శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చెల్లని చెక్కు కేసులో ఆరు నెలలు జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు లీగల్, ఏప్రిల్ 28: అప్పు జమ కింద చెల్లని చెక్కు ఇచ్చారని నమోదైన ప్రైవేటు కేసులో నిందితులు సయ్యద్ గౌస్, షబ్బీర్ అహ్మద్‌లపై ఆరోపణలు రుజువైనందున వారికి ఆరు నెలల వంతున జైలు శిక్ష విధిస్తూ మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు. అలాగే చెక్కుకు సంబంధించిన పైకం 9 లక్షల రూపాయలు నిందితులిద్దరూ ఫిర్యాదికి చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన ఫిర్యాది డివిడి భగవాన్ నుంచి నిందితులిద్దరూ 2013 జూలై 26న నాలుగున్నర లక్ష అప్పుగా తీసుకున్నారు. 2013 జూలై 30న దీనికి సంబంధించి బ్యాంక్ చెక్కును నిందితులు ఫిర్యాదికి ఇచ్చారు. దీనిని కలెక్షన్ నిమిత్తం బ్యాంకులో వేయగా అది చెల్లలేదు. దీనిపై ఫిర్యాది నిందితులిద్దరిపై సంబంధిత కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ అనంతరం న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

ఉసురు తీసిన కుళాయి ఘర్షణ
వరికుంటపాడు, ఏప్రిల్ 28: కుళాయి వద్ద జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి దారుణహత్యకు దారితీసింది. మండల పరిధిలోని ఇరువూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తూర్పుపాలెంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది. ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబసభ్యులు కుళాయి వద్ద ఘర్షణ పడటంతో చింతకుంట్ల సుబ్బారావు హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు గత రెండురోజుల క్రితం ఇరు కుటుంబసభ్యులు కుళాయి వద్ద ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో సుబ్బారావు గ్రామంలో లేకపోవడంతో మరుసటి రోజు గ్రామానికి వచ్చి మద్యం సేవించి ఘర్షణపడ్డ కుటుంబంతో గొడవకు దిగాడు. వారిని తిడుతూ బెదరించడంతో ముద్దాయిలు ఐతా అండ్రయ్య, చింతకుంట్ల సునీల్ ఆవేశంలో గొడ్డలితో సుబ్బారావు తలపై మోదగా, ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని స్థానిక సిఐ రమణ, ఎస్‌ఐ ముత్యాలరావు పరిశీలించారు. శవానికి పంచనామా నిర్వహించి బంధువులకు అప్పచెప్పారు. ముద్దాయిలను కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు.

ఆదాయ వనరుల పెంపుపై దృష్టి
* దక్షిణ మధ్య రైల్వే డిఆర్‌ఎం వెల్లడి
సూళ్లూరుపేట, ఏప్రిల్ 28: దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లో ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డిఆర్‌ఎం నవీన్ గులాటి వెల్లడించారు. శుక్రవారం ఆయన చెన్నై నుంచి సూళ్లూరుపేటకు ప్రత్యేక రైలులో చేరుకొన్నారు. రైల్వే స్టేషన్‌లోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్‌లోని ముఖ్య విభాగాలైన సిగ్నల్ కంట్రోల్ రూమ్, టికెట్ బుకింగ్ కౌంటర్, వైద్యశాల, ప్రయాణీకుల విశ్రాంతి గదులను పరిశీలించి అక్కడ వసతులను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టామని, ఆ దిశగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల కోరిక మేరకు రైల్వేస్టేషన్ తూర్పు వైపున మరో టికెట్ బుకింగ్ ఏర్పాటు చేసేందుకు పరిశీలనలో ఉందని వెల్లడించారు. స్థానికంగా ఉన్న వర్తకులు ఆయన దగ్గరకు వెళ్లి ఇక్కడ వసతులు, కావాల్సిన రైళ్లపై వినతిపత్రం అందజేసి పరిశీలించాలని కోరారు. వెంటనే ఆయన స్పందించి తాను కొత్తగా బాధ్యతలు చేపట్టానని, ఈ ప్రాంతంపై అంత అవగాహన లేదని, అధికారులతో చర్చించి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఎప్పుడూ మూసివేసి ఉండే మరుగుడొడ్లు, ప్రయాణికుల విశ్రాంతి గదులు డిఆర్‌ఎం తనిఖీ నిమిత్తం వస్తారని తెలియగానే స్థానిక అధికారులు హుటాహుటిన వాటి తలుపులు తెరిచి శుభ్రం చేయడం తదితర మెరుగులు చేయడం విశేషం. ఏడాది పొడవునా తెరిచి ఉండే విధంగా మరుగుదొడ్లు తెరిచి ఉండటాన్ని చూసి అక్కడ ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డిటి ప్రతిభాయాదవ్, కో ఆర్డినేటర్ చలం, సీనియర్ డిఇఎన్.రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.