నెల్లూరు

పెళ్లిళ్ల పేరయ్య (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది మే నెల రెండోవారం మధ్యాహ్నం మూడుదాటి ముఫ్పై నిమిషాలు అవుతోంది.
నెల్లూరు సౌత్ స్టేషన్ రెండు ప్లాట్‌ఫారాలు ఎండకొలిమిలో కాలిపోతుండటంతో మెమూ ట్రైన్‌కు టిక్కెట్టు కొన్న ప్రయాణీకులు అట్టే ప్లాట్‌ఫారాల వైపునకు వెళ్ళలేక చిన్న నీడ కోసం సైతం పరుగులు తీస్తూ ఉండటంతో ప్లాట్‌ఫారాలు రెండూ చూసే దానికి ఖాళీగానే కన్పిస్తూన్నాయి.
టిక్కెట్టు కౌంటర్‌లో సూళ్ళూరుపేటకు టిక్కెట్టు తీసుకున్న నేను ముఖానికి దట్టంగా పట్టిన చెమటను చేతిరుమాలుతో తుడుచుకుంటూ బయటకు వచ్చి మెట్టుకు ఒక మూలగా ఉన్న నీడలో నిల్చుని ప్లాట్‌ఫారాల వైపు పరికించి చూస్తూన్నాను ఎక్కడైనా కూర్చోవడానికి వీలుందేమోనని.
నెల్లూరు టౌన్‌హాలు నందు ఉదయం జరిగిన పుస్తకావిష్కరణ, కవి సమ్మేళనం కొరకు పెరసం మిత్రుల నుండి ఆహ్వానం అందుకున్న నేను ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నాను, ఒంటిగంటకే పూర్తవుతుందనుకున్న కార్యక్రమాలు దాదాపు రెండుకుపైగా జరగడంతో, ఉదయం వేసుకున్న ప్రయాణపు షెడ్యూల్ని మార్చుకుని ఇలా మెమూ ట్రైన్‌కు సూళ్ళూరుపేట వెళ్ళేందుకు సిద్ధమైనాను నేను.
ఎండలు ఏయేడుకాయేడు పెరుగుతూనే ఉన్నాయి. ఇలా అయితే ఎలా బ్రతకాలని, ఈ భూమీద మనుసులో గొణుగుతూ తనలో తనే మాట్లాడుకుంటున్నాడు నాకు అటు ప్రక్కగా నిలబడ్డ ఓ పల్లెటూరి మధ్య వయస్కుడు.
ఆ మాటలకు నేను అతని వైపు తిరిగి చూస్తూ ఓ చిరునవ్వు నవ్వి ఇంకో పది సంవత్సరాల తర్వాత మే నెలలో మనిషి తిరగాలంటే ఎ.సి. మిషన్ తగిలించుకోవల్సిందిలే అనుకుంటూ... అక్కడ నుండి ముందుకు కదిలాను.
టౌన్‌హాలు నుండి వస్తూ తాగిన నీళ్ళు ఎప్పుడో ఆవిరైన గుర్తుగా నాలుక పిడచకట్టుకపోతోంది. తల తిరుగుతున్నట్టు అనిపించి ఎడమవైపు దూరానున్న కానుగ చెట్టు నీడలోని సిమెంటు బెంచీలవైపు చూస్తూ వడివడిగా అడుగులేస్తున్నాను, ముఖానికి పూర్తిగా ఎండ తగలకుండా కొంచమైనా ఆపుకోవాలనే ఆతృతతో చేతిలోని ఆంధ్రభూమి దినపత్రికను అడ్డుపెట్టుకుంటూ.
చొక్కాజేబులోని సెల్‌ఫోను రింగవుతోంది, ఖచ్చితంగా మా అమ్మే చేసుంటుంది అనుకుని...
ఫోను తీసి ‘హలో అమ్మా!’ అన్నాను.
‘ఏమండీ! నేను..’
అవతలివైపు నా శ్రీమతి గొంతు.
ఎక్కడున్నావంటూ... ‘ఇంటికి బయలుదేరావా! లేదా!’ అని అడిగింది.
‘లేదు.. లేదు...’
నేను సూళ్ళూరుపేట వెళ్తున్నాను, నా ఫ్రెండ్‌కు యాక్సిడెంట్ అయ్యిందని టౌన్‌హాలులో మరొక మిత్రుడు చెప్పాడు.
‘అయ్యో! పాపం ప్రమాదమేమి లేదుగా?’ కంగారు పడుతూ ఆతృతగా అడిగింది నా శ్రీమతి.
‘ప్రమాదమేమి లేదంట, రేపైతే ఆఫీసుకెళ్ళాలి కదా! ఈరోజే చూసి పలకరించొస్తా’నని చెప్పి ఫోను పెట్టేశాను.
వెళ్ళి సిమెంటు బెంచీపై నీడలో కూర్చొని చేతిలోని బ్యాగ్‌ను బెంచీపై పెడదామని ప్రక్కకు చూస్తే ఓ అవ్వ తన పల్లీల బుట్టను ఉంచి పల్లీలు అమ్ముకుంటోంది, వయస్సు ఎనభై సంవత్సరాలలోపు ఉండొచ్చు. ఎప్పుడో అన్నం తిన్నదానిలా బక్కచిక్కిన శరీరం, ఆ శరీరానికి ఆచ్ఛాదనంలా చెమటకు తడిచి ముద్దై బాగా మాసిన చీరలాగా ఉండే ఓ గుడ్డ, కళ్ళు ఎక్కడికో లాగేసినట్టు, సన్నని పుల్లల్లాంటి రెండు చేతులు ఓ మనిషిలాంటి ఆకారం ఆ అవ్వది.
అయ్యో! పాపం ఈ వయస్సులో ఇలా ఎండకు, గాలికి ఎంత కష్టం, ఎవరూ లేరనుకుంటా!
ఆ... అందరూ ఉండి కూడా ఈనాడు ముసలివాళ్లు దిక్కులేని వాళ్లలా అనాధాశ్రమాల్లో జీవితాల్ని వెళ్లదీయడం లేదూ..., ఏమిటో.. ఈ కలికాలం, ఐనా ఆకలికి చిన్నా, పెద్దా, ముసలి ముతకా తేడా ఉంటుందా! ఏమిటీ?
బ్యాగును నా ఒళ్ళోనే ఉంచుకొని బ్యాగు జిప్ ఓపెన్ చేసి ఉదయం కవి సమ్మేళనంలో చదివి వినిపించిన కవితున్న పేపర్ని చేతిలోకి తీసుకొని కవిత పంక్తుల వెంబడి నా చూపును వేగంగా మరల్చాను.
ఇంతకుముందు చాలా కవితలు టౌన్‌హాలులో చదివి వినిపించినా, ఈరోజు చదివిన కవితకు ప్రేక్షకులు తమ కరతాళధ్వనులతో అభినందనలు తెలియజేస్తూ, మిగతా కవులు కరచాలనం చేసి చాలా బాగుందని చెప్పడంతో నేను పొందిన అనుభూతితో మనస్సు ఎంతో పులకించి పోయింది. చిన్న చిన్న కవితలు, కథలు రాసే నాలాంటి వారికి ఇంతకంటే కాంప్లిమెంట్స్ ఇంకేం కావాలి.
‘సార్!’ అన్న పిలుపుతో కవితా లోకం నుండి బయటకొచ్చిన నాకు ఇవిగో ఫొటోలు మీరూ చూడండంటూ! బలవంతంగా నా చేతిలో కొన్ని ఫొటోలు పెట్టాడో డొక్కపల్చటి వ్యక్తి.
తలెత్తి నాకు ఇంకోవైపున్న బెంచీవైపు చూస్తే జనాల గుంపు, నా చేతిలో ఫొటోలు పెట్టిన వ్యక్తి బెంచీపై ఉన్న తన నల్లటి బ్యాగులో నుంచి చేతినిండా మరికొన్ని ఫొటోలు తీసుకొని తన చుట్టూ వున్న జనాలకు అడిగి మరీ ఇస్తున్నాడు.
నాకైతే ఈ తంతేమీ అర్థం కాలేదు. ఈ ఫొటోలేంటి? ఇలా ఎందుకిస్తున్నట్టు? ఇందులో ఉండేది ఎవరు? అసలు ఇతనెవరు?
ఇలా అనేక ప్రశ్నలు నన్ను చుట్టుముట్టాయి.
అందరికి ఫొటోలిచ్చిన పెద్ద మనిషి తాపీగా తన బ్యాగు ప్రక్కగా కూర్చొని, లాల్చి జేబు నుండి సిగరెట్టు తీసి తాపీగా ముట్టించి ఊపిరి పీల్చుకున్నాడు, తను చేయాల్సిన పనిలో కొంత పూర్తయ్యిందనే గుర్తుగా.
నా బుర్రలో పుట్టిన ప్రశ్నలన్నింటిని పసిగట్టిన వాడులా ఆ గుంపులోంచి ఒక వ్యక్తి వేగంగా నా దగ్గరకొచ్చి, ఇవి పెళ్ళి కావాల్సిన అమ్మాయిల ఫొటోలు, ఇతను పెళ్ళిళ్ళ పేరయ్య. చాలా మంచోడు, పరిచయస్థుడే. అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కుదిర్చిన అనుభవమున్న ఈ ఏరియావాడు, మనోడంటూ, నేను అడగకనే గడగడా అన్నీ అప్పజెప్పి మరలా గుంపులో కల్సిపోయాడు.
సిగరెట్టు వెలిగించి ఒక దమ్ము గట్టిగా లాగి వేగంగా పొగను గాల్లోకి వదులుతూ..., మీకిచ్చిన ఫొటోల్లోని అమ్మాయిలు అందగత్తెలు అనేకన్నా అప్సరసలు అనొచ్చు, ఫొటోలు వెనుకవైపు వాళ్ళ చదువు, వివరాలు, అడ్రసుతోసహా ఫోన్ నెంబర్లు ఉన్నవి చెబుతూ, మధ్యలో మరో సిగరెట్టు దమ్ము లాగాడు ఆ పెద్దమనిషి.
ఆశ్చర్యమేసింది నాకు,
ఏంటితను? పెళ్లి కావాల్సిన అమ్మాయిల ఫొటోల్ని ఇలా..., పుట్టినరోజున చాక్లెట్స్ పంచిపెట్టినట్టు, వీళ్లేమన్నా సెలబ్రెటీసా!, ఇలా గుంపులో తలొకటి పంచేదానికి, ఎంత పెళ్ళిళ్ళ పేరయ్య అయితే మాత్రం దానికీ ఓ పద్ధతీ పాడూ ఉన్నాయి కదా!
ఆ దినాల్లో పెళ్ళిచూపులు, పెళ్ళితంతు సంప్రదాయబద్దంగా, సంస్కారవంతంగా జరిగేవి, అందుకే పది కాలాలపాటు పచ్చగా ఆ సంసారాలు సాగిపోయేవి, మరి ఈ రోజుల్లో పెళ్ళిచూపులు, పెళ్ళిళ్ళు నెట్, ఆన్‌లైన్లు జరిపిస్తున్నాయి కనుకనే మూడుముళ్ళు మూడునాళ్ళ ముచ్చటై సంసారాలు చట్టుబండలై కోర్టుగుమ్మాలకు వ్రేలాడుతున్నాయి.
నాకెందుకో ఈ తంతంతా గజిబిజి గందరగోళంగా అనిపించి గుంపువైపు దృష్టి సారించాను.
నేను అడగకనే పెళ్ళిళ్ళ పేరయ్య గురించి మంచిగా చెప్పిన వ్యక్తి గుంపులోని జనాలకు అలాగే చెప్పడం నేను గమనించకపోలేదు.
టైం నాలుగుదాటి పది నిమిషాలౌతోంది.
సూర్య భగవానుడి కోపానికి తట్టుకోలేక ఎక్కడెక్కడో సేదతీరిన ప్రయాణికులు అప్పుడప్పుడే ప్లాట్‌ఫారాలపైకి వస్తూ ఉండటంతో పిల్లల అరుపులు, పెద్దవాళ్ళు చేసే హడావుడితో ప్లాట్‌ఫారాలుపై సందడి నెలకొన్నాయి.
ఈ ఫొటోలోని అమ్మాయి చాలా బాగుంది నాకు నచ్చిందని తనూ నాలాగే ప్రయవేట్ కాలేజిలో లెక్చరర్‌ని ఓ గొంతు గుంపు నుండి పెద్దగా అరవడంతో అటువైపు వేగంగా నా చూపు మళ్ళింది.
అంతగా నీకు నచ్చితే మూడువందలు ఇచ్చి ఆ ఫొటో తీసుకో..అని ఆ పెద్దమనిషి అనీ అనగానే అతను ఆ డబ్బు చెల్లించి ఫొటో తీసుకోవడం, ఆ వెంటనే అక్కడున్న పదిహేను, ఇరవైమంది వరకు వాళ్ళకు కావల్సిన రిక్వైర్‌మెంట్ ప్రకారం ఉన్న ఫొటోలన్నిటిని గ్రేడింగ్ చేసి డబ్బులు చెల్లించి తీసుకోవడం వెంటవెంటనే జరిగిపోయింది.
నా చేతికి బలవంతంగా ఇచ్చిన ఫొటోల్ని నాకెందుకో చూడాలనిపించక అలానే పట్టుకొని...
మీరు పెళ్ళిళ్ళ పేరయ్య అంటున్నారు, మరి అలాంటిది డబ్బులుకు బేరంపెట్టి ఫొటోల్ని ఇలా ఇచ్చేస్తున్నారేంటి? మీరేకదా! మధ్యవర్తిగా ఉండి ఈ సంబంధాల్ని కలపాలి? మరి ఇదేంటి? ఇలా! పెళ్ళి కావాల్సిన పరాయి అమ్మాయిల ఫొటోల్ని రైల్వేప్లాటుఫారాలపై ప్రదర్శనకు పెడతారా?’ అంటూ గట్టిగా నిలదీస్తున్నట్టడిగాను ఆ పెద్దమనిషిని.
కాలు మీద కాలేసుకొని తాను చేయాల్సిన పని విజయవంతంగా పూర్తవుతున్నందుకు సంతోషంతో ఫొటోలివ్వగా వచ్చిన ఆ డబ్బును తాపీగా లెక్కపెడుతూన్న పెళ్ళిళ్ళ పేరయ్యకు ఒక్కసారిగా నా మాటలు శూలాల్లా తగిలి, కళ్ళల్లో భయాన్ని, ముఖాన చెమటను పుట్టించాయి, సాఫీగా జరుగుతున్న పనికి అంతరాయం ఏర్పడబోతున్నందుకు భయంతో.,
‘‘అయినా తమాయించుకొని ఇప్పటిదాకా వందకుపైగా పెళ్ళిళ్ళు కుదిర్చాను’’.. అన్నాడు లేని ధైర్యాన్ని కూడగట్టుకుంటూ.
‘‘ఏంది?, ఇలానా, నడిరోడ్లపై ఫొటోలు అమ్మి కుదిర్చారా! పెళ్ళిళ్ళు? పెద్ద పెళ్ళిళ్ళ పేరయ్య దిగొచ్చాడయ్యా బోడి’’ అంటూ గయ్యిన అతనిపైకి లంఘించింది ఓ పెద్దావిడ అతని మాటలకు అడ్డుతగులుతూ.
‘‘ఆ..., అవును లేకుంటే వందల మంది అమ్మాయిల ఫొటోల్ని వాళ్ళ తల్లిదండ్రులు నాకెందుకిస్తారు, ఖచ్చితంగా తగిన సంబంధాలు వెతికిపెడతాననేకదా!’’ భయపడుతూ మాటల్ని ఒత్తి ఒత్తి పలికాడతను.
నాకెందుకో మొదటినుండి అతని ప్రవర్తన, మాటతీరు, ఫొటోల్ని పంచడం అనుమానస్పదంగా తోచి అతన్ని నిశితంగా గమనించసాగాను.
మెమూట్రైన్ ఇంకో ఇరవై నిమిషాల్లో వస్తుందని తెల్సుకున్న ప్రయాణికులు, వారివారి లగేజీలతో ప్లాట్‌ఫారంపై చీమల్లా బారులు తీరి నిలబడుతున్నారు.
వెనుకనుండి ఎవరో తట్టినట్టనిపించి తిరిగి చూశాను, నా కాలేజి మిత్రుడు ఎస్.బి.ఐ.లో సీనియర్ అకౌంటెంట్‌గా పని చేస్తూ నెల్లూరులో స్థిరపడ్డాడు, ఏమిట్రా ఇక్కడున్నావంటూ! నా పక్కనొచ్చి కూర్చొని కుశల ప్రశ్నల అనంతరం ఎవరివీ ఫొటోలు అంటూ తీసుకొని చూడసాగాడు.
అప్పటివరకు అక్కడ జరిగిన విషయమంతా వాడికి చెబుతూ, పెళ్ళిళ్ళ పేరయ్య హడావుడిగా తన బ్యాగును సర్దుకోవడం, మొదటిసారిగా డబ్బులిచ్చి ఫొటో తీసుకున్న తను, మరియు పెళ్ళిళ్ళ పేరయ్య గూర్చి మంచిగా చెప్పిన వ్యక్తి గుంపులోని జనాల దగ్గర మిగిలున్న ఫొటోల్ని ఆదరాబాదరా దండుకోవడం గమనిస్తూనే ఉన్నాను.
ఫొటోలు చూస్తున్న నా స్నేహితుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ బిగ్గరగా ‘‘ఈ ఫొటోలు మా బాబాయి కూతురిది. రెండేళ్ళ క్రితమే పెళ్ళై పిల్లలు కూడా. ఇప్పుడు అమెరికాలో ఉంటోంది. ఇతని దగ్గర ఈ ఫొటో ఎందుకుంది? ఎవరిచ్చారు? ఇతను కాదే మా చెల్లెలికు పెళ్ళి సంబంధం కుదిర్చిన పెళ్ళిళ్ళ పేరయ్య’’ అంటూ సంభ్రమాశ్చర్యంతో, అనుమానంగా అతన్ని గట్టిగా నిలదీయడంతో, భయంతో పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. అక్కడున్న జనాల గుంపు గద్దించి అడగడంతోటే అసలు విషయం బయట పెట్టాడు.
‘‘తిరుపతి రైల్వేస్టేషన్లో ఈ బ్యాగును దొంగిలించామని, అందులో ఈ ఫొటోలు, వాటెనకున్న వివరాలను బట్టి వీళ్ళందరూ పెళ్ళి కావాల్సిన అమ్మాయిలేనని, వీటిని మేము డబ్బులకు ఇస్తున్నామని’’ చెబుతూ పారిపోవడానికి ప్రయత్నించగా,.
అప్పటికే అక్కడికి వచ్చిన పోలీసులు వాళ్ళను చూసి ‘‘వీళ్ళా!, వీళ్ళ ముగ్గురిమీద చైన్‌స్నాచింగ్, పిక్‌పాకెట్, ట్రైన్లో ప్రయాణీకుల బ్యాగులు, నగల చోరి చాలా కేసులున్నాయంటూ, పదండ్రా పోలీసు స్టేషన్’’కంటూ లాక్కెళ్ళారా ముగ్గురిని.
ఎన్నో రకాల దొంగతనాలు, మోసాలను గూర్చి నిత్యం పేపర్లో చదువుతూ ఉంటాం, వింటూనే ఉంటాం, అయినా! మోసపోయే జనాలున్నంత కాలం మోసం చేసే వ్యక్తులు పుట్టుకొస్తారేమో ననుకుంటూ ప్లాట్‌ఫారమ్‌పై ఆగివున్న ట్రైనెక్కి కూర్చొన్నానే్నను.

- జడపల్లె మాధవాస్సుధ, చరవాణి : 9492935005

స్పందన

నిర్ణయం కథ బాగుంది
గత వారం మెరుపులో కటారి రామయ్య గారు రాసిన నిర్ణయం కథ బాగుంది. చెప్పదలచుకున్న విషయాన్ని చాలా స్పష్టం పాఠకులకు చేరేలా రచయిత కథను అందించిన విధం బాగుంది. రమేష్, అతని తల్లిదండ్రుల మధ్య సంభాషణలు ఆసక్తిగా సాగాయి. వ్యవసాయంలో ఆటుపోట్లు బాగా వివరించారు. చివరకు రమేష్ తన కష్టపడి చదువుకుని తన కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకోవడం బాగుంది. మంచి కథను అందించిన రచయితకు అభినందనలు.
- అనురాధ చంద్రశేఖర్, బుచ్చిరెడ్డిపాళెం
కార్టూన్లు బాగున్నాయి
రామ్‌శేషు గారు వేసిన రెండు కార్టూన్లూ బాగా నవ్వు తెప్పించాయి. రెండు కార్టూన్లు మంచి సందేశాన్ని కూడా అందించాయి.
- పూసల సంజీవయ్య, నాయుడుపేట
- లలితమ్మ, మదనపల్లె
శ్రీశ్రీ కవితలు బాగున్నాయి
గతవారం మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా ప్రచురించిన కవితలు బాగున్నాయి. నా కళ్లు వెతుకున్నాయి కవిత ఎంతో చైతన్యవంతంగా సాగింది. రచయిత్రి సుభద్రాదేవి గారికి అభినందనలు. అలాగే లలిత గారి కవిత కూడా శ్రీశ్రీ గొప్పతనాన్ని చాటింది.
- గడ్డం హేమంతకుమార్, తిరుపతి
- చంద్రశేఖర్, ఒంగోలు
కృషితో నాస్తి దుర్భిక్షం సూపర్
రచయిత కొడవలూరు ప్రసాద్ గారు రాసిన గొప్ప కృషితో నాస్తి దుర్భిక్షం కవిత బాగుంది. విద్యార్థులను ప్రోత్సహించేలా మంచి కవితను అందించిన రచయితకు అభినందనలు.
- అయినాబత్తుల ఘనశ్యాం, కనిగిరి

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

చల్లగా...
చల్ల చేద్దామని మెల్లగా చల్లకుండ దగ్గరకెళ్లగా
అందులో నీ ఉన్నావేమోనని భయమేసింది
కవ్వపు దెబ్బలకు
నీవు తాళలేవు కదా! అని తలచి,
చల్ల చిలకటం మొదలుబెట్టి
అలా కవ్వాన్ని నే తిప్పుతూంటే..
కవ్వానికి చుట్టిన తాడులా..నను చుట్టుకొని
ఏదో తెలియని పులకింత..గిలిగింత..
ఆగి చూచునంతలో..
నీ ఉన్న ఆనవాలే కన్పించవాయె
మైమరపులో చల్లకుండ పగిలితే..
ఓయమ్మో.. ఇంకేముంది?
నీవు వెన్నకోసం రావనే భయం ఒకపక్క
అత్తగారి చీవాట్లు భయం మరోపక్క...
అయినా.. ఎంతకీ మనసు మనసులో
ఉండదాయె
వెన్న ముద్దలో కలసిన తెల్లనయ్య
అరచేతి వెచ్చదనానికి కరగిపోతుంటే..
తెలియని బాధనన్నావరిస్తుంది
మనసును, ప్రేమను బాధ తొలిచేస్తుంది
అంతలోనే నేనున్నానంటూ..
నా కనులు మూసి దొంగాటలు ఆడుతుంటే
పోతున్న ఊపిరి తిరిగొచ్చి
అడుగో కృష్ణయ్యననుకుంటూ..మోము పైకెత్త
నవ్వు మోమున చిరునవ్వై..
సిగ్గులు మొగ్గతొడుగ
బుగ్గ గిల్లి చల్లగా జారుకొనె
నా పెదాలకు తన పెదవుల వెన్నపూసిపోగా
ఆ అమృతాన్ని అద్దమున చూడగా
ఎచ్చటా కానరాదాయె నోయమ్మా
ముచ్చటేసి మురిసిపోతిని కదమ్మా..
అదే కదా! కృష్ణమాయ, కృష్ణప్రేమ..

- నాదెండ్ల జ్వాలా
ఉమామహేశ్వరశర్మ
అల్లూరు. చరవాణి : 9908101646

యదార్థం
గతమా! ఎందుకలా చూస్తున్నావ్?
వర్థమాన శిఖరమెక్కి
నిన్ను మరచిపోయాననా?
నేను నిన్ను మరచిపోయినా
నువ్వు వర్తమానానికి
నా ఫైలుని అందిస్తున్నావుగా!
అబ్బా! బాధలు పెట్టావ్, సుఖపెట్టావ్
సర్లే! నీతో నాకేంటి పని అని
వదిలేద్దామనుకున్నా
నీ హృదయ కుహరంలో
నా జ్ఞాపకాల నిధులు కలవా?
గడిచిన జీవితానివి!
దాచడానికి నీవేమైనా చాక్లెట్‌వా?
నా గురించి అందరికీ
తెలియచెప్పే సెర్చ్‌లైట్‌వి
నేనెంత ఉన్నతిలో ఉన్నా నీ మూలాలు లోతైనవి
నీవు నేర్పిన పాఠాలు నన్ను నడిపించే మార్గాలు
నిన్ను హీనంగా చూస్తే మాత్రం...
వర్తమానం ఊరుకుంటుందా?
నా గమనాన్ని నిరోధించి భవిష్యత్తుకు
బ్రేకులేయదా?...
కాలచక్రంలో నిమిత్తమాత్రున్ని...
ఇది యదార్థం...

-చావలి శేషాద్రి సోమయాజులు
చరవాణి: 9032496575

విజయసోపానం
గత కాలపు రోజులు స్వర్ణయుగంది
జరిగే కాలపురోజులు మొక్కుబడివి
జరగబోయే కాలపురోజులు స్పష్టత
అనుకోనేవాళ్లకు జవాబు
విజయం సాధించినవాళ్ల అనుభవాలు
పరాజయం పొందినవాళ్లు పునః ప్రయత్నంలో
విజయకేతనం ఎగురవేస్తే వాళ్ల ఆనందం వర్ణణాతీతం
ఒక్కసారికే విజయం పొందితే ఆ కిక్కే వేరు
ఆ అనుభూతి అందరికి రాదుగా,
నిరాశ అనేది పాతాళానికి తీసేస్తే,
ఆశ ఎదురుచూపులకు, సహనానికి
ప్రతీక అవుతుంది
అదిగో, అప్పుడే నిన్ను నీవు ఆవిష్కరించుకోగలవు
పదిమందికి ‘ఆసరా’ గా ఉండిపోవాలి
అవసరమైన వారికి వారధిగా ఉండాలి
అభివృద్ధికి ‘చేయూత’నివ్వాలి
క్షణం చాలు తప్పించుకోవడానికి
కాని ప్రతిక్షణం విలువైనదిగా ఉంటుంది
అందుబాటులో ఉండడటానికి
చేసే ప్రతి ప్రయత్నం
విజయసోపానానికి దారితీస్తుంది..!

- శ్రీకంటి (సుబ్బారావు)
చరవాణి : 9441685812

అర్థంకాని
కవిత
రాసిన కవితలెన్నున్నా
ఎన్నుకోలేకున్నాను
మంచిగ విత్తుని
మొలకెత్తేందుకు
పాతేందుకు
సంకలనాల్లో
చెల్లని మంచులో
కుళ్ళని కవితాశవంలో
నిలుచున్నది ....
సజీవ సాహిత్యం
పూడ్చివేయబడి యుండొచ్చు
పునరుత్థానం కోసం
ఎదురుచూస్తూ వుండొచ్చు
అది అందరికి
అర్థంకాకపోవచ్చు!

- జి. సందిత, బెంగళూరు
సెల్: 9703316760

చిరుకవితలు

దోపిడి
సహజ వనరులను దోచుకోవడం
ఆర్థిక వనరులను లూటీ చేయడం
డబ్బులుంటే మరింత ప్రేమ
అభివృద్ధి పనులలో కమీషను,
సెటిల్‌మెంట్లు, మద్యం సిండికేట్లు
ఇసుకమాఫియా, రిసార్టులు,
విద్యాసంస్థల ఏర్పాటు
మామూళ్లు, వసూళ్లు, కాసుల బేరం
బినామీ పేర్లు, భూకబ్జా,
స్థలాల పొలాల వివాదాలలో తలదూర్చి
వాటిని స్వాహా చేయడం
నామినేట్ పదవులలో చేతివాటం
సొంత సామాజికవర్గమంటే ప్రేమ
ఎమ్మెల్యేయే సంస్థానాదీశుడు
నియోజకవర్గమే వారి సామ్రాజ్యం
ఆధునిక సంస్థానాదీశులు
దోపిడీ అంటే దోపిడీ

- బాలాజి డనీయల్,
రామకుప్పం, చిత్తూరుజిల్లా

పాపం వ్యవసాయం!
పచ్చని పొలాల మధ్య
‘వ్యవసాయం’ అనే
గోవు పచ్చిక మేస్తూ వుంది
పక్కన పొదల్లో చదువులు ,
ఉద్యోగాలు, వ్యాపారాలు,
రాజకీయాలు అనే పులులు
పొంచి, పొంచి చూస్తున్నాయి
బక్కచిక్కిన ఆవు ఎంతకాలం
బతికి బట్టకడుతుందో?

- గంగిశెట్టి శివకుమార్,
చరవాణి : 9441895343

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- జడపల్లె మాధవాస్సుధ