శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జోరుగా పునర్విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 11: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచే అంశంపై కసరత్తు ప్రారంభించినట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. ఈనేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రస్తుతమున్న 10 శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 14కు పెరగనుంది. అయితే తొలుత కేవలం 3 స్థానాలు మాత్రమే పెరిగి పునర్విభజన తర్వాత జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉంటాయని అందరూ భావించారు. అయితే మారిన సమీకరణల నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ పునర్విభజనతో మారనున్న నియోజకవర్గాల సంఖ్యను పరిశీలిస్తే ఒక నియోజకవర్గం అదనంగా మిగిలిపోతున్నదని, దీంతో నెల్లూరు జిల్లాలో ఆ అదనపు నియోజకవర్గాన్ని కేటాయించడం ద్వారా భర్తీ చేసే ఆలోచనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పెంపునకు కేంద్రస్థాయిలో తీవ్రంగా కృషి చేస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సొంత జిల్లా కావడవంతో ఆ అదనపు అవకాశం ఇక్కడ కల్పిస్తున్నట్లు మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు నగరం, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. పునర్విభజన తర్వాత ఈ పది నియోజకవర్గాలతో పాటు అదనంగా గతంలో ఉండి తర్వాత లేకుండా పోయిన రాపూరు, అల్లూరు నియోజకవర్గాలు తిరిగి పునరుద్ధరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా నెల్లూరు తూర్పు లేదా నెల్లూరు-3, నాయుడుపేట నియోజకవర్గాలు కొత్తగా రానున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పడే 14 నియోజకవర్గాల్లో ఒకటి ఎస్టీలకు రిజర్వ్ చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో కోవూరు, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో ఎస్టీల జనాభా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడే అల్లూరు, ప్రస్తుతమున్న కోవూరు నియోజకవర్గాల్లో ఒకటి ఎస్టీలకు కేటాయించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అల్లూరు నియోజకవర్గం ఏర్పడితే అందులో విడవలూరు, కొడవలూరు, అల్లూరు మండలాలు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఎస్టీల సంఖ్య మిగతా మండలాలతో పోలిస్తే ఎక్కువ. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేటల్లోనూ ఎస్టీల సంఖ్య గణనీయంగానే ఉంది. ఈక్రమంలో రెండింటిలో ఏదోఒక నియోజకవర్గం ఎస్టీలకు కేటాయించే అవకాశాలను కొట్టిపారవేయలేం. ఇక ప్రస్తుతం జిల్లాలో సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ అయి ఉన్నాయి. పునర్విభజనలో రిజర్వ్ నియోజకవర్గాలను మార్చే వీలుంటే ఈ రెండు నియోజకవర్గాలు ఈ దఫా జనరల్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి స్థానిక నేతలు ఇదే కోరుకుంటుండం గమనార్హం. ఎప్పట్నుంచో అక్కడ ఉన్న ఇతర కులాల నేతలు పార్టీపరంగా ఉన్నతస్థానానికి చేరుకున్నప్పటికి అసెంబ్లీకి ఎన్నికయ్యే అవకాశాన్ని అందుకోలేకపోయారు. పునర్విభజనలో ఎస్సీ నియోజకవర్గాలను కదిలించాల్సి వస్తే ఈ రెండు స్థానాల్లో అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు అవకాశం దక్కినట్లే. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న తరుణంలో త్వరలోనే కేంద్ర మంత్రిమండలి ముందుకు ఈ బిల్లు రానున్నట్లు సమాచారం. సోమవారం ఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఈ అంశంపై ప్రత్యేకించి మాట్లాడడం జరిగింది. వారి నుంచి హామీ కూడా ఆయన పొందడం జరిగిందని త్వరలోనే ఈ బిల్లు పార్లమెంటు ముందుకు వెళ్లి కార్యరూపం దాల్చనుందని 2019లో 225 నియోజకవర్గాల ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతాయనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు.

దళితుల అభ్యున్నతికి చేయూత
కేంద్ర మంత్రి మిశ్రా స్పష్టం
సూళ్లూరుపేట, ఏప్రిల్ 11: దళితుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కలరాజ్ మిశ్రా అన్నారు. మంగళవారం ఆయన అండేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మన్నారుపోలూరు దళితవాడతో పర్యటించి అక్కడ వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆదుకొనేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి దళితవాడను ఎంపీలు సందర్శించి వారిని అన్నివిధాల ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు చిన్న పరిశ్రమలు పెట్టుకొనేందుకు ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల ద్వారా కోటి రూపాయలకు పైగా రుణం పొందే సదుపాయం కూడా కల్పించినట్లు తెలిపారు. జన్‌ధన్ ఖాతాలు కూడా వెనుకబడిన పేదల కోసం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో దేశంలో పేదరికం లేని సమాజమే తమ లక్ష్యమన్నారు. ముఖ్యంగా దళితవాడలను అభివృద్ధి చేసేందుకు కూడా ప్రత్యేక చొరవ తీసుకొంటున్నట్లు ఆయన తెలిపారు.
చెంగాళమ్మ సేవలో
సూళ్లూరుపేట పర్యటనకు విచ్చేసిన కేంద్ర మంత్రి మిశ్రా ముందుగా చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ పాలకమండలి వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వదించి అమ్మవారి తీర్ధప్రసాదాలు అందజేశారు. ముందుగా ఆయనకు రాష్ట్ర సరిహద్దు పన్నంగాడు వద్ద బిజెపి నేతలు ఘనంగా స్వాగతం పలికి అభినందలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, బిజెపి రాష్ట్ర నాయకులు రవీంద్రరాజు, సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి, కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, పులుగు శ్రీనివాసులరెడ్డి, కోటయ్య, రాజేంద్రప్రసాద్, తన్నీరు శేషగిరిరావు, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ నూలేటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే అభివృద్ధి సాధ్యం
* జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో కలెక్టర్ స్పష్టం
వేదాయపాళెం, ఏప్రిల్ 11: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని మహాత్మా జ్యోతిరావుపూలే ఎప్పుడో చెప్పారని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎన్జీఓ హోం సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావుపూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రాం వంటి నాయకులు సమాజం కోసం జీవితాంతం పని చేశారన్నారు. మహాత్మా జ్యోతిరావుపూలే వంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు గురవంటే దానిలో ఎంత ప్రాముఖ్యత ఉందో చూడవలసిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లల చదువుకోసం ఆనాడు జ్యోతిరావుపూలే తన భార్యతను విజ్ఞానవంతురాలుగా చేసి తద్వారా వారికి చదువు చెప్పించడానికి పాఠశాలలు ఏర్పాటుచేసి ఆడపిల్లల చదువుకోసం ఎంతో ఆదరణ అందించారన్నారు. నేటికి ఇంకా చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను ఇంటర్మీడియట్ వరకు చదివించి ఇంటిలోనే ఉండే విధంగా చూస్తున్నారని, కాని తల్లిదండ్రులను తమ ఆడిపిల్లలు పైచదువులు చదివించే విధంగా చూడాలన్నారు. విద్యతో పేదరికాన్ని పారదోలవచ్చన్నారు. జిల్లాలో ఇక నుంచి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లా పరిషత్ హైస్కూల్‌లో, అంగన్‌వాడీ విద్యా కేంద్రాలలో నాణ్యమైన విద్యను బోధించడమే కాకుండా నైపుణ్యతను కూడా నేర్పించడం జరుగుతుందన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి కల్పించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూక్తులైన ఎడ్యుకేట్, యూజిటెడ్, ఆర్గనైజ్ అనే వాటిలో ఎంతో అర్థం ఉందని సమస్యలను అందరి దృష్టికి తెచ్చి పరిష్కరించే విధంగా బిసి సంఘాలు కృషి చేయాలన్నారు. ఏప్రిల్ నెలలో ముగ్గురు మహానాయకుల జయంతి ఉత్సవాలు రావడంతో ఈనెల ఎంతో గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. శాసనమండలి సభ్యుడు బీద రవిచంద్ర మాట్లాడుతూ వివిధ బిసి సంఘాల వారు అనేక సమస్యలను సభ దృష్టికి తెచ్చారన్నారు. వాటిని పరిష్కరించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని చర్చించి అవి పరిష్కరించేవిధంగా కృషి చేయాలన్నారు. నెల్లూరులో బిసి భవన్ నిర్మాణానికి కావలసిన స్థలం ఒక వారం రోజులలోపు గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ మాసంతంలోపు బిసి భవనానికి శంకుస్థాపన లు చేయటానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్య ద్వారా మాత్రమే పేదరికం నిర్మూలన సాధ్యపడుతుందన్నారు. బిసి కులాల వారు తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. బిసి వర్గాల వాకి సేవలందించడానికి అనేకమంది పదవీ విరమణ చేసిన అధికారులు, పెద్దలు ముందుకు వస్తున్నారని వారి సేవలను సద్వినియోగం చేసుకుని బిసిలు అభివృద్థి చెందాలని పిలుపునిచ్చారు. సూళ్లూరుపేట శానససభ్యుడు కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావుపూలే ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని ఆయన అందరి నాయకుడన్నారు. మహాత్మా జ్యోతిరావుపూలే తొలి తరానికి చెందిన సామాజిక సమస్యలను పరిష్కరించిన మహానుభావుడని కొనియాడారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా మహాత్మా జ్యోతిరావుపూలే స్మారక భవనాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పలువురు జిల్లా అధికారులు తదితరులు జ్యోతిరావుపూలే జీవిత విశేషాలను వివరించారు. అనంతరం బిసి కార్పొరేషన్ మంజూరు చేసిన రుణ పత్రాలను లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అందచేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ 2 రంజిత్‌బాషా, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ చెంచలబాబుయాదవ్, మాజీ శాసన మండలి సభ్యులు బూదాటి రాధయ్య, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లి నిర్మల, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్, బిసి సంక్షేమశాఖాధికారి వి.సంజీవరావు, బిసి కార్పొరేషన్ ఇడి వెంకటస్వామి, వివిధ వెనుకబడిన కులాల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

స్మార్ట్ విలేజ్ అభివృద్ధి పనులు
త్వరగా పూర్తిచేయండి:జెసి
వేదాయపాళెం, ఏప్రిల్ 11: జిల్లాలో స్మార్ట్‌విలేజ్, స్మార్ట్ వార్డులలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం గ్రీవెన్స్ సమావేశ మందిరంలో ఆదర్శగ్రామాల అభివృద్ధిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ వెంకటాచలం మండలం, కనుపూరు, తోటపల్లిగూడూరు మండలం, మల్లికార్జునపురం, ఉదయగిరి మండలం, తరుమలాపురం, ఓజిలి, కర్రబల్లవోలు, ఆత్మకూరు మండలం, మహిమలూరు, ఎఎస్‌పేట మండలం, చిరమన, మనుబోలు, బుచ్చిరెడ్డిపాళెం, కట్టుబడిపాళెం గ్రామాలలో జరుగుతున్న వివిధ అభివృద్థి కార్యక్రమాలను ఎంపిడిఓలు, తహశీల్దార్లు, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పై గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన పనులు ఉంటే ముఖ్యప్రణాళికాధికారికి ఇవ్వవలసిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్యప్రణాళికాధికారి పిబికె మూర్తి, డిప్యూటీ డైరెక్టరు వెంకయ్య, ఆర్‌డిఓలు వెంకటేశ్వర్లు, రమణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కోదండరాముడి రథోత్సవం
భారీగా హాజరైన జనం
బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్ 11: బుచ్చిరెడ్డిపాళెంలోని పెద్దూరు కోదండరామస్వామి రథోత్సవం మంగళవారం అంగరంగ వైభంగా జరిగింది. కోదండరామల వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన ఈకార్యక్రమంలో స్వామివార్లను పట్టువస్త్రాలతో ముస్తాబుచేసి రథంలో కొలువుతీర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణం నుండి ప్రధాన వీధుల గుండా శివాలయం, కుమ్మరి వీధి మీదుగా ప్రయాణించి బ్రాహ్మణ అగ్రహారాల మీదుగా యథాస్థానానికి చేరింది. రథయాత్ర జరుగుతున్నంతసేపు ఆలయ పరిసరాలు శ్రీరామ నామస్మరణతో మారుమోగాయి. రథం చక్రాల కింద గుమ్మడికాయలు పెట్టి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో ఆలయ పరిసరాలు జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్ధం దాతలు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మజ్జిగ, రస్నా, పెరుగన్నం, పులిహోర పంపిణీ చేశారు. పలువురు భక్తులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

ఘనంగా చండీయాగం
సూళ్లూరుపేట, ఏప్రిల్ 11: పౌర్ణమి పర్వదినం సందర్భంగా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో మంగళవారం మహాచండీయాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాల మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి వేదపండితులు మంత్రోచ్ఛరణ నడుమ యాగాన్ని ఘనంగా చేశారు. శ్రీసిటీ అధినేత రవీంద్ర సన్నారెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి అధ్యక్షుడు ముప్పాళ్ల వెంకటేశ్వరరెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసులురెడ్డి, పాలకమండలి సభ్యులు చిలకా యుగంధర్, వేనాటి గోపాల్‌రెడ్డి, చిట్టేటి పెరుమాల్ తదితరులు పాల్గొన్నారు.

13న దేశ ఆర్థిక మార్కెట్-నూతన ధోరణులపై జాతీయ సదస్సు

నెల్లూరు, ఏప్రిల్ 11: ఈనెల 13న జిల్లా కేంద్రంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో భారతదేశ ఆర్థిక మార్కెట్-నూతన ధోరణులు అనే అంశంపై జాతీయస్థాయి కార్యశాల నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అకడమిక్ డైరెక్టర్ వినయ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు జాతీయస్థాయి ఆర్థిక, విద్యా విషయక నిపుణులు హాజరుకానున్నారన్నారు. ప్రముఖ స్టాక్ మార్కెట్ విశే్లషకులు గంగినేని ధనుంజయ, ఎస్‌వి వర్శిటీ నుండి ఆచార్య ఎం శ్రీనివాసరెడ్డి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి జివి చలం తదితరులు హాజరవుతున్నారన్నారు. దేశ మార్కెట్ వ్యవస్థల పనితీరు, విస్తరణ, మారుతున్న ఆర్థిక స్వరూప స్వభావాలు వంటి విషయాలపై అవగాహన చర్చావేదికలు ఉంటాయన్నారు. ఈ సదస్సు వ్యాపారం, స్టాక్‌మార్కెట్‌పై విద్యార్థులకు మంచి అవగాహన కలుగడంతో పాటు భవిష్యత్‌లో ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందన్నారు. అందరూ పాల్గొని సదస్సును సద్వినియోగం చేయాలని ఆ ప్రకటనలో ఆయన కోరారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
* డిటిసి శివరాంప్రసాద్ హెచ్చరిక
* రవాణా కార్యాలయ ప్రాంగణంలో తనిఖీలు
నెల్లూరు, ఏప్రిల్ 11: రవాణా శాఖ కార్యాలయం చుట్టుపక్కల ఏజెంట్ల అవతారమెత్తి కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారిని ప్రలోభాలకు గురిచేస్తే తగిన చర్యలు తప్పవని జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ శివరాంప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం ఆయన తమ శాఖ అధికారులతో కలిసి కార్యాలయం చుట్టుపక్కల ఉన్న ఏజెంట్ల షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిటిసి మాట్లాడుతూ రవాణా కార్యాలయానికి 500 మీటర్ల లోపు ఏజెంట్లు ఎటువంటి కార్యాలయాలు నిర్వహించడానికి వీల్లేదని, ఈ నిబంధనలను అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యాలయానికి వచ్చే వారు సైతం దళారులను ఆశ్రయించవద్దని, దరఖాస్తులు నింపడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎటువంటి సమాచారం అవసరమైనా కార్యాలయంలో సంప్రదించాలని, తమ సిబ్బంది సహకరిస్తారని చెప్పారు. ఏజెంట్ల ఆగడాలపై తమకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయని, ఈక్రమంలోనే మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టామని ఆయన తెలిపారు. ఇటువంటి తనిఖీలు తరచూ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించే ఏజెంట్లపై చట్టపరమైన చర్యలకు వెనుకాడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
అందరూ పరార్..
మంగళవారం ఉదయం 10 గంటలకు రవాణా కార్యాలయ ప్రాంగణం కార్యార్ధులతో రద్దీగా ఉంది. వివిధ రవాణా సంబంధిత పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్నవారు మధ్యలో ఏజెంట్లను కలవడం, వారి పనులు చేసిపెట్టే క్రమంలో దరఖాస్తులు నింపడం తదితర పనులతో ఏజెంట్లు కూడా చాలా బిజీగా ఉన్నారు. అంతలోనే ఉప రవాణా కమిషనర్ శివరాంప్రసాద్ తన సిబ్బందితో ఆకస్మికంగా ఏజెంట్ల కార్యాలయాల వద్దకు రావడాన్ని గమనించిన ఏజెంట్లు అక్కడ్నుంచి మినీ బైపాస్‌రోడ్ వైపు పరుగులు తీశారు. కార్యాలయానికి వచ్చిన వారికి అక్కడ ఏమి జరుగుతోందో కాసేపు అర్థం కాలేదు. అక్కడకు వచ్చిన డిటిసి పనుల నిమిత్తం నేరుగా కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని, ఏజెంట్ల వద్దకు వెళ్లవద్దని అక్కడున్న వారికి సూచించారు. ఈ తనిఖీల్లో ఆయన వెంట ఎంవిఐలు సీతారామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఎఎంవిఐలు రవికుమార్, పూర్ణచంద్రరావు, టి.రాఘవరావు, ఎఓలు విజయకుమార్, సాయిప్రసాద్ తదితరులు ఉన్నారు. తనిఖీలు పూర్తిచేసుకున్న తర్వాత అధికారులు మొత్తం తమ విధుల నిమిత్తం కార్యాలయంలోకి వెళ్లడమే ఆలస్యం ఏజెంట్లు తిరిగి యథాస్థానంలోకి చేరుకోవడం కొసమెరుపు.

-----------

గరుడ సేవలో వేణుగోపాల స్వామి
నెల్లూరు కల్చరల్, ఏప్రిల్ 11: స్థానిక మూలాపేటలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లు విహరించారు. తొలుత మోహిని (గినె్నభిక్ష) కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సంపత్‌కుమార్ స్వామి ఆధ్వర్యంలో అర్చక బృంధం రమాకాంత్ స్వామి, శ్రీనివాస అయ్యంగార్, నరసింహాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్నపన తిరుమంజనం నిర్వహించారు. గరుడ సేవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయ మేనేజింగ్ ట్రస్టీ ఛైర్మన్ ఆనం చంద్రశేఖర్‌రెడ్డి, మేనేజర్ వి.గిరికృష్ణల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉభయకర్తలుగా జి.సత్యనారాయణ, ఇందుమతి, దొడ్ల పద్మావతి, శేషారెడ్డి, గిరిజ తదితరులు వ్యవహరించారు.

15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం
* నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
* మత్స్యశాఖ కమిషనర్ హెచ్చరిక
వేదాయపాళెం, ఏప్రిల్ 11: సముద్ర జలాలలో చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించేందుకు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ కమిషనర్ ఆర్.శంకర్‌నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాలలో మెకనైజెడ్, మోటారు బోట్ల ద్వారా అన్ని రకాల చేపలు, రొయ్యల వేటలను ఈనెల 15వ తేది నుంచి జూన్ 14వ తేది వరకు 61 రోజులపాటు వేటను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిషేధ ఉత్తర్వులను జారీచేసింది. నిషేధ ఉత్తర్వులను అనుసరించి మెకనైజెడ్, మోటారు బోట్ల యజమానులు, మత్స్యకారులు సముద్ర జలాలలో ఎటువంటి చేపలవేట చేయకుండా సముద్ర జలాలతో మత్స్య అభివృద్థికి సహకరించాలని కోరారు. నిషేధ ఉత్వర్వులను ధిక్కరించి చేపల వేట చేసిన మెకనైజెడ్, మోటారు బోట్ల యజమానులు ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్దీకరణ చట్టం 1994 అనుసరించి శిక్షార్హులన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారి బోట్లను, బోట్లలో ఉండే మత్స్య సంపదతోపాటు జరిమానా విధిస్తూ డీజల్ ఆయిల్‌పై రాయితీ సౌకర్యాన్ని నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. అయితే సాంప్రదాయ బోట్లకు ( ఇంజన్ లేని బోట్లు) మాత్రం ఈ నిషేధం వర్తిందని తెలిపారు. నిషేధ కాలాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు మత్స్యశాఖ కోస్ట్‌గార్డు, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ అధికారులతో గస్తీ ఏర్పాటు చేస్తున్నామని, మత్స్యకారులు నిషేధ గదువు పూర్తయ్యేంత వరకు సహకరించాలని ఆయన కోరారు.

పెద్ద నోట్ల రద్దు పేదల కోసమే
కేంద్ర మంత్రి కల్‌రాజ్ స్పష్టం
నాయుడుపేట, ఎప్రిల్ 11: దేశంలో నిరుపేదల అభ్యున్నతికి ఆర్థిక సమానత్వాన్ని కోరుతూ బిజెపి ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాత్మక మార్పుల్లో పెద్దనోట్ల రద్దు ఒకటని, దాని ఫలితాలు త్వరలోప్రజలకు అందుతాయని కేంద్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా అన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల నాటికి బిజెపిని బలోపేతం చేయడానికి నియోజకవర్గ పరిధిలోని నాయకులు, పదాధికారులతో మంగళవారం ఆయన స్థానిక కెకె కల్యాణ మండపంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పరిధిలోని ప్రధాని ఆధ్వర్యంలో నిరుపేదల కోసం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని అన్నారు. తద్వారా రానున్న ఎన్నికల్లో బిజెపి బలోపేతానికి కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో బూత్ కమిటీల నుండి కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలన్నారు. బడుగు, బలహీన వర్గాల్లో ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా వ్యాపార పరంగా అభివృద్ధి చెందడానికి సబ్సిడీతో కూడిన కోటి రూపాయల రుణాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనున్నదని అన్నారు. పెద్దనోట్ల రద్దు ద్వారా జరిగిన ఉన్నత ఫలితాలు త్వరలో ఫ్రజల్లోకి వస్తాయన్నారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహాన కల్పించారు. ఉపాధి కల్పనలో ప్రత్యేక పధకాలను ప్రవేశ పెడుతూ రెండెంకెల అభివృద్ధి సాధనలో ప్రపంచ దేశాల్లో భారత్‌కు ప్రత్యేక స్థానానికి బిజెపి తెచ్చి పెడుతుందన్నారు. ఆదర్శ పురుషులైన అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు బిజెపి అడుగులు వేస్తోందన్నారు. అంతకుముందు ఆయన జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం పార్టీ నాయకులు మంత్రికి శాలవాలు కప్పి పూలమాలలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు రంగినేని కృష్ణయ్య, గుంజి శ్రీనివాసులు, ఎన్ రామ్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, సన్నారెడ్డి సురేష్‌రెడ్డి, రవీంద్రరాజు, కె ఆంజనేయరెడ్డి, కె సుధాకర్‌రెడ్డి, టిటిడి బోర్డు మెంబర్ భానుఫ్రకాష్‌రెడ్డి, విజయభాస్కర్, దయాకర్, మాల్యాద్రి, మోహన్‌కృష్ణ పాల్గొన్నారు.