శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నెల్లూరుకు పొంచి ఉన్న పెథాయ్ ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 14: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇది శుక్రవారం సాయంత్రానికి చెన్నై నగరానికి 1040 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయువ్య దిశగా కోస్తాంధ్ర తీరం వైపు గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతున్నట్లు వాతావరణ శాస్తవ్రేత్తలు తెలిపారు. ఈ తుఫాన్‌కు పెథాయ్‌గా నామకరణం చేశారు. రాగల 24 గంటల్లో తుఫాన్‌గా మారనుందని వారు హెచ్చరిస్తున్నారు. తదుపరి పెను తుఫాన్‌గా మారే అవకాశం కూడా ఉందంటున్నారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడులలో ఆకాశం మేఘావృతమై ఉంది. రాగల 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిందని, తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు మత్స్యకార గ్రామాల్లో అధికారుల ద్వారా చాటింపులు వేయిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుఫాన్‌పై ముందస్తు సన్నద్ధ చర్యలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. తుఫాన్ సంబంధిత విభాగ అధికారులు, ఆర్టీజిఎస్ అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. తుఫాన్ వచ్చే జిల్లాల్లో చౌకధరల దుకాణాల వద్ద నిత్యావసర వస్తువులు పంపిణీకి సిద్ధంగా ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక అధికారుల నియామకం
జిల్లాలో పెథాయ్ తుఫాన్‌కు ప్రభావితమయ్యే ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ నియమించారు. కావలికి టి బాపిరెడ్డి, అల్లూరు ఎఎం రోజ్‌మాండ్, బోగోలు సుబ్రమణ్యేశ్వరరెడ్డిలను, విడవలూరు ఎంఎల్ నరసింహం, టీపీ గూడూరు శోభన్‌బాబు, ముత్తుకూరు పి శ్రీహరి, ఇందుకూరుపేట సదాభార్గవి, వాకాడు కె.రాజేశ్వరి, చిల్లకూరు చినరాముడు, తడ విశ్వనాథం, సూళ్లూరుపేట శ్రీనికుమార్, దొరవారిసత్రం ఎస్.రవిశంకర్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించి వెంటనే సంబంధిత మండలాల్లో అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

త్వరితగతిన నగరంలో రోడ్ల నిర్మాణాలు
* మంత్రి నారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 14: నగరంలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ల పనుల కోసం తవ్విన రోడ్ల స్థానంలో కొత్త రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం నారాయణ మెడికల్ కళాశాలలోని తన క్యాంపు కార్యాలయంలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పనులకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మొత్తం 450 కిలోమీటర్ల మేర రోడ్లను వివిధ పనుల నిమిత్తం తవ్వినట్లు తెలిపారు. తవ్విన రోడ్ల స్థానంలో కొత్తగా ఇప్పటివరకూ 125 కిలోమీటర్లు మేర రోడ్లు వేయడం పూర్తిచేశారని, మిగిలిన పనులు కూడా జనవరి 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేందుకు ఇంజనీర్ల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇందుకోసం ఆర్‌అండ్‌బి అధికారులతో మాట్లాడి ఇఇ, డిఇ, ఏఇ హోదాలోని పది మంది అధికారులను ఈ నిర్మాణాల కోసం బదలాయించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు. ఎప్పటికప్పుడు వేసిన రోడ్లను ఫొటోలు తీసి పంపాలని, వాటిపై ప్రతి మూడు రోజులకొకసారి కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో సమీక్షిస్తానని వెల్లడించారు. ప్రజలు కూడా సిమెంటు రోడ్లు వేసిన వెంటనే దానిపై పశువులను తోలడం, వాహనాలు నడపడం, రోడ్డుకు అడ్డంగా ఉంచిన కంచెను తొలగించడం చేయకుండా సహకరించాలని మంత్రి కోరారు. మంచి నాణ్యతతో కూడిన రోడ్డు ఇంటి ముందు వస్తుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 14వ ఆర్థిక ప్రణాళిక నిధుల నుంచి నగర సుందరీకరణలో భాగంగా పుట్‌పాత్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. రంగనాథస్వామి దేవస్థానం వద్ద ఘాట్ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన నిర్మించేందుకు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు చేయాలన్నారు. నగరంలోని మాంసం, చేపల మార్కెట్లలో నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్వచ్ఛ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, నగర ఇన్‌చార్జ్ ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్లపాక అనూరాధ, కార్పొరేటర్లు దొడ్డపనేని రాజానాయుడు పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు.

నేరాలు అరికట్టడానికి నిఘానేత్రాలు
* ప్రజలను బాధపెట్టడం మా పని కాదు
* జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడి
గూడూరు, డిసెంబర్ 14 : గూడూరు పట్టణంలో దాదాపుగా రూ.10 లక్షలతో నిఘా నేత్రాలను నేరాలను అరికట్టడం కోసమే ఏర్పాటు చేస్తున్నాం తప్ప ప్రజలను బాధపెట్టడం కోసం కాదని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం గూడూరు 1వ పట్టణంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి దాతలుగా వ్యవహరించిన పీఎం రావు, లక్ష్మి దంపతులను, దీనికి పూర్తిగా సహకరించిన గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు అభినందనీయులని ఎస్పీ కొనియాడారు. ఈ రోజు గూడూరులో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని ఎస్పీ అన్నారు. గూడూరు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. గూడూరు పట్టణానికి రూ.10 లక్షలతో 40 నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడానికి పీఎం లక్ష్మీ రావు దంపతులు ముందుకు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గూడూరు డివిజన్‌లోని సీ ఐలు, ఎస్సైలు తమ సిబ్బంది అతి తక్కువ కాలంలో డీఎస్పీ ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇది ఒక కట్టుకథ అనుకున్నానని అయితే నేడు నిఘా నేత్రాలను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమాజంలో మంచి అధికారులు ఉండటం ఎంతో మేలు చేస్తుందన్నారు. సమాజంలో ప్రజల సేవ కోసం రెండు ముఖ్య ఉద్దేశాలతో ఈ నిఘా నేత్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఒకటిగా ముందుగా నేరాలు జరగకుండా చర్యలు చేపట్టవచ్చని, రెండవదిగా నేరాలు జరిగిన వెంటనే వాటిని గుర్తించి నేరస్తులను పట్టుకోవచ్చన్నారు. తమిళనాడుకి దగ్గరగా నెల్లూరు జిల్లా ఉండటంతో అక్కడి నుంచి దోపిడీదారులు ఇళ్ల దోపిడీ, ఇతర దొంగతనాలకు పాల్పడుతుంటారని, అలాంటి సమయాల్లో సీసీ కెమెరాల ద్వారా వారి ఆటలు కట్టించవచ్చన్నారు. ప్రధానంగా సీసీ కెమెరాలు ఉంటే దొంగలు భయపడుతారని, దోపిడీలు చేయడానికి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతారని తద్వారా నేరాలు పూర్తిగా అరికట్టవచ్చన్నారు. సీసీ కెమెరాల ద్వారా రౌడీయిజం, తాగుబోతు గొడవలు, చిన్నచిన్న నేరాలు తగ్గించవచ్చన్నారు. ప్రధానంగా అనేక ప్రాంతాల్లో నేర నియంత్రణ కోసం పెట్రోలింగ్, ఇతర కొన్ని కార్యక్రమాలు పోలీసులు చేపడుతున్నారని, అందులో భాగంగా ఈ చలానా, బ్రీతింగ్ ఎనలైజర్ తదితర అంశాలు ప్రజలను బాధపెట్టడానికి కాదని, నిఘా నేత్రాల మూలంగా మంచికి భద్రత, నేరస్తులకు భయం ఉంటుందన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరిస్తే కుటుంబానికి మంచి భద్రత ఉంటుందన్నారు. ఆటో యూనియన్, ఆటో చోదకులు ముందు ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఓవర్ లోడ్ చేయడం మంచిది కాదని ఒకవేళ ప్రమాదాలు జరిగితే అనేక మందికి నష్టం జరుగుతుందని, దీనికి సహకరించాలని ఎస్పీ కోరారు. సమాజంలో మార్పుల తీసుకుని రావాలంటే ఎంతో మంది దాతలు, ప్రజాప్రతినిధులు, పత్రికా సోదరులు, ప్రజలు సహకరించాలన్నారు. జిల్లాలో నాయుడుపేట, కావలి, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో లక్ష్మీరావు లాంటి దాతలు ముందుకు రావాలని సూచించారు. గూడూరు డీఎస్పీ సాధారణ బదిలీలలో భాగంగా బదిలీ అవుతున్నారని, ఓ మంచి అధికారి బదిలీ కావడం తమకు కూడా బాధగా ఉందని ఎస్పీ అన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాలకు ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. గూడూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పొణక దేవసేన మాట్లాడుతూ గూడూరు మున్సిపాలిటీని నేరరహిత ప్రాంతంగా పోలీసులు ఏర్పాటు చేయాలని, అందుకు తాము సహకరిస్తామన్నారు. నిఘా నేత్రాల దాతలు పీఎం లక్ష్మీరావు దంపతులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఐశ్వరయ్యరస్తోగి, గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబుల సూచనల మేరకు నిఘా నేత్రాలు అందచేశామని, సమాజంలో నేరాలు అరికట్టడానికి తమవంతు సహకారం అందించామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, ఆంజనేయులు, డీఎస్పీ వీఎస్ రాంబాబు, సీఐలు కల్యాణరాజు, అక్కేశ్వరరావు, ఎస్సైలు శేఖర్‌బాబు, బాబి, హుస్సేన్, శిక్షణ ఎస్సైలు, కౌన్సిలర్లు భారతి, విజయమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సామాన్యుల చెంతకు ఇంటర్నెట్ సౌకర్యం
* నగరంలో వైఫై హాట్‌స్పాట్ ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి

నెల్లూరు, డిసెంబర్ 14 : జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులకు కూడా ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే లక్ష్యంగా బిఎస్‌ఎన్‌ఎల్ సేవలను విస్తృత పరుస్తోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక దర్గామిట్ట బట్వాడిపాలెం సెంటర్ వద్ద బిఎస్‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఫై హాట్‌స్పాట్‌ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే ఎక్కువ చోట్ల వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం కొత్తగా 55 ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఫై హాట్‌స్పాట్ అనేది ఎవరైనా ఉపయోగించుకోవచ్చని, ఏ మొబైల్ యూజర్ లేదా లాండ్‌లైన్ కలిగిన వారు హాట్‌స్పాట్ ఉన్న చోట 100 మీటర్ల పరిధిలో ఈ సర్వీసు ఉపయోగించుకోవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించాలని టెలికాం అధికారులను కోరారు. త్వరలోనే జిల్లాలో 4జీ సైట్ రాబోతున్నాయని, ఇప్పటికి 30 4జీ సైట్స్ అనుమతులు పూర్తి చేసుకున్నాయని స్పష్టం చేశారు. మరో 50 సైట్ల వరకూ అదనంగా వచ్చే అవకాశం ఉందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ మేనేజర్ రవిబాబు మాట్లాడుతూ ఎంపీ చెప్పిన విధంగా జిల్లాలోని మరిన్ని ప్రదేశాల్లో ఈ వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం రవీంద్రనాథ్, ప్రసాద్, వీపీఆర్ ఫౌండేషన్ సిఇఓ నారాయణరెడ్డి, ఫౌండేషన్ చీఫ్ కో ఆర్డినేటర్ శంకర్, శ్రీనివాసులరెడ్డి, సునీల్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.