శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రత్యేక హోదా పేరుతో బాబు వంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, అక్టోబర్ 13: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక హోదా పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. నాడు హోదా వద్దు, ప్రత్యేక హోదా ముద్దు అన్న చంద్రబాబు ఓట్ల కోసమే డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. శనివారం నగరంలోని సింహపురి వైద్యశాల సమీపంలో బీజేపీ నూతన కార్యాలయ భవన నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ప్రత్యేక హోదా పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం కోసం ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీతో రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని ఆనాడు ప్రధాని మోదీకి చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఆనాటి కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ప్యాకేజీ ఇస్తామన్న మాటను పక్కనపెట్టిన రాహుల్‌గాంధీ నేడు రాష్ట్రంపై మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేకపోయినా దానినే బూచిగా చూపిస్తూ టీడీపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. గతంలో రాష్ట్రానికి నరేంద్ర మోదీ 35 వేల కోట్లు ఇస్తానని ప్రకటించి తరువాత రూ. 63,500 కోట్లను మంజూరు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగవేస్తే చూస్తూ ఊరుకోవాలా అని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సిన తరుణంలో వారు చెల్లించకపోతే ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారని, వారికి ఒక న్యాయం, టీడీపీకి ఒక న్యాయమా అంటూ సూటిగా ప్రశ్నించారు. పన్నులు చెల్లించాల్సినవారు ఐటీ దాడులకు భయపడాల్సిన అవసరమే లేదన్నారు. చంద్రబాబునాయుడు ఆ పార్టీ నాయకులు దీనినే బూచిగా చూపిస్తూ ఎన్నికలకు వెళ్తున్నారని అన్నారు. వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్పనున్నారని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికార దాహంతో బీజేపీని వీడి కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కరవు తాండవిస్తోందని వెంటనే కరవు ఉపశమన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 16 నుండి ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో తెలియజేసి 2019 ఎన్నికలకు వెళతామన్నారు. అలాగే ఈనెల 16న గుంటూరులో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన కోసం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రానున్నారని ఆ కార్యక్రమానికి, అక్కడ జరగబోవు మహాసభకు ప్రతి గ్రామం నుండి రాష్ట్రంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో నిర్మించనున్న బీజేపీ నూతన జిల్లా కార్యాలయానికి బీజేపీ నాయకులు కందుకూరు సత్యనారాయణ పది లక్షలు, కావలి మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్‌కుమార్‌రెడ్డి ఐదు లక్షలు, సీనియర్ నాయకులు వరదయ్య లక్ష రూపాయలు, మారం విజయలక్ష్మి రూ. లక్ష, పిల్లి రామకృష్ణారెడ్డి లక్ష రూపాయలు, ఇంకా పలువురు నాయకులు విరాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, కొమారి కోటేశ్వరరావు, కర్నాటి ఆంజనేయరెడ్డి, శంకరనారాయణ, మిడతల రమేష్, కె మధు, కె భాస్కర్, లక్ష్మీపతి, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, విల్సన్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.