శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాష్ట్రంలో రాక్షస పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, మార్చి 12: రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతుందని వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో ఉన్న వైకాపా జిల్లా కార్యాలయంలో ఆదివారం వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు సంవత్సరాలు పూర్తిచేసుకుని ఏడో సంవత్సరంలో వైసిపి అడుగుపెట్టిందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని స్థాపించారన్నారు. రాష్ట్రంలో అధికారం లేకపోయినా ప్రజా సమస్యలపై అలుపెరుగుని పోరాటం చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి చిన్న కార్యకర్తను గౌరవించి వారికి సముచిత స్థానం ఇస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో వైసిపి సత్తా చూపుతుందన్నారు. వైసిపి తరపున పోటీ చేసే అభ్యర్థిని సమష్టి కృషితో గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తండ్రి ఆలోచనలు, ఆశయాలను నెరవేర్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని స్థాపించారని తెలిపారు. పార్టీ పెట్టి తొలిసారిగా రాష్ట్రంలో 9 పార్లమెంటు స్థానాలు, 67 శాసనసభ స్థానాలు కైవసం చేసుకున్న ఏకైక పార్టీ వైకాపా అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నో అబద్దాల హామీలు ఇచ్చి అధికారాన్ని తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుందన్నారు. కాని ఆచరణకు సాధ్యంకాని హామీలు జనగ్‌మోహన్‌రెడ్డి ఇవ్వలేదన్నారు. అధికారం చేతిలో ఉందని నాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. పేదల గృహాల్లోకి వెళ్లి స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి పాటుపడుతున్నది జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. రాబోవు ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి విజయం సాధించి రాజన్న రాజ్యాన్ని స్థాపించడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో వైసిపి తరపున నిలబడిన అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, నగర, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య, మేరిగ మురళి, రూప్‌కుమార్‌యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల శిరీష, జడ్పీటిసి వెంకటశేషయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మోటార్‌సైకిళ్ల చోరీ నిందితుల అరెస్ట్
* తొమ్మిది బైక్‌లు స్వాధీనం
నెల్లూరు, మార్చి 12: వ్యసనాలకు అలవాటుపడిన యువకులు మోటార్‌సైకిళ్లను చోరీగా ఎంచుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలను లెక్కిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోటార్‌సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను 5వ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను నగర డిఎస్పీ జివి రాముడు ఆదివారం 5వ నగర పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన షేక్ రఫి, స్థానిక బాలాజినగర్ సమీపంలోని రాయపు దళితవాడకు చెందిన కైలాసం ఫణీంద్రలు స్నేహితులు. వీరిద్దరూ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. గతంలో పలు నేరాల్లో పాల్గొని జైలుకెళ్లి వచ్చారు. అదే విధంగా పోతిరెడ్డిపాళేనికే చెందిన బదనపూరి వెంకటేష్ వీరితో జతకలిశాడు. ముగ్గురూ కలిసి నగరంలో పలు ప్రాంతాల్లో బైక్‌లను చోరి చేయడాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఆదివారం 5వ నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై విధులు నిర్వర్తిస్తున్న 5వ నగర సి ఐ మంగారావు, వారి సిబ్బందిని చూసి అటువైపుగా వస్తున్న పై ముగ్గురు వ్యక్తులు పరిగెత్తి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే తన సిబ్బంది సహాయంతో వారిని వెంబడించి సి ఐ మంగారావు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 9 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.40లక్షలు ఉంటుందని డి ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన 5వ ఇన్స్‌పెక్టర్ మంగారావుతో పాటు ఎస్సైలు నాగభూషణం, విజయకుమార్, ఎ ఎస్సై తిరుపతయ్య, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ గోపాల్, జిలాని, సాయికిషోర్‌లను డి ఎస్పీ రాముడు అభినందించి ఎస్పీ రివార్డులకు సిఫార్సు చేశారు. ఈ సమావేశంలో సి ఐ మంగారావు తదితరులు పాల్గొన్నారు.

గస్తీలు ముమ్మరం చేయాలి
* నగర డిఎస్పీ జివి రాముడు ఆదేశం
నెల్లూరు, మార్చి 12: నగరంలో వేసవిలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున తమ పోలీస్ స్టేషన్ పరిధిలో గస్తీని ముమ్మరం చేయాలని నగర డిఎస్పీ జి.వి.రాముడు 5వ నగర పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం సాయంత్రం స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. జాతీయ రహదారితో పాటు నగరంలోని ప్రధాన రహదారుల్లో తరచూ వాహనాల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో గస్తీ బృందాలను ఎక్కువగా ఏర్పాటు చేసి విస్తృతంగా తిరిగేలా చూడాలన్నారు. రాత్రి సమయంలో మోటార్‌సైకిళ్లపై విన్యాసాలు చేసేవారిపై ప్రత్యేక దృష్టి సారించి మినీ బైపాస్ రోడ్‌లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్టేషన్ ఇన్స్‌పెక్టర్ జి.మంగారావు, ఎస్సైలు విజయకుమార్, నాగభూషణం తదితరులు ఉన్నారు.

సముద్రంలో మునిగి ఇద్దరు మృతి
* మృతులిద్దరు నెల్లూరు వాసులే

నెల్లూరు, మార్చి 12: క్రికెట్ ఆడేందుకు వెళ్లిన యువకులు సరదాగా సముద్ర స్నానం చేస్తూ ఇద్దరు మృత్యువాతపడ్డ సంఘటన ఆదివారం తోటపల్లిగూడూరు మండలం కోడూరు బీచ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నెల్లూరు నగరానికి చెందిన 14 మంది యువకులు ఆదివారం దామరమడుగులో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. అనంతరం సరదాగా సముద్ర స్నానం చేసేందుకు కోడూరు బీచ్‌కు 8 మంది యువకులు వెళ్లారు. అసలే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో చల్లగా స్నానం చేసి సేదతీరుదామని అంతా సముద్రంలోకి దిగారు. సముద్రంలో ఈత కొడుతూ సరదాగా గడుపుతూ వారిలో కొంతమంది యువకులు సముద్రంలో లోతుకు వెళ్లి ఈత కొడుతున్నారు. ఈక్రమంలో సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఉండడంతో రియాజ్ (25), అనిల్ (25) మునిగిపోయారు. ఇది గమనించిన స్నేహితులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకే వారిద్దరిని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చికిత్స నిమిత్తం నెల్లూరుకు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో అనిల్ మృతి చెందాడు. రియాజ్‌ను నగరంలోని సింహపురి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ రియాజ్ కూడా మృతి చెందాడు. తోటపల్లిగూడూరు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శోకసముద్రంలో కుటుంబ సభ్యులు
ఆడుకునేందుకు వెళ్లిన తమ బిడ్డలు మృత్యువాత పడ్డారన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. చేతికి ఎదిగివచ్చిన బిడ్డలు ఇకలేరని తెలుసుకున్న వారు రోధించడం కాలనీవాసులను కలచివేసింది. నెల్లూరు డైకస్‌రోడ్డు ఎన్‌సిసి కాలనీకి చెందిన షేక్ రియాజ్ ఎంబిఏ చదువుతున్నాడు. తండ్రి షేక్ మొహిద్దీన్ టైలరింగ్ పనిచేసుకుంటూ జీవనాన్ని సాగిస్తుండడంతో తండ్రికి చేయూతగా నిలిచేందుకు రియాజ్ పార్ట్‌టైంగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెల్లూరు టిక్కేమిట్ట ప్రాంతానికి చెందిన అనిల్ కూడా చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో అంతా కలసి క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. వారిలో ఆట అనంతరం ఆరుగురు తిరిగి నెల్లూరు వచ్చేశారు. మిగిలిన 8 మంది కోడూరు బీచ్‌కు వెళ్లి సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి చెందారు. సరదాగా గడిపేందుకు వెళ్లిన తమ స్నేహితులను మృత్యువు కబళించడంతో తోటి స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నామని వాపోయారు. ఎన్‌సిసి కాలనీ, టిక్కేమిట్ట ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

పురాతన పుణ్యక్షేత్రం పెంచలకోన
రాపూరు, మార్చి 12: భక్తుల కోర్కెలు తీర్చే దేవుడు పెంచల నరసింహుడని శ్రీరామచంద్ర రామానుజ జీయర్‌స్వామి పేర్కొన్నారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానం ఆవరణలో గత మూడు రోజులుగా జరుగుతున్న మహాసుదర్శన యాగ కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన ఆదివారం పలు ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలతోపాటు మహాపూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీరామచంద్ర రామానుజ జీయర్‌స్వామి యాగశాల వద్ద హాజరైన భక్తుల నుద్దేశించి మాట్లాడారు. దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ వైష్ణవ ఆలయాలలో ఒకటైన పెంచల నరసింహస్వామి క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ఎంతో అరుదుగా కనిపించే స్వామి అమ్మవార్లు పెనవేసుకొన్న విగ్రహం ఈ పెంచలకోన క్షేత్రంలో తప్ప యావత్ భారతదేశంలో మరెక్కడా లేదని అన్నారు. పెంచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఎంతో మహిమగల క్షేత్రమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం జరగడం ఎంతో విశిష్టమన్నారు. ఏ దేవాలయాలలోనైనా అమ్మవారు స్వామివారు విడివిడిగా ఉంటారు. పెనవేసుకొని ఉండటం చరిత్రలో ఎక్కడా లేదని చెప్పవచ్చునని తెలిపారు. ఈ కోనకు వచ్చే భక్తులు స్వామివారి సన్నిదానంలో నియమ నిష్టలతో ఉండాలని భక్తులను ఉద్దేశించి కోరారు. అనంతరం అహోబిలం జీయర్ స్వామి మాట్లాడుతూ, సాధారణంగా ఆయా దేశాలలో జరిగే యాగాలకు ఒక జీయర్ స్వామిని ఆహ్వానిస్తారు. ఆ జీయర్ స్వామి చెప్పినట్టుగా పూజలు చేస్తారు. కానీ ఈ యాగానికి ముగ్గురు జీయర్ స్వాములు రావడం ఎంతో విశేషమన్నారు. ప్రతిఒక్కరు నిత్యం వారివారి గృహాలలో వీలు కల్పించుకొని ఉదయం పూట ప్రతిఒక్కరు వేదపారాయణం పఠించటం ఎంతో ముఖ్యమని అన్నారు. దీనివల్ల వారు చేసుకొనే పనులలో విజయం సిద్ధిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా సుమారు వంద మంది వివిధ ప్రాంతాలకు చెందిన పండితులు, నిష్ణాతులైన పూజారులు పాల్గొని యాగాలను దిగ్విజయంగా పూర్తిచేశారు. ఈ కార్యక్రమానికి వెంకటగిరి ఎమ్మెల్యే కె రామకృష్ణ దంపతులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్, గూడూరు డిఎస్‌పి బి శ్రీనివాస్‌తోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వేదపాఠశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యశర్మ, టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు, డాలర్ శేషాద్రి, వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది భక్తులు హాజరయ్యారు. ట్రస్టు బోర్డు చైర్మన్ నానాజీ, ఆలయ సహాయ కమిషనర్ శ్రీరామమూర్తి భక్తులకు సౌకర్యాలు కల్పించారు.

రంగనాథునికి గరుడ సేవ
నెల్లూరు కల్చరల్, మార్చి 12: రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాయకులస్వామి దేవస్థానంలో ఆదివారం బంగారు గరుడ సేవలో శ్రీరంగనాథస్వామి ఊయలలో ఊగారు. ఉదయం 8 గంటలకు మోహినీ అవతారంలో, సాయంత్రం బంగారు గరుడ సేవలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఏకాంత సేవ, ఊంజల్ సేవలు, వివిధ పుష్పాలతో స్వామికి పూజలు నిర్వహించారు. ఉభయకర్తలుగా చింతవరపు శివకుమార్‌రెడ్డి, సనాతనరెడ్డి వ్యవహరించారు. మధ్యాహ్నం కొండా మల్లికార్జునరెడ్డి ఉభయకర్త ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు. మైపాడు గేటు వద్ద ఉన్న శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి శ్రీరంగనాథస్వామి దేవస్థానం వరకు మేళతాళాలతో ఊరేగింపు కొనసాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ పి శ్రీనివాసులరెడ్డి, ధర్మకర్తలు పాల్గొన్నారు.

భగవత్ సేవలో దర్శనం ఇచ్చిన అయ్యప్పస్వామి
నెల్లూరు కల్చరల్, మార్చి 12: వేదాయపాళెంలో వెలసిన శ్రీ స్వామి అయ్యప్పస్వామి ద్వితీయ మహాకుంభాభిషేక మహోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ అయ్యప్పస్వామి భగవత్ స్వామిలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గణపతి పూజ, దీపారాధన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయదాతగా గడ్డం రత్నయ్య, సుజాతమ్మలు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ద్వితీయ కుంభాభిషేకం కమిటీ కమిటీ అధ్యక్షులు వెంకటకృష్ణారెడ్డి, శేషగిరిరావు మహోత్సవాలను పర్యవేక్షించారు.

రైతు వెతలు తీర్చేదెవరు?
* కరవుతో అల్లాడుతున్న అన్నదాతలు
కావలి, మార్చి 12: కరవు కాటకాలతో అల్లాడుతూ గ్రాసానికి దిక్కులేని వారుగా మారిపోయిన అన్నదాతల వెతలు తీర్చే నాథుడే కనిపించడం లేదు. కావలి మండలం, పట్టణంలో మెత్తం వరి పండే ఆయకట్టు అధికారిక లెక్కల ప్రకారం 13 వేల ఎకరాలు కాగా అనధికారికంగా బోర్లు, వాగులు, వంకలు కలుపుకుని ప్రతి ఏటా 18నుంచి 20 వేల ఎకరాలదాకా పండేది. మరో 20 వేల ఎకరాల్లో మెట్ట పంటలు సాగవుతాయి. వర్షపు నెలల్లో సాధారణ వర్షపాతం సరాసరి 100 సెంటీమీటర్లు కాగా అందులో 75 శాతం వర్షాలు పడినా సోమశిల నీరు అండగా పంటలు పుష్కలంగా పండేవి. గతేడాది వద్దంటే వర్షాలు కురవగా అంతకుముందు ఐదేళ్ల కరవును తరిమేస్తూ పంటలు చేతికి రాగా చేసిన అప్పులకు వడ్డీలైనా చల్లించే పరిస్థితి వచ్చింది. అంతలోనే 2016-17ల్లో కరవు నీడలు దట్టంగా కమ్ముకోగా వర్షాలు పూర్తిగా వెక్కిరించాయి. దీంతో చెరువుల్లోని గుంటల్లోకి కూడా నీరు చేరకపోవడంతో వరిసాగు దేవుడెరుగు కనీసం అపరాలు సాగు చేయలేకపోయారు. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసే వర్షాల ఆధారంగా కావలి, ఉదయగిరి నియోజకవర్గాలలో దాదాపు 5 లక్షల ఎకరాలలో మినుము పంట సాగయ్యేది. కాని ఈ ఏడాది గింజ భూమిలో వేసేందుకు అవసరమైన పదును లేకపోవడంతో వరి సాగుదారులతోపాటు మెట్ట రైతులు కాడె కిందపడేయాల్సి వచ్చింది. ఆలస్యంగా అదీ గత డిసెంబర్ నెలలో అరకొర వర్షాలను నమ్ముకుని అపరాలు సాగు చేసిన రైతులకు పదునులేక ఒకవైపు, భూగర్భ జలాలతో తడులు ఇచ్చిన రైతు క్షేత్రాలలో ఎల్లోమొజాయిక్ తెగులు ఇంకోవైపురాగా పంట మొత్తంగా పాడయిపోగా ఎకరాకు 25 వేల రూపాయలు నష్టాలను మూటగట్టుకున్నారు. కావలి నియోజకవర్గంలో డెల్టాగా ఉన్న అల్లూరు మండలంలోని చివరి ఆయకట్టుకే నీరందక కటకట పరిస్థితి నెలకొని ఉండగా బోగోలు, దగదర్తి మండలాల్లో సోమశిల జలాల ఆధారంగా కేవలం కొంతభాగంలోనే వరి పండుతోంది. సింహభాగం సాగుకు నోచుకోలేదు. ఇక కావలి మండలం, పట్టణం అటు వర్షాలు లేక, ఇటు సోమశిల జలాలు చుక్కైనా రాక అసలు వరిపంట కాదుకదా ఏ విధమైన పంటలు వేయలేదు. బోర్ల ఆధారంగా గౌరవరం, ముసునూరు, బుడంగుంట చౌదరి పాలెం ప్రాంతాల్లో వరి పంట సాగు చేయగా, నీరు చాలక ఎండుముఖం పట్టింది. కొన్నిచోట్ల మాడి మసై బుగ్గి కాగా ఎకరాకు 30 వేలకుపైగా నష్టాలు తోడుగా నిలిచాయి. తీర ప్రాంతాలలో భూగర్భ జలాల ఆధారంగా తుంపర్ల పరికరాల సాయంతో వేరుశనగ, చేమ తదితర పంటలు వేయగా వాటికి నీరు కనాకష్టంగా అందుతోంది. వ్యవసాయంపై మాత్రమే ఆధారపడి జీవించే రైతన్నలు, దానినే నమ్ముకుని పనిపాటలకు వెళుతూ కూలినాలి చేసుకుని బతికే బడుగుజీవులు ప్రస్తుతం కడుపునిండా తిండితినలేని పరిస్థితులు దాపురించాయని చెప్పవచ్చు. ఈ ఏడాది మిగిల్చిన నష్టాలు రైతులను మరో నాలుగైదేళ్లు వెన్నాడే అవకాశం ఉండగా అరచేతిలో వైకుంఠం చూపే నేతాశ్రీలు, రైతులే లోకం అని చెప్పుకుని తిరుగుతూ గొప్పలు పోయే నాయకులు రైతు కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. చినుకు వర్షంలేక, సోమశిల జాలల్లో కనీసం ఒక బిందువైనా కావలి ప్రాంతానికి వచ్చిన దాఖలాలు లేకపోగా ప్రభుత్వాలు, అధికారుల తప్పిదమో, మరెవరి నిర్వాకమోగాని కావలి మండలం కరవు మండలాల జాబితాలో లేదు. నదీ జలాలతో అంతో ఇంతో పండుతున్న బోగోలు, జలదంకి మండలాలు కరవు జాబితాలో ఉండగా అసలే ఏ ఆధారంలేని కావలి అందులో లేకపోవడం దారుణం కాగా దానిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి రైతులకు మేలు చేసే నాయకుడే లేకుండా పోయారు. విపక్షం మాటకు విలువ లేని స్థితి. దీనికి తోడు మెరుగుపరచబడిన పంటల బీమా పథకాన్నైనా అమలు చేసి ఆదుకునేవారుకూడా కరవుకాగా అన్నదాతలు అందరూ ఉన్నా ఎవరూలేని వారన్నట్టుగా దిక్కులేని వారయ్యారు. కరవు మండలంగా ప్రకటించి బీమా పథకం అమలైతే ఏకారణం వల్లైనా పంట సాగు చేయకుంటే ఉత్పాదక వ్యయానికి కొంత శాతం అదనంగా పరిహారం అందేవీలుంది. అయితే ఏదేని బ్యాంకు శాఖనుంచి పంటరుణం కాని, లేక బీమా పొందేందుకు అవసరమైన ప్రీమియం చెల్లింపుకాని చేసి ఉన్న రైతులు మాత్రమే దీనికి అర్హులవుతారు. అలాంటి వారికి ఉదాహరణకు వరిపంటకు ఎకరాకు 30 వేల వరకు పరిహారం అందేవీలు ఉంటుంది. పాలకులు, మండల, డివిజన్, జిల్లా అధికారులు వాస్తవాలను దగ్గరగా చూసి ప్రభుత్వానికి నివేదించి కరవు మండలంగా ప్రకటించి ప్రభుత్వపరమైన సాయం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పట్టణంలో నివసిస్తూ వ్యవసాయ పనులపై ఆదారపడి జీవించే కూలీలకు కూడా ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకం వర్తించేలా వ్యవస్థీకృత మార్పుకు అధికార విపక్ష నేతలు కృషి చేయాలని రైతు నేతలు కోరుతున్నారు. తద్వారా కరవు ప్రభావం నుంచి కొంతైనా ఉపశమనం పొందవచ్చని చెబుతుండగా ప్రజాసేవలో ఉన్నామని గొప్పలు పోయే నేతాశ్రీలు ఎంతవరకు రైతులకు న్యాయం చేస్తారో వేచి చూడాల్సి ఉంది.