శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

46 టిఎంసిలు పైబడిన సోమశిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, అక్టోబర్ 17: సోమశిల జలాశయ నీటిమట్టం అనూహ్యంగా ఊపందుకుంటోంది. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో 18,270 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదు కాగా, సాయంత్రం ఆరుగంటలకు 45వేల క్యూసెక్కుల వరకు తరలివస్తున్నాయి. ఇదే సందర్భంలో సోమశిల-కండలేరు వరద ప్రవాహపు కాలువ ద్వారా తెలుగుగంగ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తరలించే నీటి రాశిని రెండువేల క్యూసెక్కుల నుంచి ఐదువేల క్యూసెక్కులకు పెంపుదల చేశారు. ఇదిలాఉంటే జలాశయ నీటిమట్టం 95.485 మీటర్లు (313.27 అడుగుల)గా నమోదైంది.

విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన
పెళ్లకూరు, అక్టోబర్ 17: మండల పరిధిలోని శిరసనంబేడు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మంగళవారం సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల తరఫున మండల టిడిపి అధ్యక్షులు వి మురళీకృష్ణారెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతూ సిఎం రైతుల సంక్షేమం కోసం ఓవైపు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నా అధికారులు విద్యుత్ సరఫరా అవాంతరాలు సృష్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు పగటిపూట మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలన్న సిఎం ఆదేశాలు ఇక్కడి అధికారులు పాటించడం లేదన్నారు. శిరసనంబేడు సబ్ స్టేషన్ పరిధిలోని రైతులకు రాత్రి 8 గంటల నుండి మరుసటి దినం ఉదయం ఆరు గంటల వరకు సరఫరా ఇవ్వడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా చేయడం వల్ల రైతులు వ్యవసాయ పొలాల దగ్గర పడిగాపులు కాస్తున్నారని, ఏ క్షణంలో ఏమిజరుగుతుందోనని ఆందోళనలో రైతు కుటుంబ సభ్యులు ఉన్నారన్నారు. సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్లు చిన్నపాటి వర్షం పడినా సరఫరా నిలిపివేస్తున్నారన్నారు. అనంతరం నాయుడుపేట విద్యుత్ శాఖ ఎడిఇ ప్రభాకర్ రైతులతో మాట్లాడుతూ ఈ సబ్ స్టేషన్ పరిధిలోని రైతులకు పగటిపూట విద్యుత్ సరఫరా చేయడంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నట్టు తెలిపారు. రైతుల కోరిక మేరకు బుధవారం నుండి నెల రోజులపాటు పగటిపూట వ్యవసాయ మోటార్లకు విద్యుత్ అందిస్తామని, మరో వారం రోజులపాటు రాత్రి వేళల్లో సరఫరా చేయనున్నట్టు తెలిపారు. రైతుల ఆందోళన సందర్భంగా ఈ మార్గంలో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వేలూరు హరిబాబురెడ్డి, రైతులు రవీంద్ర, సుధాకర్ రెడ్డి, రఘురామయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
గూడూరులో పడకేసిన పారిశుద్ధ్యం
* రోగాలబారిన జనం
గూడూరు, అక్టోబర్ 17: పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వాస్తవరూపంలో కన్పించడం లేదు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటుచేసి మూడేళ్లు దాటిపోతున్న తరుణంలో తాజాగా స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం గూడూరులో గుండుసూది వేసి వెదికినా పారిశుద్ధ్యం మెరుగుకు తీసుకున్న చర్యలు కంటితుడుపు మాత్రమేనని చెప్పవచ్చు. ఏ వార్డులో చూసినా ఏమున్నది గర్వకారణం, పట్టణమంతా మురికిమయం అనే చందాన గుడ్ ఊరు కాస్తా బ్యాడ్ ఊరుగా రూపాంతరం చెందుతున్నా ఇక్కడి పాలకుల్లో చలనం లేకపోవడంతో పట్టణమంతా విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గూడూరు పురపాలక సంఘంలో 33 వార్డులు ఉండగా అందులో 27 మురికివాడలున్నాయి. పట్టణంలో నిత్యం పారిశుద్ధ్య పనులు నిర్వహించాల్సిన సిబ్బంది అధికారుల పర్యవేక్షణ లేక తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యూతో సమీప ప్రాంతాల్లో పలువురు మృత్యువాత పడినా ఇక్కడి పాలకవర్గంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదని పట్టణవాసులు మండిపడుతున్నారు. 2015వ సంవత్సరం వరదల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అర్ధరాత్రి గూడూరులో పర్యటించిన సమయంలో ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ సమయంలో గూడూరు పట్టణం మురుగుమయం కాకుండా పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తామని ఇచ్చిన హామీ నీటిమూటలయ్యాయని వైకాపా నేతలు విమర్శిస్తున్నారు. ప్రతి ఇంటిలో పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేయడమే కాకుండా వారిని రోగాలపాలు చేస్తున్నాయి. పట్టణంలో అభివృద్ధి మాట దేవుడెరుగు కనీసం తమకు ఓట్లేసి గెలిపించిన ఫ్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైకాపా కౌన్సిలర్లు అంటున్నారు. కనీసం మురుగునీటి కాలువల్లో మురుగు తీయలేని దుస్థితిలో గూడూరు పురపాలక సంఘం ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే గూడూరు పురపాలక సంఘానికి చెల్లిస్తున్న పన్నులు కాకుండా స్వచ్ఛ భారత్ పన్నుల పేరుతో వసూలు, ప్రచార్భాటాలతో మొత్తం స్వచ్ఛమయి పోతుందని, ప్రజలను భ్రమలో పడేయటం ఎంతవరకు సమంజసమని వైకాపా కౌన్సిలర్లు నాసిన నాగులు, చోళవరం గిరిబాబు ప్రశ్నించారు. ముందు ప్రజల వద్ద నుండి మనం వసూలు చేస్తున్న డబ్బుతో కనీసం కాలువల్లో మురుగు తీసి ప్రజలపై దోమల దండయాత్ర జరగకుండా చేయండని, పైపై మెరుగులు దిద్దే పనులు కాకుండా మురికివాడలపై దృష్టిసారించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వారు ఈ సందర్భంగా కమిషనర్‌ను కోరారు. ఇదిలావుండగా పట్టణంలోని ఐసిఎస్ రోడ్డులో ఓ ప్రైవేటు వ్యక్తి భవన నిర్మాణం కోసం నాలుగేళ్ల క్రితం తీసిన పునాదులను కోర్టు వివాదాల కారణంగా అలాగే వదిలేశారు. దీంతో ప్రస్తుతం చిన్నపాటి వర్షానికి సైతం ఆ గుంతలోకి నీరు చేరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దాని నుండి వెలువడే దుర్వాసన భరించలేక పోతున్నామని వాపోతున్నారు. అలాగే సమీప ప్రాంతాల వారు ఇక్కడే మూత్రవిసర్జన చేస్తుండటం, చుట్టుపక్కల వారు చెత్తను అక్కడే పడేయడంతో దోమలు వ్యాప్తి చెంది ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని ఆప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపడుతున్నామని చెబుతున్న మున్సిపల్ సిబ్బంది ఆ దిశగా తీసుకొన్న చర్యలు ఏమీలేవని ప్రజలు బాహాటంగానే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పలు ప్రాంతాల వారు వచ్చి మూత్రవిసర్జన చేస్తుండటంతో తాము కనీసం ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని మహిళలు వాపోతున్నారు. పాలకులు, అధికారులు ప్రచార్భాటాలు కాకుండా ఈ సీజన్‌లో అయినా దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.