శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

టేకు చెట్ల వ్యవహారంలో తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 21: శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన 30 ఎకరాల పొలం లీజుకు తీసుకున్న వేమిరెడ్డి హరిశివారెడ్డి అందులో ఉన్న సుమారు 290 టేకుచెట్లను నరికి తరలించిన సంఘటనలో అధికారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా గతంలో నెల్లూరు తహశీల్దార్‌గా పనిచేసిన జనార్దన్‌రావును గురువారం జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈసంఘటనతో టేకుచెట్ల వ్యవహారంతో సంబంధం ఉన్న మిగిలిన అధికారులలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జనార్దనరావు నెల్లూరు నుండి బదిలీ అయిన తరువాత పాత తేదీలు వేసి టేకుచెట్ల నరికివేతకు అనుమతులు ఇచ్చినట్లుగా విచారణ అధికారిగా వ్యవహరించిన నెల్లూరు ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు విచారణ మేరకు తహశీల్దార్‌పై చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఆ భూముల్లోనే సుమారు పది ఎకరాలకు పైన అక్రమంగా గ్రావెల్‌ను తరలించినట్లు విచారణలో తేలడంతో ఆ సంఘటనకు పాల్పడిన వేమిరెడ్డి హరిశివారెడ్డి తండ్రి అయిన వేమిరెడ్డి హంసకుమార్‌రెడ్డిపై తాజాగా కేసు నమోదు చేసినట్లు తెలిసింది. మొత్తం మీద ప్రభుత్వం జిల్లాలో పార్టీకి జరిగిన అప్రతిష్ఠను సరిదిద్దడం మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. అధికారులకు ఈ చర్యతో ముచ్చెమటలు పడుతున్నాయి. విఆర్‌ఓ, ఆర్‌ఐ, అటవీ శాఖ, పోలీసు శాఖలలో కలకలం మొదలైంది. మొదట ఈ కేసును ఆషామాషీగా తీసుకున్న అధికారులు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఈ సంఘటన వెళ్లటంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. హరిశివారెడ్డి పరారైనట్టు పోలీసులు చెబుతున్నప్పుడు ఆయన సమీప బంధువు రామలింగాపురంలోని ఇంటిలో తల దాచుకున్నట్లు సమాచారం. హరిశివారెడ్డి కోర్టులో లొంగిపోవడం కూడా పోలీసు శాఖపై తీవ్ర ప్రభావం చూపింది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ వ్యవహారం విషయంలో ఓ పోలీసు అధికారి ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎస్‌పి సీరియస్‌గా ఉన్నట్లు ఆ పోలీసు అధికారిపై కూడా చర్యలు తీసుకొనే దశగా ముందుకు సాగుతున్నట్లు తెలిసింది. నెల్లూరు రూరల్ మండలం ఐడి పార్టీకి చెందిన కొంతమంది టేకు చెట్ల తరలింపు వ్యవహారంలో ప్రథమ భూమిక పోషించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా తెలుగుదేశం పార్టీలోని ఇద్దరు మాజీ మంత్రులు ఈ సంఘటనను ఎవరికి వారు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఇప్పటికే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. ఓ మాజీ మంత్రికి చెందిన వర్గం మాత్రం హంసకుమార్‌రెడ్డి కుటుంబాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తుండగా, వారి డిమాండ్‌కు అడ్డుకట్టవేయడం కోసమే హరిశివారెడ్డిని కోర్టులో లొంగిపోయే విధంగా పథకం రచించినట్లు తెలుస్తోంది. మొదట హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసి, పార్టీలో పరిస్థితి చేయిదాటిపోవడంతో లొంగిపోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. హంసకుమార్‌రెడ్డిపై అక్రమ గ్రావెల్ తవ్వకం కేసును ఓ మాజీ మంత్రి వర్గం పోలీసు శాఖపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించినట్లు సమాచారం. ఈ కేసులో సస్పెండ్ అయిన తహశీల్దార్‌పై గతంలోనే అనేక ఆరోపణలు వెల్లువెత్తగా ఆ సమయంలో ఓ మాజీ మంత్రి అండగా నిలిచారన్న వార్తలు వినవచ్చాయి. అప్పట్లో వెంకటాచలం తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఆయన భూముల కొనుగోలు విషయంలో ఒకరికి మధ్యవర్తిగా వ్యవహరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన నెల్లూరు తహశీల్దార్‌గా రావడానికి మార్గం సుగమమైంది. ఒకానొక సమయంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం కాలేజీ విద్యార్థుల వద్ద భారీస్థాయిలో నగదు వసూలు చేసినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో విద్యార్థి సంఘాలు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు చేసి కలెక్టర్ దృష్టి వరకు తీసుకువెళ్లారు. మాజీ మంత్రి అండ చూసుకొని ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించి చివరకు సస్పెండ్ అయ్యారు. నెల్లూరు నుండి దగదర్తి మండలానికి ఆయనను బదిలీ చేయగా, అక్కడ ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ప్రస్తుతం దీర్ఘకాల సెలవులో ఉన్నారు.