శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మామూళ్ల ‘రిజిస్ట్రేషన్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 20: ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకువచ్చే శాఖల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఎంతో ప్రముఖమైనది. నోట్ల రద్దు జరిగినప్పటి నుండి జిల్లాలో రిజిస్ట్రేషన్ రాబడి గణనీయంగా తగ్గిపోయింది. తిరిగి గత నెల రోజుల నుండి జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అయితే ప్రభుత్వాదాయానికి హెచ్చుతగ్గులు ఉంటున్నప్పటికి సిబ్బంది ఆదాయంలో హెచ్చు తప్ప తగ్గుదల కనిపించడం లేదు. మామూళ్లు ఇస్తేనే పనులు జరుగుతాయనే భావన రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారిలో ఏర్పడిపోయింది. ప్రస్తుతం జిల్లాలో గూడూరు, నెల్లూరు రిజిస్ట్రేషన్ జిల్లాలుగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. నిత్యం వివిధ ఆస్తులు, ఇతర విషయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారితో ఈ కార్యాలయాలు కిటకిటలాడుతుంటాయి. అయితే డాక్యుమెంట్ వాల్యూలో 5 శాతం వరకు కార్యాలయ సిబ్బందికి లంచం ఇవ్వనిదే రిజిస్ట్రేషన్ పూర్తికాదని ముందుగానే క్లయింట్లకు చెబుతారు. ఇందులో కార్యాలయ సిబ్బందికి ఎంతిస్తారో, వారెంత తీసుకుంటారో లోగుట్టు పెరుమాళ్లకెరుక. ఒకవేళ మామూళ్లు ఇచ్చేందుకు నిరాకరిస్తే వారి డాక్యుమెంట్లో అధికారులకు సాంకేతిక తప్పులు తప్ప మరేమీ కనిపించని పరిస్థితి. దీంతో ఎందుకొచ్చిన గొడవనుకునేవారు డాక్యుమెంట్ రైటర్లు చెప్పిన మొత్తం ఇచ్చి తమ పని పూర్తిచేసుకుని వెళుతున్నారు. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిస్థితి ఇలానే ఉందని చెప్పలేకపోయినా ఎక్కువచోట్ల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
రూరల్‌లో తిరుగులేని రైటర్లు
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంటు రైటర్లకు తిరుగుండడం లేదు. అల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏ చిన్న పని జరగాలన్నా అక్కడి కొందరు డాక్యుమెంటు రైటర్లనే నమ్ముకోవాల్సి వస్తుంది. ఇక్కడి రైటర్లు కార్యాలయ సిబ్బంది పేరుతో సాధారణంగా తీసుకునే 5 శాతానికి మరో 5 శాతం కలిపి తమ మామూళ్లుగా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక రాజకీయ నేతలతో ఉన్న సాన్నిహిత్యం రీత్యా వీరిని ప్రశ్నించేవారు కూడా లేరు. గతంలోనూ జిల్లా అధికారులు అల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల హవాపై సిబ్బందికి గట్టిగా హెచ్చరికలు కూడా చేసినట్లు సమాచారం. జిల్లాలోని గూడూరు విషయనికొస్తే ఇక్కడ ఓ డాక్యుమెంట్ రైటర్ ఎంతటి లోపం ఉన్న పనినయినా చేయించిపెట్టగల ధీరుడిగా గుర్తింపు పొందాడు. జిల్లా రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు డాక్యుమెంట్ రైటర్ల రూపంలో జరుగుతున్న ఈ మామూళ్ల వ్యవహారంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు
* పట్ట్భద్రులకు 20, టీచర్లకు 9 నామినేషన్లు దాఖలు
* టీచర్ల టిడిపి అభ్యర్థిగా వాసుదేవనాయుడు నామినేషన్ దాఖలు

చిత్తూరు, ఫిబ్రవరి 20: చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారంతో నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 29 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో ఉపాధ్యాయ స్థానానికి 9మంది, పట్ట్భద్రుల స్థానానికి 20మంది చొప్పున నామినేషన్లు వేశారు. చివరి రోజు అయిన సోమవారం 9 మంది నామినేషన్లు వేశారు. వీరిలో ముగ్గురు ఉపాధ్యాయ స్థానానికి, ఆరుగురు పట్ట్భద్రుల స్థానాలకు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వజియాబేగం ఎదుట నామినేషన్ సమర్పించారు. సోమవారం ఉపాధ్యాయుల స్థానానికి టిడిపి అభ్యర్థిగా మదనపల్లె ఉప విద్యాశాఖాధికారి వాసుదేవనాయుడు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే టీచర్ స్థానానికి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఎం రామిరెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్ రామయ్య నామినేషన్‌లు దాఖలు చేశారు. పట్ట్భద్రుల స్థానానికి ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన కె నారాయణరెడ్డి, ఇదే జిల్లాకు చెందిన వి సోమిరెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్‌కె కరీమూల్లా, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఉప్పురాజేష్‌రాయల్, చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన కె అమరేంద్ర, చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన చంద్రమోహన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 11మంది చొప్పున ప్రకాశం, చిత్తూరు జిల్లా వాసులు నామినేషన్ దాఖలు చేయగా ఏడుగురు నెల్లూరు జిల్లా వాసులు ఉన్నారు. మంగళవారం ఈనామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు.

పిఆర్ కండ్రిగలో అభివృద్ధి పనులు పర్యవేక్షణ
గూడూరు, ఫిబ్రవరి 20: గూడూరు మండలం పుట్టంరాజు వారికండ్రిగ గ్రామాన్ని సోమవారం రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ పిఎ నారాయణన్ సందర్శించారు. సచిన్ టెండూల్కర్ ఈ గ్రామాన్ని రెండు సంవత్సరాల క్రితం దత్తత తీసుకోగా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. గత సంవత్సరం నవంబర్‌లో సచిన్ ఆ గ్రామాన్ని సందర్శించి త్వరితగతిన గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈనేపథ్యంలో అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ముంబైకి చెందిన సచిన్ పిఎ నారాయణన్ ముందుగా గూడూరుకు విచ్చేసి అక్కడ నుండి అధికారులతో కలసి గ్రామానికి వెళ్లి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అసంపూర్తిగా ఉన్న పనులను సత్వరం పూర్తిచేయాలని ఆయన అధికారులను కోరారు. గ్రామంలో రెండుసార్లు పర్యటించిన సచిన్ ఆయన వచ్చి వెళ్లిన తరువాత ఇక్కడ అధికారులు ఆ గ్రామం గురించి పట్టించుకొనక పోవడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఈయన వెంట జెసి ఇంతియాజ్ అహ్మద్. ఆర్డీవో అరుణ్‌బాబు, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, మండల స్థాయి అధికారులు ఉన్నారు.

వీరభద్రయ్య మృతిపై ఇంటెలిజెన్స్ ఐజి ఆరా
నెల్లూరు, ఫిబ్రవరి 20: సామాజిక హక్కు చట్ట పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ పుట్టా వీరభద్రయ్య ఆదివారం నగరంలోని మాగుంట లే అవుట్ సమీపంలో రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి విదితమే. ఆయన మృతిపై రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజి మహేష్‌చంద్ర లడ్డా జిల్లా పోలీస్ ఉన్నతాధికారుతో మాట్లాడి ఆరా తీశారు. సోమవారం ఉదయం ఆయన జిల్లా అదనపు ఎస్పీ బి.శరత్‌బాబుతో ఫోన్‌లో ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరభద్రయ్య సమాచార హక్కు చట్టం ఉపయోగించి ఏ ఏ శాఖల అవినీతిని ప్రశ్నించినదీ, ఎవరెవరు అధికారులపై ఫిర్యాదు చేసింది తదితర వివరాలు అడిగినట్లు సమాచారం. మానవ హక్కుల సంఘం ఈ సంఘటనను సుమోటాగా స్వీకరించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సంఘటన పూర్వాపరాలు ఆరాతీయడం గమనార్హం.
ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి:కలెక్టర్
నెల్లూరు, ఫిబ్రవరి 20: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తమకు కేటాయించిన విధులను నోడల్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆదేశించారు. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల విభాగం ఏర్పాటు చేశామని, ఇందుకుగాను నోడల్ అధికారులుగా 16 మంది అధికారులను నియమించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన వారితో మాట్లాడుతూ నోడల్ అధికారుల విధులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశామన్నారు. గర్భిణీలు, దివ్యాంగులు, గుండె వ్యాధిగ్రస్తులకు ఎన్నికల విధులు కేటాయించవద్దని వారికి సూచించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ క్రిష్ణ్భారతి తదితరులు పాల్గొన్నారు.

ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం
నెల్లూరు, ఫిబ్రవరి 20: స్థానిక మూలాపేటలో వెలసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అర్చకుల వేదఘోష మధ్య స్వామివారి ఆలయ ధ్వజస్తంభ ఆరోహణ కార్యక్రమం వేడుకగా జరిగింది. సాయంత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి సింహవాహన సేవ కనుల పండువగా జరిగింది. మాడిశెట్టి కుటుంబీకులు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించారు. సాయంత్రం సాయి వెనె్నల ఆరెస్ట్రా ఆధ్వర్యంలో భక్తిగీతాలాపన, వరిసిద్ధి వినాయక నాట్యమండలి వారి సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శితమైంది. సోమవారం నాటి ఉత్సవ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ఆల్తూరి గిరీష్‌రెడ్డి, కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం చప్పర ఉత్సవం, సాయంత్రం పురుషామృగ వాహన సేవ నిర్వహించనున్నారు.
వాళ్ల బస్సు ఓవర్ లోడ్!
స్థానిక ఎంఎల్‌సి బరిలో మేమున్నాం
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఆత్మకూరు, ఫిబ్రవరి 20:
‘‘అతి సర్వత్ర వర్జయేత్.. అవసరానికి మించి అతిగా ఉంటే ప్రయోజనానికి బదులు అనర్ధదాయకమే అధికం అని అర్ధం’’ అలాగే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం బస్సు ఓవర్ లోడ్‌తో వెళ్తోందని.. కనీసం కండక్టర్ టిక్కెట్లు కొట్టేందుకు కూడా వెసులుబాటు లేని పరిస్థితిలోకి మారిందని.. అందులో ప్రయాణికులకు సీట్లు లేవనే ప్రాధాన్యత కోల్పోవడం వారిపట్ల అగౌరవంలా పరిణమిస్తోందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రత్యేకంగా వర్ణించిన వైనమిది. అనతికాలంలో జరగనున్న స్థానిక సంస్థల శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి తమ వైఎస్‌ఆర్‌సిపి పార్టీ మద్దతుదారుడైన అభ్యర్థి బరిలో నిలుస్తారని ఎమ్మెల్యే తెలిపారు. అయితే అధికార తెలుగుదేశానికి, మీ పార్టీకి నడుమ వ్యత్యాసం వంద ఓట్లకుపైగా ఉందనే విలేఖర్ల ప్రశ్నకు ఆయన స్పందించారు. గత సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో తమకే జిల్లాలో అధిక సంఖ్యా బాహుళ్యం లభించిందని వివరించారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో అధికారం తెలుగుదేశానికి రావడంతో తమ నుంచి వీడి వెళ్లిన వారితోనే ఆ పార్టీ సంఖ్య అధికమైందన్నారు. అక్కడకు వెళ్లిన వారికి అక్కడ సముచిత ప్రాధాన్యత లేక చాలామంది తిరిగి తమ వైపునకే ఆప్యాయంగా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో తమ బంధువైన అభిరామ్ ఆసుపత్రి అధినేత కోడూరు శ్రావణ్ నివాసంలో స్థానిక విలేఖర్లతో ఎమ్మెల్యే మేకపాటి ఇష్టాగోష్టిగా వివిధ అంశాలపై ముచ్చటించారు. ఈనెల 25వ తేదీలోగా తమ పార్టీ అభ్యర్థి పేరు వెల్లడించవచ్చన్నారు. తెలుగుదేశంపార్టీ అభ్యర్థి ప్రకటన తరువాతే మీ పార్టీ తరపున ఎవరనే సంగతి వెలుపలకు వస్తుందా అనే ప్రశ్నకు కూడా ఎమ్మెల్యే స్పందించారు. ఏమో.. మా అభ్యర్థిని చూసే ఆ పార్టీ తరపున ప్రకటన వెలువడవచ్చు కదా అనే అభిప్రాయం కూడా వెలిబుచ్చారు. ఈ ఎన్నికల్లో భాగంగా జరిగే శిబిర రాజకీయంపై కూడా ఎమ్మెల్యే తన అభిప్రాయాలను చెప్పారు. అలా ఎన్నో శిబిర రాజకీయాలు జరిగినా ఓటర్లు తమ మదిలో ఉన్న వారికే బ్యాలెట్‌పరంగా ప్రాధాన్యమిస్తారని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈ ఎన్నిక తమ పార్టీకి సానుకూలమని స్పష్టం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థి ఎవరు ఉండవచ్చనే సంగతిపై కూడా ఈ సందర్భంలో రాజకీయ చర్చలకు తావిచ్చింది. అంతకుముందు ఎమ్మెల్యే మర్రిపాడు మండలంలో పర్యటించారు. డిసిపల్లిలో సాగునీటి సంఘ మాజీ అధ్యక్షులు చిలకా సుబ్బారెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబీకులను పరామర్శించారు.

‘ఆయకట్టు రైతులను మోసం చేస్తున్న అధికారులు’
మనుబోలు, ఫిబ్రవరి 20: తెలుగుగంగ ఇంజనీర్లు మనుబోలు మండలం కండలేరు ఆయకట్టు రైతులను మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నూరు రామక్రిష్ణయ్య విమర్శించారు. సోమవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో ఆయన రైతు నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఆయకట్టు చెరువులకు 200 క్యూసెక్కులు నీరు అందించామని పైఅధికారులకు లెక్కల్లో చూపించి కేవలం 100 క్యూసెక్కులు మాత్రమే నీటిని విడుదల చేసి రైతులను మోసం చేస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. రైతులు రోడ్డెక్కి విధ్వంసం సృష్టిస్తే దానికి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయకట్టు హక్కుదారులైన మనుబోలు, చెర్లోపల్లి, వెంకన్నపాలెం, పిడూరు, బద్దెవోలు, పిడూరుపాలెం, కొలనుకుదురు, వెంకన్నపాలెం, కాగితాలపూరు తదితర ఆయకట్టు గ్రామాల చెరువులకు నీరందించకుండా చెన్నై, చిత్తూరుకు నీరు తరలించడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు వేసిన పంట వెన్నుదశలో వుందని, వెంటనే 1/2టిఎంసి నీటిని విడుదల చేసి రైతుల నోటి దాక వచ్చిన పైరు ఎండకుండా రెండు రోజుల్లో సాగునీరు అందించకపోతే ఆందోళన దిగుతామని రైతులు హెచ్చరించారు. అధికారులు మోసాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి న్యాయంగా తాము నీటిని సాధించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు సూరపనేని కిషోర్‌నాయుడు, ముంగర విజయభాస్కర్‌రెడ్డి, రవి, హనుమంతునాయుడు తదితరులు ఉన్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైకాపాదే అధికారం
* ఎంపి మేకపాటి స్పష్టం
నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 20: ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు కలిగించడం మంచి పద్ధతి కాదన్నారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేసేవారని, ముఖ్యమంత్రి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎంపి విమర్శించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ, పార్టీకి కార్యకర్తలు బలమని, వారి కోసం అనేక చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఇన్యూరెన్సు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటుచేసి ఆచరణలో ఉండే విధంగా ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రతి కార్యకర్త ముందుండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆనం విజయకుమార్‌రెడ్డి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇందుకూరుపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ఇందుకూరుపేట, ఫిబ్రవరి 20: మండలంలో సోమవారం పలు కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొత్తూరు గ్రామంలోని పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన 30 పడకల ప్రభుత్వ వైద్యశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పనితీరును అగిడి తెలుసుకున్నారు. కొన్ని యంత్రాలు పనిచేయకపోవడాన్ని గమనించారు. వార్డులలో ఉన్న గర్భిణీలు ఎవరూ ఆ బెడ్‌లపై కనిపించకపోవడంతో ఆయన అశ్చర్యపోయారు. అనంతరం, రోగులు ఎంత మంది వస్తారని వైద్యులను ప్రశ్నించారు. ఆసుపత్రిలో నెలకు ఎన్ని కాన్పులు జరుగుతాయని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల కోసం కేటాయించిన ప్రత్యేక గదుల్లో వైద్యులు వారి వారి సీట్లలో కూర్చోకపోవడాన్ని గమనించి, ఇలాగైతే రోగులు ఎలా వస్తారని అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం ఆసుపత్రి ముందు శిథిలమై ఉన్న భవనాన్ని పరిశీలించారు. ఆర్ అండ్ బి అధికారులచే పరిశీలింప చేసి, తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. రోగులు తాగే మంచినీరు క్యాన్‌ను పరిశీలించారు. అవి కూడా సక్రమంగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేసి, వైద్యులను నిలదీశారు. అనంతరం ఆయన తహశీల్దార్ కార్యాలయాన్న తనిఖీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్‌లో ఎమ్మెల్సీ జాబితా పరిశీలించారు. ఓటరు జాబితాలో ఉన్న ఓ ఓటును ఎందువల్ల తొలగించాల్సి వచ్చిందని విఆర్‌ఓను అడిగి తెలుసుకొన్నారు. పరిశీలన సమయంలో ఓటరు సరైన పత్రాలు చూపించనందున ఆ ఓటును తొలగించాల్సి వచ్చిందని కలెక్టర్‌కు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఆత్మగౌరవం కార్యక్రమం నూరు శాతం పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నాలుగు గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణాలు తక్కువగా ఉన్నాయని నాలుగు గ్రామాలలో మండలస్థాయి అధికారులను నియమించి మార్చి 31వ తేదీలోపు నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగేటట్లు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సి వెంకటనారాయణమ్మ, ఎంపిడిఓ కె వెంకటేశ్వరరావు, పిఓఆర్‌డి కె జలజాక్షి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

న్యాయమూర్తుల బదిలీలు
నెల్లూరు లీగల్, ఫిబ్రవరి 20: జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్న సి సత్యవాణిని కడప జిల్లా రాజంపేట మూడవ అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతపై నియమిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే నెల్లూరు ఫ్యామిలీ కోర్టు జడ్జి ఆరవ అదనపు జిల్లా జడ్జిగా ఎ సాల్మన్‌ను నియమించారు. ఈయన ప్రస్తుతం గుంటూరు జిల్లా సత్తెనపల్లి సీనియర్ సివిల్ జడ్జిగా ఉంటూ పదోన్నతిపై నెల్లూరులో నియమించారు. నెల్లూరు ఎసిబి కోర్టు జడ్జిగా మహమ్మద్ అబ్దుల్ రఫీని నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు చేసింది. ఈయన ప్రస్తుతం విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్‌గా ఉన్నారు. ఈయన కూడా పదోన్నతిపై నెల్లూరులో పోస్టింగ్ ఇచ్చారు.

ఎంఎల్‌సి అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలి
మంత్రి నారాయణ పిలుపు
నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 20: వచ్చే నెలలో జరగనున్న పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం అందరూ కృషి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కోరారు. సోమవారం నారాయణ కళాశాలలోని తన కార్యాలయంలో ఉపాధ్యాయ, రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి విషయాలను వివరించి ఎంఎల్‌సి ఎన్నికల్లో అభ్యర్థుల విజయాలకు ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. పట్ట్భద్రుల ఎంఎల్‌సి అభ్యర్థి వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డిని, ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థిని వాసుదేవనాయుడును గెలిపించి పార్టీ ప్రతిష్ఠను నిలబెట్టాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. విభేదాలను విడనాడి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, చాట్ల నరసింహారావు, పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ప్రేమజంటపై దాడి
నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 20: వారిరువురు మతాంతర వివాహం చేసుకొని ఏడాదిన్నరగా ఆత్మకూరు పట్టణంలో నివాసం ఉంటున్నారు. అమ్మాయితో ఆమె తండ్రి బాబు సఖ్యతగా ఉంటూ రూ. 22 వేల నగదు అప్పుగా తీసుకొన్నాడని, ఆ అప్పును చెల్లిస్తానని జొన్నవాడ ప్రాంతానికి రావల్సిందిగా అమ్మాయికి ఆమె తండ్రి సమాచారం ఇచ్చాడు. ఆయన పిలుపుమేరకు అమ్మాయి, అమ్మాయి భర్త మహేంద్ర సోమవారం జొన్నవాడ సమీపానానికి వెళుతుండగా, దొడ్ల డెయిరీ వద్దకు రాగానే అమ్మాయి తండ్రి బాబు, మరికొంతమంది ఆమె బంధువులు ప్రేమజంటపై మారణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. అనంతరం అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్టు ఆ సంఘటన చూసిన స్థానికులు అమ్మాయి తండ్రిని, వారి బంధువులను అటకాయించి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి అమ్మాయి తరఫు బంధువులను, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకొని తీవ్రంగా గాయపడిన ప్రేమజంటను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ రామ్మూర్తి తెలిపారు.