శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మధ్యాహ్న భోజనంలో బల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, సెప్టెంబర్ 18: విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో సరఫరా చేసిన రసంలో చనిపోయిన బల్లి కన్పించింది. దీనిని గమనించకుండా భోజనం తిన్న 8 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన మండలంలోని కంటేపల్లి దళితవాడ ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కంటేపల్లి దళితవాడ పాఠశాలకు అక్షయపాత్ర సంస్థ మధ్యాహ్న భోజనం సరఫరా చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఆ భోజనాన్ని తిన్నారు. కూరలు సక్రమంగా లేకపోవటంతో అందరూ అరకొరగా తిని మిగిలినవి పారబోశారు. రసం పారబోస్తుండగా పాత్ర అడుగున బల్లి కన్పించింది. దీంతో భోజనం వడ్డించేవారు, ఉపాధ్యాయులు కంగుతిన్నారు. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులకు తెలియటంతో వారు హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చెందారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు వెంటనే 108 వాహనం, మండల స్థాయి అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 వాహనం సిబ్బంది, తహశీల్దార్ సోమ్లానాయక్, మండల విద్యాశాఖ అధికారి కొండయ్య హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్నారు. పాఠశాలలో మొత్తం 8 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే రసంతో భోజనం చేశారు. రసంతో భోజనం చేసిన 8 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే కొంత అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం వెంకటాచలంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కసుమూరు వైద్యాధికారి శంకరయ్య హుటాహుటిన వెంకటాచలం ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని అస్వస్థతకు గురైన వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తహశీల్దార్, మండల విద్యాశాఖ అధికారి ఆసుపత్రి వద్దకు వచ్చి అస్వస్థతకు గురైన విద్యార్థుల వివరాలు నమోదు చేసుకుని ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఎంతమంది మధ్యాహ్న భోజనం చేశారు. బల్లి ఉన్నట్లు ఎప్పుడు గుర్తించారు, అన్నం, తదితర వివరాలపై వారు ఆరాతీశారు. ఈ సంఘటనపై అక్షయపాత్ర నిర్వాహకులతోను మాట్లాడారు. ఈవిషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్షయపాత్ర సంస్థ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంపై మొదటి నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. భోజనం సక్రమంగా లేదని, నిత్యం ఒకే రకమైన కూరలు సరఫరా చేస్తుండటంతో విద్యార్ధులు ఆ భోజనం తిని అస్వస్థతకు గురవుతున్నారని అటు విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందోళన చేస్తున్నారు. భోజనం సక్రమంగా లేకపోవటంతో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆ భోజనం తిప్పి పంపుతున్నారు. అసలే భోజనం సక్రమంగా లేదని తీవ్ర అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కూరల్లో బల్లి దర్మనం ఇవ్వటంపై విద్యార్ధులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇకపై మధ్యాహ్న భోజనం ఇదేవిధంగా ఉంటే ఆందోళన చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. ఈసందర్భంగా పలువురు నాయకులు ఆసుపత్రి వద్దకు వచ్చి విద్యార్థులను పరామర్శించారు.

చివరి అంకానికి బెట్టింగ్ కేసు
* పోలీసుల అదుపులో దువ్వూరు శరత్‌చంద్ర
నెల్లూరు, సెప్టెంబర్ 18: జిల్లాలో సంచలనం రేకెత్తించిన క్రికెట్ బెట్టింగ్ కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన బుకీ కృష్ణసింగ్‌తో సహా పలువురు సబ్ బుకీలు, పంటర్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వీరిలో కొందరికి బెయిల్ మంజూరు కాగా, కృష్ణసింగ్‌తో సహా మరికొంతమంది జైలులోనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ముఖ్యమైన నిందితుడిగా పోలీసులు భావించిన నెల్లూరు కోటమిట్ట ప్రాంతానికి చెందిన దువ్వూరు శరత్‌చంద్ర అలియాస్ చెర సోమవారం ఉదయం జిల్లా పోలీసులకు లొంగిపోయారు. గత రెండు నెలలుగా విదేశాల్లో తల దాచుకుంటూ వచ్చిన చెర తన అరెస్టు తప్పదని తెలిసిన నేపథ్యంలో తప్పనిసరై పోలీసులకు లొంగిపోయారు. సోమవారం ఉదయం మూడవ నగర పోలీసుస్టేషన్‌లో లొంగిపోయిన చెర నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అతన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారించే అవకాశం ఉంది. ఇటీవల రామేశ్వరంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం వెనుక చెర ఒత్తిడి ఉందని అనుమానం పోలీసుల్లో ఉంది. ఈ విషయాన్ని విచారించి చెరను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

మా ఆదేశాలను పాటించకుంటే వెళ్లిపోవాల్సిందే
* ప్రజాప్రతినిధులకు ఇచ్చే విలువ ఇదేనా? * స్టాండింగ్ కమిటీ సమావేశంలో కమిషనర్‌పై మేయర్ ధ్వజం
నెల్లూరుసిటీ, సెప్టెంబర్ 18: కార్పొరేషన్‌లో సుప్రీం నేనే.. తాను ఇచ్చిన ఆదేశాలను పాటించలేని అధికారులు వద్దని, స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ అబ్దుల్ అజీజ్ పరోక్షంగా కమిషనర్ డిల్లీరావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజుల నుండి కమిషనర్, మేయర్ మధ్యి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉంది. మేయర్‌గా అబ్దుల్ అజీజ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఆరుగురు కమిషనర్లు మారారు. ఇప్పటివరకు ఏ ఒక్క కమిషనర్‌తో కూడా మేయర్ సఖ్యతగా ఉన్న దాఖలాలు కన్పించలేదు. కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవడం మేయర్ జీర్ణించుకోలేక పోతున్నారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం రెవెన్యూ విభాగంలో ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను వేరే సీట్లకు బదిలీ చేయడం, అంతేకాకుండా మేయర్‌కు అత్యంత సన్నిహిత ఉద్యోగి జీతాల్లో అక్రమాలకు పాల్పడడంతో దీనిపై కమిషనర్ చర్యలకు సిఫార్సు చేయడంతో అప్పటి నుంచి మేయర్, కమిషనర్ మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది. ఇదిలావుంటే మేయర్‌కు అత్యంత సన్నిహితుడైన ఒక కార్పొరేటర్‌కు సంబంధించి సీ బిల్స్‌పై కమిషనర్ సంతకం పెట్టకపోవడంతో ఆ కార్పొరేటర్ సోమవారం జరిగిన స్టాండింగ్ సమావేశాన్ని వేదిక చేసుకుని కమిషనర్‌ను టార్గెట్ చేశారు. ఇక కార్పొరేషన్‌లో ఈ కమిషనర్ ఉంటే ఇక మన ఆటలు సాగవని గుర్తించిన మేయర్ ఎలాగైనా కమిషనర్‌ను ఇక్కడ నుండి బదిలీపై పంపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈమధ్య కాలంలో మేయర్ కలెక్టర్‌తో భేటీ అయి ఎలాగైనా కమిషనర్‌ను ఇక్కడ నుంచి బదిలీ చేయాలని కోరారు. దానికి కలెక్టర్ ససేమిరా అనడంతో మంత్రి నారాయణ దృష్టికి ముగ్గురు కార్పొరేటర్లను పంపి కమిషనర్‌ను ఇక్కడ నుంచి బదిలీ చేయాలని విన్నవించారు. దీనిపై మంత్రి స్పదించకపోవడంతో మేయర్ మరో మార్గం ఎంచుకున్నారు. గత కొన్ని నెలల నుంచి ప్రతిపక్ష పార్టీలు స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా స్పందించని మేయర్ హఠాత్తుగా స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి కమిషనర్‌ను టార్గెట్ చేయాలని చూశారు. స్టాండింగ్ కమిటీ అజెండాలో కీలకమైన అంశాలు లేకపోయినప్పటికి కేవలం కమిషనర్‌ను టార్గెట్ చేసేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిసింది. అయితే స్టాండింగ్ కమిటీ సమావేశానికి కమిషనర్ ఎలాగైన వస్తారని మేయర్ ఈ సమావేశంలో తాడోపేడో తేల్చుకోవాలని చూసినట్లు సమాచారం. అయితే స్టాండింగ్ సమావేశానికి కమిషనర్ హాజరుకాకపోవడంతో మేయర్ పథకం రివర్స్ అయింది. కమిషనర్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా సోమవారం మధ్యాహ్నం నుంచి సెలవుపై వెళ్ళి సమావేశాన్ని నడిపించే బాధ్యత అదనపు కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించారు. సమావేశంలోని అజెండాకు ముందుగా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ప్రశాంత్ కిరణ్ జోక్యం చేసుకుని సమావేశానికి కమిషనర్ హాజరుకాకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. కమిషనర్ ప్రజాప్రతినిధులకు ఇచ్చే విలువ ఇదేనా? స్టాండింగ్ కమిటీ సమావేశానికి ముందుగా ఉన్న వ్యక్తి అర్ధాంతరంగా సెలవుపై వెళ్ళడం ఏమిటని ప్రశ్నించారు. కమిషనర్‌కు ప్రజాప్రతిధులంటే లెక్కలేకుండా పోయిందని ప్రజాస్వామ్యన్ని హేళన చేసే విధంగా ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన కమిషనర్ కార్పొరేషన్‌లో నిరంకుశ పాలన సాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాలకు ఊరట
నగరపాలక సంస్థలో విలీన గ్రామాలకు కుళాయి పన్నులో రాయితీలో కల్పిస్తున్నట్లు మేయర్ తెలిపారు. 2015 సంవత్సరం నుండి కార్పొరేషన్‌కు ఆరు నెలలకు 600 రూపాయలు మాత్రమే చెల్లించాలని కోరారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న బిపిఎస్ ప్లాన్‌లను వెంటనే మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసిన అంశాలను అధికారులు తప్పకుండా అమలుచేసి తీరాల్సిందేనని తెలిపారు. మార్ట్‌గేజ్ కింద దరఖాస్తు చేసుకున్న ఆర్జీలను వెంటనే పరిశీలించి వారికి మంజూరుచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దోమలను నివారించేందుకు ప్రతి డివిజన్‌కు ఒక హ్యాండ్ ఫాగింగ్ యంత్రం, నగరంలోని అన్ని ప్రాంతాలలో తిరిగేందుకు 4 పెద్దమిషన్లను కొనుగోలు చేయాలని సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో కంప్యూటర్లు ఉంటే ఇంకా నెల్లూరు కార్పొరేషన్ ఈ ఆఫీసు కంప్యూటర్లు లేవని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు పెంచలయ్యనాయుడు, మల్లెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, మామిడాల మధు, అదనపు కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఎస్‌ఇ రవికృష్ణరాజు, హెల్త్ ఆఫీసర్ శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

బట్టేపాడులో దుత్తలూరు పోలీసులపై దాడి
ఆత్మకూరు, సెప్టెంబర్ 18: ‘నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని మోసగించి లక్షలాది రూపాయలు దండుకున్న విద్యుత్ శాఖ ఉద్యోగి కేసులో ఇరుక్కుని పోలీసుల సహకారంతో ఆ కేసు నుంచి సులువుగా తప్పించుకున్నాడు. అలా తాను తప్పించుకోవడంలో సహకరించిన పోలీసులకు ఒప్పందం ప్రకారం ఇస్తామన్న లంచం మొత్తంలో మస్కా కొట్టడంతో పెద్ద రగడ ప్రారంభమైంది. సాక్షాత్తు పోలీసులే నేరాల్ని సమర్ధించి అనైతిక ప్రతిఫలం పొందేక్రమంలో చిక్కుల్లో పడ్డారు. ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో దుత్తలూరు సబ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరాజేష్, కానిస్టేబుళ్లపై స్థానికుల దాడి ఘటనతో ఆసక్తికర సంగతులు వెలుగులోకి వచ్చాయి. బట్టేపాడు గ్రామానికి చెందిన మాధవరెడ్డి అనే విద్యుత్ బిల్లు కలెక్టర్ గతంలో దుత్తలూరులో విధులు నిర్వహిస్తుండగా అక్కడి నిరుద్యోగ యువతను మభ్యపెట్టి విద్యుత్‌సంస్థలో షిఫ్ట్ ఆపరేటర్లగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ అవకాశాలను ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. అలా వారి నుంచి తలా లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఇరవై మంది వద్దనుంచి రాబట్టాడు. ఇలా వసూళ్లు చేసిన అతడు బాధితులకు మాయమాటలు చెప్పి ఏడాదిగా కాలం వెళ్లదీశాడు. సంవత్సరం గడుస్తున్నా ఉద్యోగం సంగతి తేల్చకపోవడంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. దీనిపై చాన్నాళ్లుగా పోలీసులకు, మాధవరెడ్డి, నిరుద్యోగ యువతకు నడుమ మధ్యస్థపు మంతనాలు జరిగాయి. పోలీస్ అధికారులు ఓవైపున ఈ నిందితుడికి అనుకూలంగా వ్యవహరిస్తూ నిరుద్యోగ యువతలో ఆవేశాన్ని చల్లార్చేలా కుట్రపూరిత వ్యవహరించారు. లంచంగా తీసుకున్న మొత్తంలో చాలా తక్కువగా తిరిగి ఇచ్చేందుకు పంచాయితీ చేశారు. ఆ మొత్తాలను అప్పగించేందుకు కూడా గడువు కావాలని ప్రామిసరీ నోట్లను రాసిచ్చాడు. అయితే అప్పటికే చాన్నాళ్లు కావడంతో సహా వ్యవహారం నీరుగారిపోతుండటం వల్ల ఇక చేసేదేమిలేక ఇక తిరిగి వచ్చే సొమ్మే చాలు అనుకుంటూ నిరుద్యోగులు మెత్తపడ్డారు. ఈక్రమంలో నిందితుడు మాధవరెడ్డి అందచేసిన చెక్కు సైతం బౌన్స్ అయింది. దానిపై మరలా అధికారికంగా కేసు కావడం, ఎట్టకేలకు మరలా ఉదయగిరి కోర్టులో లోక్ అదాలత్‌లో మధ్యస్థంగా రాజీ కావడం జరిగాయి. ఇలా కడకు నిరుద్యోగ యువతకు చాలా మొత్తాన్ని ఎగనామం పెట్టి తప్పించుకున్నారు. అలా నిరుద్యోగ యువతను తప్పించేలా సహకరిస్తే ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తమకు ఇస్తామన్న మొత్తంలో ఇంకా రూ. 2 లక్షల అమ్యామ్యా ఎగవేయడంతో మాధవరెడ్డి పోలీసులు కారాలు మిరియాలు నూరారు. పోలీసులు ఫోన్‌లో రెండు లక్షల లంచం గురించి వాకబు చేసినప్పుడు ఆ సంభాషణల్ని ఎంతో చాకచక్యంగా మాధవరెడ్డి రికార్డు చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించసాగాడు. దీంతో ఆగ్రహించిన దుత్తలూరు ఎస్సై రాజేష్ తన కానిస్టేబుళ్లతో కలసి సోమవారం వేకువజామున బట్టేపాడుకు చేరుకున్నారు. అక్కడ డబ్బు విషయమై చర్చిస్తుండగా మాట మాట పెరిగి మాధవరెడ్డి కుటుంబీకులైన మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన మాధవరెడ్డి తనయుడుతో సహా బంధువులు ఆ ఎస్సై, కానిస్టేబుళ్లపై తిరగబడ్డారు. చితక్కొట్టారు. దీంతో ఇక చేసేదేమిలేక స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో సహా ఆత్మకూరు డిఎస్పీ కెఎస్‌ఎస్‌వి సుబ్బారెడ్డి దృష్టికి కూడా దాడి సంగతి తీసుకెళ్లారు. ఆత్మకూరు డిఎస్పీ సుబ్బారెడ్డి హుటాహుటిన బట్టేపాడుకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. ఈక్రమంలో బాధిత పోలీసులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. నిందితులను ఆత్మకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సాధారణంగా పోలీస్ శాఖకు సంబంధించి ఇతర ప్రాంతాలకు చెందినవారు స్థానిక స్టేషన్‌కు సమాచారం తెలియజేయడంతో సహా ఇక్కడి సిబ్బందిని కూడా వెంటబెట్టుకుని వెళ్లడం ఆనవాయితీ. అలా చేయకుండా నేరుగా వెళ్లడంతో అనుమానాలకు తావిచ్చింది. ఏదేమైనా బాధితులైన నిరుద్యోగులకు బాసటగా నిలవాల్సిందిపోయి మధ్యస్థం చేసుకుని నిందితులకు అండగా వ్యవహరించి కడకు వారితో కలహపడి వివాదంలో చిక్కుకున్న దుత్తలూరు పోలీసుల వ్యవహారాన్ని సర్వత్రా తప్పుబడుతున్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
*ఎమ్మెల్యే పాశం పిలుపు
గూడూరు, సెప్టెంబర్ 18: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని, ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొనివెళ్లాలని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశం సునీల్‌కుమార్ కోరారు. సోమవారం రాత్రి స్థానిక ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో టిడిపి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా తెలుసుకొనాలన్నారు. దీనిపై ఇంకా ఏమైనా సమస్యలుంటే ప్రజల దగ్గరనుండి వివరాలు సేకరించాలని ఆయన నాయకులను, కార్యకర్తలకు సూచించారు. రాబోయేది ఎన్నికల సమయమని, ఈ ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన అనేక పథకాల గురించి ప్రజలకు వివరించి అవి వారికి అందుతున్నాయా లేదా తెలుసుకొనాలని కోరారు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన పించన్ పధకం, అర్హులందరికి గృహాలు, రైతురుణమాఫి, డ్వాక్రా సంఘాల రుణమాఫీ, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, చంద్రన్న భీమా, ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పధకం వంటి వాటిపై ప్రజలకు తెలియ చేయాలని, ముఖ్యంగా చంద్రన్నభీమా వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరు ఇందులో 15 రూపాయలు చెల్లించి సభ్యులుగా చేరినట్టయితే వారికి వచ్చే నెల నుండి సాధారణ మరణానికి కూడా 2 లక్షల పరిహారం అందుతుందన్న విషయాన్ని తెలియ చేయాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు చేవూరి విజయమోహన్ రెడ్డి, నెలబల్లి భాస్కరరెడ్డి, బి కోటేశ్వరరావు, నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చౌకదుకాణాల ఖాళీలు భర్తీ చేయండి:జెసి
వేదాయపాళెం, సెప్టెంబర్ 18: జిల్లాలో ఖాళీగా ఉన్న 104 చౌకధరల దుకాణాలను వెంటనే భర్తీచేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ఆదేశించారు. సోమవారం కొత్త జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్, జిల్లాస్థాయి ఆహార సలహా సంఘ సమావేశం జరిగింది. ఈసందర్భంగా జేసి మాట్లాడుతూ జిల్లాలో 1896 చౌకధరల దుకాణాలు ఉన్నాయన్నారు. నెల్లూరులో 13, గూడూరులో 30, కావలిలో 20, ఆత్మకూరులో 12, నాయుడుపేటలో 29 దుకాణాలు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. చౌకధరల దుకాణాలలో బియ్యం మాత్రమే పంపిణీ చేయడం వలన 80నుంచి 85శాతం మాత్రమే పంపిణీ జరుగుతుందన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి గత మంత్రి వర్గ సమావేశంలో ప్రతి చౌకధరల దుకాణాలను విలేజ్ మాల్స్‌గా ఏర్పాటు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నారని ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు రానున్నాయన్నారు. దీపం పథకం క్రింద దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే వెంటనే వాటిని మంజూరు చేయాల్సిందిగా పౌరసరఫరాల శాఖాధికారులను ఆదేశించారు. సి ఎం ఆర్ బకాయిలను సంబంధిత రైస్‌మిల్లర్ల నుంచి సేకరించాలని, 26డిఫాల్ట్ రైస్‌మిల్లర్లపై ఆర్. ఆర్ యాక్ట్ ప్రకారం వారి ఆస్థులను జప్తు చేయవలసిందిగా తహసిల్దార్లను ఆదేశించారు. 21 చౌకధరల దుకాణాల విభజన కొరకు సభ్యలు ఏకగ్రీవంగా తీర్మానించారని తెలిపారు. ఈ సమావేశంలో నెల్లూరు, కావలి, నాయుడుపేట, ఆత్మకూరు ఆర్డి ఓలు డి.హరిత, భక్తవత్సలరెడ్డి, శీనానాయక్, బాపిరెడ్డితోపాటు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ధర్మారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

బిసిల అభ్యున్నతి టిడిపితోనే సాధ్యం
*ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పష్టం
నెల్లూరు టౌన్, సెప్టెంబర్ 18: బిసిలందరికీ వారివారి కులవృత్తుల వారీగా బిసి ఫెడరేషన్, కార్పొరేషన్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. సోమవారం నగరంలోని టిడిపి కార్యాలయంలో జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు పిఎల్ రావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీద రవిచంద్ర పాల్గొని మాట్లాడుతూ, సిఎం చంద్రబాబునాయుడు బిసిలపై ఉన్న అభిమానంతో ఈ జిల్లాలో బిసి భవన్‌కు స్థలాన్ని కేటాయిస్తూ భవన నిర్మాణానికి నిధులను కేటాయించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో అభినందనలు తెలిపారు. భవన నిర్మాణానికి సహకరించిన ఇన్‌చార్జి మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, జిల్లా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి నారాయణ, ఎమ్మెల్యేలు ఇన్‌చార్జిలకు అభినందనలు తెలిపారు. బిసిలందరు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమాలను ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. రాష్ట్రంలోని బిసి భవన్‌ను ఒక ప్రత్యేకత కలిగిన భవనంగా నిపుణులు సలహాలు, సూచనల మేరకు ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో జ్యోతిరావు పూలె విగ్రహాలను, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఏర్పాటు చేసే కార్యక్రమాలను నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ జడ్ శివప్రసాద్, కె పాలుశెట్టి, ఎ దయాకర్ గౌడ్, నూనె మల్లికార్జున యాదవ్, హరిబాబు యాదవ్, దేవరాల సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు గౌడ్, ఎం నిర్మల తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయం ముట్టడి
* ఉద్యోగులను బయటకు పంపి ఆందోళన
గూడూరు, సెప్టెంబర్ 18: గూడూరు పురపాలక సంఘంలో ప్రజా సమస్యలను అధికారులు గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ సోమవారం వైకాపా కేంద్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకుపంపి ప్రధానద్వారం మూసి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకొనబడిన తమను అసలు మున్సిపల్ అధికారులు పట్టించుకొనడం లేదని, ప్రజా సమస్యలను అజెండాలో పొందుపరచాలని కోరినా సాధారణ సమావేశాలు నిర్వహించకుండా అత్యవసర సమావేశాలు అంటూ మొక్కుబడి సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను చర్చకు తీసుకొని రావడం లేదని అన్నారు. ప్రధానంగా గూడూరు 4వ వార్డులో సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయని, దీనిపై తమ పార్టీకి చెందిన ఆ వార్డు కౌన్సిలర్ చోళవరం గిరిబాబు ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ప్రతి నెల కమిషనర్‌కు అక్కడి సమస్యలపై వినతి పత్రాలుసమర్పిస్తున్నా ఒక్క సమస్యను నేటికి అధికారులు పరిష్కరించక పోవడంతో ఆ వార్డులో ఆయన ప్రజలకు సమాధానం చెప్పుకొనలేని పరిస్తితి నెలకొని ఉందన్నారు. తమ పార్టీకి చెందిన వారికి మీరెట్టా నిధులు కేటాయించరు, తమ పార్టీకి చెందిన ఎంపి 4వ వార్డులో అభివృద్ది పనులకు 5 లక్షల రూపాయలు నిధులు కేటాయిస్తే ఇంత వరకు ఆ పనులకు సంబంధించి ఎటువంటి చర్యలుతీసుకొనక పోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గూడూరు పురపాలక సంఘ భవన నిర్మాణానికి, గూడూరు ప్రజల శాశ్వత తాగునీటి ఎద్దడి నివారణకు అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ప్రచారం తప్పించి వార్డుల్లో ప్రజలకు చేసిందేమి లేదని ఆయన దుయ్యబట్టారు. పురపాలక సంఘ నిధులు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా సనత్‌నగర్‌లో భారీ భవంతుల నుండి వసూలు చేసిన పన్నులతో అక్కడ అభివృద్ది చేస్తే సరి పోతుందని, ప్రధానంగా 4వ వార్డులో తాగునీరు, రోడ్లు, వీధిలైట్లు లేక ప్రజలు నానాతంటాలు పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా తాగునీటి కొళాయిలు వేయించుకొనేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొందన్నారు. పురపాలక సంఘానికి నిధులు పుష్కలంగా ఉన్నా వాటిని సమస్యలున్న ప్రాంతాలను గుర్తించి ఖర్చు చేయాల్సిన అధికారులు ఆ దిశగా ఆలోచించకుండా వేసిన సిసి రోడ్లునే వేస్తున్నారని ఆరోపించారు. ఫ్రతిపక్ష వార్డుల్లో పనులు చేపట్టకుండా ఉన్న కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకొనలేక పోతున్నారని, వారిని ప్రశ్నించే ధైర్యం మీకు లేదా అని మేనేజర్‌ను గోపాల్‌రెడ్డి నిలదీశారు. 4వ వార్డు కౌన్సిలర్ చోళవరం గిరిబాబు మాట్లాడుతూ తాను గత సంవత్సర కాలం నుండి వార్డులో నెలకొని ఉన్న సమస్యలపై కమిషనర్‌కు వినతిపత్రాలు అందచేశానని, ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదన్నారు. తన వార్డులోని సనత్‌నగర్‌లో మంచినీటి పైపులైను అసంపూర్తిగా వేసి నిలిపేశారని, స్వర్గ్ధామం రహదారిలో 13వ ఆర్థిక సంఘ నిధులతో చేపట్టిన సిసి రోడ్డు, కాలువ నిర్మాణం కూడా అసంపూర్తిగా ఉందన్నారు. నరసయ్య గుంట గిరిజన కాలనీలో మరుగు దొడ్ల నిర్మాణంలో చోటుచేసుకొన్న అవినీతిపై విచారణ జరపాలని కోరినా ఇంతవరకు అతీగతీలేదన్నారు. తమ వార్డు ప్రజలు పన్నుల రూపంలోలక్షల రూపాయలను పురపాలక సంఘానికి చెల్లిస్తున్నా అధికారులు సౌకర్యాలు మాత్రం కల్పించక పోవడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా ఎల్లసిరి గోపాల్ రెడ్డి తాము ఆందోళన చేస్తున్న మున్సిపల్ సిబ్బంది విధుల్లో ఉండటాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసి వారందరిని బయటకు పంపి మేనేజర్‌ను నిలదీశారు. ఈ కార్యక్రమంలో వైకాపా పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, మగ్ధూం మొహిద్దీన్, మనోహర్, పలువురు వైకాపా కార్యకర్తలు, 4వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.