శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

భూ ఆక్రమణలపై తెలుగుతమ్ముళ్ల బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింజమూరు, ఫిబ్రవరి 9: వింజమూరు మండలంలో భూ అక్రమణలకు సంబంధించి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దంతులూరు వెంకటేశ్వరరావు సాగిస్తున్న దందాపై సాక్షాత్తు ఆ పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడకు అందరం వెళ్లాల్సిన శ్మశనా స్థలాన్ని సైతం కబళించేస్తున్నారంటూ సాక్షాత్తు మండల తహశీల్దారు సమక్షంలో పార్టీ నేతలు ధ్వజమెత్తారు. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సదరు మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ స్వగ్రామమైన మండలంలోని రావిపాడు పంచాయతీ పరిధిలో చాకలికొండ గ్రామానికి వెళ్లే మార్గంలో ప్రభుత్వ భూమిని అక్రమించి నిమ్మ, కొబ్బరి, హైబ్రిడ్ వేపచెట్లను సాగు చేస్తున్నారు. అయితే ఆ భూమి వివరాలను స్ధానిక ఎంపిటిసి సభ్యుడు గురజాల వెంకటరమణయ్య నాయుడు సమాచార హక్కు చట్టం ద్వారా రాబట్టి అనంతరం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ భూమి వివరాలపై సమగ్ర విచారణ కొనసాగించి గ్రామంలో అర్హులైన ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు పంపిణీ చేయాలంటూ రెవెన్యూ శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తహశీల్దారును నిలదీసేందుకు ఎంపిటిసి వెంకటరమణయ్య తరలివచ్చారు. ఈ సంభాషణ కొనసాగుతున్న సమయంలో దంతులూరు కూడా అటుగా చేరుకోవడంతో ఇద్దరి నడుమ తీవ్రస్ధాయిలో వాదోపవాదాలు చోటుచేసుకుని పరస్పరం తోపులాటకు దిగారు. ఈ విషయమై అప్పటికప్పుడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.

ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఆర్‌ఐవో
బుచ్చిరెడ్డిపాళెం, ఫిబ్రవరి 9: మండల కేంద్రమైన బుచ్చిరెడ్డిపాళెం డిఎల్‌ఎన్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాన్ని నెల్లూరు ఆర్‌ఐఒ గురువారం పరిశీలించారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలలో అవకతవకలు జరుగుతున్నాయని దినపత్రికల్లో ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే. దీనికి స్పందించిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఆర్‌ఐఒ బాబు జాకబ్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయన్నారు. అన్ని వసతులు ఉన్నాయో, లేవో అని అక్కడ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు హైపవర్ కమిటీ మెంబర్ బి పెంచలయ్య, జిల్లా పరీక్షా కమిటీ మెంబర్ టి వరప్రసాద్‌రావు పరీక్షలు జరుగుతున్న గదులను పరిశీలించారు.

కసుమూరు దర్గాలో సినీనటి రమాప్రభ పూజలు
వెంకటాచలం, ఫిబ్రవరి 9: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ వలి దర్గాను గురువారం ఉదయం ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటి రమాప్రభ దర్శించుకున్నారు. ఆమెకు దర్గా ముజావర్లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాప్రభ మస్తాన్ స్వామి సమాధిపై సుగంధ ద్రవ్యాలు చల్లిన తరువాత దర్గా పూజారులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆమెకు దర్గా ముజావర్లు తీర్ధప్రసాదాలు ఆందజేశారు. రమాప్రభ దర్గాకు వచ్చారని తెలియడంతో ఆమెను చూసేందుకు భక్తులు, తెలుగు చిత్ర అభిమానులు, స్థానికులు ఎగబడ్డారు. కొందరు దర్గా ముజావర్లు, భక్తులు ఆమెతో సెల్ఫీలు తీయించుకునేందుకు పోటీపడ్డారు. అనంతరం రమాప్రభ దర్గా ముజావర్ ఎంఎస్ మొహ్మద్ ఇంటికి వెళ్లి అక్కడ కొంతసేపు సేదతీరి అనంతరం బయలుదేరి వెళ్లారు. ఆమెతోపాటు ఆమె కుమారుడు ఉన్నారు. ఆమె వెంట దర్గా ముజావర్లు ఎంఎస్ మొహ్మద్, ఎంఎస్ కరీముల్లా, హనీఫ్, యుసుఫ్, గౌస్ బాషా, మున్నా, దస్తగీర్, లియాఖత్ తదితరులు ఉన్నారు.

రాకెట్‌లో ఉపగ్రహాల అమరిక పూర్తి
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 9: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 15న ప్రయోగించే పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. గురువారం రాకెట్ చివరి భాగంలో మన దేశానికి చెందిన కార్టోశాట్-2డి, ఐఎన్‌ఎస్-1ఎ, ఐఎన్‌ఎస్-1బి ఉపగ్రహాలు, విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలను అమర్చే ప్రక్రీయ పూర్తిచేసి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేశారు. శుక్రవారం ఉపగ్రహాల చుట్టూ ఉష్ణకవచాన్ని అమర్చనున్నారు. ఈనెల 12న ప్రయోగంపై ఎంఆర్‌ఆర్ సమావేశం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో సన్నద్ధమవ్వడంతో ప్రపంచ దేశాలన్ని షార్ వైపు చూస్తున్నాయి. అన్నీ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే ఈనెల 15వ తేదీ ఉదయం 9:28 గంటలకు రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి నింగిలోకి ఎగరనుంది.

మిత్రమా! సమయం లేదు, వేగం పెంచండి
టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద పిలుపు
వెంకటగిరి, ఫిబ్రవరి 9: వచ్చే నెలలో జరిగే తూర్పు రాయలసీమ (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం) జిల్లాల పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందువల్ల నాయకులు, కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారంలో వేగం పెంచి పార్టీ బలపరిచిన అభ్యర్థి వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని త్రిపురసుందరి కల్యాణ మండపంలో పట్ట్భద్రుల ఎన్నికల సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ స్థాయి సమావేశం స్థానిక శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅఅతిథిగా విచ్చేసిన బీద రవిచంద్ర మాట్లాడుతూ గత రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు కొన్ని పొరపాట్ల వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయారని తెలిపారు. ఈసారి అన్ని అవకాశాలు టిడిపికే ఉన్నాయని ఇలాంటి సమయంలో గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు అలుపెరగని పోరాటం చేసి మన సత్తా చాటాలన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే అధిక సంఖ్యంలో నిధులు తీసుకొచ్చారని ఇంకా నిధుల కోసం ముఖ్యమంత్రికి దరఖాస్తులు పెట్టారని ఆ నిధులు కూడా రావాలంటే తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించి మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. టిడిపి బలపరచిన అభ్యరి వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి అన్ని రంగాల్లో రాణించిన మంచి వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే అందరికి అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త తన పరిధిలో ఉన్న ఏ ఒక్క ఓటును కూడా ఇతరులకు పోకుండా ప్రతి ఓటు టిడిపి అభ్యర్థి పట్ట్భారామిరెడ్డికి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ దొంతు శారద మాట్లాడుతూ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలుపు తమ గెలుపుగా భావించి ఎన్నికల్లో పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు జి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు నూనె మల్లికార్జున్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు చెలికం శంకరెడ్డి, కార్యదర్శి పులుకొల్లు రాజేశ్వరరావు, టిడపి పట్టణ అధ్యక్షులు బీరం రాజేశ్వరరావు, పట్టణ బిసి సంఘం అధ్యక్షులు దొంతు బాలకృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్‌మెన్‌లు సిసి నాయుడు, చెన్ను బాలకృష్ణారెడ్డి, ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, స్థానిక వైద్యులు, న్యాయవాదులు, పట్ట్భద్రులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నెల్లూరును కరవు జిల్లాగా ప్రకటించాలి
డిసిసి అధ్యక్షుడు పనబాక డిమాండ్
నెల్లూరు సిటీ, ఫిబ్రవరి 9: నెల్లూరును కరవు జిల్లాగా ప్రకటించాలని డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరవు తాండవిస్తోందని అన్నారు. అయితే 46 మండలాల్లో 27 మండలాలను మాత్రమే కరవు మండలాలుగా ప్రకటించారని, వాటికి కూడా అరకొర నిధులను అధికార యంత్రాగం అందిస్తోందని విమర్శించారు. 46 మండలాల్లో తాగునీరు లేక సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదన్నారు. టిడిపి ప్రభుత్వం కనీసం కరవు మండలాలలో తాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ఉందన్నారు. రైతులు సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని రబీ సీజన్‌లో నాటిన వరి, మినుము, పెసర్లు ఎండిపోతున్నాయని చెప్పారు. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు గాను 5 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారన్నారు. సోమశిల రిజర్వాయరులో 78 టిఎంసిలకు గాను 27 టిఎంసిల నీరు, కండలేరులో 68 టిఎంసిలకు 8.6 టిఎంసిల నీరు మాత్రమే ఉందన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలు, రైతులకు అన్యాయం చేసి చెన్నై, చిత్తూరు జిల్లాకు తెలుగుగంగ ద్వారా నీటిని విడుదల చేయడం సమంజసం కాదన్నారు. కేంద్ర కరవు బృందం తుతూమంత్రంగా హైవేలో ఉన్న మండలాలలో మాత్రమే పర్యటించి తీర ప్రాంతాల వైపు కనె్నత్తి కూడా చూడాలేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. బ్యాంకులు కూడా రైతాంగానికి రుణాలు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. 2017-18 బడ్జెట్‌లో కూడా రైతులు, మహిళలు, యువతను పూర్తిగా విస్మరించారని చెప్పారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఎరువులు, మేలురకం విత్తనాలను అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందినట్లు ఆయన విమర్శించారు.
నేడు పిసిసి సమావేశం
రాష్టస్థ్రాయి కాంగ్రెస్ పార్టీ సదస్సు శుక్రవారం గుంటూరులో జరుగుతుందని పనబాక కృష్ణయ్య తెలిపారు. పిసిసి పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చేవూరు దేవకుమార్‌రెడ్డి, చెంచలబాబు యాదవ్, ఉడతా వెంకట్రావు, కనకట్ల రఘురామ్‌ముదిరాజ్, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధికారుల ఆటవిడుపు
* స్టేడియంలో సందడి
* కలెక్టర్ ఎలెవన్‌పై ఎస్పీ ఎలెవన్ విజయం
నెల్లూరు, ఫిబ్రవరి 9: నిత్యం ప్రజావసరాలు తీరుస్తూ పాలనను పర్యవేక్షించే రెవెన్యూ శాఖ, ప్రజాభద్రతను పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలను కాపాడే పోలీస్ శాఖ. కార్యనిర్వహక విభాగంలో భాగమైన ఈ రెండు శాఖల సిబ్బంది నిత్యం ఎంతో బిజీగా తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. అయితే ఈ అధికారులు గురువారం తమ శాఖాపర కార్యకలాపాలు ఓపూట పక్కనబెట్టి ఆటవిడుపు కోసం క్రికెట్ పోటీలో తలపడ్డారు. నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన ఈ క్రికెట్ మ్యాచ్ ఏదో ఆటవిడుపుగా అని భావించిన వారికి అసలైన క్రికెట్‌లోని మజాను అందించడం విశేషం. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో ఇంత మంచి క్రికెట్ క్రీడాకారులున్నారా.. అని మ్యాచ్ వీక్షించేందుకు వచ్చినవారు ఆశ్చర్యపోయేలా ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు గెలుపు ఎస్పీ ఎలెవన్‌ను వరించినప్పటికి రెండు జట్లు చివరి వరకు పోరాడిన తీరు అందరి ప్రశంసలందుకుంది.
ఎస్పీ ఎలెవన్ విజయం
తొలుత టాస్ గెలిచిన కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సారధ్యంలోని కలెక్టర్ ఎలెవన్ జట్టు తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకుంది. మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఈ టీములో వివేక్ అద్భుతంగా ఆడి అత్యధికంగా 30 పరుగులు చేశాడు. గూడూరు ఆర్ డి ఓ అరుణ్‌బాబు కాసేపు ఉన్నప్పటికి సిక్సర్లు, ఫోర్లతో మెరుపులు మెరిపించాడు. కలెక్టర్ తాను ఎదుర్కొన్న తొలి బంతిని చక్కగా ఆడి ఒక పరుగు సాధించి రెండో పరుగు సాధించే క్రమంలో రనౌటయి వెనుతిరిగారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఎస్పీ ఎలెవన్ టీము నిర్దేశించిన లక్ష్యాన్ని 17.2 ఓవర్లలోనే 2 వికెట్లు నష్టపోయి సాధించారు. ఎస్పీ విశాల్‌గున్ని తన బ్యాటింగ్ ప్రతిభతో 31 పరుగులు సాధించి చివరి వరకు నాటౌట్‌గా నిలవడం విశేషం. అదేవిధంగా చివరలో బ్యాటింగ్‌కు దిగిన నగర డిఎస్పీ జివి రాముడు వెంట వెంటనే రెండు ఫోర్లు కొట్టి ఎస్పీ జట్టును విజయతీరాలకు చేర్చారు.
మెమెంటోల బహూకరణ
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది మధ్య జరిగిన ఈ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో గెలుపొందిన ఎస్పీ ఎలెవన్ జట్టుకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, రన్నర్స్‌గా నిలిచిన కలెక్టర్ జట్టుకు ఎస్పీ విశాల్‌గున్ని షీల్డ్స్, ఆటగాళ్లకు మెమెంటోలు బహూకరించారు. బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎస్పీ విశాల్‌గున్ని, ఆల్‌రౌండర్‌గా గూడూరు ఆర్‌డివో అరుణ్‌బాబు, బౌలర్‌గా వివేక్ ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యం ఎంతో పని ఒత్తిడితో ఉండే తమ రెండు శాఖల మధ్య సహృద్భావ, సమన్వయ వాతావరణం నెలకొల్పేందుకు ఈ స్నేహపూర్వక క్రికెట్ పోటీ జరిపామన్నారు. గెలుపెవరిదనేది ముఖ్యం కాదని, ప్రభుత్వ శాఖల గెలుపుగానే భావించాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికలు తదితర సమయాల్లో సమన్వయంతో ఉండే తమ రెండు శాఖల సిబ్బంది ఈ పోటీల ద్వారా మరింత దగ్గర కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, ఎఎస్పీ బి.శరత్‌బాబు, డిఆర్‌ఓ కృష్ణ్భారతి, ఆర్‌డిఓలు వెంకటేశ్వర్లు, రమణ, డిఎస్‌డిఓ రమణయ్య, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు చొప్పా రవీంద్రబాబు, మధుసూదన్‌రావు, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతగా మెలగాలి
అధికారులకు రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 9: అధికారులు బాధ్యతగా మెలగాలని, లేనిపక్షంలో మూల్యం చెల్లించాల్సి వస్తుందని రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ కనకవల్లి హెచ్చరించారు. జిల్లా ఖజానా కార్యాలయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణలో భాగంగా ఆమె గురువారం జిల్లా ఖజానా కార్యాలయాన్ని తనిఖీ చేశారు. తొలుత ఖజానా కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. స్ట్రాంగ్‌రూంను, ఇతర ముఖ్యమైన విభాగాలను ఆమె తనిఖీ చేసి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమైన ఆమె కార్యాలయ సిబ్బందిపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందిని తరచూ పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదేనని స్పష్టం చేశారు. అనంతరం కార్యాలయంలో వివిధ పథకాల లబ్ధిదారులకు అందాల్సిన నగదును తన భార్య ఖాతాలో జమ చేసుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పొరుగుసేవల ఉద్యోగి సుబ్బయ్య, అతని భార్య పార్వతిలను డైరెక్టర్ పిలిపించి విచారించారు.

సెంట్రల్ జైలు నుంచి ఖైదీ పరార్
వెంకటాచలం, ఫిబ్రవరి 9: మండల పరిధిలోని చెముడుగుంట పంచాయతీ పరిథిలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలు నుంచి ఓ ఖైదీ పరారైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. జైలు సూపరింటెండెంట్ వెంకటాచలం పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన అన్నపురెడ్డి శ్రీరాములు అలియాస్ శ్రీరామ్ చెముడుగుంట వద్ద ఉన్న జిల్లా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. గురువారం సాయంత్రం సమయంలో ఓపెన్ జైల్ నుంచి పరారయ్యాడు. ఈ విషయం జైలు అధికారులు గుర్తించేలోపే పరారైన ఖైదీ కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో జైలు సూపరింటెండెంట్ వెంకటాచలం పోలీసులకు గురువారం రాత్రి సమాచారం ఇచ్చారు. ఈమేరకు వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పనితీరు మారాలి
వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌పై కలెక్టర్ ఆగ్రహం

నెల్లూరు, ఫిబ్రవరి 9: జిల్లాలో వయోజన విద్య సక్రమంగా అమలుకావడం లేదని, పర్యవేక్షణ లోపించిందని, సమావేశాలు నిర్వహించిటప్పుడు సరైన సమాచారం ఇవ్వటం లేదని, ఇకనైనా తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు వయోజన విద్య డిప్యూటీ డైరెక్టరు ఎంవిఎల్ నారాయణమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో వయోజన విద్యపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వయోజన విద్య ఈ ఏడాది లక్షా 12 వేలు లక్ష్యంగా కేటాయించగా సక్రమంగా అమలు చేయలేదన్నారు. జిల్లాలో వంద శాతం అక్షరాస్యత చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏప్రిల్ నుంచి అధికారులు అందరిని అక్షరాస్యత కార్యక్రమంలో భాగస్వాముల్ని చేసి పూర్తిస్థాయిలో నిరక్షరాస్యతను నిర్మూలిస్తామన్నారు. గ్రామాల్లో 7,8,9 తరగతుల విద్యార్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి వయోజన విద్యలో వారిచేత పాఠాలు చెప్పించాలన్నారు. వయోజన విద్య శాఖలో తొమ్మిది మంది సూపర్‌వైజర్లు ఉన్నా వారితో సక్రమంగా పనిచేయించటం లేదని తెలిపారు. కిందిస్థాయి నుంచి ప్రతిఒక్కరు సక్రమంగా పనిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించాచారు. ఈనెల 15వ తేదీన మరలా సమావేశం నిర్వహిస్తానని, పూర్తి సమాచారంతో రావల్సిందిగా డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కృష్ణ్భారతి, డిఆర్‌డిఎ పీడి లావణ్య, సెట్నల్ సిఇఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
రాపూరు, ఫిబ్రవరి 9: ప్రపంచంలో అరుదైన వృక్షజాతి సంపద అయిన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి అటవీ టాస్క్ఫోర్స్ విజిలెన్స్ అధికారి కల్లూరు వెంకటసుబ్బయ్య స్పష్టం చేశారు. గురువారం రాపూరు మండలంలోని ఏపూరు గ్రామంలో జరిగిన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక చర్యలు తదితర అంశాలపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎర్రచందనం రవాణా నిరోధక అధికారి మాగంటి కాంతారావు ఆదేశాల మేరకు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యావత్ ప్రపంచం మీద కేవలం ఆంధ్ర రాష్ట్ర పరిధిలోని శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే ఈ అరుదైన వృక్షజాతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని స్పష్టం చేశారు. ఈ వృక్షాలు నరికేస్తే వచ్చే నష్టాలు, కరవు కాటకాల పరిస్థితులపై ఈ అవగాహన సదస్సుకు హాజరైన ప్రజలకు సమగ్రంగా వివరించారు. ఈకార్యక్రమంలో రాపూరు అటవీ శిక్షణ అధికారి ప్రకాశరావు, రాపూరు ఫారెస్టు బీట్ ఆఫీసర్ వరప్రసాద్, తిరుపతి టాస్క్ఫోర్స్ అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, పాపారావులతోపాటు స్థానిక అటవీ అధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంస్థాగత ఎన్నికల్లో
ఎమ్మెల్యేల జోరుకు చెక్

నెల్లూరు, ఫిబ్రవరి 9: అధికారపక్ష ఎమ్మెల్యేలకు ఎంతో ఇష్టమైన పదం. తాము ఇచ్చిన వారికి పదవులు, ఇష్టం లేని వారికి రిక్తహస్తాలు. గ్రామ కమిటీల నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు ఏదైనా ఇంతే. అంతటా ఇదే సూత్రం. అందుకనే కొందరు ఈ సూత్రానికి కట్టుబడి ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటారు. తద్వారా మెప్పు పొందుతారు. ఇంకోవైపు పదవులు పొందుతుంటారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పనిచేసిన సీనియార్లదీ అదే పరిస్థితి. పైస్థాయిలో కూడా ఇదే పద్ధతి. అందుకనే పార్టీలో వంగి మోకరిల్లిన వారికే పదవులు దక్కుతాయని అందరు ఓ అంచనాకొచ్చేశారు. జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు దక్కించుకొన్నారు. మిగిలిన నియోజకవర్గాలలో ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. చాలాచోట్ల గ్రామ కమిటీ స్థాయిలోనే పెద్ద తేడా వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు వేగంగా కిందిస్థాయికి చేరటం లేదు. ఇంతకుముందు పార్టీని ప్రాణంగా భావించేవారు ఎవరైనా పార్టీని పల్లెత్తు మాటంటే విరుచుకుపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. అందరూ ‘ఎస్ బాస్’కు అలవాటు పడిపోయారు. ఫలితంగా రాబోయే నష్టాన్ని అధిష్ఠానం గుర్తించింది. వచ్చే ఎన్నిలను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జ్‌ల దూకుడుకు ఏకపక్ష పోకడకు ప్రత్యక్షంగానే చెక్ పెట్టబోతోంది. అది కూడా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న వేళ. మహానాడు జరిగే ప్రతిసారి ముందస్తు సంస్థాగత ఎన్నికలను పార్టీ నిర్వహిస్తూ వచ్చింది. ఈ సాంప్రదాయం పార్టీ ఆవిర్భావం నుంచి ఉంది. అప్పటికి, ఈసారి జరగబోయే సంస్థాగత ఎన్నికలకు పెద్ద మార్పులు, చేర్పులు చేశారు. దీని ప్రకారం గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏకగ్రీవం అయినా కాకపోయిన వీరిద్దరి పేర్లను అధిష్ఠానానికి ఆన్‌లైన్‌లోనే పంపాల్సి వస్తోంది. అసలు గ్రామ కమిటీ నిర్వహించే సత్తా వీరికి ఉందా అని అధిష్టానమే క్షేత్రస్థాయిలో ఆరా తీస్తుంది. గుణగణాలను పరిగణనలోకి తీసుకుంటుంది. పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారో లేదో నిర్ధారించుకుంటుంది. ఆ గ్రామాల్లో కార్యకర్తలు వీరిపట్ల చూపే మొగ్గునుబట్టి చివరకు కమిటీ ఓకె చేస్తారు. లేదంటే తదుపరి చర్యలకు దిగుతారు. ఇంతకుముందు మాదిరిగా గ్రామ, మండల స్థాయిలో ఎవరిపెత్తనం సాగుతుంటే వారివైపు ఉండేవ్యక్తి ఇలాంటి కమిటీలకు అధ్యక్షునిగా మారేవారు. కానీ దీనికి ఇప్పుడు పూర్తిగా చెక్ పెడుతున్నారు. మండల కమిటీలను ఇలాంటి విధానాన్ని పాటిస్తారా అంటే గ్రూపులు, వర్గాలు పెచ్చరిల్లినచోట ఏ వర్గానికి మొగ్గు చూపకుండా పార్టీ కోరుకున్న వారికే అసలు సిసలులో భాగంగా బాధ్యతలు అప్పగిస్తారన్న మాట. దీంతో కొందరి పెత్తనానికి నేరుగా తెరదించటమే కాకుండా వచ్చే ఎన్నికలనాటికి నేరుగా పార్టీ యంత్రాంగాన్ని ధీటుగా సమాయత్తం చేసేటట్టుగానే తెలుగుదేశం భావిస్తుంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు తలలు పట్టుకున్నారు. గ్రామస్థాయిలో రకరకాల రాజకీయ కోణాలు ఉంటాయి. వ్యక్తిగతంగా మైనస్ ఉన్నా పార్టీపరంగా పైచేయి ఉన్నవారిని ఎంపిక చేయటం ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యమేనా అనే ప్రశ్న సంధిస్తున్నారు.

శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి
మహాకుంబాభిషేక పనుల పరిశీలన

నెల్లూరు, ఫిబ్రవరి 9: నగరంలోని దర్గామిట్టలో ఉన్న శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించనున్న మహాకుంభాభిషేకం ఏర్పాట్లను గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. తొలుత వేమిరెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకొని, దేవస్థానంలో జరిగే పనులు పరిశీలించారు. అనంతరం ప్రధాన అర్చకులతో ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల తరువాత నిర్వహించనున్న ఈ మహా కుంబాభిషేకం 9 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, కె వినోద్‌రెడ్డి, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.