలుపు

నెల్లూరు, ఫిబ్రవరి 6 : ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న గ్రామ కమిటీ ఎన్నికల్లో సమర్థులైన వారిని ఎంపిక చేయాలని, ఎంపిక చేసిన గ్రామ కమిటీల ఆధ్వర్యంలోనే 2019 ఎన్నికలు జరగనున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, గ్రామ కమిటీ, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన వారిని వెంటనే ప్రకటించరాదని, ఎవరైతే గ్రామ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపికవుతారో వారి పేర్లను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర పార్టీ గతంలో పార్టీకి చేసిన సేవలన్నిటిని పరిశీలించిన తరువాత వారు ఎన్నికైనట్లుగా రాష్ట్ర పార్టీ ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో పట్ట్భద్రుల నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించినందున అందరూ సమష్టి కృషి చేసి ఆయన గెలుపునకు కృషి చేయాలని అన్నారు. స్థానిక సంస్థల అభ్యర్థిని కూడా అందరితో సంప్రదించి త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని ఆయన తెలిపారు. సభ్యత్వ నమోదులో జిల్లాకు రెండో స్థానం, జనచైతన్య యాత్రలో మూడో స్థానం వచ్చే విధంగా కృషి చేసిన జిల్లా పార్టీకి, ఎమ్మెల్యేలకు, ఇన్‌ఛార్జికి, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించి తీర్మానించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల సోమశిల ప్రాజెక్టు పరిధిలో గాని, తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడి ఎక్కడ కూడా పంటలను ఎండిపోకుండా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతూ తీర్మానించినట్లు తెలిపారు. జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితుల్లో వేసవి కాలం రానున్నందున తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది. కావున జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటి నుంచి తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వాటిని అమలు చేయాలని మరో తీర్మానం చేశారు. జిల్లాలో నెలకొల్పుతున్న పరిశ్రమలలో ఉద్యోగాలలో అర్హత కలిగిన స్థానికులకే అవకాశం ఇవ్వాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశం ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి తగు ఆదేశాలు ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. ఎన్‌టిఆర్ భరోసా పథకం కింద జిల్లాకు కొత్తగా 20 వేల పింఛన్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అభినందిస్తూ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో నగర మేయర్ అబ్దుల్, అజీజ్, ఎపిఐఐసి చైర్మన్ కృష్ణయ్య, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పాశం సునీల్‌కుమార్, కె రామకృష్ణ, నెల్లూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆనం రాంనారాయణరెడ్డి, రాష్ట్ర పరిశీలకులు గూడూరి ఎరిక్సెన్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, పి వెంకటరత్నం, జిల్లా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు, జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
నెల్లూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 6: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి నిర్వహించేబోయే పట్ట్భధ్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం డిఆర్‌ఒ కృష్ణ్భారతి విడుదల చేశారు. ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, 23వ తేదీలోగా నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. మార్చి 9న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. మార్చి 15న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందన్నారు. కాగా మార్చి 29వ తేదీ నాటికి ప్రస్తుత ఎమ్మెల్సీలు యండవల్లి శ్రీనివాసులురెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం పదవీ కాలం ముగుస్తుందని వెల్లడించారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చిల్లకూరు, ఫిబ్రవరి 6 : మండలంలోని తీరప్రాంతమైన కొమ్మరవారిపాలెంలో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతిచెందిన వ్యక్తి మస్తానయ్యగా నిర్ధారించారు. అయితే అదే గ్రామానికి చెందిన మస్తానయ్య గత రెండేళ్లుగా గ్రామాన్ని వదిలి బయట ప్రాంతాల్లో ఉంటున్నాడని, అయితే రెండేళ్ల క్రితం అతని భార్య మృతి చెందగా, ఆ మృతికి మస్తానయ్యే కారణమని అప్పట్లో గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. గత రెండేళ్లుగా మస్తానయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఆదివారం రాత్రి గ్రామానికి చేరుకున్న మస్తానయ్యను ఎవరో కొట్టి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ అంకమ్మ తెలిపారు.
డిసిపల్లిలో విషజ్వరాలతో అవస్థలు
మర్రిపాడు, ఫిబ్రవరి 6: మండలంలోని కొన్ని గ్రామాల్లో విషజ్వరాలు అధికంగా ఉన్నాయి. అందులో డిసిపల్లి గ్రామంలో గత 15 రోజుల నుంచి జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని మారుమూల గ్రామాల్లో జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అధికారుల్లో మాత్రం చలనం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడితో సోమవారం డిసిపల్లి గ్రామంలో మండల వైద్యాధికారి వెంకటకిషోర్ సందర్శించి గ్రామంలోని కొన్ని బోర్లలో వాటర్ శాంపిల్స్ సేకరించారు. అనంతరం సుమారు వంద మందిని వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి, సర్పంచ్ పాల్గొన్నారు.

టాస్క్ఫోర్స్ అదుపులో మరో ఐదుగురు డ్రైవర్లు
* ఆర్టీసీ సిబ్బందిలో ఆందోళన
కావలి, ఫిబ్రవరి 6: ఎర్రచందనం కేసులో టాస్క్ఫోర్స్ పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తుండగా కావలి ఆర్టీసీ డిపోకు చెందిన మరో ఐదుగురు డ్రైవర్లను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో జలదంకికి చెందిన ప్రభాకర్, కలిగిరి మండలం కుమ్మరకొండూరుకు చెందిన ఎన్‌ఎం కె రెడ్డి, టంగుటూరుకు చెందిన సుభాని, నెల్లూరుకు చెందిన వెంకటేశ్వర్లు, శింగరాయకొండకు చెందిన సురేష్ తదితరులు ఉన్నట్లు తెలిసింది. వారంతా కావలి-బెంగళూరు మార్గంలో నడిచే బస్సుడ్రైవర్లు కాగా పోలీసు అధికారులు బస్సుల్లో కావలికి వచ్చి గ్యారేజిలో ఆర్టీసీ అధికారులకు తెలియజేసి అదుపులోకి తీసుకున్నట్లు డిపో వర్గాలు తెలిపాయి. కాగా మరో ఎనిమిది మంది అనుమానితులపైనా నిఘా ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ నేరంగా పరిగణించబడే ఎర్ర కేసులో ఒక ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్లు భారీ సంఖ్యలో నిందితులు కావడం ఆ సంస్థలో సంచలనంగా మారింది. రేపటివంతు ఎవరన్న దానిపై కార్మివర్గాలు, ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే విచారణ అధికారులు కేవలం కూలీలను అవసరమైన ప్రాంతంతో దించడంతోనే సరిపెట్టుకున్నారా? లేక సరకు రవాణాలోనూ సహకరించారా ? ఇతర వ్యక్తులతోనూ సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ కూపీ లాగుతున్నట్లు పలువురు చెప్తున్నారు. అరెస్టయిన డ్రైవర్లకు నిజంగా లోతుగా ఎర్ర అక్రమాలతో సంబంధాలు ఉంటే గనక వారివారి ప్రాంతాల్లో గల మరికొందరిని ప్రశ్నించవచ్చని తెలుస్తోంది.
రెవెన్యూ క్రీడల్లో సత్తా చాటాలి
* ఆత్మకూరు ఆర్‌డిఓ ఎంవి రమణ ఆకాంక్ష
ఆత్మకూరు, ఫిబ్రవరి 6 : రెవెన్యూ ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో ఆత్మకూరు డివిజన్ సిబ్బంది బాగా ఆడటం ద్వారా తమ ప్రతిభను చాటుకోవాలంటూ ఆత్మకూరు ఆర్‌డిఓ ఎంవి రమణ ఆకాంక్షించారు. సోమవారం ఈ క్రీడా పోటీలకు సంబంధించి డివిజన్ ఉద్యోగుల సన్నద్ధతకై ముందస్తు ప్రాక్టీస్ చేసేందుకు ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ నుంచి క్రికెట్ జట్టులో మంచి తర్ఫీదుతో కూడిన ఆటగాళ్లను జిల్లాస్థాయి పోటీకి పంపుతున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాస్థాయి పోటీలు ఆత్మకూరుతోపాటు నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడుపేట డివిజన్లతో సహా జిల్లా కలెక్టరేట్ విభాగం ఈ పోటీల్లో భాగంగా తలపడతాయని అన్నారు. ఇప్పటికే ఆత్మకూరు డివిజన్ స్థాయిలో ఈ పోటీ ప్రక్రియ పూర్తిచేసి క్రీడ ప్రతిభ మెండుగా ఉన్న ఆటగాళ్లను జట్లుగా తయారు చేసినట్లు చెప్పారు. పని ఒత్తిడితో మానసికంగా ఇబ్బందులు తలెత్తడం సహజమన్నారు. ఆట విడుపుగా ఇలాంటి పోటీల్లో పాల్గొంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటారని, ఒత్తిడి నుంచి బయటపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతోపాటు వ్యాయామ ఉపాధ్యాయులతో పలు అంశాలపై చర్చించారు.