నెల్లూరు

ఇళ్ల స్థలాల కోసం దివ్యాంగుల ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, ఏప్రిల్ 1 : వికలాంగుల సంఘాల మధ్య ఆధిపత్య పోరు న్యాయ వివాదాలు, అధికారుల విచారణలు, ప్రభుత్వం వారికిచ్చిన ఇళ్ల స్థలాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వరకు వెళ్లగా శుక్రవారం ఓ సంఘం నాయకులు ఆర్డీవో కార్యాలయంలో ఏకంగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. జాతీయ వికలాంగుల హక్కుల వేదిక నాయకులు మండవ వెంకటావు ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని కోరుతూ పలువురు వికలాంగులు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. తొలుత ర్యాలీగా వచ్చిన వారు ప్రధాన గేటు వద్ద అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో ఛాంబర్ ముందు బైఠాయించారు. అధికారులు వచ్చి తమకు న్యాయం చేయాలని, అంతవరకు కదిలేది లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న రెండోపట్టణ ఎస్సై అన్వర్‌బాషా తన సిబ్బందితో అక్కడికెళ్లి భద్రతను పర్యవేక్షించారు. తాము అధికారులను కలిసి సమస్యను వివరించి శాంతియుతంగా వెనుతిరుగుతామని హామీ ఇచ్చిన వికలాంగులు ఆందోళన కొనసాగించారు. అయితే ఆర్డీవో ఎంఎల్ నరసింహం విధినిర్వహణపై ఇతర ప్రాంతానికి వెళ్లి ఉండగా విధినిర్వహణలో ఉన్న డివిజన్ కార్యాలయ పాలనాధికారి రామకృష్ణకు వినతిపత్రం అందించేందుకు ఆందోళన చేస్తున్న వారంతా కార్యాలయం లోపలికి వెళ్లారు. ఆ సమయంలో తీవ్ర స్వరంతో అరుస్తూ న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వారిలో చలంచర్ల కోటయ్య, గుడ్డేటి లక్ష్మి అనే ఇద్దరు వికలాంగులు తమ వెంట రహస్యంగా తెచ్చుకున్న కిరోసిన్‌ను పైన పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అలాగే మరికొందరు నువాన్ అనే క్రిమిసంహారకాన్ని తెచ్చుకున్నారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కిరోసిన్ డబ్బాలను, క్రిమిసంహారకాలను లాగేశారు. అతి కష్టంపై ఆందోళనకారులను కార్యాలయం నుంచి వెలుపలికి పంపించారు. అనంతరం మండవతోపాటు వేదిక జిల్లా అధ్యక్షులు గూడూరు వెంకటరమణయ్య, సభ్యులు మహబూబ్‌బాషా, వి రమేష్‌నాయుడు, కోడూరు సోమయ్యలతోపాటు పలువురిని అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.
సోమవారం కలెక్టరేట్ ముట్టడి
తమ సమస్యపై సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉద్యమ నాయకుడు మండవ వెంకట్రావు తెలిపారు. తమ సంఘంలో మొత్తం 114 మంది వికలాంగులు స్థలాల కోసం దరఖాస్తులు చేసుకోగా 99 మందికి పట్టాలు తయారు చేసి ఉన్నారన్నారు. మిగిలిన 15 మందికి స్థలాలు ఉన్నాయని, వారు స్థలాల్లో ఉండి బేస్‌మెంట్లు వేసుకున్నారని చెప్పారు. అయితే రెవెన్యూ అధికారులు వాటిని అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ ఇటీవల కూల్చి వేశారని, తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికీ ఇళ్లు పేరిట నివాస స్థలాలు, నివాసాలు మంజూరు చేస్తుంటే కావలి రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేస్తున్నారంటూ ఆగ్రహించారు. న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమని, అధికారులు వాస్తవాలు తెలుసుకుని న్యాయం చేయాలన్నారు.

కార్డుల కుదింపే లక్ష్యం
* త్వరలో వేలిముద్రల సేకరణ
నెల్లూరు, ఏప్రిల్ 1: కుటుంబ సభ్యులంతా స్థానికంగా ఉంటున్నారా, లేదా మరణించినవారి పేర్లు ఇంకనూ రేషను కార్డుల్లో ఉన్నాయా... ఇవి ప్రభుత్వం తాజాగా ఆరాతీయనున్న అంశాలు. ఇందుకోసం కార్డుల్లో పేరున్న ప్రతి ఒక్కరి వేలిముద్రలు సేకరించే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫలితంగా ప్రస్తుతం సాగుతున్న అక్రమ పంపిణీకి చరమగీతం పాడనున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న రాయితీ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం మరింత పకడ్బందీ చర్యలకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే ఈ-పాసు విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో సరకులు భారీగా మిగులుతున్నాయి. ఈ క్రమంలో వేలిముద్రలు పడటం లేదని కొందరికి, అందుబాటులో లేక బయోమెట్రిక్ వేలిముద్రలు పడకపోవడంతో మరికొందరికి ప్రతినెలా రేషన్ సరుకులు అందడం లేదు. జిల్లాలో ఇలా వేలాది మంది రేషన్ సరుకులు తీసుకోలేకపోతున్నారు. ఆయావర్గాల ప్రజలు ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తున్నారు. గతంలో ఈ విధానం అమలు కాకముందు స్థానిక డీలర్ల నుంచి సరుకులు తీసుకు వెళ్లేవారు. ప్రస్తుతం కార్డుదారులు తప్పనిసరిగా రావాల్సి ఉండటంతో సరకులు చాలా మంది పొందలేక పోతున్నారు. దీంతో ప్రభుత్వానికి మిగులు కనిపిస్తోంది. ఈ అంశాన్ని గమనించిన తర్వాత ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. తాజాగా మరోసారి వేలిముద్రల సేకరణకు చర్యలు తీసుకుంటోంది. ఒక విధంగా చెప్పాలంటే కార్డులు యూనిట్లను కుదించేందుకే ఈ విధంగా చేస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
బిఎఫ్‌డి పేరుతో వేలిముద్రల సేకరణ
టెస్ట్ ఫింగర్ డిటెక్టర్ (బియఫ్‌డి) కార్యక్రమం జిల్లాలో దశల వారీగా అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. రేషన్ దుకాణాల్లోనే ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. జిల్లాలోని 2,020 రేషన్ దుకాణాలు ఉన్నాయి. అందులో సుమారు 8 లక్షల లబ్ధిదారులు ఉన్నారు. తొలి విడతలో కార్డులు ఒకరి పేరు, సింగిల్ యూనిట్ ఉన్న కార్డుదారులకు తర్వాత రేషన్ సరుకులు తీసుకు వెళ్లేందుకు వచ్చిన కుటుంబ సభ్యుల వేలిముద్రలు, చివరగా కుటుంబంలోని సభ్యులందరి నుంచి వేలి ముద్రలు సేకరించనున్నారు. డీలర్ ఒక్కడే ఇన్ని పనులు చేయడం సౌకర్యం కానందున వీరికి రెవెన్యూ శాఖ కూడా సహకరించనుంది. ఈ ప్రక్రియ పూర్తయితే భారీ స్థాయిలో రేషన్‌కార్డుల తొలగింపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్హులు ఈ చర్యల వలన ఇబ్బందులకు గురి కాకుండా తగిన సమాచారం కార్డుదారులకు అందించాల్సిన బాధ్యత కూడా డీలర్లతోపాటు రెవెన్యూ అధికారులపైనా ఉంది.

రోడ్డు ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థి మృతి
* శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
తోటపల్లిగూడూరు, ఏప్రిల్ 1: మండల పరిధిలోని పల్లెపాడుకు చెందిన కె.వెంకటేశ్వర్లు అనే విద్యార్థి శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ గ్రామానికి చెందిన విద్యార్థి వెంకటేశ్వర్లు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ముదివర్తిపాళెం హైస్కూల్ కేంద్రానికి ఆటోలో బయలుదేరాడు. అప్పటికే ఆటో కిక్కిరిసి ఉంది. నిలబడి ఉన్న విద్యార్థి చెప్పు జారి కింద పడటంతో ఆటోడ్రైవర్‌కు చెప్పాడు. వెంటనే ఆటోడ్రైవర్ గమనించకుండా వెనుకకు తిప్పడంతో ఆ వైపు వస్తున్న స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ సంఘటనతో విద్యార్థి వెంకటేశ్వర్లు కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. పరీక్ష కోసం వెళ్లి తిరిగి వస్తాడనుకొన్న కుమారుడు వెంకటేశ్వర్లు (16) తిరిగిరాని లోకాలకు వెళ్లడం కలిచి వేస్తుంది. ఈ సంఘనతో పల్లెపాడు గ్రామంలో విషాదం నెలకొంది.

చివరి తడి నీరు అందక రూ. 10 కోట్ల నష్టం
* ఆందోళనలో రైతులు
కొండాపురం, ఏప్రిల్ 1: మండలంలోని రాళ్లపాడు రిజర్వాయర్ కింద వరిపంటను సాగు చేసిన రైతులు చివరి తడికి నీరు అందకపోవడంతో కోట్లలో నష్టపోయారు. రిజర్వాయర్ అధికారులు, కొందరు స్వార్ధ రాజకీయ నాయకుల నీచ రాజకీయానికి అన్నదాతలు బలయ్యారు. మండలంలో రాళ్లపాడు రిజర్వాయర్ ఆయకట్టు కింద అధికారిక లెక్కల ప్రకారం 3,500 ఎకరాలు, అనధికారికంగా మరో 1500 ఎకరాలు ఉన్నాయి. గత నాలుగేళ్లుగా వర్షాలు కురవకపోవడంతో రైతులు పంటను సాగు చేయలేదు. దీంతో ఆ భూములు బీళ్లుగా మారాయి. అయితే గత సంవత్సరం నవంబర్ నెలలో వర్షం కురవడంతో రైతులు ఎంతో ఆశగా వరిపంటను సాగుచేశారు. అయితే అనంతరం వర్షాలు కురవకపోవడంతో రిజర్వాయర్‌లో నీరు రోజురోజుకు తగ్గిపోసాగింది. దీంతో అధికారులు, రైతులు వారబంది ప్రకారం నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. తరువాత రిజర్వాయర్ అధికారులు ప్రకాశం జిల్లా పరిధిలోని రైతులకు నీరు ఇవ్వాలని వారబంది నిర్ణయాన్ని తుంగలో తొక్కి నీటిని విడుదల చేశారు. దీంతో నెల్లూరు జిల్లా పరిధిలోని రైతులు మార్చి 1వ తేదీ మక్కెనవారిపాలెం వద్ద కాలువకు ఉన్న గేట్లను మూసివేసి నీటిని కిందకు వెళ్లకుండా ఆపేశారు. తరువాత అధికారులు అప్పటికి రిజర్వాయర్‌లో ఉన్న 4 అడుగుల నీటిలో ఒక అడుగు ప్రకాశం జిల్లా రైతులకు, 3 అడుగులు నెల్లూరు జిల్లా రైతులకు విడుదల చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ప్రకాశం జిల్లా రైతులకు ఒక అడుగు నీరు పూర్తి కాగానే అధికారులు తూము కట్టేసి నీటిని ఆపేశారు. దీంతో నెల్లూరు జిల్లా రైతులు మళ్లీ ఆందోళనకు దిగారు. ఒక అడుగు నీటిని విడుదల చేసిన అనంతరం తాగునీటి కోసమంటూ ఆపేశారు. తరువాత నాయకులు నిరాహార దీక్షకు దిగడంతో వెంటనే నీటిని విడుదల చేశారు. వెంటనే 15 నిమిషాలకే ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ మళ్లీ ఆపేశారు. తరువాత నాయకులు, రైతులు వారంతట వారే తూము తీసి నీటిని విడుదల చేశారు. మరుసటిరోజే ప్రకాశం జిల్లా ఇరిగేషన్ అధికారులు రైతులతో చర్చించి ఒకరోజు తరువాత ఆపేశారు. తరువాత నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకి రిజర్వాయర్ వద్దకు వచ్చి నీటిని, ఎండిన పంటలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఇదిలావుంటే పంట చివరి దశకు చేరుకుంది. అయితే నీటి విడుదల కాకపోవడం, పంట కోతకు రావడంతో రైతులు కోసేశారు. ఇందువల్ల పంట అరకొరగా పండి ఎక్కువగా తాలు వచ్చింది. ఎకరాకు 35వేల రూపాయల వరకు పెట్టుబడి అయిందని ఎప్పటిలాగానే ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే కొంత లాభం వచ్చేదని రైతులు అంటున్నారు. అయితే చివరి తడి అందకపోవడంతో ఎకరాకు 15 క్వింటాళ్ళ దిగుబడి వస్తోందని రైతులు తెలిపారు. క్వింటాల్ ధర ప్రభుత్వ ప్రకటించిన ప్రకారం ప్రస్తుతం సుమారు 11వందల రూపాయల వరకు వుంది. ఈ లెక్కన ఎకరాకు 44వేల రూపాయలు వచ్చేది. 35 వేల రూపాయలు పెట్టుబడి పోయినా రైతుకు ఎకరాకు 9 వేల రూపాయలు మిగిలేది. ప్రస్తుతం ఎకరాకు 15 క్వింటాళ్లే పండటంతో ఎకరాకు 15,500 రూపాయలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన ఎకరాకు 20 వేల రూపాయలు నష్టం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 5వేల ఎకరాలకు సుమారు 10కోట్ల రూపాయలను రైతులు నష్టపోయారు. దీంతో వారి పెట్టుబడులు రాక అప్పుల పాలవుతున్నారు. ఇదంతా కేవలం ఒక రాజకీయ నాయకుడు రిజర్వాయర్‌లో పెంచిన చేపలు, రొయ్యలను కాపాడేందుకు అధికారులు ఆడిన నాటకాల వల్లే జరిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ వైద్యసేవలు సద్వినియోగం చేసుకోండి
* కలెక్టర్ జానకి పిలుపు
రాపూరు, ఏప్రిల్ 1: ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం జానకి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను ఆమె తనిఖీ చేశారు. పాతభవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించేందుకు జరుగుతున్న పనులను పరిశీలించడంతోపాటు రోగులకు ఇక్కడ కల్పిస్తున్న వైద్య సేవలను ఆమె సమగ్రంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనేక కొత్త వైద్యసేవల పథకాలను ప్రవేశపెట్టిందని, ఇందులో భాగంగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, గర్భిణీలకు వైద్య సదుపాయాలు, వైద్య సేవలను అందించేందుకు 102 పథకాలను ప్రవేశపెట్టిందని, వీటన్నింటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. త్వరలో వైద్యశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ పనివేళల్లో ఢుమ్మాకొట్టే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ సేవలకే ప్రాధాన్యం ఇచ్చి ప్రైవేటు సేవలకు దూరంగా ఉండాలని చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. వీరి వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వరసుందరం, స్థానిక వైద్యులు డాక్టర్ గోపాల్, డాక్టర్ ప్రతిమ తదితరులు ఉన్నారు.
వైద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్‌చే వైద్యశాల తనిఖీ
వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గీతాప్రసాదిని శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా వైద్యశాలలోని రోగులకు అందిస్తున్న సేవలను ఆమె పరిశీలించి పలు సూచనలు చేశారు. వైద్యశాలలో పనిచేసే ప్రతి ఒక్కరు సమయవేళలు పాటించి వైద్య సేవలు అందించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీచేస్తామని అన్నారు.

చెరువులో గేదెల కోసం వెళ్లి యువకుడు మృతి
వెంకటాచలం, ఏప్రిల్ 1 : చెరువులో ఉన్న గేదెలను తోలుకొని వచ్చేందుకు వెళ్లిన యువకుడు అదే చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందిన సంఘటన మండలంలోని రామదాసుకండ్రిగలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నాయుడుపాళెం గ్రామానికి చెందిన ఎం వెంకటేశ్వర్లు (18) వెంకటాచలంలోని జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే గురువారం గేదెలు ఇంటికి రాకపోవడంతో వెంకటేశ్వర్లు గాలించేందుకు వెళ్లాడు. ఆ గేదెలు రామదాసుకండ్రిగ పడమటి చెరువులో ఉండటంతో చెరువులోకి దిగాడు. చెరువులో ఉన్న గేదెలను బయటకు తీసుకొని వస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో ఉన్న గుంటలో మునిగిపోయి మృతి చెందాడు. అయితే రాత్రికి వెంకటేశ్వర్లు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. చెరువు వద్దకు శుక్రవారం ఉదయం వెళ్లిన పలువురు స్థానికులు చెరువు గట్టు వద్ద వెంకటేశ్వర్లుకు చెందిన మొబైల్ ఫోన్‌తోపాటు దుస్తులు ఉండటం గమనించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని వెంకటేశ్వర్లు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. వెంకటేశ్వర్లు మృతితో నాయుడుపాళెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

సిడిపిఓ సస్పెన్షన్‌పై ఐసిడిఎస్ పిడి విచారణ
వెంకటగిరి, ఏప్రిల్ 1: వెంకటగిరిలో గతంలో సిడిపిఓగా పనిచేస్తున్న అనూరాధ, మరో 9 మంది సూపర్‌వైజర్లు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ సస్పెన్షన్‌పై ఐసిడిఎస్ పిడి విద్యావతి స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో శుక్రవారం విచారణ చేపట్టారు. గత సంవత్సరం నవంబర్ నెలలో అంగన్‌వాడీ కేంద్రాలకు పంపాల్సిన సరుకులు పంపకుండా ఒకచోట డంప్ చేసి అవినీతికి పాల్పడ్డారని ప్రాజెక్టు పరిధిలోని పలువురు అంగన్‌వాడీ సిబ్బంది పిడికి ఫిర్యాదు చేయడంతో, పిడి ఈ విషయంపై తనిఖీ చేసి సిడిపిఓ అనూరాధ, 9మంది సూపర్‌వైజర్లను సస్పెండ్ చేశారు. దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక ఉన్నతాధికారులకు పంపాల్సి ఉండటంతో శుక్రవారం ఈ విచారణ చేపట్టినట్లు పిడి విద్యావతి చెప్పారు. గతంలో సిడిపిఓ, సూపర్‌వైజర్లపై ఫిర్యాదు చేసిన వారినే పిడి విచారణ చేశారని, ప్రాజెక్టు స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి అందరిని విచారించి ఉంటే నిజాలు బయటపడతాయని టిఎన్‌టియుసి నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్‌వాడీలో రెండు వర్గాలు ఉన్నాయని, వారిలో ఒక వర్గానికి సంబంధించిన వారిని మాత్రమే పిడి విచారించారని ఆరోపించారు. పిడి వెంట ప్రస్తుత విజయలక్ష్మి, సిబ్బంది ఉన్నారు.

హత్యకేసులో నిందితుల అరెస్ట్
* సిబ్బందికి రివార్డులు అందచేసిన ఎస్పీ
నెల్లూరు, ఏప్రిల్ 1: గత నెల 26వ తేదీన నెల్లూరు 5వ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వెల్లిమలై భూమినాథన్ హత్య కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో జరిగిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఈ సంఘటన వివరాలను తెలియచేశారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబునగర్‌కు చెందిన భూమినాథన్ (21) నగరంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇదే విధంగా నగరంలో ఆటోలు నడుపుతూ జీవనం సాగించే కొత్తూరుకు చెందిన తమ్మినేని భాస్కర్, చంద్రబాబునగర్‌కు చెందిన సయ్యద్ ఆసిఫ్, టైలర్స్ కాలనీకి చెందిన ఖాదర్‌బాషా, సంగం మండలం సూరాయపాలెంకు చెందిన షేక్ రఫీలకు ఆటోలు నడిపే విషయంలో గత కొంతకాలం ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో భూమినాథన్‌పై కక్ష పెంచుకున్న వారు గత నెల 26న చంద్రబాబునగర్‌లో భూమినాథన్‌ను ఆటోలో ఎక్కించుకొని ఆటోలోనే కిరాతకంగా ఇనుపరాడ్‌తో కొట్టుకుంటూ వెళ్లారు. అతను మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని వెంకటాచలం మండలం అనికేపల్లి సమీపంలోని సర్వేపల్లి రిజర్వాయర్ వద్ద పడేసి అదే ఆటోలో పరారయ్యారు. శుక్రవారం కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నించిన వీరు సంగం నుంచి నెల్లూరుకు ఆటోలో కలిసి వస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద కాపుకాసిన పోలీసులు వీరు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఇనుపరాడ్‌ను, ఆటోను, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సిబ్బందికి రివార్డులు
హత్య జరిగిన వారం రోజుల వ్యవధిలో నిందితులను పట్టుకోవటంలో సఫలమైన 5వ నగర పోలీసులను ఎస్పీ విశాల్ గున్నిని అభినందించారు. నగర డిఎస్పీ రాముడు, 5వ నగర సిఐ సుబ్బారావు, ఎస్సై విజయకుమార్, కానిస్టేబుళ్లు సాయికిషోర్, గోపాల్, జిలానీలకు నగదు ప్రోత్సాహకాలను ఎస్పీ అందచేశారు.

ముగిసిన ముత్యాలమ్మ జాతర
చిల్లకూరు, ఏప్రిల్ 1: మండలంలో గత నాలుగు రోజులు నుండి జరిగిన ముత్యాలమ్మ అమ్మవారి జాతర శుక్రవారంతో ముగిసింది. భక్తులు కోలాహలం మధ్య అమ్మవారిని సాగనంపడంతో జాతర కార్యక్రమం ముగిసింది. ముత్యాలమ్మ అమ్మవారి జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. జాతర ముగింపుకు సూచనగా గంగమిట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడిసెలో పోలేరమ్మ విగ్రహాన్ని శుక్రవారం వేకువ జామున గ్రామోత్సవం నిర్వహించి గణాచారి, నాగయ్య శెట్టిల పర్యవేక్షణలో గొల్లల వేడుకల మధ్య వెళుతుండగా పంబలోళ్లు పాటలు పాడుతూ ఉత్సాహంగా సాగింది. బాణాసంచా పేలుళ్లతో గ్రామం మారుమోగింది. జాతర అనంతరం పోలేరమ్మ విగ్రహాన్ని ముత్యాలమ్మ దేవస్థానం వెనుక వైపుకు తీసుకొని వెళ్లి గణాచారి, పంబలోళ్లు తిడుతూ అమ్మవారికి అంగవైకల్యం చేయడంతో జాతర వేడుక ముగిసింది.
జాతర నిర్వహణపై బేరిశెట్ల ఆగ్రహం
తమ గ్రామ దేవత అయిన ముత్యాలమ్మను అభివృద్ధి చేసి దేవాలయాన్ని నిర్మించి దేవాదాయ శాఖకు అప్పగించినట్లు స్థానిక భేరిశెట్లు పేర్కొన్నారు. అలాంటి జాతర మహోత్సవానికి స్థానిక బేరిశెట్లను ఆహ్వానించకపోవడం, ఆలయ సాంప్రదాయాలు పాటించక పోవడం, కేవలం దేవాదాయ శాఖ అధికారులు ఆదాయం పొందేందుకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం చోటు చేసుకొందన్నారు. గతంలో భేరిశెట్లు చెన్నై పట్టణాల్లో చిరు వ్యాపారులు చేసుకొంటూ లక్షలాది రూపాయలను దాతల సహకారంతో సమకూర్చి జాతర నిర్వహించగా, నేడు వారికి ప్రాధాన్యత ఇవ్వకుండానే రాజకీయ నాయకుల సైతం తమ గ్రామానికి వచ్చి పెత్తనం చేయడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల ఓవర్ యాక్షన్
జాతర నిర్వహణకు భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయడంతో భక్తులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించి కేవలం పోలీస్ కుటుంబ సభ్యులకే దర్శనానికి ప్రాధాన్యత కల్పించారని భక్తులు ఆగ్రహం వ్యకం చేశారు. స్థానికులనే తారతమ్యం లేకుండా బయట నుండి విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీసులకు స్థానికులపై అవగాహన లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఉత్సవ కమిటీ సభ్యులే ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. దీనిపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.