శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వేడుకగా శ్రీకృష్ణుని లీలా శోభాయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కల్చరల్, ఆగస్టు 15: గోకులంలో శ్రీకృష్ణుని లీలల శోభాయాత్ర నగరంలో మంగళవారం ఘనంగా సాగింది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్, శ్రీరంగ కోలాట భజన మండలి ఆధ్వర్యంలో యాత్ర వైభవంగా నిర్వహించారు. స్థానిక గుండాల ఆంజనేయుల కల్యాణ మండపం నుంచి విఆర్‌సి సెంటర్ వరకు శోభాయాత్ర సాగింది. యాత్రలో కోలాట భజన మండలి బృందం నిర్వహించిన భజన కార్యక్రమాలు, చిన్నారులు వేసిన రాధాకృష్ణుల వేషధారణలు ఎంతగానో అలరించాయి. యాత్ర సాగుతున్నంత వరకు భక్తిశోభ సంతరించుకుంది. భక్తులు ఆలపించిన రాధాకృష్ణుల నామాలతో నగరం మార్మోగింది. యాత్రకు ముఖ్య అతిధులుగా సూర్య ప్రకాశనంద నవముఖ దుర్గాదేవి యోగీశ్వర శ్రీ సరస్వతి స్వామి పాల్గొన్నారు. విఆర్‌సి మైదానానికి యాత్ర చేరుకోవడంతో అక్కడే వేషధారణలో ఉన్న భక్తులు చేసిన నృత్యాలు చేస్తూ పరవశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బిజెపి జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకులు మెంటా రామ్మోహనరావు మాట్లాడారు. లోక కల్యాణార్థం అప్పట్లో శ్రీకృష్ణ భగవానుడు అనేక లీలలు ప్రదర్శించారన్నారు. గోకులంలో చేసిన లీలలు అద్భుతమన్నారు. శ్రీకృష్ణతత్వాన్ని ప్రతిఒక్కరు తెలుసుకోవాలన్నారు. ప్రతిఏటా శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రతిఒక్కరు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. భక్తులు భక్తిమార్గంలో సేవాదృక్పథంతో జీవించాలన్నారు. అనంతరం భక్తులకు నెమలి పించం, తిరునామాలు, అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మిడతల రమేష్, డాక్టర్ ఎం.విజయలక్ష్మి, తేలపల్లి రాఘవయ్య, విశ్వహిందూ పరిషత్ నేతలు మిద్దే శ్రీనివాసులు, పాదర్తి బాలాజీ, మాలారెడ్డి, శశి, మదన్ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
నెల్లూరు కల్చరల్, ఆగస్టు 15: కృష్ణాష్టమిని భక్తులు మంగళవారం వైభవోపేతంగా జరిగాయి. ఉత్సవాలను రెండోరోజు కూడా భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం మూలాపేటలోని వేణుగోపాల స్వామి దేవస్థానం, కామాటివీధిలోని సంతాన బాలగోపాలస్వామి ఆలయం, ఉస్మాన్ సాహెబ్‌పేటలోని కోదండరామ స్వామి ఆలయం, శాంతినగర్‌లోని శివకేశవుల దేవస్థానం, ఎన్జీవో కాలనీలోని కృష్ణమందిరం, నవాబుపేటలోని మల్లేశ్వరాలయం, పప్పులవీధిలోని మహాలక్ష్మి ఆలయం తదితర ఆలయాలలో శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆ ఆలయాలలో ఉదయం నుంచే అర్చకులు విశేషంగా అభిషేకాలు, పూజలను నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ, శేషవాహన సేవ, కోలాటాలు, డప్పుల వాయిద్యాలు, నృత్య ప్రదర్శనలు, ఉట్టి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శివకేశవుల దేవస్థానంలో కలశపూజ, పూర్ణ్భాషేకం, కోదండరామ స్వామి ఆలయంలో గణపతి పూజ, గోపూజ, శ్రీకృష్ణునికి లక్ష తులసీ దళార్చన, మల్లేశ్వర ఆలయంలో సామూహిక లలిత సహస్రనామార్చన తదితర కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం పలు ఆలయాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలతో ఆలయాల వద్ద దర్శనమిచ్చారు. వేషధారణల్లో ఉన్న పలువురు చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఎంతో అలరించాయి. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇస్కాన్ ఆలయంలో..
నగరంలోని ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆలయ నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పలువురు పురప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత రాధాకృష్ణుల ఉత్సవ ప్రతిమలకు, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరణ నిర్వహించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తదుపరి రాధాకృష్ణుల మూర్తులను ఊయలలో ఊపి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహుకులు సుఖదేవస్వామి మాట్లాడుతూ స్వాతంత్ర దినం రోజున శ్రీకృష్ణాష్టమి వచ్చిందన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో స్వాతంత్య్రం కోరుకొంటాడన్నారు. అటువంటి స్వాతంత్య్రం అతనికి నచ్చిన విధంగా ఉండొచ్చని ఆశిస్తాడని అన్నారు. నిజానికి కృష్ణ్భగవానుడు గీతలో స్వాతంత్రం గురించి ప్రస్తావించి ఉన్నారన్నారు. యోగ్యత పొందడానికి మనం మానసికంగా ఒదిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భగవంతుడు పెట్టిన నియమాలు, చెప్పిన ఉపదేశాలు పాటించకుంటే మనకు ముక్తి ప్రాప్తించదన్నారు. ప్రతి నిత్యం భగవంతుని నామస్మరణతో మనం సుఖసంతోషాలతో జీవించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ డిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.

మన జాతికి గౌరవం జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3 విజయం
షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ స్పష్టం
సూళ్లూరుపేట, ఆగస్టు 15: జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3 ప్రయోగ విజయం మన జాతికే గౌరవం తెచ్చిందని షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ అన్నారు. మంగళవారం షార్‌లోని అంతరిక్ష కేంద్రీయ పాఠశాల మైదానంలో జరిగిన 71వ స్వతంత్య్ర దిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రతిష్ఠ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. శ్రీహరికోట నుండి ప్రయోగించిన జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3 మన భారత జాతికే ఎంతో గౌరవం దక్కిందన్నారు. అదేవిధంగా 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడంతో అంతర్జాతీయపరంగా ఇస్రోకు ఎంతో ఖ్యాతి తెచ్చిందన్నారు. 46 వేల ఎకరాల్లో విస్తరించిన ఉన్న షార్ కేంద్రానికి పహారా కాస్తున్న సిఐఎస్‌ఎఫ్ భద్రత సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ముందుగా ఆయన జాతీయ జెండాను ఎగరవేసి సిఐఎస్‌ఎఫ్ దళాల నుండి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన భద్రతా సిబ్బంది, ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. భద్రతపై కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు పలు విన్యాసాలను చేసి చూపించారు. అనంతరం నవభారత నిర్మాణం కోసం అందరూ పాటుపడాలని అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో షార్ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలుగుగంగ కార్యాలయంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
వేదాయపాళెం, ఆగస్టు 15: నగరంలోని తెలుగుగంగ కార్యాలయంలో స్పెషల్ కలెక్టర్ పి.ప్రశాంతి ఆధ్వర్యంలో మంగళవారం 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆమె ఎగురవేసి జెండావందనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారన్నారు. వారి ప్రాణత్యాగ ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నామన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసి అమరులైన వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరు నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ పిఎ-2 ఎంవి రమణ, నెల్లూరు యూనిట్ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ డివి రమణారెడ్డి, స్పెషల్ కలెక్టర్ రాపూరు యూనిట్ ఎంఎల్ నరసింహంతో పాటు పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ క్రీడాకారిణికి సన్మానం
బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 15: అంతర్జాతీయ క్రీడాకారిణి, వ్యాయామ ఉపాధ్యాయురాలు ఎం.దేవికను బుచ్చిరెడ్డిపాళెం స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మంగళవారం స్థానిక బెజవాడ బుజ్జమ్మ జెడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎం.దేవికను బుచ్చి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు యల్లసిరి దేవ, ఆమె సహచర ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఆమె ఇటీవల మలేషియాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీలలో పాల్గొని క్యాంస్య పతకాన్ని సాధించి దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చారు. ఈసందర్భాన్ని పురస్కరించుకుని ఆమెను ఘనంగా సత్కరించారు. అలాగే మండల వ్యాప్తంగా జెండా పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలలో త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి మిఠాయిలు పంపిణీ చేశారు. బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయినులను తోటి ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు ఎఎస్ పేటకు, పిఇటి దేవిక కోవూరుకు బదిలీ అయ్యారు. వీరితో పాటు మరికొందరు బదిలీ కావడంతో వారందరికీ సహచర ఉపాధ్యాయ బృందం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు పాఠశాలకు చేసిన సేవలను కొనియాడారు.

ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే..!
* రాష్ట్భ్రావృద్ధికి అన్ని రంగాలు సమన్వయం
* 3వేల గొట్టపు బావుల నిర్మాణాలకు చర్యలు
* జిల్లాకు మరిన్ని పరిశ్రమలు
* ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
మంత్రి అమరనాధ్‌రెడ్డి వెల్లడి

నెల్లూరు, ఆగస్టు 15: ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్‌ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్ శాఖ మంత్రి ఎన్.అమరనాధ్‌రెడ్డి తెలిపారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని పోలీస్ కవాతు మైదానంలో మంగళవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అమర్‌నాధ్‌రెడ్డి విచ్చేశారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్భ్రావృద్ధి కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలను సమన్వయం పరచడానికి 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిందన్నారు. గ్రామాలను, పట్టణాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలను తయారుచేసుకొని 20 రాజీలేని సూచికలను 100 శాతం సాధించేందుకు స్మార్ట్ గ్రామాలు, స్మార్ట్ వార్డులు అనే కార్యక్రమం అమలు పరుస్తున్నామన్నారు. కరవును పారదోలడానికి నీరు-చెట్టు కార్యక్రమం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా భూగర్భ జలనీటి మట్టం పెంచడానికి రైతుల పొలాలలో నీటి కుంటలను పెద్దఎత్తున నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలే ముందు అనే నినాదంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అమలవుతున్నాయో పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, అధికారులను గ్రామాలకు పంపి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు చేసేందుకు పల్లె నిద్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. ముప్పవరకు వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి హోదాలో జిల్లాలకు వివిధ ప్రాజెక్టులను మంజూరు చేయించి జిల్లా అభివృద్థికి ఎంతగానో తోడ్పాటు అందించారన్నారు. ప్రస్తుతం దేశ ఉప రాష్టప్రతి పదవి చేపట్టినందుకు మన జిల్లా ప్రజలందరి తరపున ఆయనకు అభినందనలు తెలియచేశారు. జిల్లాలోని కొడవలూరు మండలం, బొడ్డువారిపాళెం వద్ద మిథానీ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందన్నారు. వెంకటాచలంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి (ఎన్‌సిఇఆర్‌టి), నెల్లూరు నగరంలో ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రం, కొత్తూరు వద్ద ఎఫ్‌ఎం రేడియో స్టేషన్, దగదర్తి వద్ద విమానాశ్రయం, బోగోలు మండలం జువ్వలదినె్న వద్ద హార్బర్ నెలకొల్పడానికి కావాల్సిన స్థల సేకరణ దాదాపు పూర్తయిందన్నారు. కేంద్రప్రభుత్వం ఒకే దేశం - ఒకే పన్ను అనే నినాదంతో జూలై 1వ తేది నుంచి ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను (జిఎస్‌టి)ను అమలు చేస్తున్నామన్నారు. జిల్లా మొత్తం స్థూల ఉత్పత్తి ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరలలో 2016-17 సంవత్సరానికి రూ.46వేల, 310కోట్లు, స్థిర ధరల ప్రకారం రూ.36వేల 558కోట్లుగా అంచనా వేసినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో జనవరి 2 నుంచి 11 వరకు 4వ విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నైరుతి రుతుపవనాల వల్ల ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదైంది. గత సంవత్సరంలో వర్షపాతం 64శాతం తక్కువగా నమోదు అయినందున ప్రాజెక్టులలో నీరు లేక ఈ ఖరీఫ్ సీజన్లో 81వేల హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా 33 వేల హెక్టార్లలో మాత్రమే సాగు చేయడం జరిగిందని తెలిపారు. శాస్ర్తియ పద్ధతిలో ఎరువులు వాడేలా రైతులను ప్రోత్సహించడానికి గత మూడు సంవత్సరాల్లో 1.97లక్షల మంది రైతులకు భూసార కార్డులను పంపిణీ చేయడంతోపాటు రూ.550 కోట్లతో 2.82లక్షల మంది రైతులకు రుణ విమోచన కల్పించామన్నారు. గత సంవత్సరంలో సమీకృత అభివృద్థి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఇతర పథకాల ద్వారా రూ.12కోట్లను ఉద్యాన పంటల అభివృద్ధికి ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ సంవత్సరం రూ.12కోట్లతో ఉద్యాన పంటలను అభివృద్థి చేస్తున్నామన్నారు. గత ఏడాదిలో 4,630 మంది రైతులకు సంబంధించిన 13వేల ఎకరాలలో బిందు, తుంపర్ల సేద్య పరికరాలు రూ.24కోట్ల ఖర్చుతో అమర్చినట్లు తెలిపారు. ఈ సంవత్సరం 57 కోట్ల ఖర్చుతో 25వేల ఎకరాలలో బిందు, తుంపర్ల సేద్య పరికరాలు అమర్చడం జరుగుతుందన్నారు. దేశవాళి పశుసంతతి అభివృద్థికి కొండాపురం మండలం చింతలదీవిలో రూ.25కోట్లతో కేంద్రప్రభుత్వ నిధులతో నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 17 పశు జాతులకు సంబంధించి 190 పశువులను సేకరించినట్లు తెలిపారు. గత ఏడాదిలో 1,720 మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మత్స్యకారులకు రూ.6కోట్లతో ఐస్ బాక్సులు, సైకిళ్లు, వలలు, మోపెడ్లు సరఫరా చేయడం జరిగిందన్నారు, రూ.2కోట్ల ఖర్చుతో వివిధ అభివృద్థి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సంవత్సరం రూ.10కోట్ల విలువైన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మత్స్యకారులకు, ఆక్వా రైతులకు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి ఇ-మార్కెటింగ్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రైతు బంధు పథకం ద్వారా రూ.9కోట్లు రుణాలు 620 మంది రైతులకు మంజూరు చేసినట్లు చెప్పారు. కొత్తగా 16 రైతుబజార్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 4.77 లక్షల మంది మహిళలు 48వేల స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి రూ.700కోట్లు కార్పస్ ఫండ్ కలిగియున్నాయన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా జిల్లాలో 2.60లక్షల మంది పెన్షన్‌దారులకు ప్రతి నెలా రూ.29కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకం ద్వారా 5.80లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు అందించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద ఆయకట్టు ప్రాంత రైతుల పొలంలో భూగర్భ జలశాఖ ద్వారా 3వేల మంది రైతులకు గొట్టపు బావులను నిర్మించడానికి సర్వే చేయించి గొట్టపు బావులను తవ్వి సోలార్ పంపుసెట్లు అమలుపర్చడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం ఎన్టిఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రూ.342కోట్లతో 22,500 గృహాలను మంజూరు చేసి పూర్తిచేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది గూడూరు, ఆత్మకూరు, కావలి, నాయుడుపేట, వెంకటగిరి పురపాలక సంఘాలలో 11,630 గృహాలను రూ.640కోట్లతో మంజూరు చేసి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత సంవత్సరం వాడవాడలా చంద్రన్నబాట, ఉపాధిహామి పథకం, ఇతర నిధులు కలిపి రూ.98కోట్ల ఖర్చుతో 404 కిమీ సిమెంటు రోడ్లు నిర్మించామన్నారు. అలాగే ఈ ఏడాది రూ.139 కోట్ల ఖర్చుతో 462 కిమీ సిమెంటు రోడ్లను నిర్మించాలని నిర్ణయించి ఇప్పటివరకు రూ.19కోట్ల వ్యయంతో 102 కిమీ పూర్తిచేశామన్నారు. రూ.6కోట్లతో 71 ఫ్లోరైడ్ పీడిత ఆవాసాలకు 71 ఆర్‌ఓ ప్లాంట్లను మంజూరు చేసి 69 ప్లాంట్లను పూర్తిచేసి జిల్లాలోని ప్రజలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. చిన్న ఆవాస ప్రాంతాలకు 6కోట్లతో 117 సోలార్ డ్యూఎల్ పంపుసెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.28కోట్లతో సబ్సిడీ ద్వారా రైతాంగానికి 5,600 ఉచిత కనెక్షన్లు విద్యుత్‌ను ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన పథకం ద్వారా రూ.11కోట్లతో విద్యుత్ ఉప కేంద్రాలను ఉపయోగంలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. సంగం ఆనకట్ట ద్వారా నెల్లూరు నగరానికి రూ.513కోట్లతో తాగునీరు సరఫరా చేపట్టినట్లు తెలిపారు. నగరానికి రూ.580 కోట్లతో భూగర్భ డ్రైనేజి పథకాన్ని చేపట్టామన్నారు. జిల్లాలోని 19 మండలాల్లోని 145 గ్రామాలు, చిత్తూరు జిల్లాలోని రెండు మండలాల్లోని 11 గ్రామాలను కలుపుతూ 156 గ్రామాల పరిధితో నెల్లూరు పట్టణాభివృద్థి సంస్థ (నుడా ) ఏర్పాటు చేశామన్నారు. గర్భిణీలకు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం కింద ప్రతి నెల 9వ తేదిన వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో 1800 మందికి హైరిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించడం జరుగుతుందన్నారు. అన్న అమృత హస్తం ద్వారా 41వేల మంది గర్భిణీలకు, బాలింతలకు ఒకపూట భోజనం, పాలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలోని 173 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 8,500 మంది 8, 9 తరగతి విద్యార్థులకు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం పెంపొందించేందుకు స్పెల్ అనే పేరుతో వేసవి కాలంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది 20లక్షల మొక్కలను పంపిణీ చేసినట్లు చెప్పారు. 120 కిమీ మేర రహదారుల వెంబడి చెట్లను పెంచినట్లు తెలిపారు. ప్రహరీ గోడలు లేని పాఠశాలలకు బయోఫెన్సింగ్ పనులు చేపట్టామన్నారు. రూ.104కోట్లతో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, కాపు, బ్రాహ్మణ, అల్పసంఖ్యాక కార్పొరేషన్‌ల ద్వారా 13,400 కుటుంబాలకు సబ్సిడీతో రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. 20,200 మందికి వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణను ఇప్పించామన్నారు. మేకిన్ ఇండియా నినాదంతో జిల్లాలో పలు జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. భారత ప్రభుత్వ కోస్టల్ ఎంప్లాయిమెంట్ పథకం ద్వారా జిల్లాలో భారీగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో 50 అవగాహన ఒప్పందాలకు గాను 15 పరిశ్రమలు, 11,568 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తిని ప్రారంభించి 7వేల మందికి ఉపాధిని కల్పించినట్లు తెలిపారు. మరో మూడు పరిశ్రమలు ప్రారంభానికి నోచుకోనున్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 7 భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. 607 మంతి చేనేత కార్మికులకు రూ.1.53కోట్లు రుణ మాఫీ చేశామన్నారు. స్వదేశీ దర్శన్ పథకం ద్వారా కోస్టల్ టూరిజం సర్క్యూట్‌ను రూ.60.30కోట్ల వ్యయంతో నెల్లూరు చెరువు, మైపాడు, కొత్తకోడూరు, రామతీర్థం, ఇస్కపల్లి, నేలపట్టు, ఆటకానితిప్ప, వేనాడు, బివిపాళెం, ఇరకం దీవులలో నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో రెవెన్యూ రికార్డులను కంప్యూటీకరణ చేసినప్పటికీ అందులో ఉన్న చిన్న పొరపాట్లతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి నీ భూమికి భరోసా కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటి వరకు 9,75 లక్షల ప్రతిపాదనలు జిల్లా యంత్రాంగం సవరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతోపాటు జిల్లా జడ్జీలు, పిడిలు, ఇడిలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్యాంకు అధికారులు, స్వచ్ఛంద సేవా ప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, తదితరులకు ఆయన ధన్యవాదాలు తెలియచేశారు. ఈకార్యక్రమంలో గ్రామీణ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, శాసనమండలి సభ్యుడు బీద రవిచంద్ర, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జేసి-2 వెంకటసుబ్బారెడ్డి, జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, డ్వామా పీడి హరిత, ఎస్సీ కార్పొరేషన్ ఇడి, మెప్మా పీడి చిరంజీవులు, డిఆర్‌డిఏ పీడి లావణ్యవేణిలతోపాటు అన్ని శాఖల అధికారులు, డిఎస్పీలు, సిఐలు, తదితరులు పాల్గొన్నారు.

అలరించిన నృత్య ప్రదర్శనలు
వేదాయపాళెం, ఆగస్టు 15: దేశ 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర వేడుకలు కన్నులపండువగా జరిగాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ముందుగా కోవూరుకు చెందిన జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు వందేమాతరం... వందేమాతరం పాటకు నృత్యం చేశారు. తరువాత చంద్రశేఖరపురం ఏపి రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన విద్యార్థినులు జయహో అంటూ ముందుకువచ్చి తమ ప్రతిభను చాటారు. అనంతరం నెల్లూరు నగరానికి చెందిన లిటిల్ ఏంజెల్స్ ఇంగ్లీషు మీడియం స్కూల్‌కు చెందిన 110 మంది విద్యార్థులు దేశ చరిత్రను కళ్లకు కట్టినట్లు నృత్యం ద్వారా ప్రదర్శించి చూపురులను ఆకట్టుకున్నారు. ఏపి రెసిడెన్షియల్ స్కూల్ బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన విద్యార్థినులు దేశ రంగీలా అనే హిందీ పాటకు నృత్యం చేశారు. చివరగా నెల్లూరు నగరానికి చెందిన ప్రగతి చారిటీస్ విద్యార్థులు ఏ దేశమేగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే పాటకు అద్భుతంగా నృత్యం చేసి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలను ఆకట్టుకున్నారు. వారంతా దివ్యాంగులైనా వారికి ఏమీ వినిపించకపోయినా ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణ మేరకు వారు పోలీసు మైదానంలో అద్భుతంగా నృత్యం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. విజేతలు వీరే!
స్వాతంత్య్ర వేడుకల్లో అద్భుతంగా నృత్యం చేసి మొదటి స్థానాన్ని నెల్లూరు లిటిల్ ఏంజెల్స్ స్కూల్ కైవసం చేసుకుంది. రెండవ బహుమతిగా ప్రగతి చారిటీస్ విద్యార్థులు దక్కించుకున్నారు. మూడవ బహుమతి చంద్రశేఖరపురం ఏపి రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన విద్యార్థినులు సాధించారు. ఇక నాలుగు, ఐదవ స్థానాల్లో కోవూరు, బుచ్చి రెడ్డిపాళెంకు చెందిన విద్యార్థినులు నిలిచారు. విజేతలైన విద్యార్థులకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాధ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు చేతులమీదుగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు.
కుట్టు మిషన్లు పంపిణీ
స్వాతంత్య్ర సంబరాల్లో భాగంగా పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్.అమరనాధ్‌రెడ్డి వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పథకాలను లబ్ధిదారులకు అందచేశారు. మెప్మా ద్వారా 47 కుట్టుమిషన్లతోపాటు రూ.45కోట్లు బ్యాంక్ లింకేజిని మంత్రి లబ్ధిదారులకు అందచేశారు. వయోజన విద్య కింద అక్షరాస్యత పొందిన 17 మంది నియోలిటిరేట్లకు మంత్రి సర్ట్ఫికేట్లు ప్రదానం చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధికి సంబంధించి లబ్ధిదారులకు రూ.100కోట్లు బ్యాంక్ లింకేజిని అందచేయడంతోపాటు 10 మంది రైతు ఉత్పత్తిదారులకు రివాల్వరింగ్ ఫండ్ కింద రూ.1కోటి చెక్కును అందించారు. చంద్రన్న బీమా పథకం కింద ఇటీవల మరణించిన ఇద్దరు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5లక్షలు వంతున ఇన్సూరెన్స్‌ను ఇచ్చారు. సహజంగా మరణించిన నలుగురు కుటుంబాలకు రూ.30వేల వంతున ఆర్థిక సహాయాన్ని అందచేశారు. బిసి కార్పొరేషన్ కింద రూ.1.30కోట్లు విలువ కలిగిన వస్తువులను మంత్రి అందచేశారు. దివ్యాంగులకు 14 మూడు చక్రాల బండ్లు, రెండు వీల్‌ఛైర్లు ఇచ్చారు. ఐసిడిఎస్ కింద నెల్లూరు 10 కేంద్రాలలో అంగన్‌వాడీ స్కూలు పిల్లలకు యూనిఫారాలు ఇచ్చారు. ఐడిడిఏ పథకం కింద 20 మంది లబ్ధిదారులకు రూ.1,31,27,000లు విలువ కలిగిన ట్రాక్టర్ల యూనిట్లు, ఆటో యూనిట్లు, వ్యాన్లు, డ్రైవర్ కం ఓవరు కార్లు, సెవెన్ సీటర్ ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపేరు, కంప్యూటర్, ఇంటర్నేట్, డిటిపి జెరాక్స్ మిషన్లు అందచేశారు. ఎస్సీ కార్పొరేషన్ కింద మొత్తం రూ.47కోట్లు పంపిణీ చేయగా, దానిలో రూ.38.55 కోట్లు బ్యాంక్ లింకేజి మిగతావి ఆటోలు, ట్రాక్టర్లు, బోర్‌వెల్స్, ఇతర ఆస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జేసి 2 వెంకటసుబ్బారెడ్డి, ఎస్పీ రామకృష్ణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న శకటాలు
* డ్వామాకు మొదటి బహుమతి
వేదాయపాళెం, ఆగస్టు15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం పోలీసు పరేడ్ మైదానంలో 16 శాఖలకు సంబంధించి అమలు చేస్తున్న కార్యక్రమాలను చూపిస్తూ ఆయాశాఖలు శకటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రెవెన్యూ, డ్వామా, జలవనరుల శాఖ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, చంద్రన్న సంచార చికిత్సా శకటం, 108, డిఆర్‌డిఏ, అటవీశాఖ, వ్యవసాయశాఖ, సర్వశిక్షా అభియాన్, ఐసిడిఎస్, గ్రామీణ నీటిపారుదల, నగరపాలక సంస్థ, గృహనిర్మాణ సంస్థ, ఎస్సీ కార్పొరేషన్, గిరిజన వెల్ఫేర్, ఉద్యానవన శాఖలకు సంబంధించి శకటాలు ప్రదర్శించారు. ఈ శకటాల ప్రదర్శనలో మొదటి బహుమతి డ్వామా ప్రదర్శించిన శకటానికి దక్కింది. రెండవ బహుమతి రెవెన్యూశాఖ, మూడవ బహుమతిని రెండు శాఖలు నగరపాలక సంస్థ, వ్యవసాయ శాఖలు కైవసం చేసుకున్నాయి.. ఈ శకటాల ప్రదర్శనను మంత్రి అమరనాధ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌తోపాటు ప్రజాప్రతినిధులు తిలకించి గెలుపొందిన శకటాల నిర్వాహకులకు బహుమతులు అందచేశారు.
అబ్బురపరచిన స్టాల్స్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం పోలీసు కవాతు మైదానంలో వివిధ శాఖలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ అబ్బురపరిచాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా, ఐసిడిఎస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, వయోజన విద్య, దివ్యాంగుల శాఖ, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, ఎస్సీ, బిసి కార్పొరేషన్, గిరిజన సంక్షేమశాఖలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌ను మంత్రి అమరనాధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ -2 వెంకటసుబ్బారెడ్డితోపాటు ఇతర ప్రజాప్రతినిధులు సందర్శించారు. స్టాల్స్‌లో ఉంచిన వస్తువులపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.