శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎవరి ధీమాలో వారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 11: జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు జోరందుకుంది. గెలుపు తమదంటే తమదేనంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండడం విశేషం. కప్పదాటు వ్యవహారం నడిపే అవకాశం ఉందంటూ తమ పార్టీ సభ్యుల మీదే నమ్మకం లేని ఇరుపార్టీల నేతలు ఓటర్లను ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. బెంగళూరు, తెలంగాణా రాష్ట్రంలోని గద్వాల ప్రాంతాల్లో వైకాపా సభ్యులకు శిబిరాలు ఏర్పాటు చేయగా, మహాబలిపురం, చెన్నై ప్రాంతాల్లో టిడిపి సభ్యులకు ఆ పార్టీ నేతలు విడిది ఏర్పాటు చేశారు. నిన్నటి వరకు 151 మంది సభ్యుల మెజార్టీ తమకుందన్న టిడిపి శ్రేణులు ప్రస్తుతం ఆ మెజార్టీ 160కు చేరుకుందని ప్రకటించారు. అయితే టిడిపి నాయకులు చెప్పే లెక్కలకు వాస్తవానికి పొంతన లేదని, తమ పార్టీ నుంచి గతంలో టిడిపిలోకి వెళ్లిన ఎంపిటిసి సభ్యులు, కార్పొరేటర్లు ఇప్పటికీ తమ వెంట ఉన్నారని, తమకు ఓటు వేస్తానని హామీ కూడా ఇవ్వడం జరిగిందనేది వైకాపా నేతల వాదనగా ఉంది. ఈ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి జిల్లాకు తరచూ విచ్చేస్తూ ఎన్నికల వ్యూహాలపై జిల్లా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా శనివారం నెల్లూరుకు వచ్చిన ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలోని వైకాపా నేతలందరితో ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ముందస్తు బెయిల్ రావడంతో ఈ ఎన్నికలయ్యేంత వరకు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరులోనే అందుబాటులో ఉంటూ పార్టీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి గెలుపుకోసం కృషి చేయాలని నిశ్చయించుకున్నారు. మరోవైపు ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ రోజుకొకరి మెడలో కండువాలు కప్పుతున్న టిడిపి నేతలు తమ బలం రోజురోజుకి పెరుగుతోందని, కచ్చితంగా ఈ స్థానం నుంచి తమ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్నటిదాకా ఆనం కుటుంబానికి చెందిన వ్యక్తి రంగంలో ఉండడంతో జిల్లాలో తమకంటూ ప్రత్యేక రాజకీయ వర్గం కలిగిన ఆ కుటుంబం ప్రస్తుతం టిడిపిలో ఉన్నప్పటికి తమ తమ్ముణ్ని కాదని మరొకరికి సహాయం ఎలా చేస్తారనే ఆలోచన జిల్లా వాసుల్లోనూ ఉండేది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విఆర్ విద్యాసంస్థల నుంచి బైటకు వెశే్ల పరిస్థితి నుంచి గట్టెక్కేందుకైనా టిడిపి అభ్యర్థిని గెలిపించక తప్పదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఎవరికి వారు తమకు తోచిన రీతిలో గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తుంటే మధ్యలో సందట్లో సడేమియాలా శిబిరాలకు వెళ్లకుండా రేటు పెంచుకునే క్రమంలో కొందరు ఓటర్లు ఉండడం కొసమెరుపు.

ఘనంగా చండీయాగం
సూళ్లూరుపేట, మార్చి 11: స్థానిక చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా మహాచండీయాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాల మండపంలో అమ్మమారి ఉత్సవ విగ్రహం ఏర్పాటుచేసి వేదపండితులు, మంత్రోచ్ఛరణల నడుమ యాగాన్ని ఘనంగా జరిపారు. నెల్లూరుకు చెందిన టి.రాజేష్ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. యాగం అనంతరం వీరికి ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసులురెడ్డి అమ్మవారి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు చిట్టేటి పెరుమాల్, వేనాటి గోపాల్‌రెడ్డి, చిలకా యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ రెవెన్యూ శాఖకు మాత్రమే అధికారి కాదు
* విధులు నిర్వర్తించమనడం తప్పా?
* ప్రభుత్వ వైద్యులపై రెవెన్యూ సంఘ నేతల ధ్వజజంనెల్లూరు, మార్చి 11: జిల్లా కలెక్టర్ జిల్లా మొత్తానికి సంపూర్ణ పరిపాలనాధికారి అని, అన్ని శాఖల్లోని ఉద్యోగులు ఆయనకు జవాబుదారీగా ఉండాలని, ఆయన కేవలం రెవెన్యూ శాఖ ఉద్యోగిగా ప్రభుత్వ వైద్యులు పేర్కొనడం విచారకరమని జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు చొప్పా రవీంద్రబాబు, అధ్యక్షుడు ముత్యం నరసింహులు తదితరులు మాట్లాడుతూ ఎవరెంత జీతం తీసుకుంటున్నా అది ప్రజా ధనమేనన్న సంగతి గుర్తెరిగి పనివేళల్లో ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించడం తప్పెందుకవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ పనివేళల్లో సొంత ప్రాక్టీస్‌లు చేసుకుంటూ ప్రశ్నించిన అధికారిపైన, తమ రెవెన్యూ శాఖపై ఆరోపణలకు దిగడంపై మండిపడ్డారు. పనిచేయమని కలెక్టర్ నిలదీస్తే అవినీతి గురించి వైద్యులు ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో అవినీతిపరులున్నారంటూ ఆరోపణలకు దిగి విషయాన్ని పక్కదోవ పట్టించవద్దని వారు హితవు పలికారు. ఎవరో ఒక అవినీతి రెవెన్యూ అధికారి గురించి అప్రస్తుతంగా మాట్లాడడం వారి అవివేకానికి అద్దం పడుతోందని, అన్ని శాఖల్లోనూ కొందరు అవినీతి అధికారులున్నారని అన్నారు. పొర్లుకట్ట బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 14 మంది నిరుపేద గిరిజనులు చనిపోవడం ఎంతో బాధాకరమని, ఆ సంఘటనలో వ్యవస్థాపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని గుర్తుచేశారు. సమస్యను ఆ కోణంలో చూడకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలపై నిందలు వేయడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రభుత్వ పనివేళల్లో విధులు సక్రమంగా నిర్వర్తించమని కలెక్టర్ కోరారని, తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయకపోవడం కూడా అవినీతేనని, ఇకనైనా తోటి ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని ప్రభుత్వ వైద్యులకు సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.మధుసూదన్‌రావు, జిల్లా కార్యదర్శి అల్లంపాటి పెంచలరెడ్డి, నెల్లూరు డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, విఆర్‌ఓ సంఘ జిల్లా అధ్యక్షుడు పంట అశోక్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘పోలీసులపై విమర్శలు సిగ్గుచేటు’
నెల్లూరు, మార్చి 11: తమకు ఉద్యోగరీత్యా సమస్యలు ఉంటే వాటిని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించుకోకుండా పోలీసులను అవినీతిపరులంటూ ప్రభుత్వ వైద్యుల సంఘ నేతలు ఆరోపించడం సిగ్గుచేటని పోలీస్ అధికారుల సంఘ జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాద్‌రావు, సభ్యులు తురకా శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. విధి నిర్వహణలో భాగంగా వైద్యులపై కలెక్టర్ చర్యలు తీసుకుంటే తప్పని సమర్థించుకోవడం కోసం తమపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. గతంలో పోలీసులు రక్తదానం చేస్తే ఆ రక్తాన్ని కూడా ఏమిచేశారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. వైద్య వ్యవస్థపై తమకు ఎంతో గౌరవం ఉందని, అయితే వారు శుక్రవారం ఇతర శాఖలపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇకనైనా ఆలోచించి ఆరోపణలు చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

‘స్వైన్‌ఫ్లూ పట్ల ఆందోళన వద్దు’
మనుబోలు, మార్చి 11:ప్రజలు స్వైన్‌ఫ్లూపై ఆందోళన చెందవద్దని జిల్లా వైద్యాశాఖాధికారి వరసుందరం చెప్పారు. శనివారం ఆయన మండల పరిధిలోని కొమ్మలపూడిలో స్వైన్‌ఫ్లూతో ఓ మహిళ మరణించిందన్న వార్తలతో ఆమె మృతదేహం, గ్రామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 16 మంది స్వైన్‌ఫ్లూ వ్యాధి బారినపడ్డారని అనుమానంతో శాంపిల్స్ పంపించామని, వాటిలో కేవలం 2 కేసులకు మాత్రమే స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా వచ్చిందన్నారు. ఈ ఇద్దరికి కూడా వైద్యసేవలు అందించి ఆరోగ్యవంతంగా ఇంటికి పంపించామన్నారు. రమాదేవి స్వైన్‌ఫ్లూతో మరణించందంటూ ప్రైవేటు ఆసుపత్రులు నిర్ధారించిన దానిని పరిగణనలోకి తీసుకోలేమన్నారు. మృతురాలి నుండి శాంపిల్స్ సేకరించి వాటిని స్విమ్స్‌కు పంపించామన్నారు. స్విమ్స్ నుండి నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే నిర్ధారిస్తామన్నారు. ప్రస్తుత వాతావరణంలో స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు లేవన్నారు. రమాదేవి కుమారై ధనలక్ష్మి, మనమరాలు నిఖితకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. కొమ్మలపూడి గ్రామంలో తమ సిబ్బందితో ఇంటింటసర్వే చేపట్టామని ఎక్కడా జ్వరాలు లేవని చెప్పారు. ఆయన వెంట స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారులు రవి, విష్ణురావు ఉన్నారు.
కొమ్మలపూడిలో ఇంటింటి సర్వే
స్వైన్‌ఫ్లూతో రమాదేవి మరణించిందంటూ వార్తలు రావడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్ధానిక పిహెచ్‌సికి చెందిన పిహెచ్‌ఎన్ నజీమా, ఆరుగురు ఎఎన్‌ఎంలు ఇంటింట సర్వే చేపట్టారు. జ్వరాలు వస్తే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలన్నారు. మురుగు కాలువలలో నీటిని నిలువ ఉంచరాదని, నీటి తొట్టెలలో ప్రతి మూడు రోజులకోసారి ఖాళీ చేసి ఎండబెట్టాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌ఎన్ నజీమున్నీసా, ఎంఎన్‌ఎంలు సుభాషిణి, సూపర్‌వైజర్ శాంతమ్మ, హెల్త్ అసిస్టెంటు కేశవరావు తదితరులు ఉన్నారు.

బిజెపి కార్యాలయంలో సంబరాలు
* మిఠాయిలు పంచిపెట్టిన నాయకులు
వేదాయపాళెం, మార్చి 11: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయం ఢంకా మోగించిన నేపథ్యంలో శనివారం నగరంలోని బిజెపి కార్యాలయంలో నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పెద్దఎత్తున బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెటారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి మాట్లాడుతూ 2014లో దేశ ప్రజలు బిజెపికి పెద్దఎత్తున మద్దతు తెలిపి అధికారాన్ని ఇచ్చారన్నారు. అప్పటి నుంచి ప్రధాని మోదీ ప్రజాకర్షణ పథకాలతో పేద ప్రజల పక్షాన నిలిచి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకొచ్చారన్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత జరిగిన ఈ ఎన్నికలలో బిజెపి ఆదరణ మరింత పెరిగిందన్నారు. పెద్దనోట్ల రద్దుతో బిజెపికి ఆదరణ కరవు అవుతుందని భావించిన ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు మింగుడు పడడం లేదన్నారు. గోవా, మణిపూర్‌లలో బిజెపి పోటాపోటీగా ఫలితాలు సాధిస్తూ గట్టి పోటీ ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ 2019లో దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రా, తెలంగాణాలలో కూడా బిజెపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజాతీర్పు బిజెపికి అనుకూలంగా ఉందని, కార్యకర్తలు ఆ దిశగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు దువ్వూరు రాధాకృష్ణారెడ్డి, ఆమంచర్ల శంకరనారాయణ, నగర అధ్యక్షుడు మండ్ల ఈశ్వరయ్య, నాయకులు నాగరాజారెడ్డి, మొగరాల సురేష్, కప్పిర శ్రీనివాసులు, నందకుమార్, గిరిగౌడ్, పోట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.