బిజినెస్

ఈ భారాన్ని మోయలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 19: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సిమెంటు ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గృహనిర్మాణ రంగంపై ఈ సిమెంటు ధరల ఆకస్మిక పెరుగుదల తీవ్ర ప్రభావానే్న చూపిస్తోంది. నెల రోజుల వ్యవధిలో 60 శాతానికిపైగా బస్తా సిమెంటు ధర పెరిగిపోవడం వెనుక సిమెంటు కంపెనీల కుమ్మక్కు స్పష్టంగా కనిపిస్తోందనే ఆరోపణలు మిన్నంటాయి. మార్చి నెలాఖరులో బస్తా సిమెంటు ధర 200-230 రూపాయల మధ్య ఉండగా, ప్రస్తుతం 340-380 రూపాయల మధ్య ఉండడం ఆందోళన కలిగించే విషయమే. సిమెంటుకు ఉపయోగించే ముడిపదార్థాల ధరలు పెరిగినపుడు సిమెంటు ధరల్లో పెరుగుదల సాధారణంగా ఉంటుంటుంది. అయితే గత కొంతకాలంగా అలాంటిదేమీ లేకపోయనా కొన్ని సిమెంటు తయారీ సంస్థలు అదును చూసి ఒక్కటై ఉద్దేశపూర్వకంగానే ధరలను పెంచాయని బిల్డర్స్ అసోసియేషన్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవాలు కూడా లేకపోలేదు. ఒకవేళ ముడిపదార్థాల ధరలు పెరిగితే ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే స్థాయిలో సిమెంటు ధరలు పెరగాల్సి ఉంటుంది. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లో మినహాయించి పక్క రాష్ట్రాల్లోనూ, ఉత్తర భారతదేశంలోనూ సిమెంటు బస్తా ధరలు ఇంత భారీగా పెరగకపోవడం గమనార్హం. గతంలో 2014లోనూ ఇదే తరహాలో సిమెంటు కంపెనీలు ఒక్కటై కృత్రిమ కొరత సృష్టించి సిమెంటు ధరలను అమాంతం పెంచివేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ధరలను స్థిరీకరించే పరిస్థితి ఏర్పడింది. అప్పట్నుంచి స్థిరంగా ఉన్న సిమెంటు ధరలు గత నెల రోజుల వ్యవధిలో పెరుగుతూ పోయాయ. దీనిపై మరలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సిమెంటు ధరల నియంత్రణ ప్రాధికార సంస్థ ఏర్పాటును ఈ ధరల పెరుగుదల మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచన చేయాలని గృహనిర్మాణ రంగ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
అన్ని రంగాల నిర్మాణాలపై ప్రభావం
అనూహ్యంగా పెరిగిన సిమెంటు ధరలు ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ రంగాలు రెండింటిపైనా తీవ్ర ప్రభావానే్న చూపుతున్నాయ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ‘అందరికీ ఇల్లు’ పథకం సిమెంటు ధరల ప్రభావానికి పూర్తిగా లోనైంది. ప్రస్తుతం ప్రభుత్వం అందజేసే 1.50 లక్షల రూపాయలకు మరో 2 లక్షల రూపాయలు వేసుకొని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని తలంచిన మధ్యతరగతి ప్రజల ఆశలపై పెరిగిన సిమెంటు ధరలు నీళ్లు చల్లుతున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చేపడుతున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్నీ సిమెంటు ధరలు దెబ్బతీస్తున్నాయ. అదేవిధంగా పోలవరం, హంద్రీ-నీవా, పెన్నా డెల్టా ఆధునీకరణ, మిషన్ కాకతీయ తదితర నీటిపారుదల రంగ పనులు కూడా సిమెంటు ధరల పెరుగుదలతో మందగించినట్లు కనిపిస్తున్నాయి. సిమెంటు ధరలు తగ్గాక పనుల్లో వేగం పుంజుకోవచ్చనే నెపంతో గుత్తేదారులు ప్రస్తుత పనుల్ని నత్తనడకన చేస్తున్నట్లు ప్రభుత్వాలకు ఫిర్యాదులు అందుతుండటమే దీనికి నిదర్శనం. ఇక గృహనిర్మాణ వ్యాపారాలు చేసేవారు ప్లాట్ల ధరలను పెంచక తప్పని పరిస్థితి. ప్రతి చదరపు మీటరుకు 50 నుండి 80 రూపాయల వరకు ధర పెంచక తప్పదని బిల్డర్లు చెబుతున్నారు. అంత పెంచితేగానీ పెరిగిన సిమెంటు ధరలతో తమకు ఎంతమాత్రం గిట్టుబాటు కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకు 5 మిలియన్ టన్నుల సిమెంటు డిమాండ్ ఉంటోంది. పెరిగిన ధరల కారణంగా సిమెంటు వ్యాపారాలు కూడా గత నెల రోజుల వ్యవధిలో కాస్త మందగించిన మాట వాస్తవమని సిమెంటు డిస్ట్రిబ్యూటర్లు కూడా చెబుతున్నారు. కాగా, గృహనిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది పరిస్థితి పెరిగిన ధరల వల్ల ఆందోళనకరంగా మారింది. గతంలో సిమెంటు కంపెనీలు ఇష్టారీతిగా ధరలు పెంచిన సమయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) చొరవ తీసుకొని సిమెంటు కంపెనీలకు సుమారు 6 వేల కోట్ల రూపాయల వరకు జరిమానా విధించింది. అయినా కంపెనీల ఆలోచనల్లో మార్పు మాత్రం రాలేదు. ఫలితంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, లేదంటే సిమెంటు కంపెనీలే తమ ఆలోచనను మార్చుకోవాలని లేనిపక్షంలో ఇతర దేశాల నుంచి సిమెంటు దిగుమతికి వెనుకాడబోమని ఇప్పటికే బిల్డర్లు హెచ్చరించారు. ఏదిఏమైనా ఈ సమస్య కేవలం బిల్డర్లకు మాత్రమే పరిమితం కాదని తెలుసుకొని వెంటనే ధరల స్థిరీకరణపై సిమెంటు కంపెనీలతో ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

విజయవాడ నుంచి
మళ్లీ మామిడి ఎగుమతులు?
విజయవాడ (రైల్వేస్టేషన్), ఏప్రిల్ 19: ప్రతి సంవత్సరం నూజివీడు నుంచి న్యూ ఆజాద్‌పూర్‌కు మామిడి ఎగుమతుల ద్వారా ఏప్రిల్, మే నెలలలో కోట్ల రూపాయల ఆదాయం విజయవాడ రైల్వే డివిజన్‌కు లభించేది. అటువంటిది నిరుడు నూజివీడుకు బదులుగా సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌లోని బోనకల్లుకు మామిడి లోడింగ్ తరలిపోయింది. దీంతో 2016లో విజయవాడ డివిజన్‌కు వచ్చే కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడింది. విజయవాడ నుంచి ఢిల్లీకి సమీపంలో ఉన్న న్యూ ఆజాద్‌పూర్‌కు మామిడి ఎగుమతులను 1986లో ప్రారంభించారు. 1995లో మొదటిసారిగా నూజివీడు నుంచే 18 వ్యాగన్లతో ఒక రేకుగా కలిపి ఎగుమతులు ప్రారంభించారు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ మాసాలలో మ్యాంగో మర్చంట్స్‌తో సమావేశం ఏర్పాటు చేసి వారికి అనుకూలంగా నూజివీడు నుంచి ఎగుమతులు ఆరంభించారు. దీంతో ప్రతి ఏటా కేవలం మే, జూన్ మాసాల్లోనే కోట్ల రూపాయల ఆదాయం విజయవాడకు వచ్చేది. 2013లో 24 రేకుల ద్వారా 27,807 టన్నులు ఎగుమతులకు గాను ఆదాయపరంగా 5,34,65,571 రూపాయలు, 2014లో 21 రేకులకు గాను 25,607 టన్నులు ఎగుమతికి 5,99,66,885 రూపాయలు, 2015లో 25 రేకులకు గాను 14,336 టన్నులు ఎగుమతి అవగా, 5,34,46,042 రూపాయల ఆదాయం సమకూరింది. 2016లో లోడింగ్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ డివిజన్‌కు తరలిపోవడంతో విజయవాడ డివిజన్‌కు వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. కాగా, తరలిపోయిన లోడింగ్ కేంద్రాన్ని తిరిగి విజయవాడకు తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం గత శనివారం మ్యాంగో ఎక్స్‌పోర్ట్ మర్చెంట్స్‌తో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు షిపాల్ భేటీ అయ్యారు. అలాగే మ్యాంగో మర్చెంట్స్‌తో సమావేశమై తిరిగి యథావిధిగా నూజివీడు నుంచి ఎగుమతులు చేయడానికి కావల్సిన విధానాన్ని ఏర్పాటు చేయాలని కమర్షియల్ ఇన్‌స్పెక్టర్లను షిపాలీ ఆదేశించారు. దీంతో కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ల బృందం మలో రెండు రోజులలో మర్చెంట్స్‌తో సమావేశం కానున్నారు. ఇదిలా ఉండగా మర్చెంట్స్‌లో కొంతమంది రేకులే కాకుడా విజయవాడ మీదుగా ఢిల్లీలోని న్యూ ఆజాద్‌పూర్‌కు వెళ్లే సూపర్‌ఫాస్ట్ రైళ్ల ద్వారా ఎగుమతులు చేసుకోవడానికి విపి(వెహికల్ పార్శిల్)ను విడిగా ఒకటి, రెండు కల్పించాలని కోరుతున్నారు.
భవిష్యత్‌లో సాంకేతికతదే కీలకపాత్ర
విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎండి మధుసూదన్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 19: భవిష్యత్‌లో సాంకేతిక పరిజ్ఞానమే కీలకపాత్ర పోషించబోతోందని స్టీల్ ప్లాంట్ సిఎండి పి మధుసూదన్ అన్నారు. ముంబయి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇండియా స్టీల్-2017 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ బుధవారం ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్‌లో విశాఖ స్టీల్ కూడా స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలోనే సిఎండి మాట్లాడారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బిరేంద్ర సింగ్ సందర్శించి ప్రశంసించారు.

దర్యాప్తు సంస్థలు అదేపనిలో ఉన్నాయ్

మాల్యాను భారత్‌కు తీసుకురావడంపై జైట్లీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకురావడానికి దర్యాప్తు సంస్థలు ఎంతగానో శ్రమిస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకుపైగా బకాయిపడి, వాటిని చెల్లించలేక లండన్‌కు పారిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత మాల్యాను మంగళవారం అక్కడ స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేసినది తెలిసిందే. తర్వాత వెంటనే బెయిల్ కూడా వచ్చినదీ విదితమే. ఈ క్రమంలోనే జైట్లీ ఇక్కడ బుధవారం స్పందిస్తూ మాల్యాను భారత్‌కు తీసుకురావడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలను చేస్తున్నామన్నారు. కాగా, అమెరికా పర్యటనకు వెళ్తున్న జైట్లీ.. అక్కడ హెచ్-1బి వీసాల అంశాన్ని ప్రస్తావనకు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వీసాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారతీయ ఐటి రంగ ఉద్యోగులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఐటి పరిశ్రమల సంఘం నాస్కామ్ అభిప్రాయపడింది.
ఉద్యోగ కోతలకు అవకాశం
హైదరాబాద్: అమెరికా ప్రభుత్వం హెచ్-1బి వీసాల జారీని కఠినతరం చేయడం వల్ల భారతీయ ఐటి రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, అనేక ఐటి కంపెనీలు ఉద్యోగాల కోతలకు దిగే వీలుందని పారిశ్రామిక సంఘం అసోచామ్ అంచనా వేసింది. అమెరికా హెచ్-1బి వీసాలను పొందుతున్నవారిలో 86 శాతం మంది భారత ఐటి నిపుణులేనని, దీంతో 60 శాతం వరకు వీరిని తగ్గించవచ్చని అసోచామ్ పేర్కొంది. కారణం అక్కడి వారినే నియమించుకోవాల్సి వస్తుండటమే నంది. కాగా, అమెరికా నుంచి చెల్లింపులు అందుకునే దేశాల్లో భారత్ రెండవ స్ధానంలో ఉంది. వీసాల కొత్త నిబంధనలతో ఈ చెల్లింపుల శాతం కూడా గణనీయంగా తగ్గుతుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ తెలిపారు.

‘న్యాక్’కు ప్రతిష్ఠాత్మక అవార్డు

దుబాయిలో స్వీకరించిన సంస్థ డైరెక్టర్ బిక్షపతి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 19: అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు-2017’ తెలంగాణకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) దక్కించుకుంది. దుబాయిలో బుధవారం జరిగిన వరల్డ్ కాంగ్రెస్ ఆన్ బిజినెస్ ఎక్సలెన్సీ అండ్ ఇన్నోవేషన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ బిక్షపతి ఈ అవార్డు అందుకున్నారు. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ సయిద్ అల్‌మక్తూం, దుబాయి సాంస్కృతిక మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ అవార్డును అందించారు. కాగా, ఈ అవార్డు తెలంగాణకు దక్కడం పట్ల రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.
యాప్ ఆఫ్ హైదరాబాద్‌కూ..
మరోవైపు హైదరాబాద్ పోలీసులు రూపొందించిన యాప్ ఆఫ్ హైదరాబాద్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కింది. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తరఫున అదనపు పోలీస్ కమిషనర్ (శాంతి,్భద్రతలు) వివి శ్రీనివాస్ రావు, జాయింట్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ ఈ అవార్డు అందుకున్నారు.
శ్రీసిటీని సందర్శించిన
చైనా ప్రభుత్వ ప్రతినిధులు
తడ, ఏప్రిల్ 19: తడలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన శ్రీసిటీ సెజ్‌ను బుధవారం చైనా ప్రభుత్వ ప్రతినిధుల బృందం సందర్శించింది. జియాన్స్ రాష్ట్రం వూజిన్ జిల్లాకు చెందిన ఎగ్జిక్యూటివ్ దయ్ షిప్ ఆధ్వర్యంలో విచ్చేసిన ఏడుగురు ప్రతినిధుల బృందానికి శ్రీసిటీ ఆపరేషన్ అధ్యక్షుడు సతీష్ కామత్ పరిశ్రమలోని వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతిని క్షుణ్ణంగా వివరించారు. అనంతరం శ్రీసిటీలోని మెట్రో రైళ్ల పరిశ్రమతోపాటు ఆల్‌స్టామ్ పరిశ్రమను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా దయ షిప్ మాట్లాడుతూ శ్రీసిటీలోని ప్రపంచ శ్రేణి వౌలిక వసతులు, స్నేహపూర్వక వ్యాపార వాతావరణం తమ బృందాన్ని ఎంతో ఆకట్టుకుందన్నారు. కాగా, వీరి పర్యటన తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

28న ఆహారోత్పత్తిలో
సాంకేతికతపై జాతీయ సదస్సు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 19: ఆహారోత్పత్తిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఎఫ్‌ట్యాప్సీ సహాయ సంచాలకుడు ఎల్ గిరిజాపతి అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో ‘ఆహార ఉత్పత్తుల రంగంలో నూతన ధోరణులు, వాణిజ్య అవకాశాలు’ అనే అంశంపై జాతీయ సదస్సును ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహార ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన తీసుకురావడం లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఫెడరేషన్ హౌజ్‌లో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.