శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కరవు నివారణ చర్యలు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కల్చరల్, ఏప్రిల్ 15: నెల్లూరు జిల్లా తీవ్రస్థాయిలో కరవు ఉందని, తగు నివారణా చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఆయన శనివారం స్థానిక జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో కరవుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా కరవు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 46 మండలాలకు గాను 27 మండలాల్లో కరవు తీవ్రత అధికంగా ఉందన్నారు. మొత్తం 46 మండలాల ప్రజలు కరవుతో అల్లాడుతున్నారని అన్నారు. జిల్లావ్యాప్తంగా కరవు నివారణ చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సోమశిల, కండలేరు, వివిధ డ్యాంలలో నీటి నిల్వలు పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. పాత చెక్‌డ్యాంలు ఏమైనా మరమ్మతులు ఉంటే తక్షణమే పరిశీలించి తగు చర్యలు తీసుకుని పునరుద్ధరించాలన్నారు. భూగర్భ జలాలు పెరిగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా రైతాంగానికి సాగునీరు అందించగలమన్నారు. జిల్లాలో చాలాచోట్ల వేసవికాలం కావడంతో పంటలు ఎండిపోయాయని తన దృష్టికి వచ్చిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో వేసిన పంటలు సక్రమంగా పండకలేదని, అరకొరగా పండిన పంటను రైతులే కోతలు కోసుకొంటున్నారని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కరవుతోందన్నారు. అటువంటి వారికి ఆ గ్రామంలో కాకపోయిన పక్క గ్రామంలో పని కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో కరవు నివారణ కోసం ముఖ్యమంత్రి అధిక నిధులు కేటాయిస్తారని చెప్పారని పేర్కొన్నారు. ఉన్న నిధులను త్వరితగతిన సాగునీరు అందించేందుకు ఖర్చు చేయాలన్నారు. రైతాంగానికి కావలసిన ఎరువులు, పశుగ్రాసం, వివిధ రకాల పంటల విత్తనాలు సబ్సిడీతో కావలసినంత మేర అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంట కాలువల్లో నీరు ఇంకకుండా తగు చర్యలు చేపట్టి రైతాంగానికి నీరందించాలన్నారు. జిల్లాలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా పూర్తిస్థాయిలో చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. తాగు, సాగునీరు పూర్తిస్థాయిలో అందించే విధంగా అధికారులు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. రైతాంగాన్ని పూర్తిస్థాయిలో ఆదుకునేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీకల్లా పెన్నా బ్యారేజీ పనులు పూర్తికావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. దీంతో రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సాగు నీరందించేందుకు గాను డ్యాంలను, పంట కాలువలను మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాగు నీరందించేదుకు గాను కావలసినంత మేర నిధులను వాడుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్-2 షేక్ రంజిత్ బాషా, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

చిత్తశుద్ధితో పని చేయాలి
అధికారులకు మంత్రి సోమిరెడ్డి ఆదేశం

నెల్లూరు, ఏప్రిల్ 15: అధికారులు చిత్తశుద్ధి, అంకితభావంతో పని చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం మంత్రి వివిధ పథకాలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అధ్యక్షత వహించారు. మంత్రి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు, రైతులు, ఎస్‌సి, ఎస్‌టిలను దృష్టిలో పెట్టుకొని అధికారులు పని చేయాలన్నారు. ప్రభుత్వం ఆయా శాఖలకు కేటాయించిన నిధులను నూరు శాతం ఖర్చు చేసి లక్ష్యాలను సాధించాలన్నారు. అనేక మంది పేదలు చిన్నచిన్న పనుల కోసం తహశీల్దార్, ఎండిఓ తదితర కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారని అన్నారు. ఇది మంచి పరిణామం కాదన్నారు. న్యాయబద్దంగా చేయాల్సిన పనులు ఆలస్యం చేయడం సహించరాని విషయమని అన్నారు. బాధ్యతాయుతంగా పని చేస్తేనే ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం కలుగుతుందని అన్నారు. గతంలో డక్కిలి తదితర మండలాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటుచేసి 24 గంటల్లోనే నీటిని పంపింగ్ చేశామని అన్నారు. తద్వారా పంటలకు సాగు నీరందించామన్నారు. రైతాంగానికి అందించే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు నాణ్యత లేకపోతే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాంటి కంపెనీలపై చర్యలు తప్పవన్నారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు మాట్లాడుతూ గత ఏడాది అనేక మండలాల్లో ఏర్పడిన కరవు దృష్యా 1212 కోట్లు నిధులు కావాలని కేంద్ర బృందానికి నివేదిక సమర్పించామని అన్నారు. ఆ నిధులు వస్తే విత్తనాలు, ఎరువులు తదితర పనులు చేయవచ్చని వివరించారు. ఉద్యానశాఖలో 4.58 కోట్లు పనుల నిమిత్తం ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉందన్నారు. గ్రామీణ నీటి సరఫరా పథకంలో ప్రభుత్వం నుంచి నిధులకు తాత్సారం చేయకుండా అత్యవసరమైన పనులు చేపట్టాలని అన్నారు. ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి సోమిరెడ్డి అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెబుతూ సోమశిలలో పూర్తి నీటి సామర్ధ్యం 77.988 టిఎంసిలు కాగా ప్రస్తుతం 10.274 టిఎంసిలు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాజెక్టు కింద ఉన్న వివిధ పనులు త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో మొక్కలు పెంపకంలో ప్రాధాన్యత ఇవ్వాలని, మెట్ట ప్రాంతాల్లో అధిక శాతం మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా సహాయం అందించడానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్-2 షేక్ రంజిత్ బాషా, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.