శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పోటెత్తిన దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, నవంబర్ 17: కావలి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌కు అనూహ్యంగా ప్రజల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి. క్షేత్ర స్థాయిలో ఇంతమంది అర్హత కలిగిన వారికి అన్యాయం జరుగుతుందా అంటూ సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహిస్తే బాగుంటుందని ఆర్డీవో భక్తవత్సలరెడ్డితో వ్యాఖ్యానించారంటే గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీల పనితీరు ఎలా ఉందో ఆయనకు అర్థమైనట్లుంది. ఒక వైపు రేషన్‌కార్డులు, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికి క్షేత్రస్థాయిలో వివిధ కారణాలతో అర్హత ఉన్న వారికి సైతం జన్మభూమి కమిటీలు అడ్డుకుంటున్నాయని ఆయన అర్థం చేసుకున్నారు. ఈ పరిస్థితిలో మార్పురావాలంటే ఇలాంటి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌ను ప్రతి మండలంలో నిర్వహిస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు అనిపించింది. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌కు మొత్తం 1320 దరఖాస్తులు ప్రజల నుంచి వచ్చాయి. ఇందులో రేషన్‌కార్డుల కోసం గరిష్టంగా 451 అర్జీలు అందగా వృద్ధాప్య పింఛన్ల కోసం 182, వితంతు పింఛన్ల కోసం 78, దివ్యాంగుల పింఛన్లు కోసం 76 దరఖాస్తులు వచ్చాయి. అలాగే దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరుకు 122 మంది దరఖాస్తు చేసుకోగా దివ్యాంగ ధ్రువీకరణ పత్రాల కోసం 95మంది అర్జీలు అందజేశారు. వీరిలో అర్హత కలిగిన వారందరికి అక్కడికక్కడే మంజూరు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని గతంలోనే ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తూ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వాస్తవ పరిస్థితిని గ్రహించి తమకు న్యాయం చేస్తున్నందుకు అర్జీదారులు హర్షం వ్యక్తం చేశారు. పరిస్థితిని గమనించిన కలెక్టర్ ముత్యాలరాజు దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలను అందజేసేందుకు స్థానిక ఏరియా వైద్యశాలలో 22వ తేదీన ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనుమర్లపూడి వెంకటనారాయణ ఆధ్వర్యంలో వైకాపా కౌన్సిలర్లు అర్హత ఉన్నప్పటికి కొందరికి ఉద్దేశపూర్వకంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సంక్షేమ పథకాలను అందనీయకుండా చేస్తున్నారని నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యుడు బీద మస్తాన్‌రావు సమక్షంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వార్డుల పరిధిలో పింఛన్లు, రేషన్‌కార్డులు, పక్కాగృహాలు మంజూరు విషయంలో తమ వార్డులలోని పేదలకు అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు. దీంతో మస్తాన్‌రావు జోక్యం చేసుకుని అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ ద్వారా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వారికి నచ్చజెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భక్తవత్సలరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ కృష్ణారావు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగుదేశం నేతల అసంతృప్తి
జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుతో పాటు స్థానిక అధికారులందరూ మండల స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్‌ను నిర్వహించాలని ఆలోచిస్తుంటే కొందరు అధికార పార్టీ నాయకులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులే అందరికీ అన్నీ ఇచ్చుకుంటూపోతే మా ముఖం చూసే వారెవరుంటారని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు మేము అంతా బాగుందని ప్రచారం చేసుకుంటుంటే అదంతా ఒట్టిదే అన్నట్లు వాస్తవ పరిస్థితి బహిర్గతం అయ్యేలా చేయడం ద్వారా ప్రతిపక్షాలకు అవకాశం కల్పిస్తున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టుకుని వారు చేస్తున్న వసూళ్లకు బ్రేక్ పడిందనే బాధ వారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. కలెక్టర్ ప్రయత్నం ద్వారా పరోక్షకంగా పార్టీకి, ప్రత్యక్షంగా ప్రజలకు ఉపయోగం జరుగుతుందనే ఆలోచన వారికి రాకపోవడం విచారకరం. ఏదిఏమైన ఇలాంటి కార్యక్రమం ద్వారా జన్మభూమి కమిటీల పనితీరు ఇకనైనా మెరుగుపడుతుందెమో చూడాలి. మొత్తానికి నిజంగా జన్మభూమి కమిటీలు సక్రమంగా పనిచేస్తూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తుంటే ఇంత మంది ప్రజలు ఇక్కడకు రావాల్సిన అవసరం ఉండేది కాదేమో.