శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాష్ట్ర తెలుగు యువత అధ్యక్ష రేసులో.. జూనియర్ సోమిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 19 : రాష్ట్ర తెలుగు యువత అధ్యక్ష పదవి ఈ దఫా నెల్లూరు జిల్లా నేతలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ పదవి ఎంపికపై రాజధానిలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ సీనియర్ నేతలు, పొలిట్‌బ్యూరో సభ్యులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ పదవికి తొలుత విజయవాడకు చెందిన దివంగత మాజీమంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం చోటుచేసుకున్న పలు ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనయుడు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. ఆయన పేరును తెలుగు యువత అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో ప్రధాన పదవులు ఒక సామాజికవర్గానికే పరిమితమవుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ దఫా రెడ్డి సామాజిక వర్గానికి తెలుగు యువత పదవి ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నట్లు తెలిసింది. త్వరలో భర్తీ చేయబోతున్న మరో రాష్టస్థ్రాయి పార్టీ పదవి అయిన తెలుగు మహిళ అధ్యక్ష హోదాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన కృష్ణా జిల్లా మహిళా నేతకు ఇవ్వబోతున్నారని, అందుకే యువత పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు ఓ సీనియర్ నేత తెలిపారు. పార్టీలో యువతకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో సీనియర్ నేతల కుమారులు, కుమార్తెలకు పార్టీలో సరైన స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. గత మహానాడు విజయవంతం చేయడంలో పార్టీ యువనేతల కృషి గురించి అప్పట్లో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. అదే ఆలోచనకు సామాజిక న్యాయం రూపంలో చోటు కల్పిస్తూ రెడ్డి వర్గానికి యువత పగ్గాలు అప్పచెప్పబోతున్నట్లు తెలిసింది. సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజకీయ ప్రవేశం జరిగి కొద్ది కాలమే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోగలిగారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను సర్వేపల్లి నియోజకవర్గంలో విజయవంతం చేయడం ద్వారా పార్టీ అధినేత దృష్టిలో పడ్డారు. తన తండ్రి మంత్రి పదవిరీత్యా బిజీగా ఉంటుండటంతో నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రజల మధ్యన తిరుగుతూ తరచూ వారితో మమేకమవుతూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ ఛోటా నేతలు, కార్యకర్తలు ఎంతటి అవసరం వచ్చినా తొలుత రాజగోపాల్‌రెడ్డినే సంప్రదించే స్థాయికి అనతికాలంలోనే చేరుకున్నారు. ఈ పరిణామాలను గమనిస్తూ వస్తున్న పార్టీ రాష్ట్ర నాయకత్వం సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరును ఈ యువత పదవి కోసం తీవ్రంగానే పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఈ పదవి పొందిన రెండో నెల్లూరీయుడిగా రాజగోపాల్‌రెడ్డి నిలిచిపోతారు. గతంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర బాధ్యతలు నిర్వర్తించి ఉన్నారు. అయితే ఈ పదవి కోసం తన పేరును పరిశీలిస్తున్న విషయాన్ని సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వద్ద ప్రస్తావిస్తే పార్టీ ఆదేశిస్తే ఏ పదవినైనా చేపడతానని, పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి బలోపేతం చేయడంపైనే తాను దృష్టి పెట్టానని క్లుప్తంగా చెప్తున్నారు. జిల్లాకు చెందిన యువ నేతకు రాష్టస్థ్రాయి పదవి వస్తుందా? లేదా? అనే మీమాంసకు త్వరలోనే తెరపడనుంది.