శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రొట్టెల పండుగకు పటిష్ట బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 16: రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన రొట్టెల పండగకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. శనివారం ఆయన నగర మేయర్ అబ్దుల్ అజీజ్‌తో కలిసి బారాషహీద్ దర్గాను సందర్శించారు. మేయర్‌తో కలిసి దర్గాలో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేది నుండి మొదలుకానున్న పండగకు దేశ వ్యాప్తంగా 15 లక్షల వరకు భక్తులు వస్తారనే అంచనా ఉందన్నారు. దీనికనుగుణంగా భక్తుల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, దర్గా కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులతో చర్చించి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ 45 నిమిషాల్లో ప్రతిఒక్కరికీ దర్శనం జరిగేలా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ విచ్చేసే భక్తులకు సకల వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సిసి టివి నిఘా, పోలీస్ కంట్రోల్ రూం, ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ ప్రాశస్తం పెరిగితే దేశ వ్యాప్తంగా ప్రజల్లో సోదరభావం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం దర్గా పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ, మేయర్ పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కార్పొరేటర్లు డి.రాజానాయుడు, ప్రశాంత్‌కిరణ్, మైనార్టీ నేతలు మున్వర్, అబూబకర్, హయత్, సిద్ధిక్, జకీర్ తదితరులు ఉన్నారు.

బాల్య వివాహాలు, వేధింపులు అరికట్టేందుకే కిశోరి వికాసం
* ఎజెసి వెంకటసుబ్బారెడ్డి స్పష్టం
వేదాయపాళెం, సెప్టెంబర్ 16: బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, లైగింక వేధింపులకు గురికాకుండా వారిని చైతన్యవంతులుగా చేసేందుకే కిశోరి వికాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ -2 వెంకటసుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఛాంబర్‌లో కిశోరి వికాసం కార్యక్రమంపై జిల్లాలో ఎన్నికైన జిల్లా రీసోర్స్ గ్రూప్ మెంబర్లతో సమావేశం జరిగింది. ఈసందర్భంగా జేసి -2 మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమగ్ర బాలల సంరక్షణ పథకం, స్ర్తి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కిశోర వికాసం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. బాలలపై లైంగిక వేధింపులు, ఇతర వ్యామోహాలకు గురికాకుండా వారిని చైతన్య వంతులుగా చేసి దిశ నిర్దేశం చేసేందుకు ఐసిడి ఎస్, ఐసిపి ఎస్ ఆధ్వర్యంలో కిశోర వికాసం పేరుతో 13 నుంచి 18 ఏళ్ల బాలికలకు సరైన మార్గము ఉద్దేశించి వారి ఆశయాలను గుర్తు చేస్తూ లక్ష్యాలు చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అందుకోసం డిగ్రీ, ఇంజనీరింగ్, లా విద్యార్థినీలను సిద్దం చేస్తున్నామన్నారు. కిశోరి వికాసంలో బాలికలను చైతన్యం చేసేందుకు ముందుకు వచ్చిన విద్యార్థినీలకు ముందుగా అవగాహన తరగతులు నిర్వహించి ఆ తరువాత నేరుగా కిశోరి బాలికల వద్దకు వారిని పంపించి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. స్ర్తి, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ కిశోరి వికాసం శిక్షణా కార్యక్రమంలో 15 అంశాలు గుర్తించి ఒక్కొక్క అంశంపై 5 గ్రూపులుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా జిల్లా రీసోర్స్ గ్రూప్ వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈనెల 20వ తేది నుంచి శిక్షణా తరగతులు ప్రతి దివిజన్ స్థాయిలో గుర్తించిన విద్యార్థులు, టీచర్లకు పైన తెలిపిన జిల్లా రీసోర్స్ గ్రూప్ వారిచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రీసోర్స్ గ్రూప్ మెంబర్లు కె.అపర్ణాదేవి, హోం సైన్సు డిపార్టుమెంటు, కె.అరుణ రీసెర్చ్ అసోసియేట్, సుభావతి డిపి హెచ్‌ఎస్‌ఓ, ఎస్‌వి రత్నంబాబు, ఆర్.వెంకట్రావ్ ఉపాధ్యాయులు, జిల్లా బాలల సంరక్షణ అధికారి బి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పెట్రోలు బంకులపై అధికారుల దాడులు
* రికార్డులు తనిఖీ చేసిన సివిల్ సప్లై అధికారులు
వేదాయపాళెం, సెప్టెంబర్ 16: పెట్రోలు బంకుల్లో కల్తీ జరుగుతుందన్న ఫిర్యాదులపై జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ స్పందించారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేసి సివిల్ సప్లై అధికారులను తనిఖీలకు ఆదేశించారు. దీంతో శనివారం నగరంలోని పలు పెట్రోలు బంకులపై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. పెట్రోలు బంకుల్లో రికార్డులను తనిఖీలు చేశారు. పెట్రోలు, డీజల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. పెట్రోలు బంకుల్లో నిబంధనల ప్రకారం ఉంచాల్సిన పరికరాలు ఉన్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. బంకుల్లో నీళ్లు, ఇసుక బక్కెట్లు తదితరాలను తనిఖీ చేశారు. అలాగే పెట్రోలు, డీజల్ కొలతలను కూడా తూనికలు, కొలతల అధికారులు తనిఖీ చేశారు. పెట్రోలు బంకుల నిర్వాహకులు వినియోగదారులకు సక్రమంగా పడుతున్నారా లేదా అనేది డబ్బాల్లో లీటరు, ఐదు లీటరు పెట్రోలు పోయించి మరీ చూశారు. ఇదిలావుండగా సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం తెలుసుకున్న పలు పెట్రోలు బంకుల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. బంకుల్లో ఉంచాల్సిన పరికాలను సమకూర్చుకున్నారు. ఈ దాడులు శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగాయి. నిబంధనలు పాటించని పెట్రోలు బంకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తీవ్రస్థాయిలో అధికారులు నిర్వాహకులను హెచ్చరించారు.

నెల్లూరును స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తా
*మంత్రి నారాయణ హామీ
నెల్లూరుసిటీ, సెప్టెంబర్ 16: నెల్లూరు నగరాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసి ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని మునిసిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. శనివారం నగరంలో జరుగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి పథకం పనులను వివిధ ప్రాంతాలలో మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా మంచి నాణ్యతతో పనులు వేగవంతంగా చేస్తున్నారని తెలిపారు. నెల్లూరు నగరంలో 1100 కోట్ల రూపాయలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 565 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజి పనులను 2018 జూన్‌నాటికి పూర్తిచేస్తామన్నారు. నెల్లూరు నగరానికి కావాల్సిన అన్ని హంగులను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్ని నిధులైన మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే నెల్లూరు రూపురేఖలు మారున్నన్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ డిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల శుభ్రతతో ఆరోగ్యానికి రక్షణ
* స్వచ్ఛతే సేవలో మంత్రి, కలెక్టర్
ముత్తుకూరు, సెప్టెంబర్ 16: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతోనే ప్రతి మనిషికి ఆరోగ్య రక్షణ చేకూరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్ ముత్యాలరాజు పేర్కొన్నారు. శనివారం తోటపల్లిగూడూరు మండలం కోడూరు పంచాయతీ కేంద్రంలో స్వచ్ఛతే సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మన ఇల్లు, వీధి, గ్రామం శుభ్రంగా ఉంటే రాష్ట్రం, దేశం, ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపట్టిన స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వచ్ఛతే సేవ పని చేస్తోందని తెలిపారు. మహాత్మాగాంధీ ఆశించిన సంపూర్ణ ఆరోగ్యం దీని ద్వారానే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామస్థాయి నాయకులు పరస్పర సహకరించి పనిచేసుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక నేతలు దువ్వూరు సురేంద్రనాథ్‌రెడ్డి, వీరబోయిన గంగాధర్‌లకు సూచించారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు స్వచ్ఛ దేశమే పూజ్యబాపూజీ ఆశించారని అందుకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా పనిచేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులచే స్వచ్ఛతే సేవ ర్యాలీని నిర్వహించారు. ఈ స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్‌డిఓ హరిత, సోమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, బొమ్మి సురేంద్ర, బి శ్రీనివాసులు, చిన్నబాబురెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పేదల అభ్యున్నతే బిజెపి, టిడిపి లక్ష్యం
* మంత్రి కామినేని స్పష్టం
నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 16: పేద ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే బిజెపి, తెలుగుదేశం ప్రభుత్వాల లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో నారుూబ్రాహ్మణులకు ఇంటి స్థలాలకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు, మోదీ ఇరువురు పేదల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తున్నారని అన్నారు. వారి కృషి వల్ల ఇప్పుడిప్పుడే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. నెల్లూరు మండల పరిధిలోని కొండ్లపూడి గ్రామంలో 23.10 ఎకరాలను 333 కుటుంబాలకు నివాస స్థలాలు అందించినట్లు ఆయన తెలిపారు. వీరి ఇంటి స్థలాలు రావడానికి స్వర్ణ్భారతి ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ దీపావెంకట్ తీవ్రంగా ప్రయత్నించారని ఆయన తెలిపారు. కొత్తగా పట్టాలిచ్చిన ప్రాంతాన్ని వెంకయ్యనాయుడు కాలనీగా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్న సమయంలో రాష్ట్రానికి ఐదు లక్షల 33 వేల ఇళ్లును మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ఉప రాష్టప్రతి జిల్లాలో ఇంటి స్థలాలు పంపిణీ చేసే అవకాశం తనకు రావడం ఆనందించదగ్గ విషయమని ఆయన తెలిపారు. అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే ప్రతిఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో రాష్ట్ర మొత్తం ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని తెలిపారు. నెల్లూరు నగరంలో మరో 15 నెలలలోపు 4,500 మందికి ఇళ్లు అందివ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 20, 22 లోపు ప్రతిఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ప్రయత్నాన్ని తీవ్రతరం చేసినట్టు ఆయన తెలిపారు. వెంకయ్యనాయుడు సహకారంతో ఐదు లక్షల 33 వేల ఇళ్లు రాష్ట్రానికి రావడం జరిగిందని ఇంకా మరికొన్ని ఇళ్లు కూడా వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి కోసం అందరూ పూనుకోవాలని కోరారు. త్వరలోనే నెల్లూరు నగరంలో రెండు ఫ్లైఓవర్లు నిర్మించడానికి సహకారం అందించవల్సిందిగా మంత్రి నారాయణను, దీపావెంకట్‌ను కోరారు. అనంతరం స్వర్ణ్భారత్ ట్రస్టు డైరెక్టర్ దీపావెంకట్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, పలువురు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సామాన్య భక్తులకు వసతులు కల్పించండి
*రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచన
నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 16: దసర నవరాత్రులను పురస్కరించుకొని నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో సామాన్య భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి కోరారు. శనివారం ఆలయంలో శరన్నవరాత్రులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, దైవదర్శనం కోసం వచ్చే భక్తులకు దేవుని అనుగ్రహం ఉండే విధంగా చర్యలు తీసువాలన్నారు. విఐపిలకు పెద్దపీట వేసి సామాన్యులకు దర్శనానికి ఇబ్బంది కలగనీయవద్దని ఆయన అన్నారు. గడిచిన మూడు సంవత్సరాలుగా దేవస్థానం ప్రాంగణం పరిసరాలలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు కట్టడం నిషేధించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈసంవత్సరం కూడా ఎలాంటి ఫ్లెక్సీలు కట్టవద్దని ఆయన తెలిపారు. ప్రార్థనా మందిరాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని గతంలోనే కోర్టు తీర్పు ఇచ్చి ఉందని ఎవరైనా ఫ్లెక్సీలు కడితే అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దేవుని ఎదుట ధనికుడు, సామాన్యుడు అందరూ సమానమేనని ఆయన తెలిపారు. విఐపిల కోసం మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు, రాత్రి 9 నుండి ఆలయం మూసేవరకు వారి దర్శనానికి ఏర్పాట్లు చేయవల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ధర్మాదయ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖ తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
* మంత్రి సోమిరెడ్డి స్పష్టం
కోట, సెప్టెంబర్ 16: ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కోట మండలంలోని కొత్తపట్నం శ్రీనివాససత్రం గ్రామాల్లో శనివారం జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేద, బడుగు, బలహీన వర్గాల కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. సిఎం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకాన్ని దాని ద్వారా పొందుతున్న సహాయాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఇరిగేషన్ ప్రాజెక్టులకు 44 వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో సోమశిల, కండలేరుతోపాటు ఇతర చిన్న రిజర్వాయర్లు, చెరువులద్వారా 175 టిఎంసిల నీటిని నిల్వ చేసేందుకు అవకాశం ఉందన్నారు. జన్మభూమి కమిటీలు, పార్టీ విభాగాల్లో పనిచేసేవారు సమైక్యంగా వ్యవహరించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. సిఎం ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అహర్నిశలు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇంటింటికి టిడిపి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రతి ఇంటిపై టిడిపి జెండాను ఎగురవేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఇంట్లో టిడిపి సభ్యత్వం తీసుకొనేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనంతరం కొత్తపట్నం గ్రామంలో కోటీ 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన తుఫాన్ షెల్టర్, శ్రీనివాససత్రంలో కోటీ 23 లక్షల రూపాయలతో నిర్మించిన తుఫాన్ షెల్టర్లను ఆయన ప్రారంభించారు. అంతకముందు సోమిరెడ్డిని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ను మండల నాయకులు గజపూలమాలతో సన్మానించారు. కొత్తపట్నం గ్రామంలో మంత్రి టిడిపి జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్, డిసిసిబి ఉపాధ్యక్షులు నల్లపురెడ్డి జగన్మోహన్‌రెడ్డి, టిడిపి ఉపాధ్యక్షులు కోనిశెట్టి రమేష్, తెలుగు రైతు జిల్లా ఉపాధ్యక్షులు నెల్లూరు మోహన్‌రెడ్డి, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలకు ప్రభుత్వం అండ:సోమిరెడ్డి
కోట, సెప్టెంబర్ 16: ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వ అండదండలు ఎప్పుడూ ఉంటాయని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో శనివారం కోట పట్టణంలో జిల్లా స్థాయి ఇస్తిమా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లిం మైనార్టీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, తమ ప్రభుత్వం ఎప్పుడు ముస్లింలకు అండదండలుగా ఉంటుందని అన్నారు. అనంతరం ఆయన ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తేనేటి విందులో పాల్గొన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, డిసిసిబి నల్లపురెడ్డి జగన్మోహన్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జలీల్ బాషాతోపాటు పలువురు మండలంలోని టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కల్తీ మాఫియాను తుదముట్టించాలి:బిజెపి
నెల్లూరు టౌన్, సెప్టెంబర్ 16: జిల్లాలో వేళ్లూనుకుంటున్న మాఫియాను తుదముట్టించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి అన్నారు. నగరంలోని రామ్మూర్తినగర్‌లో ఉన్న బిజెపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో బిజెపి సామాజిక అంశాలపై, అవినీతిపై ప్రజల పక్షాన మాట్లాడుతోందని, ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అనేకమార్లు తాము చేస్తున్న పనుల వల్ల అధికారులలో కూడా స్పందన రావడం మొదలైందని, అందుకు నిదర్శనం కల్తీ ఆహార పదార్ధాలు, కలుషిత తాగునీరుపై అమ్మకాలు జరుపుతున్న ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని జాయింట్ కలెక్టర్ అనడం నిదర్శనమన్నారు. భారతదేశం, అమెరికాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు ద్వారా మంచినీళ్ల వాడకంతో ప్రజలు అనేక రోగాలబారిన పడుతున్నారన్నారు. కల్తీపై అధికారులు ప్రజల్లో చైతన్యం కలిగించాలని, చట్టాలలో మార్పులు తీసుకువచ్చి కల్తీ మాఫియాపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. క్రికెట్ బెట్టింగ్‌ల వల్ల జిల్లాలో అనేక కుటుంబాలు రోడ్డు పాలయ్యాయని, ఆ బెట్టింగ్‌ల మాఫియాని జిల్లా పొలిమేరల వరకు తరిమి కొట్టాలన్నారు. ఇసుక అక్రమ రవాణా వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, తీరప్రాంతాల్లో ఇసుకను సిలికా పేరుతో రాజకీయ నాయకుల అండదండలతో విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. సింగిల్ నెంబర్ల ఆట, గుట్కా నగరంలో జోరందుకున్నాయని, అలాంటి వాటిని అరికట్టాలన్నారు. మంచి జిల్లాగా పేరున్న ఈ జిల్లాను ఎస్పీ చొరవ తీసుకొని మాఫియా అడ్రస్ లేకుండా చేయాలన్నారు. ఇందుకోసం ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు ప్రజలు తమ పూర్తి మద్దతును అధికారులకు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు ముద్దు శీను, విజయలక్ష్మి, కరణం భాస్కర్, మారుతికుమార్‌రెడ్డి, బి సురేష్, శ్రీనివాసులు యాదవ్, హరికృష్ణ, సుధాకర్, సాయిశ్రీను తదితరులు పాల్గొన్నారు.