నెల్లూరు

ఉగాది కవితలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం మారిపోయింది
ఆశలు అడుగంటి పోయాయి
కోరికలు కొడిగట్టిపోయాయి
అక్షరం అన్నం ముద్దవుతుందనుకొన్నాను
కళ్లల్లో దీపాలు వెలిగించి
పుస్తకాల్లో బ్రతుకు చిత్రాన్ని వెతుకున్నాను
జీవితంలో ఎన్ని ఆశ్చర్యార్థాలు
జీవన సమయంలో కామాలే తప్ప
పుల్‌స్టాపులు ఉండవనుకొన్నాను
మార్కులు తగ్గినపుడు పంతులు గారు
గోడ కూర్చీ వేయిస్తే సిగ్గుతో తలవంచుకున్నాను
ఇప్పుడే అదే అక్కరకొచ్చింది
ఋణదాత ఇంటి ముందు
వడ్డీ కట్టలేని అసహాయత
ఎన్నోసార్లు గోడకుర్చీ వేయించింది
ఎక్కం అప్పచెప్పకపోతే..
గుంజీళ్లు పెట్టిన అనుభవం
గంజినీళ్ల కోసం గుంజీళ్లు తీస్తుంటే
గుర్తుకొచ్చింది
అల్లరి చిల్లరగా తిరిగిన రోజులే బాగున్నాయి
మా అమ్మ పది పైసలిస్తే ఆరోజు పండుగే
జారిపోయే చడ్డీకి మొలతాడు కట్టి
పగిలిన పలక, విరిగిన బలపం
చిరిగిన సంచిలో వేసుకొని బడికెళ్లేవాళ్లం
గుడి దగ్గర పూజారయ్య పెట్టే
ప్రసాదం కోసం పోటీపడే వాళ్లం
పెట్టే ప్రసాదం పిడికెడైనా
జీవితం మీద ఆశ చిగురింపచేసేది
మేడి పట్టిన మా అయ్య బ్రతుకు బీడుగా
మారిందని
బడికెళ్లి బ్రతుకు దిద్దుకోమనేవాడు
దిద్దీ దిద్దీ సుద్ద అరిగిపోయిందే కాని
అన్నం ముద్ద నోటి కందలేదు
డిగ్రీ పట్టా చేతికందినపుడు
ఇరగ కాసిన వరికంకుల్లా
మా అమ్మ కళ్లల్లో ఆనందం ఇప్పటికీ గుర్తే
డిగ్రీ పట్టా ఫైల్లో భద్రంగా వుంది
ఏజ్ బారయ్యింది
నేను మా అయ్యగా మారిపోయాను
మా బుడ్డోడు నేనుగా మారిపోయాడు
నేను మేడి పట్టాను
మా బుడ్డోడిని బడిలో వేద్దామనుకొన్నాను
చిత్రం.. ఎల్‌కెజి చదువులంట
వాడు బడిలో చేరడానికి ఎంట్రెన్స్ నాకంట..
వెధవ బ్రతుకు జీవితమంతా చదువే
కానె్వంటు చదువు కంటే కలెక్టరు చదువు
చౌకైపోయింది
మెడలో టై, కాలికి బూట్లు, నడుముకి బెల్టు
ఇస్ర్తి మడత నలగని యూనిఫాం
పిల్లోడు పిల్ల జమిందారుగా కనిపిస్తుంటే
వాడమ్మ మురిసిపోయింది
మమీ..మమీ అంటుంటే ప్రేమతో తడిసి
ముద్దయిపోయింది
పొలానికి ఎదపెట్టడం కన్నా
వీడి చదువుకి ఎదపెట్టడం కష్టమైపోయింది
బొచ్చెలోకి అంబలి లేక అల్లాడుతుంటే
పిజ్జాలు, బర్గర్లు కావాలంటున్నాడు
కాలం మారిపోయింది
మా అయ్య నా మీద ఆశలు పెట్టుకున్నట్టే
నేనూ మా బుడ్డోడి మీద పెట్టుకున్నాను
కోడి కూతతో ఉషోదయం రావాలి
కోకిల గానంతో ఉగాది రావాలి
కోడి కూత పెట్టలేదు
జీవితం తెల్లారి పోయింది
కోకిల గానం వినిపించడం లేదు
జీవితం చిగురించకుండానే ఉగాది వెళ్లిపోయింది
కాలం మారిపోయింది.

- పొన్నూరు వేంకట శ్రీనివాసులు
ఒంగోలు
చరవాణి : 9440432939

షడ్రుచుల సమాజం
శుభోదయాల సందేశాలు
శుభాకాంక్షలతో సుప్రభాతాలు
అభినందనల మకరందాలు
అంతర్జాలపు స్నేహాలు
ఆత్మీయ సమూహాల్లో అచ్చట్లు
ముఖపుస్తక మిత్రుల ముచ్చట్లు
మురిపించే తీయని కోయిల పాటలు
విదేశాల్లో ఉద్యోగాలు
విహంగయానపు ఉద్వేగాలు
అవధుల్లేని ఆదాయాలు
అందుకోబోయే అందలాలు
అత్యాధునిక విలాసాలు
పండిన చింత పులుపు ఊరింపులు
కొనలేని కార్పొరేట్ చదువుల బరువులు
మండుతున్న ఇంధన ధరల సెగలు
నిలకడ లేని నిత్యావసరాల వెలలు
హడలెత్తిస్తున్న హాస్పిటల్ ఖర్చులు
దడ పుట్టిస్తున్న విద్యుత్ ఛార్జీల పిడుగులు
కొత్త మిరప కారపు చురుకులు..
అమాయకుల గుండెల్లో
బాంబు పేలుళ్లు
అమ్మాయిల బ్రతుకులపై
యాసిడ్‌దాడులు
అగ్రస్థానం అందుకుంటున్న
ఉగ్రవాదులు
విపక్షాల కక్షల్లో రక్షణలేని బ్రతుకులు
అవినీతి ఊబిలో మునిగినపాలకులు
బ్రౌన్షుగర్ రుచి మరిగిన బాలకులు
వేపపూత లాంటి చేదు నిజాలు...

విలువ కోల్పోతున్న పెద్దలు
విడాకుల బాటలో జంటలు
విదేశాల మోజులో యువకులు
యంత్రాలతో చేసే సహవాసాలు
అస్థిత్వము కోల్పోతున్న మస్తిష్కాలు
అస్థిరవౌతున్న బాంధవ్యాలు
పిందె మామిడి వగరు చందాలు..

ఆత్మశక్తిని పెంచే ప్రబోధాలు
ఆనందాన్ని పంచే వినోదాలు
ఆరోగ్యానికి వ్యాయామాలు
ఆహ్లాదాన్నిచ్చే వ్యాపకాలు
ఆధ్యాత్మిక కేంద్రాలు,
పర్యాటక ప్రదేశాలు
అందిస్తున్న అద్భుత అనుభవాలు
రుచి కూర్చే లవణపు కమ్మదనాలు...

ఆధునిక పరిణామశీల ప్రపంచం
అందిస్తోంది షడ్రుచుల సమాజం
ఆదేశిస్తోంది దుర్ముఖి ప్రవేశం
ఆస్వాదించమంటూ
ఈ ఆరు రుచుల సారం..

- వి.లక్ష్మీభవాని, నెల్లూరు

పుస్తక సమీక్ష

దృశ్యం వెనుక అదృశ్యం
కొత్త జీవన పార్శ్వం

- ప్రతులకు -
బివిఎస్ ప్రసాద్,
101, డిఆర్‌కె అపార్టుమెంట్,
పుట్టవీధి, బాలాజీనగర్, నెల్లూరు
చరవాణి : 99499 44006

బివిఎస్ ప్రసాద్ ‘మరో మలుపు’ కథా సంపుటి

బివిఎస్ ప్రసాద్ - ఎల్లైసిలో పదవీ విరమణ చేసి, వృద్ధి చేసుకున్న జ్ఞానప్రభాసతో, విశే్లషణాత్మక స్వీయాధ్యయనంతో, జీవితానుభవ సారంతో కథా రచనకు పూనుకొన్నారు. తక్కువ కాలంలో మంచి కథలు చాలా రాసారు. మరోపార్శ్వంలో కార్టూనిస్టుగా ప్రముఖ వారపత్రికల్లో తన ప్రతిభ ప్రదర్శిస్తున్నాడు.
ఇది ‘మరో మలుపు’ కథానికల సంపుటి. ప్రసాద్ సాహితీ వరివస్యలో తొలిపంట! 23 కథానికలు ఉన్నాయి. ప్రసాద్ వ్యక్తిత్వం, వైశిష్ట్యం ప్రసాద్ కథానికల్లోనూ ప్రతిఫలిస్తూ ఉంది. మధ్యతరగతి మనస్తత్వాల్లోని వైరుధ్యాలూ, వాటి పర్యవసానాలూ, ఆ త్రిశంకు వర్గం వారి బతుకు ఇక్కట్లూ అలతి అలతి సుఖ సంతోషాలూ, ఆదర్శాల పట్ల ఆరాధనా, అన్యాయాల పట్ల ధర్మాగ్రహం - ఇవన్నీ ద్యోతకవౌతున్నాయి. కథల్లోని పాత్రల్లో ఎక్కువ మంది మన ఇరుగుపొరుగు వారే. బాగా పరిచయమున్నవారే! వారంతా మనలాగే ‘నేల’ మీద నడుస్తాడు. మనలాగే నవ్వి మనలాగే వౌనంగా ఏడుస్తారు.
మానవతా సంబంధాల్లో ‘ ఉదాసీనత’ కల్పించే పరిణామాలు చిత్రంగా వుంటాయి. తండ్రికి ఆపరేషన్ .. కొడుకూ, కూతురూ, అందరూ బిజీ. భార్యకి ఎవరూ సహాయం చేయలేరు. అయితే వెంట వెంటనే హైటెక్ పరిష్కారాలని సూచించగలరు. అన్నీ శుష్క ప్రియాలూ, శూన్యహస్తాలూ! మరి ఆయన గతి, ఆమె స్థితి ఏమిటి? లోకం ఇంకా గొడ్డుబోలేదు!- ‘‘బంధంలో బాంధవ్యం’’ కథ చదవండి రచయిత కథాకథన శక్తిని, వాంఛనీయమైన ముగింపునీ ఆనందిస్తారు.
‘‘్భర్యా రూపవతి’’ దానికి తోడు భర్త గారి అనుమానం పెనుభూతం దాంపత్య బంధానికి ఇరుసు - విశ్వాసం అది సడలితే అంతా క్షోభే! ‘‘వగలరాణివి నీవే’’లో ఆ సడలటం.. మళ్లీ బిగవటం చూస్తాం. ఉపకార చింతనకి డబ్బు మూటలు ఉండనక్కరలేదు. పెద్ద మనసు ముఖ్యం. అంతఃకరణ ముఖ్యం. ‘‘చిన్న జీతం’’ కథలో ఇదే పెద్ద సందేశం.
రక్త సంబంధాన్ని తెంచుకొని రూపాయి బంధాన్ని పెనవేసుకొంటే. రూపాయి ఆత్మ ఘోషిస్తూ తిరుగుబాటు చేస్తుందనేది ‘‘రూపాయి మాట్లాడితే’’ కథగా శిల్పభరితంగా పఠితని అలరిస్తుంది. ఇంకా.. ఇంకా.. ఎనె్నన్నో సృజనాత్మకత కలిగిన వర్తమాన సామాజిక వాస్తవాలు, మనుషుల ఆత్మనివేదనలు ఉన్నాయి.. ఇతర కథల్లో.
ఆరోగ్య పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తుంది - ‘‘మరో మలుపు’ . టైం విలువనీ, పనిలో ఆనందాన్నీ ఉన్నతీకరిస్తుంది - ‘‘తాతయ్య మందు’’. అవయవదానంతో ఆత్మతృప్తి పొందడం - ‘‘మనోరథం’’!
కార్టూనిస్టు కూడా కావడం వలన ప్రసాద్ కలంలో ఆహ్లాదకరమైన హాస్యం, ఆస్వాదయోగ్యమైన వ్యంగ్యం వొలుకుతాయి. ప్రసాద్‌కి ప్రయోగాత్మక సృజన పట్ల మక్కువ చేసే ఆలోచనా, చెప్పే విధానమూ - నవ్యంగా వుండాలనే తపన కన్పిస్తుంది. ఇంతకింత నిత్యచైతన్య పథ యాత్రికులు. చేశాక చెప్పే దక్షతా, జాగ్రత్తా కలిగిన బుద్ధిమంతుడు!
రానున్నది ఇంకా ఇంకా మంచి కథాకాలం ఆయనకు! కానున్నది ఇంకా ఇంకా ఉజ్వలమైన భవిష్యత్!

- విహారి
చరవాణి : 9848025600

స్పందన

ఉగాది కవితలతో
మెరిసిన మెరుపు
గతవారం మెరుపులో కవితల తివాచీ పరవడంతో సాహిత్యాభిలాషులకు కాస్త ముందుగానే ఉగాది వచ్చేసింది. ఉగాది కవితలతో మెరుపు మెరిసింది. ప్రతి కవితా చాలా బాగుంది. ఉగాది ఆహ్వానిస్తూ, ఉగాదిని వేడుకుంటూ, విన్నవిస్తూ సాగిన కవితల మాలికలు ఆధ్యంత్యం ఉగాది పచ్చడిని రుచి రూపించాయి. కొత్త రాజధాని ఏర్పడిన తరువాత వచ్చే కొత్త ఉగాది దుర్ముఖినామ ఉగాదికి ఎన్నో విజ్ఞాపనలు చేసి షడ్రురుచుల అభినందనలతో స్వాగతం పలికిన మన కవి పుంగవులకు ధన్యవాదములు. అన్నీ కవితలు చాలా బాగా కుదిరాయి.
- వెంకటాచలపతి, నెల్లూరు, అయితా అనిత, బుచ్చిరెడ్డిపాళెం
- కరుణాకరరెడ్డి, దర్శి, రమణి ప్రియ, శ్రీకాళహస్తి .

షడ్రుచుల మాలికలు

ఉ(గాది)షోదయం
తెలుగు గడ్డ నందు తొలి ఉగాది
భిన్నసంస్కృతులకు బహు పునాది
చిమ్మచీకట్లు చీల్చుకొని
చిరునవ్వులు మోసుకొని
ప్రకృతి పరవశించగా
పంచభూతాలు దీవించగా
పల్లెపట్నాలందు వెలుగుచూడగా
పాడిపంటన్నీ పచ్చగుండగా
మతసామరస్యాలు మిళితమవ్వగా
వర్గవైషమ్యాలు రూపుమాపగా
తెలుగు పలుకుల తీయదనం
ఉగాది పచ్చడి బహు కమ్మదనం
ఆరు రుతువులు ఆహ్లాదకరం
షడ్రుచులతో కమ్మని కలలకు శ్రీకారం
కట్టుబాట్లు నేర్పు కమనీయ సాంప్రదాయం
తెలుగు లోగిళ్లలోన తొలకరి చిరుదరహాసం
తెలుగువెలుగు నందు తొలి ఉగాది
ఉషోదయం

- హస్తి మోహన్‌రాజు
నారాయణహాస్పిటల్ పి.ఆర్.ఒ.
చరవాణి : 8008511316

సదా ప్రేమిస్తా...
ప్రకృతి ఆకృతిలోకి
నూతన శోభలు తెస్తూ
చేతన భావాలు మోస్తూ
వచ్చే ఉగాదిని స్వాగతిస్తూ..

అనంతమైన కాలం మీద
చిత్ర విచిత్ర చరిత్ర రాస్తూ
చైత్ర మాసపు ఊసులు చెప్తూ
వచ్చే ఉగాదిని ఆహ్వానిస్తూ..
జీవన నవగమనానికి
సంతోష వసంతాలనిస్తూ
షడ్రుచుల సందేశమందిస్తూ
వచ్చే ఉగాదికి వందనమంటూ..

పాడి పంటలకై పాటుపడమని
ఉల్లాసపరిచే పైరగాలులతో
ఉల్లానికి హాయినిచ్చే కోకికలతో
వచ్చే ఉగాదిని మెచ్చుకుంటూ..
తెలుగు ముంగిళ్లకు
వెలుగు పంచుతూ
పచ్చని మామిడి తోరణాలు కడుతూ
ముచ్చటగా
మనందరికానందమిచ్చే
సంవత్సరాదిని
సదా ప్రేమిస్తూ..

- బొగ్గవరపు రాధాకృష్ణమూర్తి, నెల్లూరు
చరవాణి : 9885481939

ఆశల ఉగాది
వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం
కోటిభావాలతో నివేదిస్తున్నాం
శతకోటి అభయాలనందిస్తావనే ఆశిస్తున్నాం
ఆకాశమంత ఆశతో ఆశల దీపాలను వెలిగించుకున్నాం.
సమస్యల తుఫానులో విలవిలాడుతున్నాం
నీకోసమే మా నిరీక్షణ
అప్పుడప్పుడు అక్కడక్కడ కాదు
అనుదినం జరిగే ప్రక్రియ
కుత్తకపై కత్తిపెట్టి
మహిళల మానాన్ని ప్రాణాల్ని హరించేస్తూ
క్షణికావేశాలతో
పరిసరాలను నెత్తుటి మడుగులుగా మార్చేస్తున్నారు
నాయకులేమో రాజకీయాలకే పరిమితమవుతున్నారు
న్యాయం ధర్మాలను కాలరాసి
స్వార్థానికి అగ్రతాంబూలమిస్తున్నారు
ఆకలిమంటలతో దహించుకపోతూ
బాలకార్మికులు తయారవుతున్నారు
చట్టాలు అవినీతి చుట్టాలై కాలరెగరేస్తున్నాయి
ఒకటా రెండా ఎన్నని చెప్పేది
ఆసాంతం సమస్యలప్రోది
ఆగిపోతావో
పరిష్కరించే దిశలో అడుగులేస్తావో చూద్దాం!
కోటానుకోట్ల తెలుగు జాతి స్వాగతమిదే!
- గుర్రాల రమణయ్య,
చరవాణి : 9963921943

దుర్ముఖి నామ సంవత్సర ఉగాదికి ఆహ్వానం
కొన్ని నవ్వులను, మరికొన్ని దిగుళ్లను మిగిల్చి
వెళ్లిపోయింది మన్మథనామ సంవత్సరం
కాస్తంత తీపిని, మరికాస్త చేదును
మోసుకొస్తూ
విశ్వమానవాళికి, వినూత్న సందేశంతో
వచ్చేసింది దుర్ముఖి నామ సంవత్సర ఉగాది

మన్మథనామం వెళుతూ..వెళుతూ..
మిగిల్చిన చేదు అనుభవాలు,
తీపి జ్ఞాపకాలు
పునస్సమీక్షించుకుంటూ, లక్ష్యం
నిర్దేశించుకుంటూ
కొత్త ఆశలు..కొంగ్రొత్త ఆశయాలతో
కాలగమనంలో మరో యుగాదిని ఆహ్వానిద్దాం

ముంగిట్లో రతనాల ముగ్గులు
ద్వారాలకు మామిడాకుల తోరణాలు
చావిడలో పంచాంగ శ్రవణాలు
ఇంటిలో ఉగాది పచ్చడి సేవనంతో
వచ్చేసింది దుర్ముఖి నామ సంవత్సర ఉగాది

లేత మామిడి పూతలతో, గండు కోయిల కూతలతో
సంస్కృతి సాంప్రదాయలను ఒకటిగా చేసి
షడ్రుచుల సమ్మేళనంలో విచ్చేసి
ప్రకృతి కూత ఒడిలో సింగారించుకొన్న
దుర్ముఖి నామ సంవత్సర యుగాదికి
ఇదే ఆంధ్రుల ఆహ్వానం

- టివి ఎం ఎన్ ప్రకాష్‌రావు, కావలి
చరవాణి : 9490662460

ఆశిద్దాం - సాధిద్దాం
వయ్యారాల వసంతం రానే వచ్చింది
కాకికి కోయిలకు తేడా తెలియనే వచ్చింది
మావిచిగురు మరిగిన
ఆమని కోయిల గానంతో ఆశల చిగుళ్లతో
ఆశాభావాల్లో ఆహ్వానించాలనిపించింది ఉగాదిని.
ఎన్ని రుతువులున్నా వసంతం వేడుకే వేరు
మనస్సులను రంజింప చేసే మధుమాసం
నింబకుసుమ భక్షణంతో
వగరు, తీపి, పులుపు రుచుల కలగలుపు
మన జీవన వైవిధ్యం.

ఇది దుర్ముఖినామ సంవత్సరమట
దుర్మార్గుడు, దు శ్శాసనుడు, దుర్యోధనుడు,
దుర్నీతి వరుసలో
దుర్ముఖిని తలచుకుంటే
దురవగాహన, దురవగతమవుతోంది!

గత, వర్తమాన ఘటనల జ్ఞాపకాలను నెమరేస్కుంటే
మావిచిగురు తిన్న కోయిల గానాన్ని
విందామనుకుంటే
మానులాంటి మావిచెట్ల నరికివేత
వర్షాభావం వల్ల!
తొందరపడి ఒక మామిడి ముందే పండింది
కార్పైడ్ వల్ల!
తొణికిసలాడే అందంతో మిసమిసలాడి బుసబుస పొంగింది శే్వత క్షీరం డిటర్జెంట్ వల్ల!
కల్తీ తైలంలో కలదంటున్నారు వరాహకొవ్వు!
కాదేదీ కల్తీకనర్హం!
రాజకీయ విలువల పతనం, ప్రలోభాల ప్రభావాలు
రక్తమొడ్డుతున్న రహదారులు
కాల్‌మని కాలనాగులు, ఖాతరు చేయని
‘నిర్భయ’ నేరస్తులు
ఉద్ధృతంగా కురిసిన వర్షాలు
విఖ్యాత విశ్వవిద్యాలయాల
విద్యార్థి సంఘాల
కులమత వైషమ్యాలు
పునరావృతం కారాదని అభిలషిస్తూ..
సముదాయించుకున్నా, సర్ధి చెప్పుకున్నా
విరోధి, వికారి, వికృతి, పరాభవ, ప్రమాదీలా
దుర్ముఖి ఒక వత్సరమని.
ఆశాజనకంగా పంచాంగ శ్రవణం ఉంటుందని ఆకాంక్షిస్తూ
సంవత్సరాది సత్ఫలితాలను
ఆశిద్దాం - సాధిద్దాం.

- వేదం సూర్యప్రకాశం
చరవాణి : 9866142006

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 ౄళూఖఔఖశూబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆ

- పొన్నూరు వేంకట శ్రీనివాసులు