శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

గీత దాటితే వాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 22: అవినీతి విషయంలో ప్రజల నుంచి ఆరోపణలు, ఫిర్యాదులు ఎదుర్కోవటంలో మిగతా ప్రభుత్వ శాఖలతో పోలిస్తే ముందు వరుసలో ఉండే పోలీస్ శాఖలో ప్రస్తుతం ఒక రకమైన నిస్తేజం, నిశ్శబ్దం ఆవరించింది. జిల్లా ఎస్పీగా పిహెచ్‌డి రామకృష్ణ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అవినీతి, ఆమ్యామ్యాలకు అలవాటు పడిన కొందరు పోలీస్ సిబ్బంది తమ పద్ధతులు మార్చుకొని బుద్ధిగా ప్రజల ఫిర్యాదుల పట్ల సానుకూలంగా స్పందిస్తుండగా, అవినీతి నుండి నిజాయితీకి మారలేని కొందరు అధికారులు, సిబ్బంది మాత్రం ఎస్పీ తీసుకుంటున్న శాఖాపరమైన చర్యలతో తాత్కాలికంగా విధులకు దూరమవుతున్నారు. గత కొన్ని నెలలుగా జిల్లా పోలీస్ శాఖలో క్షేత్రస్థాయి నుండి ఉన్నతాధికారి వరకూ అందరూ నిబద్ధతతో ఉండాలని కోరుకుంటూ ఎస్పీ తనదైన శైలిలో ప్రక్షాళన చర్యలు చేపట్టారు. జిల్లాలో సంచలనంగా మారిన క్రికెట్ బెట్టింగ్ బుకీల కేసు నుండి ఈ పరిస్థితి ప్రారంభమైందనే చెప్పాలి. గతంలో బుకీలకు తమ సర్వ సహకారాలు అందించిన పోలీస్ అధికారులు ప్రస్తుతం విధులకు దూరంగా జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నగర డిఎస్పీ రాముడితో పాటు అప్పట్లో ఎస్బీ డిఎస్పీగా వ్యవహరించిన విక్రమ శ్రీనివాసరావులతో సహా మరో ఇద్దరు ఇన్స్‌పెక్టర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ చర్యలతో తాను కేవలం క్షేత్రస్థాయి సిబ్బందిపై మాత్రమే కాకుండా అవినీతికి పాల్పడినవారు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకుంటాననే సంకేతాలను ఎస్పీ తమ సిబ్బందికి పరోక్షంగా స్పష్టం చేశారు. అదేవిధంగా స్టేషన్లలో రెండవ ఎస్‌హెచ్‌ఓ స్థాయి హోదా అనుభవిస్తూ కలెక్షన్ కింగ్‌లుగా మారిన కొందరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులను విఆర్‌కు ఎస్పీ పిలిపించారు. గతంలో ఇటువంటి సిబ్బందిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా జిడి వ్యవస్థను నిర్మూలించిన అధికారి లేరనే చెప్పాలి. ఒకేసారి 52 మంది సిబ్బందిని విఆర్‌కు పిలిపించడం, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒకేసారి సుమారు 30 మందికి పైగా ఉద్యోగులను బదిలీ చేయడం వంటి నిర్ణయాలు.. అవినీతి, నిర్లక్ష్యం వంటి విషయాల్లో ఎస్పీ ఎంత కఠినంగా ఉన్నారో తెలియచేస్తున్నాయి. ఓవైపు ఎస్పీ స్థాయి అధికారి చిన్న తప్పును కూడా క్షమించకుండా తగిన చర్యలు తీసుకుంటూ ఉంటే, మరోవైపు సైదాపురం ఎస్సై ఏడుకొండలు ఓ మహిళా సర్పంచిని లైంగికంగా వేధించడం పోలీస్ శాఖలో ఇంకా కొనసాగుతున్న విచ్చలవిడితనాన్ని తేటతెల్లం చేసింది. వెంటనే సదరు ఎస్సైను ఎస్పీ సిఫార్సుతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడాన్ని పక్కనబెడితే ఉన్నతాధికారి ఎంత కఠినంగా నిబద్ధతతో వ్యవహరిస్తున్నప్పటికీ జిల్లాలో అక్కడక్కడా కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ ఉల్లంఘించేలా ప్రవర్తిస్తుండడం పోలీస్ బాస్‌కు అసహనం తెప్పిస్తోంది. అయితే ఎక్కడ తప్పు జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటూ క్రమశిక్షణ అనే గీత దాగితే వాత తప్పదన్నట్లు ఎస్పీ వ్యవహరిస్తుండడంతో పోలీస్ సిబ్బందిలో భద్రతతో కూడిన భయం ఏర్పడింది. దీంతో గతంతో పోలిస్తే స్టేషన్లలో ఫిర్యాదుల పరిష్కారం మొదలు, కాసుల వసూలు కూడా కాస్త తగ్గిందనేది వాస్తవం.

విషజ్వరాలు ప్రబలుతుంటే అధికారులు నిద్రపోతున్నారా?
* ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం
నెల్లూరు రూరల్, అక్టోబర్ 22: గ్రామాలలో విషజ్వరాలు సోకి ప్రజలు చనిపోతుంటే అధికారులు చోద్యం చేస్తున్నారా అంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆదివారం పొట్టేపాళెం ప్రాంతంలో 23వ రోజు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒక్క పొట్టేపాళెం ప్రాంతంలోనే విషజ్వరాల బారినపడి ఐదుగురు మృతి చెందారని, వందల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. ఇంత దీనస్థితిలో ప్రజలు ఉంటే కార్పొరేషన్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. పొట్టెపాళెం ప్రాంతంలో పారిశుద్ధ్యం అత్యంత అధ్వాన్నంగా తయారైందని, గ్రామంగా ఉన్న ప్రాంతాన్ని కార్పొరేషన్‌లో విలీనం చేసి చేతులు దులుపుకున్న అధికారులు వౌలిక వసతులు కల్పించడంలో శ్రద్ధ వహించడం లేదని ఆరోపించారు. పొట్టెపాళెం ప్రాంతంలో మురుగునీరు కాల్వలు లేక ఎక్కడ నీరు అక్కడే నిలబడి దోమలకు పుట్టినిల్లుగా మారిందని, దుర్గందంగా తయారైందని అన్నారు.

కౌలు రైతులకేదీ ఉపశమనం?
*రుణ ఉపశమనంలో చుక్కెదురు

నెల్లూరు, అక్టోబర్ 22: కౌలు రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, రుణ ఉపశమనాలు క్షేత్రస్థాయిలో వారికి అందడం లేదు. ప్రభుత్వం కౌలు రైతులను ఆశించిన స్థాయిలో ఆదుకోవడం లేదు. ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా రైతులకు పూర్తిస్థాయిలో కౌలు రైతుగా గుర్తింపుకార్డులు అందజేయకపోవటంతో వారికి రావాల్సిన రాయితీలు అందుకోలేకపోతున్నారు. మరోవైపు రుణాలు ఆశించిన స్థాయిలో ఇవ్వడం లేదు. దీంతో కౌలు రైతు కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. రుణాలు అందజేయడంలో ప్రభుత్వ మార్గదర్శకాలను బ్యాంక్ అధికారులు పట్టించుకోక అలసత్వం ప్రదర్శిస్తూ కౌలు రైతులకు రుణాల ఇవ్వటానికి కుంటిసాకులు చూపి మంజూరుకు నిరాకరిస్తున్నారు. ఏటా లక్ష్యాలు నిర్ధేశిస్తున్న ప్రభుత్వం, బ్యాంక్‌లు, వ్యవసాయ ఉన్నతాధికారులు రాయితీలు, రుణాల మంజూరు వ్యవహారంలో చొరవ తీసుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కౌలు రైతుకు ప్రభుత్వంతో పాటు భూమి యజమాని ధ్రువీకరణ పత్రం ఇవ్వవలసి ఉందని అధికారులు అంటుండగా చట్టంలో అది లేదని క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే సరిపోతుందని రైతు సంఘాలు అంటున్నాయి. కౌలు రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం లక్ష్యాలు పెంచుకుంటూ పోతున్నా ఫలితాలలో మాత్రం వెనుకబడుతోంది. పథకం అమల్లోకి వచ్చిన నాటినుండి గమనిస్తే రుణాలు తీసుకున్న కౌలు రైతుల సంఖ్య పెరగవలసిందిపోయి గణనీయంగా తగ్గిపోతుండటంతో వారికి ఏమేర ఆర్థిక చేయూత అందుతుందో తేటతెల్లమవుతోంది. చాలా బ్యాంక్‌లు భూ యజమానులకే ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాయని కౌలు రైతులకు రుణాలు ఇవ్వటానికి బ్యాంక్‌లు మొండికేస్తున్నాయి. దీనికితోడు చాలామంది వ్యవసాయ భూయజమానులు పంట రుణాలు పొంది బకాయి ఉండటంతో కౌలు రైతులకు రుణం పుట్టని పరిస్థితులు ఎదురయ్యాయి. ఏదిఏమైనా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన కౌలు రైతులందరికీ రుణ సదుపాయం కల్పించాలని కౌలు రైతులు, కౌలు రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

పతనం దిశగా విలువ!
*వాహనాల వేలం ఎప్పుడో?
ఆత్మకూరు, అక్టోబర్ 22: అటవీశాఖ యంత్రాంగం ఆధ్వర్యంలో వివిధ సందర్భాల్లో పట్టుబడుతున్న వాహనాల్ని బహిరంగ వేలం నిర్వహించడంలో అంతూదరి లేని రీతిన తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఈక్రమంలో మన్నికైన వాహనాలు సైతం ఎందుకూ కొరగాని రీతిలో మారుతున్నాయి. ఏళ్ల తరబడి మూలన పడేయడంతో ఎండకు ఎండి, వానకు తడుస్తూ అప్పుడప్పుడైనా రన్నింగ్ కండీషన్‌లోకి తీసుకురాని వైనంతో కండెమ్డ్ వాహనాల కంటే హీనంగా మారుతూ కడకు ముందుకు కదల్లేకపోతున్నాయి. అటవీశాఖ ఆత్మకూరు రేంజర్ కార్యాలయం వద్ద పెద్దసంఖ్యలోనే సీజ్డ్ వాహనాలు కనిపిస్తున్నాయి. వీటిలో అత్యధిక భాగం ఎర్రచందనం అక్రమంగా తరలిస్తూ పట్టుబడినవే. ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి 2014 జూన్ మాసంలో అధికారంలోకి రాగానే ఆర్థికంగా సంక్షోభాన్ని అధిగమించేందుకై ఎర్రచందన నిల్వలపైనే దృష్టిసారించింది. దీంతో అప్పటి వరకు పట్టుబడిన ఎర్రచందనం దుంగలను చట్టప్రకారం విక్రయించేందుకు గ్లోబల్ టెండర్ల ద్వారా వేలం ప్రక్రియ నిర్వహించారు. ఎర్రచందనం నిల్వలకు వేలం నిర్వహించినా, వాటిని తరలిస్తూ పట్టుబడిన వాహనాల సంగతి అటవీశాఖ యంత్రాంగం పూర్తిగా విస్మరించింది. అయితే ఇదే అదనుగా ఇంటి దొంగలు ఆయా వాహనాల్లోని విలువైన విడిభాగాలను మాయం చేసేశారు. ప్రధానంగా బ్యాటరీలు, ఇతర విలువైన సామగ్రి ఏ సీజ్డ్ వాహనంలోనూ కనిపించడం లేదు. వాహనాలకు సంబంధించే కాకుండా ఎర్రచందనం దుంగల్ని సైతం మాయం చేసిన వ్యవహారం గతంలో అటవీశాఖలో అలజడికి తావిచ్చింది. ఆత్మకూరు రేంజ్ కార్యాలయానికి పక్కనే ఉన్న చెరువువద్దకు రాత్రి వేళల్లో సీజ్డ్ ఎర్రచందనం దుంగల్ని గతంలో తరలించిన ఘటనలు కోకొల్లలు. ఎట్టకేలకు సదరు ఇంటి దొంగల నడుమ పొత్తులుపోక గుట్టు రట్టైంది. అయితే ఆ సందర్భంగా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే ఓ చిరుద్యోగిపై చర్యలు తీసుకుని సరిపెట్టారు. ఇదే ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పోలీసుశాఖ మాత్రం డిప్యూటీ రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న గాలీబ్‌ను సైతం అరెస్ట్ చేసి కోర్టుకు ఈడ్చిన ఘటన తెలిసిందే. ఎర్రచందనం సంగతే ఇలా ఇంటి చోరుల చేతివాటంతో అంతూదరి లేని రీతిలో లెక్కల్లో తేడాలు సృష్టిస్తున్నారు. ఇక పట్టుబడ్డ వాహనాలకు సంబంధించి జవాబుదారీతనంపరంగా చూస్తే చెల్లుచీటీనే. గతంలో కూడా పోలీసుశాఖ, మోటార్ వాహనాల అధికారులు సీజ్ చేసిన వాహనాల్లో విలువైన అంతర్‌భాగాలు మాయమై కేసులు నమోదు అయ్యే వరకు సంఘటనలు దారితీశాయి. కొన్నాళ్లక్రితం పోలీస్‌శాఖ తమ స్టేషన్లలో పట్టుబడి చాన్నాళ్ల నుంచి ఉన్న పాత వాహనాలన్నింటికీ వేలం నిర్వహించింది. అదేక్రమంలో అటవీ కార్యాలయాల వద్ద బారులుతీరిన సీజ్డ్ వాహనాలకు త్వరితగతిన వేలాన్ని నిర్వహించడం సముచితం. విలువైన అంతర్గత సామగ్రి మాయమవుతున్న ఘటనలతో సహా మిగిలి ఉన్న భాగాలు కల వాహనాలు శిధిలావస్థకు చేరే తతంగాన్ని చాలావరకు అదుపు చేయవచ్చు. అంతేగాక ప్రభుత్వానికి ఎంతోకొంత మొత్తమైనా జమ చేయడానికి అవకాశాలుంటాయి.

ప్రతీ ఆయకట్టుకు నీరందిస్తాం
* కనుపూరు కాలువ ఇఇ కృష్ణమోహనన్ వెల్లడి
సంగం, అక్టోబర్ 22: సోమశిల ప్రాజెక్ట్ కింద ఉన్న ప్రతీ ఆయకట్టుకు నీరందిస్తామని కనుపూరు కాలువ ఇఇ కృష్ణమోహన్ వెల్లడించారు. ఆయన ఆదివారం కనుపూరు కాలువ డిఇ అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి సంగం ఆనకట్ట వద్ద ఉన్న కనుపూరు కాలువ వద్ద చేస్తున్న పూడికతీత పనులను పరిశీలించారు. పూడికతీత పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 లక్షల రూపాయిలతో కనుపూరు కాలువ పూడికతీత పనులు జరుగుతున్నానయని వెల్లడించారు. ఈ నెలాఖరుకల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జరుగుతందని, వెంటనే సాగునీరు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రతీ ఆయకట్టుకు నీరందించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు. 177 కాలువల్లో పూడికతీత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే పూర్తిచేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కనుపూరు కాలువల కింద మోటార్ల ద్వారా సాగు చేసుకునే రైతులు నీటిని పొదుపు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనుపూరు కాలువ ప్రాజెక్ట్ చైర్మన్ మస్తాన్‌నాయుడు, ఎఇలు కృష్ణ, బాలు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన జిల్లాస్థాయి ఫుట్‌బాల్ పోటీలు
వేదాయపాళెం, అక్టోబర్ 22: గత రెండు రోజులుగా నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న జిల్లాస్థాయి ఓపెన్ ఫుట్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీలలో బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో సౌత్‌మోపూరు జట్టు నిలవగా, ద్వితీయ స్థానంలో అల్లీపురం జట్టు నిలిచింది. బాలుర విభాగంలో నెల్లూరు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా ద్వితీయ స్థానాన్ని ఏసి సుబ్బారెడ్డి స్టేడియం జట్టు గెలుచుకుంది. ఇక తృతీయ స్థానంలో సింహపురి జట్టు నిలిచింది. గెలుపొందిన జట్లకు ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.వి.రమణయ్యలు బహుమతులు అందచేశారు.

చంద్రబాబు పాలనలోనే రాష్ట్భ్రావృద్ధి:చేజర్ల
కోవూరు, అక్టోబర్ 22: నూతన రాష్ట్రానికి విదేశీ కంపెనీలను ఆహ్వానించి తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, చదువుకున్న యువతకు ఉద్యోగాలు సృష్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తపన పడుతూ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పడుగుపాడు గ్రామంలోని సత్యవతినగర్ ప్రాంతంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేజర్ల మాట్లాడుతూ గతంలో భారతదేశానికి హైదరాబాదును సాఫ్ట్‌వేర్ రంగ కేంద్ర బిందువుగా మార్చిన ఘనత హైటెక్ సిటీ నిర్మాతగా, ప్రస్తుత నూతన రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టడం ద్వారా చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా సొంత బ్రాండ్ ఇమేజ్ ఉందని కొనియాడారు. ఆ ఇమేజ్‌తో ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతూ నూతన రాష్ట్రానికి విదేశీ కంపెనీలను తీసుకువస్తున్నారని తెలిపారు. గతంలో ఓక్స్‌వ్యాగన్ కార్ల కంపెనీ విషయంలో బోల్తాపడి రాష్ట్ర పరువు తీసిన వైసిపి నేత బోత్సా సత్యనారాయణ ముఖ్యమంత్రి సొంత పనులు చక్కపెట్టుకుంటున్నారని విమర్శించటం గర్హనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చిన దోమల సమస్యను, డ్రైనేజి నిర్వహణ లోపాలను పరిష్కరిస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ ఏలూరు కృష్ణయ్య, ఎంపిపి గిద్దలూరు ఉమ, శ్రీహరిరెడ్డి, జొన్నాదుల రవికుమార్, సూరిశెట్టి శ్రీనివాసులు, విన్నకోట రాధాకృష్ణ, రసూల్, మసూద్, సాదిఖ్, మినార్‌బాషా, శ్రీహరి, నరసింహ, అనీల్, జమీర్, ఎంపిటిసి సభ్యుడు కె.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

తీవ్రమవుతున్న విష జ్వరాలు
*ఒకరు మృతి* స్పందించని అధికారులు - ఆందోళనలో ప్రజలు
కోట, అక్టోబర్ 22: కోట మండలంలో విషజ్వరాలు రోజు, రోజుకి తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఆదివారం మండలంలోని సిద్దవరం పంచాయతీ ఇలకూరుపాడుకు చెందిన మానికల భారతి (35) మృతి చెందింది. దీంతో మండలంలో జ్వరాల బారినపడి మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. మండలంలో జ్వరాలతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడంలో నిమ్మకునీరెత్తినట్లు వున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే విషజ్వరం సోకి కోట, చెందోడు, రామాపురం, గోవిందుపల్లి, గూడలి, ఇలకూరుపాడు గ్రామాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. ప్రస్తుతం కోటకు చెందిన అనేక మందికి జ్వరం సోకడంతో గత వారం రోజుల నుంచి బాధపడుతూ వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. కోట, కేశవరం, చిట్టేడు, గూడలి, కొత్తపాళెం, కొత్తపట్నం పంచాయతీలలో రోజు,రోజుకి విషజ్వరాలు విజృంభిస్తున్నా, ఆ గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్యాన్నంగా వున్నా అటు అధికారులు కానీ, ఇటు పాలకులు కానీ స్పందించడం లేదని ఆయా పంచాయతీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరపీడితులు అనేకమంది కోట, గూడూరు, నెల్లూరు, చెన్నై ప్రాంతాల్లోని వివిధ ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. మండలంలోని అన్ని పంచాయతీలలో పారిశుద్ధ్య నిధులు మెండుగా ఉన్నా పనులు చేయడంలో జాప్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో జ్వరాలు అధికమవుతున్నా దోమల నివారణ మందులు కూడా పిచికారి చేసిన దాఖలాలు కన్పించడంలేదు. ప్రజారోగ్యం పట్ల ఇంత నిర్లక్షం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా కోట పంటకాలువ పూర్తిగా ఆక్రమణలకు గురికావడంతో ఇళ్లలోని మురికినీరంతా కాలువలోకి చేరి పాచిపట్టి వున్నాయి. దీంతో ఈకాలువలో దోమల శాతం పెరిగిపోయింది. గ్రామాల్లో అపరిశుభ్రత నెలకొనడం వల్ల రోజు,రోజుకి జ్వరపీడితుల సంఖ్య అధిమవుతోంది. పలు పంచాయతీలలో చెత్త పేరుకొనిపోయి, కురుస్తున్న వర్షాలకు చెత్తకుళ్లి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. చెత్తలో పందులు సంచారం చేస్తున్నాయి. ఇప్పటికైనా పంచాయతీ, వైద్య అధికారులు గ్రామాల పట్ల శ్రద్ధ వహించాలని పలువురు కోరుతున్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
*ఎమ్మెల్యే బొల్లినేని స్పష్టం
జలదంకి, అక్టోబర్ 22: మండలంలోని అన్నవరంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పాల్గొని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు మాట్లాడుతూ జలదంకి చిప్పలేరుపై నిర్మించిన ఫైబర్ చెక్‌డ్యాం భారతదేశంలోనే మొట్టమొదటి అన్నారు. 14వ మైలు వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని త్వరలో పనులు ప్రారంభించి 14 గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. గ్రామాలలో సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. మండలంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. అనంతరం ఎస్సీ కాలనీలో ఆయన పర్యటించారు. కాలనీవాసులు తమ కాలనీకి వాటర్ ట్యాంకు కావాలని, సిమెంట్‌రోడ్లు నిర్మించాలని, విద్యుత్తు లైన్లు మార్చాలని కోరారు. త్వరలో కాలనీకి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి పి.మధుమోహన్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లినేని రామారావు, మండల పార్టీ కన్వీనర్ పూనూరు భాస్కర్‌రెడ్డి, సోమశిల జలాశయ కమిటీ ఉపాధ్యక్షుడు వంటేరు జయచంద్రారెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డబ్బుంటే టిక్కెట్ ఇవ్వరు:వంటేరు జయచంద్రారెడ్డి
అన్నవరం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో సోమశిల జలాశయ కమిటీ ఉపాధ్యక్షుడు జయచంద్రారెడ్డి మాట్లాడుతూ డబ్బులు ఉన్నంతమాత్రాన ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వరన్నారు. జలదంకి మండలానికి చెందిన ఒక నాయకుడు వచ్చే ఎన్నికలలో ఉదయగిరి నియోజకవర్గ టిక్కెట్ నాకే అని ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని పరోక్షంగా మాజీ మండల అధ్యక్షడు దగ్గుమాటి కృష్ణారెడ్డిని ఉద్దేసించి వ్యాఖ్యానించారు. ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికలలో బొల్లినేనికే టిక్కెట్ అని, ఆయనకు ఓట్లు వేసి గెలిపించుకోవలసిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు.