శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బయోమెట్రిక్ విధానం అమలయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, జూలై 4: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఈ విద్యాసంవత్సరానికి గాను జూలై 1వ తేది నుంచి కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలుపరచాలని రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. బయోమెట్రిక్ విధానం వల్ల విద్యార్థుల హాజరు ఆధారంగా బోధన రుసుముల చెల్లింపుల పథకం అమలు జరుగుతోంది. గత ఏడాది వలే ఈ ఏడాది కూడా ప్రతి కళాశాలలో బయోమెట్రిక్ విధానాన్ని కచ్చితంగా అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకు భిన్నంగా జిల్లాలో ఉన్నత కళాశాలల పనితీరు నడుస్తోంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న కొన్ని కళాశాలలు, హాస్టళ్లలో మాత్రం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మిగిలిన కళాశాలల్లో ఆ ఊసే కనిపించటం లేదు. నెల్లూరు నగరంలో ఉన్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంతోపాటు పలు కళాశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5 గంటలకు బయోమెట్రిక్‌ను వాడుతున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని జిల్లావ్యాప్తంగా 30 శాతం వరకే అమలవుతోంది.
కళాశాలల్లో కానరాని యంత్రాలు
విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిధిలో మొత్తం 137 డిగ్రీ కళాశాలలు, ఒక పీజీ కళాశాల ఉంది. అయితే ఈ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం చాలాచోట్ల కానరావడం లేదు. అక్కడక్కడ కొన్ని కళాశాలల్లో మాత్రం ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. మిగిలిన కళాశాలల్లో బయోమెట్రిక్ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. కళాశాలల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బయోమెట్రిక్ విధానం అంతంతమాత్రంగా అమలు జరుగుతోంది. కొన్ని కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ యంత్రాల జోలికే వెళ్లడం లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కళాశాలలకు రాగానే ముందుగా బయోమెట్రిక్‌పై బొటన వేలు ఉంచి ఆ తరువాత లోపలకు ప్రవేశించాలి. ఇలా చేయడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్ని గంటలకు వచ్చారు, రావాల్సిన సమయం వంటి విషయాలు వెంటనే అందులో నమోదవుతాయి. ఇదివరకు కొన్ని కళాశాలల్లో ఉపాధ్యాయులు సమయానికి రాకుండా ఇష్టం వచ్చినప్పుడు వచ్చి సాయంత్రం పూట రిజిస్టర్‌లో సంతకాలు చేయడం వంటివి జరుగుతుండేది. అయితే బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం వల్ల ఇలాంటి ఉపాధ్యాయులకు చెక్ పడింది. కానీ కళాశాలల్లో ఈ విధానాన్ని సంపూర్ణంగా అమలుచేస్తే ఉపాధ్యాయులు ఆగడాలకు, విద్యార్థుల ఇష్టారాజ్యానికి కళ్ళెం వేయవచ్చు. అలాగే హాస్టళ్లలో కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడంవల్ల బయట వ్యక్తులు లోనికి ప్రవేశించకుండా ఉండేందుకు ఈ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పథకాన్ని జిల్లాలోని ఉన్నత విద్యా కళాశాలల్లో పూర్తిస్థాయిలో అమలుచేస్తే ఉపాధ్యాయుల ఆగడాలు అరికట్టడంతోపాటు విద్యార్థులు అన్ని విధాలుగా విద్య అందుతుంది.
కొరవడిన నిఘా
ఉన్నత విద్యా కళాశాలల్లో అధికారుల నిఘా కొరవడింది. దీంతో జూలై 1వ తేది నుంచి కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేయాల్సి ఉన్నా ఇప్పటివరకు ఈ విధానాన్ని అమలు చేయకుండానే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను పెడచెవిన పెట్టిన కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిన విస్‌యూ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అధికారులు బయోమెట్రిక్ అమలు గురించి గట్టిగా చెప్పకపోవడంతో ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అన్ని కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
యంత్రాలు అమర్చకుంటే ఇబ్బందులే
విఎస్‌యూ రిజిస్ట్రార్ శివశంకర్
జిల్లాలోని అన్ని కళాశాలలు, హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలన్నది ప్రభుత్వ నిబంధన. ఈ మేరకు కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను సమావేశపరచి బయోమెట్రిక్ యంత్రాలను అమర్చుకోవాలని సూచించటం జరిగింది. అన్ని కళాశాలల్లో జూలై 1వ తేది వరకు అమర్చుకోవాల్సి ఉంది. కానీ రాష్ట్ర కౌన్సిల్ ఈనెల 15వ తేది వరకు గడువు ఇచ్చింది. 15వ తేదిలోగా అన్ని కళాశాలల్లో ఈ యంత్రాలను అమర్చుకోకపోతే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కూడా రావు. అలాగే ఆ కళాశాలలకు అప్లియేషన్ కూడా ఇవ్వడం జరగదు. యంత్రాల విషయంలో నిర్లక్ష్యం వహించే కళాశాలలపై చర్యలు తీసుకుంటాం.