శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

క్షమించండి.. ఎంపీగా పోటీ చేయలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 21: తాను నెల్లూరు పార్లమంటు స్థానం నుండి పోటీ చేయలేనని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి స్పష్టం చేసినట్లు తెలిసింది. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఎదుట ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడమే కాకుండా పార్టీ జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కూడా విన్నవించారు. జిల్లా పార్టీ నాయకత్వంలో సమన్వయం లేదని, పనిగట్టుకొని కొందరు తనపట్ల తప్పుడు ప్రచారం చేస్తున్నారని పరోక్షంగా మంత్రులిద్దరిపైనా, పార్టీ జిల్లా అధ్యక్షుడిపైన కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వాస్తవాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం లేదని, నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన ‘ఆనం’ సోదరులు ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నారని ముఖ్యమంత్రికి చెప్పిన జిల్లా మంత్రులు ఎప్పట్నుంచో కోరుకుంటున్న తన పేరు ఎందుకు ప్రస్తావించలేక పోయారని ఆదాల ప్రశ్నించారు. ఇప్పటికైనా నెల్లూరు లోక్‌సభకు పార్టీ ఆదేశిస్తే పోటీచేసే సత్తా తనకు ఉన్నప్పటికీ, నెల్లూరు, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కందుకూరు నియోజకవర్గాల పరిధిలో బలమైన అభ్యర్థులు లేరని, ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోవాలని ఆయన విన్నవించారు. కోట్లాది రూపాయలు తనకు ప్రభుత్వం నుండి రావాల్సి ఉన్నప్పటికీ తాను ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదని, ఎన్నికల్లో ఆర్థికంగా నష్టపోయిన తనను ఆదుకోవాల్సిందిపోయి తన కాంట్రాక్ట్ బిల్లులను నిలిపివేసేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి, మరో నేత ప్రయత్నించారని ఆదాల ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలనే ప్రతిపాదన కూడా ఆదాల రాష్ట్ర పార్టీ నాయకత్వం ముందుంచినట్లు సమాచారం. అయితే దీనికి మంత్రులిద్దరూ అడ్డుపడుతున్నట్లు ససేమిరా అంటుండడంతో ఆ ప్రతిపాదన కూడా అటకెక్కడంతో ఆదాల ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు కనపడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా తనకు ప్రొటోకాల్ పదవి కూడా ఇవ్వలేదని, అయినా ఈ విషయంలో తాను బాధ పడలేదని, అయితే ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో ప్రస్తుతం తన అవసరాన్ని గుర్తించి పిలవడం బాధ కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో రెడ్డి సామాజికవర్గం క్రమేణా టీడీపీకి దూరమవుతుండడంపై కూడా ఆదాల ముఖ్యమంత్రికి నివేదించినట్లు సమాచారం. అయితే ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి వద్ద కూడా పూర్తి సమాచారం ఉండడం గమనార్హం. మంత్రుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారికి కూడా ఆదాల ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో అధికారం చెలాయించడానికి మాత్రమే మంత్రి పదవులు ఉపయోగించుకుంటూ పార్టీకి మాత్రం నష్టం కలిగించే చర్యలు చేస్తున్నారని, నియోజకవర్గాల్లో గ్రూపులను కూడగడుతూ పరోక్షంగా అక్కడ పోటీ చేయాలనుకునే నేతలు తమ కనుసన్నల్లో ఉండేలా మంత్రులు సంకుచితంగా ఆలోచించడాన్ని ఆదాల రాష్ట్ర నేతల ఎదుట ఖండించినట్లు తెలిసింది. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి తాను పోటీ చేయలేనని, తనకు కోవూరు, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట అవకాశం కల్పించాలని ఆయన ముఖ్యమంత్రిని చివరగా కోరారు. అయితే ‘మీరు లోక్‌సభపైనే దృష్టిపెట్టండి, నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంతో పాటు అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తాను’ అని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో జిల్లాలో చావుతప్పి కన్నులొట్టబోయిన టీడీపీ 2019లోనైనా అత్యధిక నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగరవేయాలంటే తక్షణమే ఆదాల సూచించిన నియోజకవర్గాల్లో దిద్దుబాటు ప్రక్షాళన చర్యలకు దిగాల్సిన అవసరం ఉందని, అపుడే ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోగలరని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.