శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మసకబారుతున్న ప్రభుత్వ ప్రతిష్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 23: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కనిపిస్తున్న పురోభివృద్ధికి ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుంటే, అంతకు మించిన స్థాయిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. జిల్లాలో పారిశ్రామికంగా జరుగుతున్న అభివృద్ధి కూడా ప్రజలు గమనించేలోపు అక్కడ అభివృద్ధి మాటున జరుగుతున్న అవినీతి ముందుకొచ్చి నిలబడుతోంది. అధికారుల విధుల్లో టీడీపీ నేతల మితిమీరిన జోక్యం వలన అభివృద్ధి కొందరి పక్షమే చేరుతోందనే ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేకపోలేదు. గ్రామాల్లో ఉన్న జన్మభూమి కమిటీలు ప్రతి పథకంలోనూ తమ భాగస్వామ్యాన్ని తమ స్వార్థ లాభాల కోసమే అన్న విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ కమిటీలపై వస్తున్న వేల కొలది ఫిర్యాదులకు స్పందించి వెంటనే కమిటీలను మార్చాలని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికి జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కానీ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించలేదు. నిజాయితీ కలిగిన అధికారులు జిల్లాలో పనిచేస్తుండడంతో నిత్యం ఏదో ఒక చోట తెలుగు తమ్ముళ్లకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. జిల్లా ఎస్పీగా రామకృష్ణ విధుల్లో చేరినప్పటి నుండి జిల్లాలో సిలికా, ఇసుక అక్రమ రవాణా పూర్తిగా అదుపులోకి వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా తిరిగి జిల్లాలో ఈ అక్రమ రవాణా ప్రారంభమైందనేది వాస్తవం. వెంకటాచలం, సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇటీవల పోలీసుల దాడిలో గ్రావెల్, ఇసుక వాహనాలు పట్టుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే జిల్లాకు చెందిన ఓ మంత్రి తన అధికారాన్ని పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేసి మరీ వాహనాలకు మోక్షం కల్పించాడని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే జిల్లాను కుదిపేసిన బెట్టింగ్ కేసులో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కిందిస్థాయి నుండి బడా నేతలు పోలీసులకు చిక్కారు. తొలుత ఈ కేసుపై ఎంతటి ఒత్తిడి వచ్చిన వెనకడుగు వేయని జిల్లా ఎస్పీ కూడా చివరకు మంత్రి స్థాయిలోవచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో బెట్టింగ్‌రాయుళ్లపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీస్ శాఖ ఇటీవల బాలాజీనగర్ పరిధిలో దొరికిన ఓ టీడీపీ నేత కుమారుడిపై కేవలం నామమాత్రపు బెయిలబుల్ కేసులు పెట్టడం వెనుక ఎస్పీపై ఓ మంత్రి ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. సదరు నిందితుడి వల్లనే ఓ కుటుంబం రామేశ్వరంలో ఆత్మహత్య చేసుకుందనే వార్తలు గతంలో గుప్పుమన్నాయి. అటువంటి వారిని టీడీపీ మంత్రులు వెనకేసుకు రావడాన్ని ప్రజలు హర్షించడం లేదు. అలాగే పసుపు కుంభకోణంలో కేవలం అధికారులను బలిపశువు చేసి తెలుగు తమ్ముళ్లకు ఆ మరక అంటకుండా చూడడంలో సఫలీకృతులయ్యారు. జిల్లాస్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, వారి విధుల్లో జోక్యం చేసుకోవడం టీడీపీకి చెందిన ఓ చట్టసభల ప్రతినిధికి నిత్యకృత్యంగా మారింది. ముఖ్యంగా జలవనరుల శాఖలో ఈయన ఫోన్ వస్తే అందరూ భయపడే పరిస్థితి. సూళ్లూరుపేట ప్రాంతం నుండి గతంలో జరుగుతున్న సిలికా వ్యాపారం పోలీస్ అధికారుల వరుస దాడులతో ఆగిపోయింది. దీంతో ఎలాగైనా జిల్లా ఎస్పీని బదిలీ చేయాలని సిలికా వ్యాపారులు గూడూరు డివిజన్‌కు చెందిన ఓ సీనియర్ టీడీపీ నేత ద్వారా రాజధాని స్థాయిలో ప్రయత్నాలు కూడా చేసి విఫలమైనట్లు సమాచారం. ఎస్పీ బదిలీని అడ్డుకోలేకపోయినప్పటికీ తిరిగి తమ వ్యాపారాలైనా జరుపుకునేందుకు వారు చేయని ప్రయత్నమంటూ లేదు. గతంతో పోలిస్తే ప్రస్తుతం సిలికా, ఇసుక లారీలపై పోలీసుల దాడుల్లో చురుకుదనం కాస్త తగ్గిందనే భావనలో ప్రజల్లో నెలకొంది. ఇలా ప్రతి విషయంలోనూ టీడీపీ నేతల విపరీత జోక్యం, జన్మభూమి కమిటీల పేరుతో జరుగుతున్న పక్షపాతం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలో రోజురోజుకీ పెరగుతున్న అవినీతిమయం వెరసి పార్టీపై ప్రజల్లో చెడు సంకేతాలకు బీజం వేస్తోంది. రాష్ట్రం కోసం ఎంతో శ్రమిస్తున్న ముఖ్యమంత్రి ప్రభుత్వం ద్వారా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లోనూ, ఇతర అంశాల్లోనూ టీడీపీ నేతల ప్రవర్తనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు తమ్ముళ్ల ప్రవర్తన పార్టీకి 2104 ఎన్నికల ఫలితాలనే పునరావృతం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.
----------

కావలి మున్సిపల్ చైర్‌పర్సన్ మార్పు ఇక లేనట్టే..?
* రాష్ట్ర రాజకీయ పరిస్థితులే కారణం
కావలి, ఫిబ్రవరి 23 : కావలి మున్సిపల్ చైర్‌పర్సన్ మార్పు ఇక సాధ్యం కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం ఇక ఈ విషయంపై ఆసక్తి చూపకపోవచ్చని అంటున్నారు. పైగా మార్పు విషయంలో స్థానిక పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చు. ప్రస్తుతం ఉన్న చైర్‌పర్సన్ అలేఖ్య ఇష్టపూర్వకంగా రాజీనామా చేసినప్పటికీ దానికి ప్రభుత్వ ఆమోదం, తదుపరి చైర్‌పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడంలాంటి అధికారిక లాంఛనాలు పూర్తి కావాలంటే కనీసం మూడు, నాలుగు నెలలు సమయం పడుతుంది. అప్పటికి రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టమే. ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కారణంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసేందుకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ముహూర్తం కూడా ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న పార్టీ సభ్యుల చేత కూడా అదే బాటలో రాజీనామా చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ వెంటనే తన పార్టీకి చెందిన స్థానిక నేతల ప్రతినిధులతో కూడా రాజీనామా చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ రానున్న రెండు, మూడు నెలల్లో జరిగే పరిణామాలు. అదే జరిగితే రాష్టస్థ్రాయిలో తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత మరోలా ఉంటుంది. ఆ పరిస్థితిలో కావలి ముచ్చట పట్టించుకునే ఓపిక, తీరిక ఆ పార్టీకి ఉండదు. అలాకాకుండా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటూ అలేఖ్యతో రాజీనామా చేయించగలిగితే మళ్లీ చైర్‌పర్సన్ స్థానం తెలుగుదేశం పార్టీ వశమవుతుందని నమ్మకం లేదు. మున్సిపల్ పరిపాలన ఆఖరు దశకు చేరుకున్న సందర్భంగా కౌన్సిలర్లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తారే తప్ప పార్టీ పట్ల విధేయత చూపకపోవచ్చు. ఈ అవకాశాన్ని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుని జగన్ వద్ద మెప్పు కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ క్రమంలో చోటుచేసుకునే తెరచాటు ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొని కౌన్సిలర్లను సంతృప్తిపరచి పార్టీ పరువు నిలపాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకుడు బీద మస్తాన్‌రావుపై ఉంది. అందుకు ఆయన సుముఖంగా ఉన్నారా..అంటే అనుమానమే అని చెప్పాలి. ఎందుకంటే చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్న వారి పట్ల పార్టీలో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న కారణంగా ఆ స్థానానికి ఎన్నికలు జరిగితే అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రయత్నించినా కుర్చీ పార్టీ వశమవుతుందనే నమ్మకంలేదు. ఒక వైపు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, మరోవైపు స్థానిక నాయకుల్లో అనైక్యత కారణంగా చైర్‌పర్సన్ కథ కంచికి చేరినట్లేనని చెప్పక తప్పదు.