శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జడ్పీ సమావేశం రచ్చ రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, ఆగస్టు 14: జిల్లా పరిషత్ సమావేశం ఆద్యంతం రచ్చ రచ్చగా సాగింది. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా సాగింది. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పంచాయతీల అభివృద్ధి నిధులను కూడా నుడా వారు చూసుకొనే అధికారం, ఆ పరిధిని పెంచే అధికారం ఎవరిదని శాసనసభ్యులు, జడ్పీటీసీలు ప్రశ్నించారు. ఈ సమావేశంలో పలువురు జడ్పీటీసీలు నుడా పరిధిని, దాని అధికారాలను వివరించాల్సిందిగా అధికారులను కోరారు. తమ మండలాల్లోని పంచాయతీలు తాము అభివృద్ధి చేసుకొనే నిధులను నుడా అధికారులకు ఎందుకు ఇవ్వాలని వారు నిలదీశారు. 19 మండలాలను నుడా పరిధిలోకి ఎవరు తీసుకొచ్చారని, ఎవరి అనుమతితో ఈ వ్యవహారం జరిగిందని పలువురు జడ్పీటీసీలు ప్రశ్నించారు. గ్రామాల్లో చిన్న ఇల్లు నిర్మించుకోవాలన్నా నుడా అనుమతులు కావాలంటూ నెల్లూరుకు తిప్పడం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని పలువురు అధికార పార్టీ నాయకులు అన్నారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ నుడాకు సంబంధించి ఒకరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేద్దామని, వాటి పరిధులు, అధికారాలపై చర్చించి ఏ మండలం నుడా పరిధిలో ఉండాలి అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చారు. అనంతరం కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కావలి చెరువుకట్టను తెగ్గొట్టి అందులో ఉన్న నీటిని ఎవరి ప్రయోజనాల కోసం తీసుకెళ్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ఈ విషయంపై వెంటనే కలుగజేసుకున్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం మంచిది కాదని, కావలి కాలువ అభివృద్ధి కోసం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో విశేషంగా కృషి చేశామని తెలిపారు. కావలి ఎమ్మెల్యే పంట కాలువలు, చెరువుల మీద అవగాహన లేకుండా మాట్లాడటం మంచిది కాదన్నారు. తీసిన కట్టను పూడ్చుకోవడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే అలా చేస్తే రైతులు ఇబ్బంది పడతారని ఆయన అన్నారు. ఆ సమయంలో బీద, ప్రతాప్‌రెడ్డిల మధ్య కొంత వాడివేడిగా వాదనలు చోటుచేసుకున్నాయి. మధ్యలో కలుగజేసుకున్న కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహంగా మాట్లాడుతూ, కోవూరు నియోజకవర్గంలోని డెల్టా భూములకు ఇవ్వవల్సిన సాగునీటిని కావలి చెరువు ద్వారా సంగం బ్యారేజి నుండి తరలించుకుపోవడం ఇదెక్కడి న్యాయమంటూ ఆవేశంతో ఊగిపోయారు. దీనిపై కలుగజేసుకున్న మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాల భూములు సస్యశ్యామలంగా ఉండాలని, రైతుల బాగుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, ఇలాంటి సమయంలో వాదులాడుకోవడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. జిల్లాలో ఒక్క మండలం మినహా అన్ని మండలాలు కరవు మండలాలుగా ప్రకటించారని, ఆయా ప్రాంతాల ప్రజలను, పంటలను ఏవిధంగా కాపాడుకోవాలనే దానిపై చర్చించాలే తప్పా నా, నీ నియోజకవర్గాలని మాట్లాడటం మంచిది కాదని ఆయన సూచించారు. అనంతరం గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ గ్రావెల్ తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, కానీ మైనింగ్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. గత నాలుగు రోజులుగా గ్రావెల్ మాఫియా అని అన్ని దినపత్రికల్లో వార్తలు వస్తున్నాయని, గ్రావెల్ మాఫియాకు తెలుగు తమ్ముళ్ల అండ అని వార్తలు రావడంవల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ఇలాంటి చర్యలను కట్టడి చేయాల్సిన అవసరం అధికారులకు లేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ పొట్టెపాళం ఇసుకరీచ్ సమీపాన ప్రధాన రహదారిపై ఇసుక కప్పలు పేరుకుపోయాయని వాటివల్ల ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే ప్రమాదాలకు గురవుతున్నారని, ఇటీవల ఒక వ్యక్తి కూడా చనిపోయాడని తెలిపారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఆ సమస్యపై పోరాటం చేస్తున్నానని తానే స్వయంగా రోడ్డుపై ఇసుకను నాలుగు పర్యాయాలు తొలగించానని, కాని అక్కడ ఎలాంటి మార్పు రాలేదన్నారు. కార్పొరేషన్, మైనింగ్, ఆర్ అండ్ బి శాఖల వారు ఒకరిపై ఒకరు చెప్పుకొంటూ సమస్యను గాలికి వదిలేస్తున్నారని ఆయన అన్నారు. అందుకు స్పందించిన మంత్రి సోమిరెడ్డి ఆర్ అండ్ బి అధికారులతో ఆ సమస్యపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జాయింట్ కలెక్టర్ వెట్రిసెల్వి, సీఇఓ, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులరెడ్డి, పలువురు జడ్పీటీసీలు, వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.