శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎంఎల్‌సి ఎన్నికల్లో ఆద్యంతం రాజకీయ జోక్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఫిబ్రవరి 21: ‘‘శాసనమండలి అంటే సాక్షాత్తు పెద్దల సభ. ఈ సభకు వెళ్లే ఎంఎల్‌సిలను గవర్నర్ సిఫారసు చేసే కోటా తప్పనిసరి. అలాగే ఎన్నికయ్యే వారి కోసం వినియోగించుకునే ఓటుహక్కు సమాజంలోని కొన్ని వర్గాలకు మాత్రమే లభించే పరిమిత అవకాశం. ఇంతేగాక ఎన్నిక ప్రక్రియ కూడా ఎంతో విభిన్నం. పోటీలో ఉన్న అందరు అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం ఈ ఎన్నికలో ఉండటం ప్రత్యేకత. అయితే ప్రాధాన్యక్రమం ప్రకారం బ్యాలెట్‌లో 1,2,3.. వంతున అంకెలు, పదికంటే ఎక్కువ మంది బరిలో ఉంటే సంఖ్యలుగా ఓట్లు వేయాలి. అన్నిటికంటే ముఖ్యమైన మరో విషయం ఏమిటంటే.. ఈ ఎన్నికలో ఎక్కడా రాజకీయాల ప్రస్తావన ఉండని రీతిలో రూపొందించడం జరిగింది. అయితే ఆయా రాజకీయ పార్టీల మద్దతుదార్ల అభ్యర్థులంటూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల తంతు చూస్తే, పెద్దల సభకు జరుగుతున్న ఇలాంటి అనారోగ్యకరమైన పోటీయా అని ఆశ్చర్యపోవాల్సిందే.’’ రాష్ట్ర ప్రభుత్వం ఆ మధ్య నిర్వహించిన సొంత సర్వేలో సచీవులందరిలోనూ వెనుకబడ్డ మంత్రి తన రాజకీయ ఆధిపత్యం కోసమై తూర్పు రాయలసీమ పట్ట్భద్ర స్థానం నుంచి పార్టీ మద్దతుదారుడి విజయపతాకాన్ని రెపరెపలాడించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసమై తన వ్యక్తిగత ఆంతరంగికుడ్నే బరిలో నిలిపారు. ఓటర్ల జాబితాలో ఎన్నో తప్పిదాలు దొర్లించడంలోనూ అధికారపక్షంగా తమ హవా సాగించినట్లు సాక్ష్యాధారాలతో సహా బరిలో నిలిచిన ప్రత్యర్థులు వెలుగులోకి తీసుకొచ్చారు. తూర్పు రాయలసీమ నియోజకవర్గ పరిధిలో సుమారుగా 2.5 లక్షల మంది పట్ట్భద్ర ఓటర్లు ఉన్నారు. ఇదిలావుండగా పాలక కూటమి తరపున ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వాసుదేవనాయుడు తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. గత రెండు పర్యాయాలుగా ఎంఎల్‌సిగా గెలుపొందుతున్న సిపిఎంకు అనుబంధంలా వ్యవహరించే యూటిఎఫ్ ఈదఫా కూడా తమదే విజయం అనే ధీమాలో కొనసాగుతోంది. అయితే గడచిన రెండుమార్లు ఉపాధ్యాయ స్థానంలో ఓట్ల చీలిక ఎక్కువగా ఉంటే.. ఈదఫా యూటిఎఫ్ వైరి పక్షాలు చాలావరకు తెలుగుదేశం బలపర్చిన అభ్యర్థికే బాహాటంగా మద్దతు ప్రకటిస్తుండటాన్ని ఇదే సందర్భంలో ప్రస్తావించుకోవాలి. కాగా, రాష్ట్రంలో ప్రధాన విపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పట్ట్భద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో పోటీకి దూరంగా వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల తరువాత వచ్చే స్థానిక సంస్థల పోరులో మాత్రం బరిలో నిలుస్తామంటూ వైఎస్‌ఆర్‌సిపి నేతలు ప్రకటిస్తున్నారు. జిల్లా యూనిట్‌గా జరిగే స్థానిక సంస్థల ప్రతినిధుల ఎంఎల్‌సికి సంబంధించి తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సి సభ్యుల నడుమ ఎంతలేదన్నా 130కు పైగానే తేడా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్న లుకలుకలే తమ పార్టీ మద్దతుదారుడి గెలుపునకు సోపానాలు అనే భావనతో ఈనెల 25వ తేదీకల్లా అభ్యర్థి ప్రకటించే పనిలో వైఎస్‌ఆర్‌సిపి నిమగ్నం కావడం విశేషం.

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్న
జాతీయ రహదారిపై రాస్తారోకో
రైతు నాయకుల అరెస్టు
మనుబోలు, ఫిబ్రవరి 21: సాగునీటి కోసం రైతులు మంగళవారం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం, బిజెపి, సిపిఎం నాయకులు రైతులతో కలిసి స్థానిక రెవెన్యూ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో నాయకులు, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు బోలా శ్రీనువాసులు, సిపిఎం కార్యదర్శి కటికాల వెంకటేశ్వర్లు, తెలుగుదేశం నాయకుడు కలికి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కండలేరు ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రస్తుతం మండలంలో చేపట్టిన వరిసాగు వెన్నుతీసే దశలో ఉందని, అవసరమైన సాగునీటిని అధికారులు అందించకుండా మాటలతో రైతులను మోసగిస్తున్నారని ఆరోపించారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తు వాహన రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న నాయకులను, రైతులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో పోలీసులకు బిజెపి అధ్యక్షుడు బోలా శ్రీనువాసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడంతో పోలీసులు ఆయనను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సిపిఎం నాయకుడు కటికాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆయకట్టు రైతులకు నీరందించకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఓట్ల కోసం చిత్తూరు, చెన్నైకు తరలిస్తు స్థానికులకు మొండిచేయి చూపిస్తోందని మండిపడ్డారు. బిజెపి మండల అధ్యక్షుడు బోలా శ్రీనువాసులు మాట్లాడుతూ రైతుల పక్షాన పోరాడుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. మండలంలోని ఆయకట్టు చెరువులకు రెండు రోజుల్లోగా సాగునీరు అందించకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించారు.

రెండు నామినేన్లు తిరష్కరణ
నేటి నుంచి నామినేన్ల ఉసపసంహరణ

చిత్తూరు, ఫిబ్రవరి 21: చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లలో రెండు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆధ్వర్యంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని చేట్టారు. ఇందులో పట్ట్భద్రుల స్థానానికి సరైన పద్ధతిలో నామినేన్లను దాఖలు చేయనందుకు ఇద్దరి నామినేషన్లు తిరస్కరించారు. ఈ ఎన్నికలకు మొత్తం 29 మంది నామినేషన్లను దాఖలు చేశారు. అందులో ఉపాధ్యాయ స్థానానికి 9 మంది, పట్ట్భద్రుల స్థానానికి 20 మంది చొప్పున నామినేషన్లు వేశారు. దాఖలలైన నామినేషన్లను మంగళవారం అధికారులు పరిశీలించారు. ఇందులో పట్ట్భద్రుల స్థానానికి నామినేషన్లు వేసిన చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన అమరేంద్ర, పుంగనూరు పట్టణానికి చెందిన చంద్రమోహన్‌రెడ్డిల నామినేషన్లలో సక్రమంగా లేకపోవడంతో వీటిని అధికారులు తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. వీరు ఇరువురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. దీంతో పట్ట్భద్రుల స్థానానికి 18 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 9 మంది చొప్పున ప్రస్తుతానికి రంగంలో ఉన్నారు. బుధవారం, గురువారం నామినేషన్ల ఉపసంహరణ పర్వం కొనసాగనున్నది. గురువారం సాయంత్రానికి ఎన్నికల బరిలో తలపడే తుది జాబితా విడుదల కానున్నది.

నిమ్మ సాగులో మెళకువలు
గూడూరు, ఫిబ్రవరి 21: నిమ్మ సాగులో మెళకువలు, వేరుకుళ్లు నియంత్రణపై మంగళవారం రైతులకు ఆత్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెట్లూరు చీనీ నిమ్మ పరిశోధనా కేంద్ర ప్రధాన శాస్తవ్రేత్త డాక్టర్ బి గోవిందరాజులు, ఆత్మ బిటిటి కన్వీనర్ కె శివనాయక్, ఆత్మ బిటిఎం సిహెచ్ కళారాణి రైతులనుద్దేశించి మాట్లాడుతూ ప్రధానంగా నిమ్మ సాగులో మెళకువలు గురించి నిమ్మను ఆశించే వేరుకుళ్లు నివారణపై రైతులకు వివరించారు. పెట్లూరులో సాగులో ఉన్న వివిధరకాలైన పెట్లూరు సెలక్షన్-1, బాలాజీ రకాల గురించి రైతులకు వివరించారు. నాటు రకాలంటే కాపు నాణ్యత బాగుంటుందన్నారు. నిమ్మలో వేరుకుళ్లు రాకుండా ఉండాలంటే 25 శాతం పచ్చిరొట్ట పైర్లు వేసి దున్నాలని, 25 శాతం పశువుల ఎరువు, వేప పిండి,వాడుకొనాలని, మిగతా 50 శాతం రసాయిన ఎరువులు వాడుకొనవచ్చునని అన్నారు. గజ్జితెగులు, గాడిద మచ్చ, బంక తెగుళ్లు నిమ్మకు అధికంగా ఆశిస్తాయని, దీనిని నివారణకు తీసుకొనాల్సిన చర్యల గురించి వారు వివరించారు. సెలక్షన్ బాలాజీ-1 రకాన్ని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామంలో వేసి వాటి దిగుబడి అనంతరం మిగతాచోట్ల వేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి డాక్టర్ ఎస్‌వి నాగమోహన్ రైతులు పాల్గొన్నారు.

పిఎస్‌ఎల్‌వి సి-37 ప్రయోగం అందరి విజయం
* షార్ డైరెక్టర్ స్పష్టం
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 21: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ ఎంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 15న ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి సి-37 రాకెట్ ప్రయోగం శాస్తవ్రేత్తల అందరి విజయమని షార్ డైరెక్టర్ పి కున్హికృష్ణన్ స్పష్టం చేశారు. మంగళవారం షార్‌లోని ఎంఆర్ కురుప్ అడిటోరియంలో పిఎస్‌ఎల్‌వి సి-37 ప్రయోగం విజయంపై శాస్తవ్రేత్తల అభినందన సభ జరిగింది. ఈకార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 104 ఉపగ్రహాల ప్రయోగం దేశం గర్వించదగ్గ ప్రయోగంగా అభివర్ణించారు. యావత్ జాతి మొత్తం ఎదురుచూసిన ప్రయోగం విజయమన్నారు. దీనికి ప్రధాన కారణం షార్ కేంద్రంలో ఇలాంటి ప్రయోగాలకు అనుకూలమైన వసతులు ఉండటమే విజయానికి దోహదపడుతున్నాయని తెలిపారు. 2016లో షార్ కేంద్రం ఓ మరుపురాని సంవత్సరం అన్నారు. ఆ ఏడాది ఎన్నడూ లేని విధంగా 9 ప్రయోగాలు చేపట్టగా, తొమ్మిది కూడా విజయవంతమయ్యాయని అన్నారు. ఈ ప్రయోగాలలో ఒక రాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలు ప్రయోగించడం, ఉపగ్రహాలను బహుళ కక్ష్యలో ప్రవేశపెట్టడంలో కూడా శాస్తవ్రేత్తలు విజయం సాధించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రయోగాల విజయం అంతా శాస్తవ్రేత్తల కఠోర శ్రమే కాకుండా సమష్టి కృషి వల్ల మంచి ఫలితాలు లభించాయని పేర్కొన్నారు. అనంతరం ఆయన అన్ని ప్రాజెక్టు డైరెక్టర్లను సన్మానించి అభినందించారు. కంట్రోలర్ జెవి రాజారెడ్డి మాట్లాడుతూ, షార్‌లో రాకెట్‌లకు ఉపయోగించే ఘన ఇంధనం తయారుచేసుకొనేందుకు మంచి అనుకూలమైన వాతావరణం ఉందని, అందులో ప్రతి ప్రయోగం విజయవంతమవుతున్నాయని అన్నారు. ఈకార్యక్రమంలో షార్ అసోసియేట్ డైరెక్టర్ ఎంబిఎన్ మూర్తి, డిప్యూటీ డైరెక్టర్లు వి రంగనాథన్, ఆర్ వెంకట్రామన్, రేంజి ఆపరేషన్ డైరెక్టర్ పొంగనన్, షార్ ఉద్యోగులు హమీద్, సెల్వరాజ్ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ పోరు షురూ
* ప్రకటన విడుదల చేసిన జెసి
నెల్లూరు, ఫిబ్రవరి 21: మండలి స్థానిక సంస్థల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియకు మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అహ్మద్, డిఆర్‌ఓ కృష్ణ్భారతి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు మార్చి 17వ తేదిన ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో మార్చి 18వ తేది వరకు పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల రీత్యా ఉన్న ఎన్నికల కోడ్ తాజా నోటిఫికేషన్‌తో మార్చి 24 వరకు కొనసాగనుంది. ప్రకటనలో పేర్కొన్న మేరకు.. ఈనెల 28వ తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. దాఖలైన నామినేషన్లను మార్చి ఒకటో తేదిన పరిశీలిస్తారు. ఉపసంహరణకు మార్చి 3 వరకు గడువుంది. పోలింగ్ మార్చి 17వ తేది ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. మార్చి 20న ఓట్ల లెక్కింపు జరిపి, అదేరోజు ఫలితాన్ని వెల్లడిస్తారు.
బలాబలాల్లో తెదేపాదే పైచేయి
స్థానిక సంస్థల నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో మొత్తం 847 మంది ఓటర్లుండగా, మూడు స్థానాలు ఖాళీగా ఉండడంతో 844 మందికే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. నగరపాలక సంస్థల్లో 216 మంది ఉండగా, వారిలో తెదేపా, భాజపాలకు చెందినవారు 159 మంది కాగా, వైకాపాకు చెందినవారు 54 మంది, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఎంపిటిసి సభ్యులు జిల్లావ్యాప్తంగా 583 మంది ఉండగా, వారిలో తెదేపా, భాజపాల మద్దతుదారులు 320 వరకు ఉండగా, వైకాపాకు 261 మంది ఉన్నారు. జడ్పీటిసిల విషయానికొస్తే 46 మంది ఉండగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో 26 మంది తెదేపాకు, 20 మంది వైకాపాకు మద్దతుదారులుగా ఉన్నారు. ప్రస్తుత లెక్కలను బేరీజు వేసుకుంటే తెదేపాకు 505 మంది, వైకాపాకు 335 మంది మద్దతు ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో 170 స్థానాల వరకు తెదేపాకు స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. తమకు ఈ స్థానం ఖాయమనే ధీమాతో జిల్లా టిడిపి వర్గాలు ఉన్నాయి. అయితే బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడం ద్వారా ఈ స్థానంలో గట్టి పోటీ ఇవ్వాలనే కృతనిశ్చయంతో వైకాపా వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలవనున్నారనే విషయంలో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.

అంతిమ దశకు కాకాణి రాజకీయ జీవితం
* ప్రజలకు క్షమాపణ చెప్పాలి
* ఎమ్మెల్సీ సోమిరెడ్డి డిమాండ్
నెల్లూరు, ఫిబ్రవరి 21: సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాపాలు, రాజకీయ జీవితం అంతిమ దశకు చేరుకుందని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకాణి అక్రమ చర్యలు జిల్లాకే అవమానకరంగా మారాయని ఎద్దేవా చేశారు. బెజవాడ గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఏసి సుబ్బారెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి వంటి రాజకీయ దురంధులు పుట్టిన జిల్లాలో కాకాణి వంటి రాజకీయ నేత ఉండడం సిగ్గుగా ఉందన్నారు. 38 రోజులపాటు నిత్యం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కానిస్టేబుల్ ముందు సంతకం పెట్టి వచ్చిన ఎమ్మెల్యే రాష్ట్ర చరిత్రలో ఎవరూ లేరని, ప్రస్తుతం కాకాణి ఆ ఘనతను మూటగట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఒక ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ 6 కేసుల్లో నిందితునిగా ఉన్న కాకాణిపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాను 12 కేసుల్లో నిందితునిగా ఉండడంతో ఆయన వెనకడుగు వేసి ఉంటారని ఛలోక్తి విసిరారు. ఈనెల 14వ తేది నుండి కాకాణి కనుమరుగయ్యారని, పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావడం లేదన్నారు. చట్టసభ సభ్యుడిగా ఉంటూ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును కాకాణి ధిక్కరిస్తున్నారని స్పష్టం చేశారు. కల్తీ మద్యంతో ఎందరివో ప్రాణాలు తీసి, మరికొందరిని శాశ్వత వికలాంగులను చేసిన కాకాణి వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రత్యర్ధుల్ని ఎదుర్కొనేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ఎమ్మెల్యే బహుశా రాష్ట్రంలో ఎవరూ ఉండబోరని అన్నారు. జిల్లాలో వైకాపాకు సంబంధించి పలు సమావేశాలు జరుగుతున్నా పార్టీ అధ్యక్షుడు మాత్రం కనిపించడం లేదన్నారు. ఆయనే తాను తప్పు చేసినట్లు రుజువైతే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నాడని గుర్తు చేస్తూ వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణితో పాటు ఆయన అనుచరులు కూడా ఎన్నో అక్రమాలకు పాల్పడి ఉన్నారని, అన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు నగర టిడిపి అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి విదేశీ కాగితాలను ఫోర్జరీ చేశారని ఈ నేరంపై ఆయనపై విదేశాల్లోనూ కేసులు నమోదు కావాలన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముసునూరు రవికుమార్‌రెడ్డి, కనుపూర్ కాలువ డిసి చైర్మన్ మస్తాన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

వివిధ పథకాలపై ప్రధాన కార్యదర్శి సమీక్ష
నెల్లూరు, ఫిబ్రవరి 21: త్వరలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు, మీసేవ, మీకోసం, ప్రసాజాధికార సర్వే, ఆరోగ్య రక్ష తదితర పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ మంగళవారం జిల్లా అధికారులతో వీడియో కానె్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించారు. హైపవర్ కమిటి, సిట్టింగ్ కమిటి, ఫ్లైయింగ్ స్క్వాడ్, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ తదితర అంశాలపై చర్చించారు. విద్యార్థులకు బల్లలు, రవాణా సౌకర్యంతో పాటు వెలుతురు, మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉంచాలన్నారు. ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా నిర్వహిస్తున్న ఆరోగ్యరక్ష పథకంపై విస్తృత అవగాహన కల్పించి ఎక్కువ మంది లబ్ధిదారులను నమోదు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వరసుందరం, ఎన్‌టిఆర్ వైద్యసేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రేమోన్మాది వీరంగం
నెల్లూరు, ఫిబ్రవరి 21: బాలికను ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా ఆమె ఇంటికెళ్లి కత్తితో బెదిరించిన ఘటనలో నిందితుడ్ని 3వ నగర పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. స్థానిక గుంటబడిలో 9వ తరగతి బాలికను స్థానిక ఖుద్దూస్‌నగర్‌కు చెందిన పఠాన్ అహ్మద్ ఆలి గత కొన్ని రోజులుగా ప్రేమించమంటూ వెంటపడి వేధిస్తున్నాడు. ఆ బాలిక చదివే పాఠశాలకు వెళ్లి తరగతి గదుల్లోనూ ఆమెను ఉపాధ్యాయుల ముందు బెదిరించే స్థాయికి అతని వేధింపులు చేరాయి. ఈక్రమంలో సోమవారం రాత్రి బాలిక ఇంటికెళ్లి ఆమె తల్లిదండ్రుల ఎదుటే ఓ చేత్తో కత్తి పట్టుకొని, మరో చేతితో బాలిక చేయి పట్టుకొని ప్రేమించమంటూ బెదిరించడంతో బాలిక కుటుంబ సభ్యులు ఒక్కసారిగా హతాశులయ్యారు. వెంటనే బాలిక బంధువులు, చుట్టుపక్కల వారి సహాయంతో నిందితుడిపై దాడికి ప్రయత్నించారు. నిందితుడు అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోయాడు. వెంటనే 3వ నగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు అలీని మంగళవారం 3వ నగర సిఐ పాపారావు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు:ఆర్‌ఐఓ
* పరీక్షా కేంద్రాలలో వౌలిక వసతులు ఉండాలి
* నేటి నుండి ప్రశ్నాపత్రాల తరలింపు
నెల్లూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 21: వచ్చే నెల 1 నుండి జరగబోయే ఇంటర్‌మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఆ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐఒ) ఎన్ బాబూజాకబ్ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 93 ఇంటర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాలలో వౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఇప్పటి వరకు పరీక్షల జిల్లా కమిటీలను స్థానికంగా ఏర్పాటు చేసుకునేవారమని ఈ ఏడాది నుండి ఇంటర్ బోర్డు నియమిస్తుందన్నారు. ఈనెల 22 నుండి ప్రశ్నాపత్రాలను ఆయా పరీక్షా కేంద్రాల పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లకు తరలిస్తామన్నారు. పరీక్షలకు సంబంధించి నిర్ధారించిన సెట్ సంఖ్యల పత్రాలను విద్యార్థులకు అప్రమత్తంగా అందించాలన్నారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు.
హాల్‌టిక్కెట్లు ఇవ్వకపోతే చర్యలు
పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు హాల్ టిక్కెట్ ఇవ్వని కళాశాలలు, నిర్వాహకులపై చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ద్వితీయ ఇంటర్ పరీక్ష తేదీ మార్పు: మార్చి 9న నిర్వహించాల్సిన ద్వితీయ ఇంటర్ గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా వాయిదా వేశామన్నారు. ఆరోజు నిర్వహించాల్సిన పరీక్షను మార్చి 19న నిర్వహించాలని ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశించారన్నారు.
నేటితో ముగియనున్న ప్రయోగ పరీక్షలు
ఈనెల 3న ప్రారంభమైన ఇంటర్ ప్రయోగ పరీక్షలు బుధవారంతో ముగుస్తాయి. జంబ్లింగ్ విధానంలో ప్రారంభమైన ఈ పరీక్షలు ఒకటి రెండు సంఘటనలు మినహా జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

కనుల పండువగా చప్పర ఉత్సవం
నెల్లూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 21: జిల్లా కేంద్రంలోని మూలాపేటలో ఉన్న శ్రీ భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం చప్పర ఉత్సవం, పురుషామృగ వాహనం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో వివిధ హోమాలు, పూజలు నిర్వహించి వేదపండితుల మంత్రోచ్ఛరణలతో చప్పర ఉత్సవం నిర్వహించారు. ఉభయకర్తలుగా దివంగత కొట్రా వెంకటసుబ్బమ్మ జ్ఞాపకార్ధం దేవాలయ నిర్వాహకులు వ్యవహరించారు. చప్పర ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.