శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆదాయం అధికం.. సౌకర్యాలు స్వల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 23: దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో రైల్వే శాఖకు ఆదాయం అందించే జిల్లాలో విజయవాడ తర్వాతి స్థానం నెల్లూరు జిల్లాది. అంతటి ప్రాధాన్యం కలిగిన నెల్లూరుకు రైల్వే కేటాయింపుల్లోనూ, కొత్త రైళ్ల ఏర్పాటు, హాల్టింగ్ వంటి విషయాల్లోనూ ఎప్పుడూ రైల్వే బడ్జెట్‌లో నిరాశే ఎదురవుతోంది. కనీసం బడ్జెట్‌కు సంబంధం లేకుండా కూడా అవకాశం కల్పిస్తారనే నెల్లూరువాసుల ఆశలపై ఏ ప్రభుత్వం వచ్చినా నీళ్లు చల్లడం మామూలైపోయింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆదివారం నెల్లూరుకు రానున్నారు. సాక్షాత్తూ రైల్వే మంత్రి నెల్లూరు వస్తుండడంతో రైల్వే పరంగా ఆయన్నుంచి ఎన్నో అభివృద్ధి హామీలను నెల్లూరు వాసులు కోరుకోవడంలో తప్పేమీ లేదు. నిత్యం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ నుంచి రైల్వేకు రూ.15 లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. కానీ కేటాయింపుల్లోనూ, స్టేషన్ అభివృద్ధిలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. దాదాపు 7 లక్షల జనాభా కలిగిన నెల్లూరు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాకులతో రైళ్లు కిటకిటలాడుతుంటాయి. ఏ గ్రేడ్ స్థాయి స్టేషన్ అయినప్పటికి ఇక్కడ అరకొర సౌకర్యాలే ప్రయాణికులకు అందుతున్నాయి. జిల్లాలో గణనీయంగా సాగుతున్న పారిశ్రామికాభివృద్ధి పుణ్యమాని దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ఎందరో ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే నెల్లూరు స్టేషన్‌లో కోరమాండల్, తమిళనాడు, రాజధాని వంటి కొన్ని ప్రధాన రైళ్లకు నిలుపుదల లేకపోవడంతో వాటిలో ప్రయాణించాల్సినవారు చెన్నై, విజయవాడ వంటిచోట్లకు వెళ్లి ప్రయాణించాల్సిన పరిస్థితి. బిట్రగుంటలో వందల ఎకరాల రైల్వే భూమి నిరుపయోగంగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన రైల్వేకు లేకపోవడం విచారకరం. నెల్లూరు, గూడూరు నగరాల్లో రైల్వే స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. అధికారుల్లో మాత్రం చలనంలేదు. ఇక మెట్ట ప్రాంతవాసుల చిరకాల వాంఛ శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైను ఇంకా ప్రాథమిక దశలో ఉంది. సికింద్రాబాద్, చెన్నై రైల్వే జోన్ల ఇంటర్‌చేంజ్ పాయింట్ అయిన గూడూరులో ఎప్పట్నుంచో రెఫరల్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని రైల్వే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా ఇంతవరకు ఆ దిశగా రైల్వే శాఖ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు సిబ్బంది నుంచి వినవస్తున్నాయి. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టు కోసం 22 కిమీ రైల్వే లైను ఏర్పాటు చేశారే తప్ప అక్కడ ఉద్యోగులను కేటాయించలేదు. ఇతరచోట్ల ఉన్న ఉద్యోగులనే అక్కడ ఉపయోగించుకుంటున్నారే తప్ప పెరిగిన ట్రాక్‌కు అనుగుణంగా ఉద్యోగులను ఎందుకు నియమించడం లేదని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆదాయం అధికంగా వచ్చేచోట అరకొర కేటాయింపులు మాత్రమే అందుకుంటూ వచ్చిన నెల్లూరు రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాకతో దశ తిరుగుతుందనే ఆశతో జిల్లావాసులు ఉన్నారు. నెల్లూరు సౌత్ స్టేషన్‌లో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ భూమిపూజకు విచ్చేస్తున్న రైల్వే మంత్రి జిల్లాకు ఏమైనా వరాలు ప్రకటిస్తారో, లేక చిరునవ్వు చిందించి రిక్తహస్తాలు చూపించి వెనుతిరుగుతారో ఆదివారం అర్ధమైపోతుంది.

సిపిఎస్ రద్దుకు దేశవ్యాప్త ఆందోళన
ఎమెల్సీ యండపల్లి వెల్లడి
నెల్లూరు కలెక్టరేట్, జూలై 23: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ద్వారా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వం సిపిఎస్‌ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద శనివారం సిపిఎస్ పెన్షన్‌ను రద్దు చేయాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మెరుగైన వేతన సవరణ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ద్వారా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎస్‌టిఎఫ్‌ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనకు యుటిఎప్ మద్దతు తెలియజేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో ఉన్న అన్ని సంఘాలతో కలిపి మూడు దశల పోరాటాలు చేయడానికి సంకల్పించామన్నారు. అందులో భాగంగా తొలుత కోటి సంతకాలు సేకరించి ప్రధానికి పంపాలని నిర్ణయించామన్నారు. సెప్టెంబర్‌లో సిపిఎఫ్ రద్దు చేయాలని కోరుతూ సమ్మె నిర్వహించనున్నామన్నారు. అలాగే నవంబర్‌లో చలో పార్లమెంట్ కార్యక్రమం చేపట్టి పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె తులసీరాంబాబు, ఎన్ నవకోటేశ్వరరావు, ఎన్‌జివో సంఘం జిల్లా సెక్రటరీ జనరల్ రమణారెడ్డి, గౌరవాధ్యక్షుడు ఎం మస్తానయ్య, కోశాధికారి నాగిరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ సి శ్రీహరి ఎన్‌వి సుబ్బారావు, శేషు, భాస్కర్, ఎస్‌కె ఖాజావళి తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనం పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్
నెల్లూరుటౌన్, జూలై 23 : నగరంలోని జెండావీధిలో ఉన్న పిఎన్‌ఎం ఉన్నత పాఠశాలలో శనివారం మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ తాళ్లపాక అనురాధ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ పాఠశాలలో ఉన్న 400 మంది పిల్లలకు గాను కేవలం 60 మంది పిల్లలకే భోజన సదుపాయం కల్పిస్తున్నారని అన్నారు. అక్కడి పిల్లలను విచారించగా భోజనం సరిగా లేదని తెలిపారన్నారు. ఆమె స్వయంగా భోజనం చేసి అక్కడి భోజనం సరిగా లేదని వెంటనే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ దృష్టికి ఫోన్ ద్వారా తెలియచేశారు. ఆ భోజనం ఏర్పాట్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మధ్యాహ్న భోజన పథకాలను తప్పుదోవ పట్టించకుండా సక్రమంగా అందేలా చూడాలని మంత్రి నారాయణను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పి.శైలజ, నగర మహిళా అధ్యక్షురాలు పి.శాంతి, సుబ్బమ్మ ఆ ప్రాంత మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అయోడైజ్డ్ ఉప్పు వినియోగంపై
ప్రజలకు అవగాహన కల్పించాలి:జెసి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జూలై 23: అయోడైజ్డ్ ఉప్పు వినియోగంపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించి అయోడైజ్డ్ ఉప్పు వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్నారు. శనివారం స్థానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో వివిధ శాఖ అధికారులతో అయోడైజ్‌డ్ ఉప్పు వినియోగంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయోడైజ్డ్ ఉప్పు లోపం వల్ల గాయటర్, థైరాయిడ్ వంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉందని, దీనిని నివారించవలసిన అవసరం ఉందన్నారు. అయోడైజ్‌డ్ ఉప్పు వాడకంపై విస్తృతస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. దారిద్య్రరేఖకు దిగువనున్నవారు అయోడైజ్‌డ్ ఉప్పు వినియోగంపై అవగాహన లేకపోగా దారిద్య్రరేఖకు ఎగువన్న ఉన్న వారు బ్రాండెడ్ ఉప్పు వాడుతున్నారని అన్నారు. అయితే దానిలో నాణ్యత ఎంత ఉందని చూడటం లేదన్నారు. అయోడైజ్‌డ్ ఉప్పు 19 నమూనాలు పరీక్షించగా 7 నమూనాలలో అయోడైజ్‌డ్ ఉప్పు శాతం తగినంత లేదని గుర్తించడం జరిగిందన్నారు. ఒకరికి 60 వేల వరకు జరిమానా విధించినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వి ఆనందరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 1988లోనే సహజ ఉప్పు (కల్లు ఉప్పు)ను నిషేధించిందని అన్నారు. అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో మానసిక రుగ్మత, పెరుగుదలలో సమస్యలు వంటివి వస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ, తూనికలు, కొలతలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఉప్పు శాఖ, ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.

అధికారుల పర్యవేక్షణలోనే రైల్వే పనులు
రాపూరు, జూలై 23: కృష్ణపట్నం-ఓబులాపురం మధ్య జరిగే రైల్వే నిర్మాణ పనులు నాణ్యతగా ప్రభుత్వ నిబంధనల మేరకు జరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే ఇంజనీరింగ్ అధికారి బాలాజీ స్పష్టం చేశారు. శనివారం రైల్వే క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణపట్నం నుండి ఓబులాపురం వరకు 60 కిలోమీటర్ల దూరంలో జరిగే పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా పక్కా ప్రణాళికతో చేస్తున్నామన్నారు. ఇటీవల కొందరు ఈ నిర్మాణ పనులపై విమర్శలు చేస్తున్నారని అది సరికాదన్నారు. ఈ రైల్వే పనుల్లో తమకు ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాలేదని, ఒక్క రాపూరు మండల పరిధిలోనే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ నిర్మాణ పనులపై విమర్శించేవారు నిర్మాణం నాణ్యతపై తనిఖీ చేసి విమర్శిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఈ విలేఖరుల సమావేశంలో మేడికొండ కన్‌స్ట్రక్షన్స్ ప్రాజెక్టు మేనేజర్ ఎ రమేష్ పాల్గొన్నారు.

పేదల సంక్షేమం టిడిపితోనే సాధ్యం:సోమిరెడ్డి
ముత్తుకూరు, జూలై 23: తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, ప్రజా సంక్షేమం టిడిపి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని గోవిందరెడ్డిపాళెం విచ్చేసి సరయువాల పామాయిల్ ఫ్యాక్టరీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్‌టిఆర్ సురక్షధార మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి సభ్యులు కొత్తపల్లి రమేష్‌కుమార్ శర్మ ఎమ్మెల్సీకి తప్పెట్లు, మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ, ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ ద్వారా పొట్టెంపాడు రోడ్డు నుండి గోవిందరెడ్డిపాళెం వరకు 600 మీటర్ల తారురోడ్డు, 500 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి సుమారు 75 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. నీరు-చెట్టు పథకం ద్వారా అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. అనంతరం బ్రహ్మదేవం బిసి కాలనీని ఎమ్మెల్సీ సందర్శించారు. మరమ్మతులకు గురైన మూడు గృహాలను తొలగించి నూతనంగా పక్కా గృహాలు నిర్మించాలని ప్రభుత్వ శాఖ అధికారులకు తెలిపారు. గిరిజన కాలనీలో ఇంకుడు గుంటలను ఎమ్మెల్సీ ప్రారంభించారు. జిల్లాలో సుమారు వెయ్యి కోట్లకు పైబడి నిధులతో ఆర్ అండ్ బి అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. తదుపరి ఎమ్మెల్సీని శాలువాలతో సన్మానించారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా ఎంపిటిసి సభ్యులు కె రమేష్‌కుమార్ ఇంటి ముందు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటారు. బ్రహ్మదేవి పంచాయతీని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్సీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ మునుకూరు రవికుమార్‌రెడ్డి, టిడిపి అధ్యక్షులు విశ్వమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శివారు ప్రాంతాల్లో
పోలీసుల నిఘా ఏదీ?
* పెరుగుతున్న నేరాలు
* శ్రుతిమించిన మద్యంబాబుల ఆగడాలు
* అవస్థలు పడుతున్న మహిళలు
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జూలై 23 : నెల్లూరు నగర శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా లోపించడంతో నేరాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా సుందరయ్య కాలనీ, దండోరా కాలనీ, జగ్జీవన్‌రామ్ కాలనీలతోపాటు పలు కాలనీలకు ఆనుకుని ఉన్న బహిరంగ ప్రదేశాల్లోనే యువకులు మద్యం సేవిస్తూ వచ్చేపోయే మహిళలను వేధిస్తున్నారు. దీంతో స్థానిక మహిళలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. రాత్రి సమయాల్లో ఈ ప్రాంతాల్లో కనీసం గస్తీ పోలీసులు కూడా కానరాకపోవడంతో మందుబాబు ఆగడాలు పెట్రేగిపోతున్నాయి. శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా లేకపోవడంతో కొందరు యువకులు ఇళ్లలో ఉన్న చిన్నచిన్న వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. దానికితోడు అర్థరాత్రి వరకు ఇష్టారాజ్యంగా యువకులు ఈ ప్రాంతాలలో తిరుగుతున్నారు. వీరిని అడిగేవారు కరవయ్యారు. కనీసం వారానికోసారైనా గస్తీ పోలీసులు వస్తూపోతూ ఉంటే వీరిలో కొంతవరకు భయం ఉంటుంది. కానీ చూద్దామన్నా బీట్ పోలీసులు కానరాకపోతుండడంతో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఇళ్ల ఆవరణలో ఏ చిన్నపాటి వస్తువు పెట్టిన తెల్లారేసరికి వాటిని కాజేస్తున్నారు. ప్రధానంగా సుందరయ్య కాలనీ, జగ్జీవన్‌రామ్ కాలనీ, కొండాయపాళెం ప్రాంతాలలో ఉన్న బీడు ప్రదేశాల్లో సాయంత్రం అయితే చాలు నగరానికి చెందిన ఆటోలు, కార్లు, బైక్‌లు వచ్చి చేరుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు మద్యం సేవిస్తూ ఇష్టారాజ్యంగా గోల చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దానికితోడు ఈ మార్గాల నుంచి వచ్చే మహిళలను వేధిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మద్యం మత్తులో ఉన్న వారు ఏ రోజు ఏ అఘాయిత్యానికి పాల్పడుతారోనన్న భయం స్థానికులను పట్టి పీడిస్తోంది. ఇటీవల ఈ కాలనీకి చెందిన కొందరు యువతులు వస్తుండగా కొందరు యువకులు మద్యం సేవిస్తూ వారిని వేధిస్తుండడంతో గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఈ ప్రాంతాలకు వచ్చింది లేదు. గస్తీ నిర్వహిస్తున్న దాఖలాలే లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గూర్కాలే దిక్కు..
నగర శివార్లలో పోలీసులు నిర్వహించాల్సిన గస్తీని గూర్కాలు చేస్తున్నారు. గూర్కాలు వీధుల్లో తిరుగుతూ విజిల్స్ వేసుకుంటూ పోతున్నారు. కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గూర్కాలకు ప్రశ్నించే అధికారం లేకపోవడంతో వారు కూడా చూస్తూ వెళ్లిపోతున్నారు. ఏదిఏమైనా పోలీసులు నిర్వహించాల్సిన విధులను గూర్కాలు నిర్వహిస్తూ కొంతవరకు శివారు ప్రాంత ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పెరుగతున్న నేరాలు, మహిళలపై వేధింపుల విషయంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్నవారే కరవయ్యారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఒక్క సుందరయ్యకాలనీ కాక నగర శివారు ప్రాంతాల్లోనూ నెలకొని ఉంది. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ స్పందించి శివారు ప్రాంతాల్లో పోలీసు గస్తీ ఏర్పాటుచేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.

పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొన్న స్కార్పియో
హోంగార్డు మృతి * ఎస్‌ఐతోపాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలు

మనుబోలు, జులై 23: విధి నిర్వహణలో వున్న పెట్రోలింగ్ పోలీసులు మృతి చెందిన గేదెను పక్కకు తీసివేయడానికి తమ వాహనం నుంచి దిగతుండగా వెనుకవైపు వస్తున్న స్కార్పియో వేగంగా ఢీకొనడంతో ఒక హోం గార్డు మృతిచెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని కొండూరు సత్రం సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం వేకువ జామున చోటుచేసుకుంది. హైవే పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో శనివారం రాత్రి ముత్తుకూరు ఎస్‌ఐ జెపి శ్రీనువాసులు, కానిస్టేబుల్ మోహన్, హోంగార్డు ముట్టెంబాక శ్రీహరి(29) విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా బూధనం టోల్‌ప్లాజా నుండి కృష్ణపట్నం పోర్టురోడ్డుకు వస్తున్న సమయంలో కొండూరు సత్రం సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని గెదే మృతి చెందివుండడాన్ని గుర్తించారు. రోడ్డుకు అడ్డంగా పడివున్న గెదేను తొలగించడానికి హైవే సిబ్బందికి పెట్రోలింగ్ అధికారులు సమాచారం అందిస్తుండగా అదే మార్గంలో తిరుపూరు నుండి రాజమండ్రికి వెళ్తున్న స్కార్పియో వేగంగా వచ్చి మృతి చెందిన గెదేను ఢీకొని ముందు వున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొంది. దీంతో పెట్రోలింగ్ వాహనం బోల్తా పడగా స్కార్పియో సంఘటన స్థలం నుండి సుమారు 50మీ.దూరంలో వున్న ఇసుకలోకి కూరుకు పోయింది. ఈ ప్రమాదంలో పెట్రోలింగ్ వాహనంలో వున్న ఎస్‌ఐ శ్రీనువాసులురెడ్డి, కానిస్టేబుల్ మోహన్, హోంగార్డు శ్రీహరి, స్కార్పియోలో ప్రయాణిస్తున్న మారుఫ్ షరీఫ్, మహారాజ్ షరీఫ్, ఫర్విన్, సయ్యద్ మహమ్మద్, సాయిబాబాలకు తీవ్ర గాయాలైనాయి. గాయడిన వారిని 108, హైవే అంబులెన్సులలో చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని సింహపురి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ హోంగార్డు శ్రీహరి మృతి చెందాడు. కానిస్టేబుల్ మోహన్ పరిస్థితి విషమంగా వున్నట్లు పోలీసులు తెలిపారు. అటుగా వెళ్తున్న నెల్లూరు రూరల్ సిఐ శ్రీనువాసులురెడ్డి ప్రమాదాన్ని గమనించి 108కు సమాచారం అందించి క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు మనుబోలు ఎస్‌ఐ గంగాధర్ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. శనివారం ఉదయం ఎఎస్‌పి శరత్‌బాబు ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింహపురి ఆసుపత్రిలోవున్న క్షతగాత్రులను పరామర్శించారు. హోంగార్డు శ్రీహరి మృతదేహంను పరిశీలించి ఆయన బంధువులను ఓదార్చారు. ఆయనతోపాటు గూడూరు డిఎస్‌పి శ్రీనివాస్, సిఐ శ్రీనువాసులురెడ్డి తదితరులు ఉన్నారు.