శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్సీ వరమాల ధరించే వరుడెవరో...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 10 : త్వరలో ఖాళీ కానున్న శాసనమండలి స్థానాల్లో తమకు అవకాశం కల్పించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కార్యాలయ గడప ఎక్కి దిగే జిల్లా నేతల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. పనిలో పనిగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైపు నుంచి కూడా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కూడా త్వరలో ఖాళీ కానుంది. ప్రస్తుతం ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న వాకాటి నారాయణరెడ్డి మరోసారి తనకు అవకాశం కల్పించాలని అధినేతకు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. పైగా టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరిన తొలి ఎమ్మెల్సీగా వాకాటిపై చంద్రబాబుకు మంచి అభిప్రాయం ఉండటం, చేరే సమయంలో ముఖ్యమంత్రి తమ నాయకుడికి స్పష్టమైన హామీ కూడా ఇచ్చినట్లు వాకాటి అనుచరులు దీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మారిన పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం జిల్లాలో ఎందరికి కల్పిస్తారో అంతుచిక్కడం లేదు. జిల్లాలో బలమైన రాజకీయవర్గంగా ఉన్న ఆనం సోదరులు టిడిపిలో చేరడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ విశే్లషణలన్ని పూర్తిగా మారిపోయాయనే చెప్పవచ్చు. పైగా వీరు పార్టీలో చేరే సమయంలో చంద్రబాబు దగ్గర్నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్య అవకాశం కల్పిస్తామనే స్పష్టమైన హామీ పొందినట్లు సమాచారం. ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఆనం రామనారాయణరెడ్డిని పార్టీ నియమించడంతో ఈ వాదనలకు బలం చేకూరింది. నగర మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడికి ఎమ్మెల్పీ అవకాశం కల్పిస్తారనే ప్రచారం నెల్లూరులో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఒకేసారి రెండు అవకాశాలు తమ నేత కల్పించరనే వాదన కూడా మరోవైపు పార్టీ జిల్లానేతల నుంచి వ్యక్తమవుతోంది. అదే కోవలో మరోమాజీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ స్థానంపై గంపెడాశతో ఉన్నారు. ఎంపీగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడినప్పటికి ఆదాల నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తూనే ఉన్నారు. బాధ్యతాయుతమైన పదవి అప్పగిస్తే రూరల్ నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చనే ఆలోచన ఆయన అనుచరుల నుంచి వ్యక్తమవుతోంది. ఆదాల సైతం తనకు అవకాశం లభిస్తుందనే భావంతో ఉన్నారు. ఆదాల, ఆనంలిద్దరూ రంగంలోకి రావడంతో వాకాటి తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. మరోవైపు వాకాటికి అవకాశాలు సన్నగిల్లేలా చేసేందుకు జిల్లా టిడిపి నేతలు పనిగట్టుకొని ఆయనపై తప్పుడు సమాచారాన్ని వెలుగులోకి తీసుకువస్తున్నారంటూ వాకాటి అనుచరులు ఆరోపిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి జిల్లాలో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రెడ్లను పార్టీకి చేరువచేయాలనే తలంపుతో చంద్రబాబు ఉండటంతో ఎవరికి అవకాశం ఇచ్చినా వారు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఉంటారన్నది సుస్పష్టం. అయితే ఇప్పటికే ఒకేసారి నెల్లూరు జిల్లాకు రెండు ఎమ్మెల్సీ పదవులు అప్పగించిన చంద్రబాబునాయుడు మరొక అవకాశం కల్పిస్తారా అనేది కూడా ప్రశ్నార్థకమే. స్థానిక సంస్థల నుంచి ఎలాగూ ఒక ఎమ్మెల్సీ వస్తుండటంతో అది కాకుండా మరొకరి కూడా అవకాశం ఏ మేరకు ఆయన జిల్లా నేతలకు ఇస్తారో కూడా వేచి చూడాలి.

మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం
* జిల్లా సెషన్స్ జడ్జి జునైద్ అహ్మద్ వౌలానా

నెల్లూరు, ఫిబ్రవరి 10: ప్రజాసేవలో తన మునకలైన ఉద్యోగులకు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా ప్రధాన సెషన్ జడ్జి జునైద్ అహ్మద్ వౌలానా అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో అంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ రెవెన్యూ క్రీడోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా ఆస్వాదించాలని కోరారు. క్రీడల నిర్వహణకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపోటములు సమానమని, దాన్ని క్రీడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకుపోవాలన్నారు. క్రీడల్లో గెలుపొందిన వారికి ఎప్పటికప్పుడు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని అన్నారు. ముగింపు రోజున క్యాంప్‌ఫైర్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, రెవెన్యూ ఉద్యోగులు వారివారి కుటుంబాలతో సహా తప్పక హాజరై క్రీడలను ఆస్వాదించాలని ఆయన కోరారు. తొలుత ఆత్మకూరు, గూడూరు, కావలి, నాయుడుపేట, నెల్లూరు కలెక్టరేట్ యూనిట్ల కవాతు అనంతరం ముఖ్య అతిథులు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ జెండా, రెవెన్యూ క్రీడోత్సవాల పతాలను ఎగురవేశారు. శాంతికపోతాలను, బెలూన్‌లను ఎగురవేసి ముఖ్యఅతిథి జునైద్ అహ్మద్ వౌలానా క్రీడలను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆత్మకూరు తరఫున సిహెచ్ సురేష్, గూడూరు తరఫున వెంకట్, కావలి తరఫున మురళీ, నాయుడుపేట తరఫున రామకృష్ణ, నెల్లూరు తరఫున మురళీ, కలెక్టరేట్ తరఫున వెంకట్ రిలే క్రీడా జ్యోతిని ముఖ్యఅతిథికి అందజేసి క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, డిఆర్‌ఓ కృష్ణ్భారతి, డ్వామా పిడి హరిత, రాజీవ్ విద్యా మిషన్ పిడి కనకనరసారెడ్డి, ఐటిడిఎ పిడి కమలాకుమారి, డిఆర్‌డిఎ పిడి లావణ్యవేణి, రెవెన్యూ డివిజనల్ అధికారులు వెంకటేశ్వర్లు, భక్తవత్సలరెడ్డి, ఎంవి రమణ, పి అరుణబాబు, శీనునాయక్, రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదన్, జిల్లా అధ్యక్షుడు ఎం నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

మార్చికల్లా గృహ నిర్మాణాలను
పూర్తి చేయాలి
* జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశం

నెల్లూరు, ఫిబ్రవరి 10 : గృహ నిర్మాణ శాఖ ద్వారా చేపట్టనున్న గృహ నిర్మాణ లక్ష్యాలను మార్చి 31నాటికి పూర్తిచేసి తద్వారా ఆర్థిక సంవత్సరంలో మరింత మందికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌లోని గోల్డెన్ జూబ్లీహాల్లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గృహ నిర్మాణ దరఖాస్తులు, ఆప్‌లైన్‌లో ఉన్న దరఖాస్తులను ఆన్‌లైన్‌లోకి త్వరితగతిన పొందుపరచాలన్నారు. లక్ష్య సాధనలో వెనుకంజలో ఉన్నామని, మెరుగైన సేవలు అందించి త్వరితగతిన లక్ష్యాలను పూర్తిచేయాలని ఆయన సూచించారు. లక్ష్య సాధనలో ఏదైనా సమస్యలు ఎదురైతే ముందస్తుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లిప్తను వీడి చురుగ్గా పనిచేయాలన్నారు. లక్ష్యాలను సాధించేవరకు ప్రతి మంగళ, శుక్రవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, తదుపరి సమావేశానికి అందరూ సిద్ధమై సంబంధిత రికార్డులతో రావాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ ప్రాజెక్టు అధికారి రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీరాములు, గృహ నిర్మాణ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వౌలిక సదుపాయాలు కల్పించాలి
వైఎస్‌ఆర్‌నగర్ కొత్తూరులో నిర్మించిన గృహాలకు వెంటనే వౌలిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌నగర్ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌నగర్‌లో 6 వేల గృహాలు ఉన్నాయని, ఇప్పటికే కొన్ని గృహాల్లో నివాసం ఉంటున్నారని, మార్చి 10వ తేదీనాటికి 4 వేలకు పైగా కుటుంబాలు వచ్చేస్తాయన్నారు. అక్కడ నివసించే కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. రేషన్ షాపుఏర్పాటు చేసి దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని పౌరసరఫరాల అధికారిని ఆదేశించారు. ప్రధాన రోడ్డు వెంటనే వేయించాలని గృహ నిర్మాణ శాఖ అధికారిని కోరారు. ఈ పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పిడి హరిత, హౌసింగ్ పిడి రామచంద్రారెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా చక్రస్నానం, వేంకటేశ్వరునికి ఏకాంతసేవ
కావలి, ఫిబ్రవరి 10: పట్టణంలోని ముసునూరు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం ఉదయం భక్తజన సందోహం మధ్య చక్రస్నానం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక అర్చకులు వేదగిరి సూర్యనారాయణచార్యుల నేతృత్వంలోని అర్చక బృందం వేద మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా చక్రస్నాన పూజలు నిర్వహించగా భక్తులు భారీగా తరలి వచ్చారు. అనంతరం సామూహికంగా వేంకటేశ్వరస్వామి వ్రతాలు జరిగాయి. భక్తులు మొక్కులు తీర్చుకోగా సాయంత్రం స్థానిక టీచర్స్ కాలనీలో స్వామివారి ఊరేగింపు జరిగింది. అనంతరం రాత్రి ఆలయ సన్నిదిలో స్వామివారికి ఏకాంతసేవకు భక్తులు హాజరై తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
దాడి కేసులో ఇద్దరికి ఆరు నెలల జైలు
నెల్లూరు లీగల్, ఫిబ్రవరి 10: వ్యక్తిగత కక్షలతో ఒక వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారని నమోదైన కేసులో నిందితుడు బండి శీనయ్య, బి రాజేష్‌లపై ఆరోపణలు రుజువైనందున వారికి ఒక్కొక్కరికి ఆరు నెలల వంతున జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు నాల్గవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా ఉన్నాయి. ముత్తుకూరుకు చెందిన ఫిర్యాది సాయి వర్షితారెడ్డికి నిందితుల నడుమ వ్యక్తిగత కక్షలు ఉండేవి. ఈ నేపథ్యంలో 2014 జూలై 23న ముత్తుకూరు బస్టాండ్ సమీపంలో రోడ్డుపై వెళ్తున్న వర్షితారెడ్డిపై నిందితులు బండి శీనయ్య, రాజేష్ ఇరువురు దాడి చేసి గాయపరిచారని ఆరోపణ. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి నిందితులు ఇద్దరిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు.

టిడిపిలో యువతకు పెద్దపీట
* జిల్లా టిడిపి అధ్యక్షుడు బీద
అల్లూరు, ఫిబ్రవరి 10 : తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేస్తూ వారి అభివృద్ధికి చేయూతనిస్తున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎంఎల్‌సి బీద రవిచంద్ర అన్నారు. శుక్రవారం మండలంలోని నార్తుమోపూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 28వ తేదీ వరకు గ్రామస్థాయిలో కమిటీలను, అనుబంధ సంస్థలను నిర్వహించినట్లు తెలిపారు. పార్టీ అనుబంధ ఎన్నికల కోసం కార్యక్రమాలను చేపట్టామన్నారు. మే నెలలో మినీ మహానాడు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు యువతకు పెద్దపీట వేయడమే ధ్యేయంగా గ్రామస్థాయిలో యువకులను పార్టీలోకి ఆహ్వానించి వారికి బాధ్యతలను అప్పగిస్తామన్నారు. గ్రామంలో నెలకొని ఉన్న ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు మేలు చేసేవిధంగా ఉండాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలాంటి వారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నారని, ఆయనను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించాలన్నారు. పట్ట్భద్రుల ఎన్నికలు త్వరలో ఉన్నందున కార్యకర్తలు శ్రమించి వారి విజయం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ పార్టీ విధానాలను యువతలోకి తీసుకెళ్తూ వారి కోసం నిధిని ఏర్పాటు చేశారన్నారు. ఎన్‌టిఆర్ ట్రస్టు, ఎన్‌టిఆర్ మోడల్ స్కూలు అనేక కార్యక్రమాలు చేపడుతూ మరణించిన కార్యకర్తలకు అండదండగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ నూతన జీవన ప్రమాణాలతో ప్రజలకు చేరువ అవుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉంటుందన్నారు.
డెల్టాగా మూడు గ్రామాలు
మండలంలోని నార్తుమోపూరు, బట్రకాగొల్లు, నార్తు ఆములూరు నాన్‌డెల్టాగా ఉన్నందున రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అల్లూరు డెల్టా అయినప్పటికీ ఈ మూడు గ్రామాలు నాన్ డెల్టాగా ఉన్నాయని, సంబంధిత విషయంపై గతంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు స్పందించి డెల్టాగా మార్చాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా దృష్టికి తీసుకెళ్లామని, వెంటనే స్పందించి డెల్టాగా మార్చేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో ఈ మూడు గ్రామాలు డెల్టా అవుతున్న కారణంగా పంటలు సస్యశ్యామలం అవుతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బీద గిరిధర్, రంగారెడ్డి, శంకర్‌రెడ్డి, బిట్రగుంట ఉమా ప్రసాద్‌రెడ్డి, బండి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అవసరం’
గూడూరు, ఫిబ్రవరి 10 : విద్యార్థులకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ, దేశభక్తి, విలువలతో కూడిన విద్య అవసరమని గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బాదిపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం స్థానిక సరస్వతీ శిశు మందిరం పాఠశాలలో రూ.14 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్‌ల్యాబ్, కాన్ఫరెన్స్ హాలు, తరగతి గదులను ఆయన మున్సిపల్ చైర్‌పర్సన్ పి దేవసేనతో కలసి ప్రారంభించారు. లయన్స్, వైజెపి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన వీటిని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరస్వతీ శిశు మందిరంలో విద్యాభ్యాసం క్రమశిక్షణకు, దేశభక్తికి మారుపేరని, చిన్నతనం నుంచే విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేందుకు, క్రమశిక్షణ అలవర్చేందుకు శిశు మందిరాలు ఎంతో కృషి చేస్తున్నాయని అన్నారు. నేడు విద్యార్థుల తల్లితండ్రులు కార్పొరేట్ మోజులో పడి, చిన్నారులకు విలువలతో కూడిన విద్యను అందించడంలో ఆసక్తి చూపడం లేదని, దీంతో భవిష్యత్తులో వారికి అనేక ఇబ్బందులు కలిగే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పి దేవసేన మాట్లాడుతూ గూడూరులోని సరస్వతీ శిశు మందిరం గతంలో అద్దె భవనంలో నిర్వహిస్తుండే వారని, దాన్ని ప్రస్తుతం డాక్టర్ సిఆర్ రెడ్డి సొంత భవనం సమకూర్చి పాఠశాలకు దాతల సహాయ సహకారాలతో బస్సు సౌకర్యం కూడా కల్పించారని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం నేడు సరస్వతీ శిశు మందిరంలో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారంటే ఇక్కడ విద్యాబోధన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిఆర్ రెడ్డి, లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ గౌతం, జోన్ చైర్మన్ బివిఎస్ రవిశంకర్, ఎపి సరస్వతీ శిశు మందిరం ఇన్‌ఛార్జి శ్రీనివాసులు, డాక్టర్ సి రోహిణి, డాక్టర్ సి జనార్దన్‌రెడ్డి, పేరం శ్రీలక్ష్మి, వైజెపి లయన్స్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భార్యను వేధించిన కేసులో భర్తకు ఆరు నెలలు జైలు
నెల్లూరు లీగల్, ఫిబ్రవరి 10: అదనపు కట్నం తెమ్మని కట్టుకున్న భార్యను వేధించిన కేసులో నిందితుడైన భర్త ఈదూరు శ్రీనివాసులుపై ఆరోపణలు సాక్ష్యాధారాలతో రుజువైనందున అతనికి ఆరు నెలలు జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ నెల్లూరు నాల్గవ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా ఉన్నాయి. ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెంకు చెందిన నిందితుడు శ్రీనివాసులరెడ్డికి ఫిర్యాది లక్ష్మికి 2004లో వివాహం జరిగింది. ఈ సందర్భంగా కట్నకానుకల కింద ఒకటిన్నర లక్ష పైకం అత్తింటి వారు ఇచ్చారు. కాగా, కొద్దికాలం తరువాత మరింత కట్నం తెమ్మని భార్య లక్ష్మిని నిత్యం వేధించేవాడు. దీంతో విసిగిపోయిన ఫిర్యాది తన భర్తపై, తదితర బంధువులపై ఇందుకూరుపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ అనంతరం నిందితుడు శ్రీనివాసులరెడ్డితో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం నిందితుడికి పైమేర శిక్ష విధించి మిగతా ఐదుగురు నిందితులపై సాక్ష్యాధారాలు లేనందున వారిపై కేసు కొట్టివేస్తూ కోర్టు తీర్పుచెప్పింది.
పారిశ్రామిక ప్రగతికి కృషి చేయాలి
* ఏపి ఛాంబర్స్ ఆధ్వర్యంలో జెడ్‌ఇడి అవగాహన సదస్సు
నెల్లూరు, ఫిబ్రవరి 10: వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు ప్రామాణిత గుర్తింపు ఇచ్చేందుకు కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన జెడ్‌ఇడి విధానంపై జిల్లాలోని పారిశ్రామిక, వ్యాపార సంస్థల ప్రతినిధులకు అవగాహన సదస్సు శుక్రవారం స్థానిక యష్‌పార్క్ హోటల్‌లో జరిగింది. ఏపి చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ డైరక్టర్ వొమ్మిన సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలువురు వక్తలు పాల్గొని ఈ జెడ్‌ఇడి ఆవశ్యకతపై వివరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నగర ఎమ్మెల్యే పి అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పారిశ్రామిక ప్రగతి సాధించడంలో ఏపి ఛాంబర్స్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఇప్పుడిప్పుడే ప్రగతి సాధిస్తున్న నెల్లూరు జిల్లాలో చిన్న పారిశ్రామికవేత్తలకు మరింతగా ప్రోత్సాహాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఇప్పటివరకూ ఐఎస్‌ఓ సర్ట్ఫికేషన్ జరుగుతుండేదని, అయితే దేశీయంగా ఇటువంటి సర్ట్ఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని, కేవలం ప్రమాణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, సంబంధిత సంస్థల వల్ల పర్యావరణానికి జరిగే నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ముందుగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ సిఐటిఐ డైరెక్టర్ సుధాకర్ కార్యక్రమానికి హాజరై సర్ట్ఫికేషన్ పొందే విధానాన్ని క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

‘సంఘాల పేర్లతో దోపిడీ ఆపండి’
గూడూరు, ఫిబ్రవరి 10: విద్యార్థి, ప్రజా, కుల సంఘాల పేర్లు చెప్పుకుని పేద విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బిసి హాస్టళ్లకు వెళ్లి చందాల పేర్లతో దోపిడీకి పాల్పడుతున్నవారు ఇకనైనా ఇటువంటి దోపిడీలు ఆపాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ వార్డెన్లను కొందరు బెదిరిస్తూ ఇదే బతుకుతెరువుగా సాగించడం దుర్మార్గమన్నారు. దీనివల్ల నిరుపేద బడుగు, బలహీన, దళిత పీడిత వర్గాల విద్యార్థులకు అందాల్సిన తిండిని కూడా దోచుకుంటున్న ఇలాంటి వ్యక్తులపై నిఘా ఉంచి వారి ఆగడాలను అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో వైకాపా మైనారిటీ విభాగం నాయకుడు ఎండి మగ్ధూం మొహిద్దీన్, టిపి ఫ్రాంక్లిన్, ఏ హరికృష్ణ, ఎన్‌ఎస్‌యుఐకి చెందిన అనిల్‌కుమార్, బిఎస్పీకి చెందిన నాసిన భాస్కరగౌడ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన కల్లూరు రవి, హరి, డి వెంకటేశ్వర్లు, వంగపూరి పెంచలయ్య, ఎం సునీల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రింటెడ్ సర్య్కూట్ బోర్డు తయారీపై శిక్షణ
కోట, ఫిబ్రవరి 10 : కోట మండలం విద్యానగర్‌లోని నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఇసిఇ విద్యార్థులకు ప్రింటెడ్ సర్య్కూట్ బోర్డు తయారీపై శిక్షణ శిబిరం నిర్వహించారు. హైదరాబాద్‌కి చెందిన టెక్నోటిన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అజహర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పిసిబిలేని ఏ ఎలక్ట్రానిక్ ఉపకరణ ఉండదన్నారు. పిసిబి తయారీలో ముందుగా ఒక సాధారణ బోర్డుపై సర్య్కూట్‌ను ముద్రించి ఎలక్ట్రానిక్ కాంపౌసెంట్స్‌ను అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. సదస్సులో కళాశాల డైరెక్టర్ వి విజయకుమార్‌రెడ్డి, ఇసిఇ విభాగాధిపతి హర్‌నాథ్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

స్మార్ట్‌సిటీ సెల్‌తో నగరాభివృద్ధి వేగవంతం
* నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ స్పష్టం
నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 10 : రాష్ట్రంలోని స్మార్ట్ సిటీలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసేందుకు మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేసిన స్మార్ట్‌సిటీ సెల్ సహకారంతో నగరాభివృద్ధి వేగవంతం అవుతుందని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు ఈ సంస్థ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో నెల్లూరుతోపాటు అనంతపురం, కర్నూలు, ఏలూరు, శ్రీకాకుళం, ఒంగోలు నగరాల్లో ప్రాజెక్టును ప్రారంభించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారని చెప్పారు. రాబోవు పదేళ్లలో నగర ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్న అంశాలపై సంస్థ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతి ఏటా రూ.33కోట్లు మంజూరు చేస్తుందని, ఆ మొత్తంలో నగరాభివృద్ధికి అవసరమై ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. మూడేళ్లపాటు మంజూరై ఆ నిధులకు సమానంగా కార్పొరేషన్ కూడా నిధులను వెచ్చిస్తూ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని వివరించారు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లాంటి సామాజిక మాధ్యమాలతో ప్రజాప్రాభియాలను సేకరిస్తామని నెల్లూరు స్మార్ట్‌సిటీ సెల్ ప్రాజెక్టు మేనేజర్ రత్నాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేనేజర్ గిరిజ, నెల్లూరు స్మార్ట్‌సిటీ సెల్ సంస్థ ప్రతినిధులు రూపరాణి, నాగేంద్ర, వాసవి, కార్పొరేటర్ దొడ్డపనేని రాజానాయుడు తదితరులు పాల్గొన్నారు.