శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విజృంభిస్తున్న విష జ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 17: జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారుకావడం, మారిన వాతావరణ పరిస్థితులు తోడు కావడంతో ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు. జిల్లాలోని మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఈ మండల పరిధిలో ఒకరు విషజ్వరానికి గురై మరణించడం జరిగింది. అదేవిధంగా సూళ్లూరుపేట మండలంలో ఇద్దరు, చిల్లకూరు మండల పరిధిలో ఒకరు ఈ విషజ్వరాల కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రజలు విషజ్వరాల బారినపడిన సంగతి తెలిసి కూడా ఎటువంటి వైద్యచికిత్సా చర్యలు తీసుకోని ఆరోగ్య సిబ్బంది ఒకరిద్దరు మృత్యువాత పడడంతో జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకోవడంతో విషజ్వరాలు ప్రబలిన ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. గ్రామాల్లో పంచాయతీలు సరిగా పారిశుద్ధ్య పనులు నిర్వహించకపోవడంతో ఎక్కడపడితే అక్కడ వర్షపు నీరు మురికినీటితో కలిసి దోమల వ్యాప్తికి దోహదం చేస్తుండడంతో ప్రజలు దోమకాటుకు గురై జ్వరాల బారిన పడుతున్నారు. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా తదితర రోగాలకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రెండు రోజుల వ్యవధిలో నలుగురు ఈ విషజ్వరాలతో మృతి చెందడం, వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రుల పాలు కావడంతో జిల్లా యంత్రాంగంలో కదలిక మొదలైంది. జిల్లా కలెక్టర్ ఆరోగ్యశాఖ పనితీరుపై సీరియస్ కావడంతో జిల్లా ఆరోగ్య శాఖాధికారి పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది తక్షణ చర్యలకు ఆలస్యంగానైనా ఉపక్రమించారు. అయితే ఇప్పటికే రోగాల బారిన పడినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు నగరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పారిశుద్ధ్యం సరిగా లేకపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో మురికినీరు పారుదల సరిగా జరగకపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది కొన్ని ప్రాంతాల్లోనే పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు నివసించే మురికివాడలు, కాలువగట్టు కాలనీల్లో ఈ విషజ్వరాల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తోంది. నగరంలోని ప్రయివేటు ఆసుపత్రుల్లో విషజ్వర పీడితుల తాకిడి ఎక్కువగా దర్శనమిస్తోంది. ప్లేట్‌లెట్స్ పడిపోతుండడంతో రోగులకు అవసరమైన రక్తం కోసం వారి సంబంధీకులు రక్తనిధులకు పరిగెడుతున్నారు. మెట్ట ప్రాంతాలతో పోలిస్తే డెల్టా ప్రాంత మండలాల పరిధిలో ఈ విషజ్వరాల తాకిడి ఎక్కువగా ఉంది. పరిస్థితి రోజురోజుకి ఆందోళనకరంగా మారుతోంది. ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజూ గణనీయంగా పెరుగుతుండడం గమనార్హం. జిల్లా పాలనా యంత్రాంగం ఇకనైనా ఈ విషయంలో తగు చర్యలు తీసుకొని జ్వరాలను అదుపులోకి తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

పెరిగిన మద్యం ధరలతో
ఆబ్కారీ శాఖకు ఆదాయం
* జిల్లాలో రూ.100 కోట్ల వరకు అదనపు రాబడి
* ప్రతి మద్యం సీసాకు బిల్లు తప్పనిసరి
నెల్లూరు, సెప్టెంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల మద్యం ధరలను పెంచడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది. నెల్లూరు జిల్లా విషయానికొస్తే పెరిగిన మద్యం ధరల వల్ల ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి అదనంగా మరో 10 శాతం వరకూ రాబడి ఉంటుందని ఆబ్కారీ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 340 మద్యం దుకాణాలు, 37 బార్లకు అధికారులు లైసెన్సులు జారీ చేశారు. పెరిగిన ధరలను వెంటనే అమలుపరచాలని ఇప్పటికే ఆయా మద్యం దుకాణదారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 750 మిలీ మద్యం ధర రూ.400కు మించి ఉన్న మద్యం ధరలను మాత్రమే ప్రభుత్వం 10 శాతం మేర పెంచింది. అంతకన్నా తక్కువ ధర ఉన్న మద్యంపై ఎటువంటి ధరలను పెంచలేదు. ఒకవిధంగా ఒక వర్గం వారు తాగే మద్యంపైనే ఈ ధరల ప్రభావం కనిపిస్తోంది. ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్న ఆబ్కారీ ఆదాయానికి పెరిగిన మద్యం ధరల వల్ల ఈ ఆబ్కారీ ఏడాదిలో మరో 10 శాతం అదనపు ఆదాయాన్ని అధికారులు అంచనా వేశారు. 2015-16 అబ్కారీ ఏడాదిలో రూ.958 కోట్ల ఆదాయం రాగా, 16-17 ఏడాదికి రూ.1001కోట్లకు ఆదాయం చేరుకుంది. ఇక ప్రస్తుత 2017-18 ఏడాది ప్రారంభమైన రెండు నెలలకే ప్రభుత్వం ధరలను పెంచడంతో ఈ ఏడాది కచ్చితంగా గత ఏడాది కంటే 10 శాతం అదనంగా అంటే.. సుమారు రూ.100కోట్ల వరకు అధిక ఆదాయం లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ప్రభుత్వం ఖజానాలు ఖాళీ అవుతుండడంతో ఏమిచేయాలో దిక్కుతోచక మద్యం ధరలు పెంచినట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ కనీసం రూ.100కోట్ల మేర ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేసి ఈ మద్యం ధరలను పెంచినట్లు స్పష్టమవుతోంది.
కొనుగోలుకు బిల్లు తప్పనిసరి
మద్యం విక్రయాలు ఎమ్మార్పీ ధరలకు లోబడే జరగాలనే కృతనిశ్చయంతోనే ఉన్న ప్రభుత్వం ఆ దిశగా ఆబ్కారీ శాఖను సిద్ధం చేసింది. ఆబ్కారీ శాఖ మద్యం కొనుగోలు చేసేవారికి కచ్చితంగా కంప్యూటర్ బిల్లు ఇవ్వాల్సిందేనని మద్యం దుకాణాలకు ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు. అందులో భాగంగా హాత్ గ్రాఫిక్ పాత్ ఫైండర్ సిస్టమ్ ( హెచ్‌జిపియఫ్‌యస్) విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ విధానాన్ని ఈనెల 29లోగా అన్ని మద్యం దుకాణాల్లో ఏర్పాటు చేసుకోవాలని యజమానులకు ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే సూచనలు చేశారు. ప్రతి కొనుగోలుకు బిల్లు తప్పనిసరి చేయడం వల్ల మద్యం ఎమ్మార్పీ ధర ఉల్లంఘన జరగకుండా చూడవచ్చని ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు తెలియచేశారు. ఈ పద్ధతిలో తప్పు జరిగే అవకాశం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. బిల్లు తీసుకోవడం వల్ల మద్యంప్రియులు ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. బెల్టుషాపులు లేకపోవడం, మరోవైపు ఎమ్మార్పీ ధరకే విక్రయాలు జరపాలనే నిర్ణయంతో మద్యం వ్యాపారులకు ఏమీ పాలుపోవడంలేదు. కొత్త విధానాన్ని అమలు చేసేలోగా వీలైనంత మేర మద్యంప్రియుల్ని దోచుకునేందుకు కొందరు మద్యం వ్యాపారులు సిద్ధమయ్యారు. క్వార్టర్‌కు రూ.10 వంతున పెరిగిన మద్యం ధరలు పెరిగితే 90 మిలీ బాటిల్‌పై కూడా రూ.10 అధికంగా వసూలు చేస్తుండడం గమనార్హం. అదేవిధంగా పెరగని మద్యం ధరలను కూడా పెంచి కొన్నిచోట్ల అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులు ఈ కొత్త పద్ధతి త్వరగా ఏర్పాటు చేసుకోండంటూ మద్యం వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ సమయం ఉందనే ధీమాతో వారు పాత పద్ధతి అనుసరిస్తూ ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.

అమ్మ నుంచి.. హాయ్ దాకా వచ్చాం
మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని ఆవేదన
కావలి (జలదంకి), సెప్టెంబర్ 17: అమ్మ అనే తియ్యటి పిలుపు కాలగర్భంలో కలిసిపోయి హాయ్ అనే స్పీడ్ యుగంలోకి వచ్చినందుకు బాధపడాలో లేక పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని ఆనందపడాలో అర్ధంకాని పరిస్థితిలో ఉన్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్, రాష్ట్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు పిల్లలు అమ్మ, నాన్న అని పిలుస్తుంటే ఎంతో ఆత్మీయత అనుభవించే వాళ్లమని ఇప్పుడు హాయ్ అని ముక్తసరిగా పిలుస్తుంటే మనసుకి కష్టంగా అనిపిస్తుంటుందని అన్నారు. అయితే కాలానుగుణంగా వచ్చే మార్పును ఆహ్వానించడం తప్ప ఏమీ చేయలేమని ఆమె అన్నారు. ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ సతీమణి, ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్‌ను కావలి పట్టణానికి చెందిన సాంస్కృతిక సేవా సంస్థ తెలుగు సాహితీ వేదిక జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించే కార్యక్రమంలో ఆమె గౌరవఅతిధిగా పాల్గొన్నారు. ఈకార్యక్రమం ఆదివారం పట్టణంలోని వస్త్ర వ్యాపారుల కల్యాణ మండపంలో జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికత కారణంగా సమాజంలో వికృత పోకడలు పెరిగిపోతున్నాయని అన్నారు. తన చిన్నతనంలో ఆడపిల్లలు బయటకు పోవడం ప్రమాదమని పెద్దలు చెప్పేవారని, మహిళలు రాష్టప్రతులు, ప్రధానమంత్రులు అవుతున్న నేటి ఆధునిక యుగంలో కూడా ఇంకా మహిళలకు రక్షణ లేకపోవడం బాధిస్తోందన్నారు. సమాజంలో నెలకొన్న రుగ్మతలు, వికృత పోకడల వైపు యువత ఆకర్షితులు కాకుండా వారిని కవులు, రచయితలు చైతన్యపరిచి ఆలోచింపచేసే విధంగా రచనలు చేయాలని ఆమె కోరారు. తెలుగు భాషపట్ల మక్కువతో తాను రచనలు ప్రారంభించి ‘నన్నపనేని నవరత్నాలు’ రచించే సమయంలో నన్నపనేని రచనలు చేస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయారని అన్నారు. కానీ రచన పట్ల ఉన్న మక్కువతో నన్నపనేని నవరత్నాలు అనే రచనను పూర్తిచేసి ప్రముఖులకు అంకితమివ్వడం, ఆ రచనలు అప్పటి దినపత్రికలు, వారపత్రికలలో ప్రముఖంగా ప్రచురితం కావడంతో అమ్మో రాజకుమారి అన్నారని తన గతాన్ని సభికులతో పంచుకున్నారు. తనకు రచనల పట్ల ఉన్న మక్కువతో పాటు ప్రముఖ రచయిత్రి జలంధరపై గౌరవంతో మూడు జిల్లాలు దాటి ఈకార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు. జలంధరకు తన చేతులమీదుగా పురస్కారాన్ని అందచేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అనంతరం నన్నపనేని చేతులమీదుగా రచయిత్రి జలంధరకు తెలుగు సాహితీ వేదిక నిర్వాహకులు జీవనసాఫల్య పురస్కారం అందజేశారు. ఈకార్యక్రమంలో నవ్యాంధ్ర రచయితల సంఘం తేళ్ల అరుణ, తిరుపతికి చెందిన రచయిత్రి ఐతరాజు స్రవంతి, సీనియర్ జర్నలిస్టు ఎస్ సూర్యప్రకాష్‌రావు, కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమరా యాదగిరి గుప్తా, అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాది పోట్లూరు శ్రీనివాసులు, కావలి రోటరీక్లబ్ అధ్యక్షులు ఎఎస్ రామారావు, ద్రవిడ దేశం పార్టీ అధ్యక్షులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ బెట్టింగ్ కేసులో టిడిపి నేతకు నోటీసు?
కావలి (జలదంకి), సెప్టెంబర్ 17: జిల్లాలో సంచలనం రేకెత్తించిన క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కావలికి చెందిన ఒక ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకుడికి నెల్లూరులోని ఎస్పీ కార్యాలయం నుంచి నోటీసు అందినట్లు అత్యంత విశ్వసనీయమైన సమాచారం. బెట్టింగ్ వ్యవహారాలలో నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ నిందితులతో లావాదేవీలు జరిపినందుకు ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ శాసనసభ్యులకు కూడా ఇలాగే నోటీసులు జారీచేసి విచారణ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా కావలికి చెందిన ప్రముఖ నాయకుడికి ఎస్పీ కార్యాలయం నుంచి శనివారం నోటీసు రాగా స్థానిక పోలీసులు నోటీసును సదరు నాయకుడుకి అందజేసినట్లు పట్టణంలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై డిఎస్పీ రఘును సంప్రదించగా తమకు ఏమీ తెలియదని తెలిపారు.

నగరంలో భారీ ర్యాలీ
నెల్లూరు టౌన్, సెప్టెంబర్ 17: విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆదివారం నగరంలోని స్టోన్‌హౌస్‌పేట నుండి ఆత్మకూరు బస్టాండు మీదుగా గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారతీయ జనతా మజ్దూర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో అన్ని విభాగాలకు చెందిన సుమారు వెయ్యి మంది కార్మిక సోదర, సోదరీమణులు పాల్గొన్నారు. అనంతరం గాంధీబొమ్మ సెంటరులో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథులుగా బిజెఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకటసుబ్బారావు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి సురేంద్రరెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్మికుల కష్టాలను చూసి వారి కోసం పనిముట్లు తయారుచేసిన మహోన్నత వ్యక్తి విశ్వకర్మ అని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిని ఘనంగా కార్మికులందరూ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తొలుత పప్పులవీధిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెఎంఎం జిల్లా అధ్యక్షుడు ఎ అంకయ్య, ప్రధాన కార్యదర్శి వి శ్రీ్ధర్, జి మాలకొండయ్య, ఎం రాజేష్‌కుమార్ కార్మికులు పాల్గొన్నారు.

నరసింహస్వామిని దర్శించుకున్న సినీనటుడు సుమన్
రాపూరు, సెప్టెంబర్ 17: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన నరసింహస్వామిని ప్రముఖ సినీనటుడు సుమన్ ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ట్రస్టు బోర్టు సభ్యులు సోమయ్య, సహాయ కమిషనర్ శనగవరపు శ్రీరామ్మూర్తి స్వాగతం పలికారు. ఆయన స్వామి, ఆమ్మవార్లను, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాన అర్చకులు రామయ్యస్వామి, ఆలయ చరిత్ర తెలిపే పుస్తకంతోపాటు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

పీపుల్స్ పార్కును అభివృద్ధి చేస్తాం:మేయర్
నెల్లూరుసిటీ, సెప్టెంబర్ 17: ప్రజలందరికీ ఆహ్లాదం కలిగించేలా పీపుల్స్ పార్కును అభివృద్ధి చేస్తామని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆదివారం 18వ డివిజన్‌లో హరనాధపురంలోని పీపుల్స్ పార్కులో స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం, పర్యవేక్షణతో పార్కులు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. డివిజన్‌కు అవసరమైన అన్ని అభివృద్ది పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు నూతన రోడ్డు నిర్మాణాలను చేపడతామని చెప్పారు. స్వచ్ఛత సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భగస్వాములు కావాలని కోరారు. అనంతరం కమిషనర్ డిల్లీరావు మాట్లాడుతూ స్థానిక సమస్యలపై పూర్తి నివేదికను పొందామని వాటిని పరిష్కారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజలు అవగాహన పెంచుకుని కార్పొరేషన్ సిబ్బంది విధులకు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు దార సరోజనమ్మ, శ్రీనివాసులురెడ్డి, డాక్టర్ నాయుడు, రామకృష్ణారెడ్డి, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

విపిఆర్ అమృతధార ప్రారంభం
యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం:వేమిరెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబర్ 17: విద్యావంతులైన యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పంచేడు దళితవాడలో ఆదివారం ఆర్వో ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ చేపట్టిన అమృతధార కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఉదయగిరి, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాలలోని గ్రామీణ ప్రాంతాలలో వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో వాటర్ ప్లాంట్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఖాళీగా ఉండే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. తొలుత బుచ్చి మండలంలోని పంచేడు గ్రామంలో, కొడవలూరు మండలం రామన్నపాళెం, విడవలూరు మండలంలోని గాదెలదినె్న గ్రామంలో, కోవూరు మండలం వేగూరు గ్రామంలో, ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట గ్రామంలో విపిఆర్ అమృత ధార వాటర్‌ప్లాంట్లను వేమిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విపిఆర్ ఫౌండేషన్ సిఇఓ నారాయణరెడ్డి సంస్థ చీఫ్ కో ఆర్డినేటర్ శంకర్, సింహపురి వైద్యశాల అధినేత రవీంద్రరెడ్డి, కేతంరెడ్డి, పంచేడు గ్రామ సర్పంచ్ రమణమ్మ, ప్రసాద్‌రెడ్డి, విపిఆర్ వికాస్ యూత్ పాల్గొన్నారు.

సంగంలో భారీ వర్షం
* నీటమునిగిన వరిపంట
* 500 ఎకరాల పంట నష్టం
సంగం, సెప్టెంబర్ 17: సంగం మండలంలో శనివారం రాత్రి నుండి ఆదివారం వేకువజాము వరకు భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో వీధులన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులకు కొన్ని వృక్షాలు నేలకొరిగాయి. చెరువులు వర్షపు నీటితో నిండాయి. పెన్నానదికి వర్షపునీరు భారీగా చేరింది. భారీ వర్షానికి మండలంలో వరిపంట నీట మునిగింది. దీంతో 500 ఎకరాల వరిపంట నష్టపోయి, రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పంట చేతికి వచ్చే సమయానికి భారీ వర్షం కురవడంతో వరిపంట తీవ్రంగా దెబ్బతిందని రైతులు ఆవేదన చెందారు. మరికొందరు రైతులు పంటను కోసి ధాన్యాన్ని బయటికి తెచ్చే వీలులేక వర్షంలోనే వదిలేసిన పరిస్థితి ఏర్పడింది. కాగా, వర్షం పూర్తిగా తగ్గడంతో జాతీయ రహదారిపై వరి ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. ఈ వర్షానికి మండలంలో పలువురు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఆత్మకూరు డివిజన్‌లో 438.2 మిమీ వర్షపాతం
ఆత్మకూరు: ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 438.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం సేకరించిన గణాంకాల మేరకు వివరాలిలా ఉన్నాయి. డివిజన్ పరిధిలో సంగంలో గరిష్టంగా 113.4 మిల్లీమీటర్లు, కనిష్టంగా మర్రిపాడులో 10.2 మిల్లీమీటర్లు నమోదైంది. ఆత్మకూరులో 46.2 మిల్లీమీటర్లు, వింజమూరులో 13.4, సీతారామపురంలో 17.2 మిల్లీమీటర్ల, ఉదయగిరిలో 32, అనుమసముద్రంపేటలో 23.8 మిల్లీమీటర్లు, చేజర్లలో 68.6 మిల్లీమీటర్లు, కలువాయిలో 68.4 మిల్లీమీటర్లు, అనంతసాగరంలో 45 మిల్లీమీటర్ల వంతున వర్షపాతం నమోదైంది.