శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆలయాల్లో మార్మోగిన శివనామ స్మరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 24: నగరంలోని మూలాపేటగల శివాలయం, ఉమా మహేశ్వరి ఆలయం, సంతపేట, నవాబుపేట గల శివాలయం, దర్గామిట్టలోని రాజరాజేశ్వరి తదితర దేవాలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి. శుక్రవారం మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని నెల్లూరు నగరంలో ఉన్న శైవక్షేత్రాలు తెల్లవారు జాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా మూలాపేటలో గల శివాలయంలో స్వామివారి అభిషేకానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయం పాలక వర్గం, ఇఓ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఏర్పాట్లను నగరపాలక సంస్థ మేయర్ అబ్దుల్ అజీజ్, ఇన్‌చార్జ్ కమిషనర్ రవికృష్ణం రాజు, హెల్త్ ఆఫీసర్ సుబ్బరాజు పరిశీలించారు. నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి దంపతులు, జడ్పి చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిలు మూలాపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకునేందుకు విఐపిల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆలయ ముఖ్య నిర్వాహణ అధికారి శ్రీనివాసులురెడ్డి పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పాలక వర్గ సభ్యులు కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసి క్యూలైన్ పద్ధతి పాటించి ప్రతి ఒక్కరికీ స్వామి వారి దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం జరిగిన పూజా కార్యక్రమాలకు రేబాల వెంకటరెడ్డి, ఇందిరమ్మ, పులిమి రమేష్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, దినకర్‌రెడ్డిలు ఉభయ కర్తలుగా వ్యవహరించారు. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సమన్వయంతో పనిచేస్తే విజయం మనదే
* రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ పిలుపు
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 24: ఎంఎల్‌సి ఎన్నికలకు అందరూ కలసి సమన్వయంతో పనిచేస్తే విజయం మనదేనంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సత్యసాయి కల్యాణ మండపంలో తూర్పు రాయలసీమ పట్ట్భద్ర, ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల నేతలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, పార్టీకేగాక జిల్లాకు కూడా ఎంఎల్‌సి ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయన్నారు. అందరూ కలసి పనిచేయాలన్నారు. పట్ట్భద్రుల అభ్యర్థి వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థి వాసుదేవనాయుడుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక బడ్జెట్ లోటుగా ఉన్నా అభివృద్ధి వైపునకు చంద్రబాబు పయనించేలా కృషి చేస్తున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎంఎల్‌సి ఎన్నికలకు ప్రతి ఒక్కరూ ఓటర్లను ఆకట్టుకునేలా తమ వైపునకు మళ్లించుకునేలా పనిచేయాలన్నారు. ఈ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా భావించి ప్రణాళికాబద్ధంగా అభ్యర్థులను బరిలో నిలిపి గెలుపే లక్ష్యంగా నాయకత్వానికి సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎంఎల్‌సి స్థానాలన్నీ కైవసం చేసుకుని ముఖ్యమంత్రికి కానుకగా అందజేయాలని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిశీలకులు జయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఓటు వేసే వారంతా సామాన్యులు కాదన్నారు. అందరూ విద్యావంతులేనన్నారు. వారికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరిస్తే తమ అభ్యర్థులకే ఓటు వేస్తారన్నారు. గెలుపు ఎప్పుడూ సులువుగా భావించరాదన్నారు. బూత్ స్థాయి నుంచి జిల్లా వరకు నాయకులు పనిచేస్తే గెలుపు తధ్యమన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్ మాట్లాడుతూ నెల్లూరు నాయకత్వానికి సవాల్‌తో కూడిన ఎన్నికలుగా చెప్పారు. దీనిని ఆషామాషీగా భావించరాదన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, ఎంఎల్‌సి వాకాటి నారాయణరెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు, నాయకులు మోహనరెడ్డి, వేనాటి పరంధామరెడ్డి, కామిరెడ్డి మురళిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నూలేటి విజయలక్ష్మి, జడ్పీటిసి సభ్యులు శ్రీ్ధర్, విజేత తదితరులు పాల్గొన్నారు.

వ్యూహ ప్రతివ్యూహాలతో వేడెక్కిన ఎంఎల్‌సి ఎన్నికలు
* రంగులు మారుతున్న రాజకీయం

నెల్లూరు, ఫిబ్రవరి 24: జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎంఎల్‌సి ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటివరకు నిస్తేజంగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీశ్రేణుల్లో కదలిక మొదలైంది. ఎన్నికలు వచ్చాయంటే పల్లెల్లో సందడి నెలకొనడం సర్వసాధారణంగా చూస్తాం. ఇప్పుడొచ్చే ఎంఎల్‌సి ఎన్నికలతో స్థానిక నాయకుల ఇళ్లు, పార్టీ కార్యాలయాలు సందడిగా ఉంటున్నాయి. ఎన్నికల సంఘం రాష్ట్రంలో స్థానిక సంస్థలు, పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. పట్ట్భద్రుల, ఉపాధ్యాయుల నామినేషన్ ఘట్టం పూర్తయింది. స్థానిక సంస్థలకు ఈ నెల 27 వరకు నామినేషన్‌ల గడువుంది. జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉనికిని కాపాడుకొనే పనిలో పడ్డాయి. పట్ట్భద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి పోటీ చేయడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పోటీ చేసేందుకు ముందుకు వచ్చింది. వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ నెల్లూరు స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా పోటీ చేయాలని ఖరాకండిగా ఆదేశించడంతో బరిలోకి కొందరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి పేరును దాదాపు శనివారం ఖరారు చేసే అవకాశం ఉంది. మూడు పేర్లు పరిశీలనకు వచ్చాయి. నెల్లూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు, ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి, జిల్లా నేతలు అందరూ కలిసి ఏకతాటిపై ఆనం విజయకుమార్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. నేడో రేపో అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇద్దరూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఎవరి పేరును తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తుందో వేచి చూడాల్సిందే.
ప్రజాప్రతినిధులకు పెరిగిన ఆదరణ
స్థానిక సంస్థల ప్రతినిధులైన ఎంపిటిసి సభ్యులు, పురపాలక కౌన్సిలర్లు, నగర కార్పొరేటర్లకు రాజకీయ ఆదరణ పెరుగుతుంది. వీరు వేసే ఓట్లే స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థుల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి. నిన్నటి వరకు ఎంపిటిసిలకు నేతల నుంచి ఉలుకూ పలుకూ ఉండేది కాదు. షెడ్యూల్ రాగానే నాయకులు ఎంపిటిసిలను ఆకర్షించేలా తాయిలాలను ఎర చూపుతున్నారు. ఎన్నికల సమయంలో రూ. 5 నుంచి 25 లక్షల వరకు వ్యయం చేసి గెలుపొందారు. అప్పటి నుంచి పెట్టిన ఖర్చులు కూడా సంపాదించే అవకాశాలు కనుచూపుమేరలో వీరికి కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో కొందరు ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వం అండగా ఉంటే పనులైనా చేసుకోవచ్చన్న భావనతో గతంలోనే అధికార పార్టీలో చేరిపోయారు. వీరి ఎన్నిక అప్పట్లో పార్టీ గుర్తులపై నిర్వహించారు. టిడిపి, వైసిపి పార్టీ గుర్తులతో గెలుపొందారు. అయితే ప్రస్తుతం టిడిపికి మెజారిటీ ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు, వైకాపా నుంచి వెళ్లినవారే కాబట్టే తమకు ఓటు వేస్తారని వైకాపా వారు ధీమాగా ఉన్నారు. రానున్న రెండు రోజుల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కే అవకాశం ఉంది. అభ్యర్థుల పేర్లు తేలిన వెంటనే ఇరుపార్టీల వారు శిబిరాలు ఏర్పాటు చేసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

వైద్యానికి అధిక ప్రాధాన్యత
* మంత్రి నారాయణ స్పష్టం

నెల్లూరు, ఫిబ్రవరి 24: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కష్టపడి పనిచేసి రాష్ట్భ్రావృద్ధికి తోడ్పడే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి డాక్టర్ పి నారాయణ వెల్లడించారు. శుక్రవారం స్థానిక కస్తూరిదేవి గార్డెన్‌లో మూడురోజుల పాటు జరగనున్న ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆఫ్ ఎపి సమావేశాలను మంత్రి నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 110 మున్సిపాలిటీల పరిధిలోని 250 అర్బన్ హెల్త్ సెంటర్లలో సూపర్ స్పెషాలిటీ టెలీ మెడిసిన్ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. రాష్టస్థ్రాయి ఆర్థోపెడిక్ సమావేశాలను తొలిసారిగా నెల్లూరు జిల్లాలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం సావనీర్‌ను మంత్రి, అసోసియేషన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ బసిరెడ్డి నరేంద్రరెడ్డి, కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్, కార్యదర్శి డాక్టర్ గోపాలకృష్ణయ్య, కోచైర్మన్ డాక్టర్ నారాయణరెడ్డి, ట్రెజరర్ డాక్టర్ బాలకొండయ్య, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ వివి నారాయణరావు, జాయింట్ సెక్రటరీ డాక్టర్ అనిల్, సింహపురి ఆసుపత్రి ఎండి నరేంద్రరెడ్డి, రాష్ట్ర నలుమూలల నుండి ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొన్నారు.

డాక్యుమెంట్లు లేకుండానే పొదుపు ఖాతాలకు రుణాలు
* డ్రా చేయాలంటే డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందే
* రుణాలపై 12 శాతం వడ్డీ వసూలు
* గ్రూపులకు అందని సమాచారం
* పావలా వడ్డీ హుళక్కే
మనుబోలు, ఫిబ్రవరి 24 : పొదుపులక్ష్మి గ్రూపులకు సమాచారం లేకుండా, డాక్యుమెంట్లు తీసుకోకుండానే బ్యాంకర్లు రుణాలను వారి ఖాతాలకు జమచేశారు. అయితే డబ్బులు విత్‌డ్రా చేయాలంటే మాత్రం డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాతే ఇస్తామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలంటూ పొదుపులక్ష్మి గ్రూపులను ప్రవేశపెట్టారు. క్రమం తప్పకుండా ప్రతి నెలా గ్రూపులు సేవింగ్స్ చేసుకుంటే దానికి రివాల్వింగ్ ఫండ్ కింద రుణాలు అందిస్తారు. ఈ రుణం ద్వారా మహిళలు సొంతంగా వ్యాపారాలు చేసుకుని లక్షాధికారులు కావాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం. గతంలో రుణం పొందే సమయంలో గ్రూపు సభ్యుల వివరాలు, గ్రూప్ ఫొటోలు, ఆమోదం తెలుపుతూ తీర్మానం అందించిన తర్వాత బ్యాంకర్లు రికార్డులు పరిశీలించి రుణాలను అందించేవారు. అయితే కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడంతో బ్యాంకుల్లో ధనం ఎక్కువైంది. దీంతో బ్యాంకు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సిసిఎల్ (క్యాష్ క్రెడిట్ లిమిట్) కింద పొదుపు రుణం ఖాతాకు కోట్ల రూపాయలు జమచేశారు. జమ చేసిన విషయం బ్యాంకర్లకు, ఐకెపి అధికారులకు తెలిసినా గ్రూపులకు సమాచారం అందించలేదు. రుణం జమ చేసిన నాటి నుంచే రుణాలకు బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తారు. దీంతో గ్రూపు సభ్యులపై వడ్డీల భారం పడి నష్టపోతున్నారు. గ్రూపు సభ్యులకు ప్రభుత్వం పసుపు, కుంకుమ కింద రూ.3 వేలు ఇస్తే, బ్యాంకర్లు ఇచ్చిన అదనపు రుణానికి ఈ వడ్డీ భారం పడుతుంది. ప్రస్తుతం కొన్ని గ్రూపుల్లో ఉన్న సభ్యుల మధ్య వివాదం ఉంది. ప్రస్తుతం జమ చేసిన రుణం డ్రా చేయాలంటే గతంలో విధంగా డాక్యుమెంట్ సమర్పిస్తేనే రుణాలు బ్యాంకర్లు డ్రా చేయిస్తారు. గ్రూపు సభ్యుల మధ్య వివాదం కారణంగా రుణం తీసుకునేలోగా వారిపై వడ్డీ భారం పడుతుంది. మరికొద్దిమందికి ప్రస్తుతం సిసిఎల్ కింద ఇచ్చిన రుణం వల్ల సభ్యులకు ప్రయోజనం ఉండదని చెప్తున్నారు. వారు ఇచ్చిన రుణం కుటుంబంలో వాడుకోవడం తప్ప మరెందుకు ఉపయోగపడదని వాపోతున్నారు. గతంలో పొదుపులక్ష్మి గ్రూపులకు మొదటి విడత రూ.1.50 లక్షలు ఇస్తారు. ఈ రుణం పూర్తిగా చెల్లిస్తే రెండవ విడత రూ.3 లక్షలు, మూడవ విడత రూ.5 లక్షలు ఇస్తున్నారు. అయితే నేడు ఆ విధంగా కాకుండా రుణం చెల్లించిన మొత్తాన్ని ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండానే కట్టిన మొత్తాన్ని బ్యాంకర్లు జమచేశారు. మనుబోలు మండలంలో 135 గ్రూపులకు రూ.2.39 కోట్లు రుణం కింద ఈ నెల 10వ తేదీన జమచేశారు. ప్రస్తుతం ఒక్క గ్రూపు కూడా జమ చేసిన రుణాలను డ్రా చేయలేదు. ఆ సమయంలో వారానికి రూ.24 వేలు మాత్రమే డ్రా చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం బ్యాంకర్లు జమ చేసిన మొత్తం డ్రా చేయాలంటే రెండు వారాలు పడుతుంది. ఈ సమయంలో మాత్రం బ్యాంకులకు వడ్డీ మాత్రం తప్పనిసరిగా కట్టాల్సిందే. దీంతో పొదుపులక్ష్మి గ్రూపులు వడ్డీతో నష్టపోతున్నారు.
అందని పావలా వడ్డీ
పొదుపు లక్ష్మి గ్రూపుల ద్వారా మహిళలను లక్షాధికారి చేస్తామంటూ ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు నీటిమూటలుగా మారుతున్నాయని మహిళలు ఆరోపిస్తున్నారు. పొదుపులక్ష్మి గ్రూపులు క్రమం తప్పకుండా తీసుకున్న రుణాలను చెల్లిస్తే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకరంగా పావలావడ్డీకే రుణాలు అందిస్తామని చెప్పారు. అయితే గత మూడేళ్లుగా పావలా వడ్డీకి రుణాలు అందించడం లేదని, బ్యాంకర్లు 12 శాతం వడ్డీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మహిళలు ఆవేదనతో చెప్తున్నారు. ఈ విషయంపై స్థానిక ఐకెపి ఏపిఎం విజయలక్ష్మిని వివరణ కోరగా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునే పొదుపు ఖాతాలకు సిసిఎల్ కింద రుణాలు అందించారన్నారు. పొదుపు మహిళలు కట్టిన వడ్డీ సుమారు మూడేళ్లుగా తిరిగి చెల్లించని మాట వాస్తవమేనన్నారు. స్థానిక ఎస్‌బిఐ మేనేజర్ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌ను వివరణ కోరగా తమ పై అధికారులు, జిల్లా కలెక్టర్, పిడిల సూచనల మేరకు రుణాలను జమ చేశామన్నారు. డబ్బులు డ్రా చేయాలంటే మాత్రం తప్పనిసరిగా డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఖాతాకు జమ చేసిన నాటి నుంచి వడ్డీ వసూలు చేస్తామని చెప్పారు.

శరవేగంగా ఎఫ్‌డిఆర్ నిర్మాణ పనులు
పెళ్లకూరు, ఫిబ్రవరి 24: మండల కేంద్రమైన పెళ్లకూరులోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రహదారుల ఎఫ్‌డిఆర్ కింద జరుగుతున్న కల్వర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2015 నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, హుదూద్ తుఫాను కారణంగా ఈ రహదారి పూర్తిగా దెబ్బతినడమే కాక చావాలి చెరువుకు సాగునీరు వెళ్లే సప్లై చానల్ కల్వర్టు కోతకు గురైంది. దీంతో అప్పుడు రాకపోకలు స్తంభించాయి. వరదల సమయంలో పెళ్లకూరుకు వచ్చిన సిఎం చంద్రబాబునాయుడు రహదారులను పరిశీలించి నిధుల విడుదలకు అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని పిఆర్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు అంచనాలు రూపొందించి పంపగా, ప్రభుత్వం ఎఫ్‌ఢిఆర్ కింద రూ. 30 లక్షలు విడుదల చేసింది. టెండర్ల ప్రక్రియలో భాగంగా శ్రీకాళహస్తికి చెందిన చీమల ప్రకాష్ అనే గుత్తేదారు కాంట్రాక్టు దక్కించుకోగా, ఆయన పెళ్లకూరులోని అధికార పార్టీ నాయకులకు సబ్ కాంట్రాక్ట్ కింద పనులు అప్పగించారు. దీంతో పదిహేనురోజులుగా పనులు చేపడుతున్నారు. పెళ్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మిట్ట హరిజనవాడకు వరకు 320 మీటర్ల పొడవుతో 3.75 సెంటీమీటర్ల వెడల్పుతో 17 సెంటీమీటర్ల మందంతో సిసి రోడ్డు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం రహదారి మధ్య భాగంలో ఉన్న కల్వర్టు దగ్గర 46 అడుగుల మేర 4 సిమెంటు పైపులు వేసి బెడ్ కాంక్రీట్ పనులు చేపడుతున్నారు. ఈ పనులను శుక్రవారం పిఆర్ ఎఇ కృష్ణారావు పర్యవేక్షించారు.
కల్వర్టు నిర్మాణంపై స్థానికుల అసంతృప్తి
2015లో కురిసిన భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు చావాలి చెరువుకు వెళ్లే సప్లై చానల్‌పై వంతెన నిర్మించాలి గానీ, గుత్తేదార్ల కోసమేనంటూ ఇక్కడ సిమెంటు పైపులు వేసి అధికారులు చేతులు దులుపుకొంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.