శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మహానాడు వేదికగా మహా విభేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 21: తెలుగుదేశం పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన విభేదాలు జిల్లాలో జరుగుతున్న మినీ మహానాడు వేదికగా ఒక్కసారిగా బయటపడడంతోపాటు తారాస్థాయికి చేరుకున్నాయి. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రలే టార్గెట్‌గా మాజీ మంత్రి ఆనం రామానారాయణరెడ్డి, మరో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు పరోక్ష విమర్శలతో రూరల్ నియోజకవర్గ మినీ మహానాడులో విరుచుకుపడ్డారు. గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడి వెళ్లాలనే ఆలోచన చేసి చివరి క్షణంలో నిర్ణయాన్ని పునరాలోచించి టీడీపీలోనే నిలిచిపోయారు. అయితే టీడీపీలోనే ఉంటూ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా తాను ఉన్నప్పటికీ ప్రతి విషయంలో పార్టీ పేరుతో కొందరు నేతల ప్రమేయాన్ని ఇకపై సహించేది లేదని తేల్చిపారేశారు. ఆయన ప్రభుత్వ పనితీరుపైనా, పార్టీ వ్యవహారశైలిపైనా తన అసంతృప్తిని, అసహనాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన మాటలు రాష్ట్రంలోనే సంచలనంగా మారాయి. ఇదే పంథా కొనసాగిస్తూ రూరల్ నియోజకవర్గ మినీ మహానాడు వేదికపైన కూడా ఆయన తన గళం విప్పారు. జిల్లాలో భూదోపిడీ, సిలికా, ఇసుక మాఫియా ఎక్కువై పోయిందని, ఇందుకు కారణం పార్టీలోనే ఉన్న కొందరి సహకారమే అంటూ, దీని వలన ప్రజల్లో ప్రభుత్వంపైనా, టీడీపీపైనా అసంతృప్తి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇకనైనా సమీక్షించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ మెతక వైఖరి అవలంబిస్తూ, తన పరిధికి మాత్రమే పరిమితమైన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా ఈ వేదికపై జిల్లాలో పార్టీ నాయకత్వంపై తనలో ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కారు. కొందరు నేతలు పనిగట్టుకొని తనపై విష ప్రచారం చేస్తున్నారని, తాను పార్టీని వీడతానంటూ పత్రికల్లోనూ, సోషల్ మీడియాలోనూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని పేర్లను ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలు మంత్రి సోమిరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రలను ఉద్దేశించినవని కార్యకర్తలు భావించారు. ఇప్పటివరకూ పుకార్లు భావించి వదిలేస్తూ వచ్చానని, ఇకపై తనపై వచ్చే ప్రతి తప్పుడు ప్రచారానికి, అందుకు కారణమైన వ్యక్తుల గురించి అప్పటికప్పుడే సమాధానం ఇస్తానని ఆదాల తన అనుచరులు వద్ద స్పష్టం చేసినట్లు తెలిసింది. రూరల్ నియోజకవర్గ మహానాడు కార్యక్రమం జరుగుతున్నప్పటికీ నియోజకవర్గ పరిధిలోని అల్లీపురం, గుడిపల్లిపాడు గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు, నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం వెనుక కొందరి ఒత్తిడే ప్రధాన కారణమని పరోక్షంగా మంత్రి సోమిరెడ్డిపై ఆదాల అనుయాయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విభేదాలు పార్టీ ఉనికికి ప్రమాదకరంగా మారే పరిస్థితి ఏర్పడింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం టీడీపీ గాలి వీస్తే నెల్లూరు జిల్లాలో మాత్రం విరుద్ధంగా వైకాపా ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగింది. ఇందులో వైకాపాపై ప్రజలకు ఉన్న అభిమానంతో పాటు టీడీపీలో ఉన్న ఇటువంటి విభేదాలే కారణమని, లేదంటే మరో రెండు స్థానాలు టీడీపీ ఖాతాలో చేరేవని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ప్రజలు ఆదరించకపోవడాన్ని విశే్లషించుకొని మందుకు సాగాల్సిన టీడీపీ శ్రేణులు జిల్లాలో పార్టీ భవితవ్యం కంటే తమ వ్యక్తిగత ప్రయోజనం, అధికార దర్పం ముఖ్యమని భావిస్తుండడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ ద్వారా ఏర్పడిన ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తూ తిరిగి పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన నేతల మధ్య సమన్వయ లోపంతో జిల్లాలో పార్టీ పరిస్థితి రోజురోజుకీ తీసికట్టుగా మారిందంటూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఇంకా పార్టీలో నేతల మధ్య ఎటువంటి సఖ్యత కనిపించకపోతుండడం గమనార్హం. పార్టీ మహానాడు పూర్తయిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాపై సమీక్షించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలిసింది.