శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జిల్లాలో భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 10: ప్రత్యేక హోదా కోసం వైకాపా, వామపక్షాలు, కాంగ్రెస్ తదితర రాజకీయ పార్టీలతో పాటు పలు కార్మిక సంఘాలు శనివారం చేపట్టిన బంద్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్‌ల వద్ద వాహనాల రాకపోకలను నిరసనకారులు అడ్డుకునే అవకాశం ఉండడంతో అక్కడ ప్రత్యేక బలగాలను మోహరించారు. నెల్లూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు పట్టణాల్లో 144వ సెక్షన్ విధించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 33 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు 971 మందిని భద్రతా చర్యల్లో భాగంగా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మొత్తంమీద జిల్లాలో చేపట్టిన బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరగడంతో పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకుంది.

మంత్రివర్గంలో జిల్లాకు మరో అవకాశం!
* మాగుంట, సోమిరెడ్డిలలో ఒకరికే ఛాన్స్
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, సెప్టెంబర్ 10: త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చెందిన మరొకరికి అమాత్యునిగా అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించనున్నట్లు తెలిసింది. అయితే జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఈ పదవి రేసులో ఉన్నారు. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎప్పట్నుంచో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోమిరెడ్డి అంటే టిడిపి, టిడిపి అంటే సోమిరెడ్డి అన్నంత స్థాయిలో జిల్లాలో పార్టీని ముందుండి నడిపించిన ఘనత ఆయనది. సాధారణ ఎన్నికల్లో ఓడిన వారికి ఎమ్మెల్సీ అవకాశం లేదని తేల్చిచెప్పిన చంద్రబాబే తర్వాత సోమిరెడ్డి లాంటి సీనియర్ సేవలు జిల్లాలో అవసరమని భావించడం వల్లనే ఆయకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తుంటారు. మంత్రివర్గ విస్తరణ గురించి రాజధాని స్థాయిలో జరిగే చర్చల్లో ముందు వినిపించే పేరు సోమిరెడ్డిదే అంటుంటారు. ఇక పార్టీలో ఆయనంతటి సీనియర్ కాకపోయినప్పటికీ చంద్రబాబు దగ్గర మంచి పేరున్న వ్యక్తిగా జిల్లాకు చెందిన మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి గుర్తింపు ఉంది. నెల్లూరు, ప్రకాశం రెండు జిల్లాల్లో మాగుంట కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున సేవలందించిన ఆయన తదనంతరం టిడిపిలో చేరి ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. సోమిరెడ్డితో పాటు చంద్రబాబు మాగుంటకు కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. ఒకరు సీనియర్, మరొకరు పార్టీకి జూనియర్ అయినప్పటికీ రాజకీయంగా సీనియర్. అయితే ఇద్దరికీ అవకాశం ఇస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. టిడిపికి రెడ్డి సామాజికవర్గం దూరమైపోతోందని గత కొంతకాలంగా వారిని ఆకర్షించే పనిలో పడ్డ అధినేత చంద్రబాబు ఈ దఫా వారిని దగ్గర చేర్చుకునే పనిలో పడినట్లు సమాచారం. ఈ కోవలోనే రెడ్డి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గానికి అదనంగా మరో ఆరుగురికి మాత్రమే అవకాశం కల్పించే వీలుంది. ఈ ఆరుమందిలో ఇద్దరు నెల్లూరు జిల్లా వాసులకు, అందులోనూ ఇద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి చంద్రబాబు అవకాశం ఎంతవరకు ఇస్తారనేది ప్రశ్న. అయితే దసరా తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని, జిల్లాకు చెందిన వారికి తప్పక అవకాశం రానుందని జిల్లా టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు మదిలో ఏ నేత మెదులుతున్నాడో త్వరలోనే తెలియనుంది.

హోదా కోసం నిరసనల హోరు
* జిల్లాలో బంద్ ప్రశాంతం
* ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం
* పలుచోట్ల నాయకుల అరెస్ట్
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, సెప్టెంబర్ 10: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జిల్లావ్యాప్తంగా వామపక్షాలు, వైకాపా ఆధ్వర్యంలో నిరసనలతో హోరెత్తించారు. గత రెండున్నర ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదా రాని కారణంగా శనివారం వైకాపా, వామపక్షాలు తలపెట్టిన బంద్ జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలతో పలుచోట్ల నాయకులు అరెస్ట్‌తో సాగింది. నగరంలో ఆర్టీసీ బస్టాండు వద్ద బస్సులను ఆపేందుకు ప్రయత్నించిన వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకుని వారిని అదుపులో తీసుకున్నారు. నగరంలోని కరెంటు ఆఫీసు సెంటరు వద్ద వైకాపా నాయకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోవూరు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లి, వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదా 14వ ఆర్థిక అంశమని ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా జాతీయ అభివృద్ధి సంస్థకు చెందుతుందని, జాతీయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్రమోదీ ఛైర్మన్ కనుక హోదా ఇచ్చేందుకు ప్రధానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన వెల్లడించారు. హోదాతోనే ఆంధ్రా అభివృద్ధి చెందుతుందే తప్పా కేంద్రం ఇచ్చిన ప్యాకేజీల వల్ల ముఖ్యమంత్రికి సంబంధించిన కాంట్రాక్టర్లు, మంత్రులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి సౌలభ్యం ఉండబోదన్నారు. ఎన్నికలకు ముందు ప్రధాని, పవన్‌కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఆంధ్రాకు హోదా 10 సంవత్సరాలు ఇస్తామని మాట ఇచ్చారని, ఇచ్చిన హామీ అమలు చేయకుండా కేంద్రం మాట తప్పిందన్నారు. ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇచ్చి రాష్ట్రానికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత మోదీపై ఉందన్నారు. హోదా వచ్చేవరకు జగన్, చంద్రబాబులు కలిసి పోరాటాలు సాగిస్తే న్యాయంగా ఉంటుందన్నారు. ఆత్మకూరులో జరిగిన బంద్‌లో 22 మంది వామపక్షాల నాయకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నార్తురాజుపాళెంలో ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు వైకాపా, వామపక్షాల నాయకులను అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. బుజబుజనెల్లూరు వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తోందని, ప్యాకేజీల ద్వారా ప్రజలకు ఒరిగేది ఏమీలేదంటూ ప్రతిఒక్కరు ప్రత్యేక హోదాతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి, టిడిపి ప్రభుత్వాలు కలిసి ప్రజలను మభ్యపెడుతూ ప్రజలు దోబూచులాడుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరిని విడనాడి హోదా సాధించేందుకు ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఏదిఏమైనా జిల్లాలో ఎలాంటి దుర్ఘటనలకు తావులేకుండా పోలీసుల చొరవతో బంద్ ప్రశాంతంగా ముగిసింది.

వైకాపా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
వేదాయపాళెం, సెప్టెంబర్ 10 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ శనివారం వామపక్షాలు, వైకాపా సంయుక్తంగా నిర్వహించిన బంద్‌లో భాగంగా నగర డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాధ్ సమక్షంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజన్నభవన్ నుంచి ఆత్మకూరు బస్టాండు, నవాబుపేట, ట్రంకురోడ్డు, చిన్నబజారు, సంతపేట, విజయమహల్ గేటు ప్రాంతాల మీదుగా బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాధ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై రాష్ట్రానికి ప్రత్యేకహోదా కాదు ప్రత్యేక ప్యాకేజి మాత్రమే అని ప్రకటిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వాగతిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం ఇప్పటికే ఆర్థిక లోటులో నడుస్తోందని, రాష్ట్భ్రావృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యపడుతుంది తప్ప ప్రత్యేక ప్యాకేజీతో కాదన్నారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో నెల్లూరు నగర శాసనసభ్యుడు అనీల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో వైసిపి నాయకులు ఉద్యమాలు చేయడం జరుగుతోందన్నారు. ఆంధ్రాకు ప్రత్యేకహోదా వచ్చేంత వరకు వైసిపి అన్ని వామపక్షాలతో కలిసి పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఓబలి రవిచంద్ర, రాజశేఖర్, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఎండి ఖలీల్‌అహ్మద్, దేవరకొండ అశోక్, నాయకులు కుంచాల శ్రీనివాసులు, వందవాశి రంగా, సత్యానందం, సుధీర్‌బాబు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరులో హైడ్రామా
* రాజరాజేశ్వరి గుడి గోపురం ఎక్కిన ఉన్మాది
నెల్లూరు, సెప్టెంబర్ 10: నగరంలో మతిస్థిమితం లేకుండా, ఉన్మాదిలా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి శనివారం స్థానిక దర్గామిట్టలోని శ్రీరాజరాజేశ్వరి దేవస్థాన గోపురం ఎక్కి హల్‌చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వ్యక్తి రాజరాజేశ్వరిదేవి గుడి గోపురం ఎక్కేందుకు ప్రయత్నించాడు. దేవస్థానం సిబ్బంది గమనించేలోగా అతను గోపురం చివరి అంచుకు చేరుకున్నాడు. దీంతో అప్రమత్తమైన దేవస్థాన సిబ్బంది ఆలయ కార్యనిర్వాహణాధికారికి సమాచారమివ్వగా ఆయన పోలీస్‌లకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అతన్ని దింపేందుకు మాటలతో ప్రయత్నించగా అతను సరిగా స్పందించలేదు. పైన సదరు వ్యక్తి ఏం చేయబోతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో కూడా కింది వారికి అర్థంకాని స్థితి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఒకవైపు నుంచి అతన్ని సంప్రదిస్తున్నట్లుగా ప్రవర్తించి మరోవైపు నుంచి గోపురంపైకి ఎక్కారు. చివరకు ఆ ఉన్మాదిని పట్టుకుని నడుముకి తాడు కట్టి కిందకు తీసుకువచ్చారు. ఈ సమయంలో ఉన్మాది చేష్టలతో అక్కడ నడచిన హైడ్రామా చూసేందుకు జనం, వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆ వ్యిక్తిని కిందకు తీసుకువచ్చే సమయంలో చూచేవారిలో ఆందోళన కలిగింది. ఎట్టకేలకు అతడిని క్షేమంగా కిందకు దించబడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అతడ్ని 5వ నగర పోలీస్‌స్టేషన్‌కు తరలించి అతని గురించి సమాచారం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అతను మాట్లాడే విధానం అర్థంకాక, అతడు ఎవరు, ఎక్కడ్నుంచి వచ్చాడు, ఎందుకు గోపురం ఎక్కాడు అనే ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పడ్డారు.
అగ్నిమాపక సిబ్బంది చొరవ
గుడి గోపురం ఎక్కిన ఉన్మాదిని కిందకు తీసుకువచ్చే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది చూపిన చొరవ, ధైర్యానికి స్థానికుల నుంచి ప్రశంసలు లభించాయి. సమాచారం అందుకున్న అదనపు ఎడిపివో శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఓ శ్రీనివాసులు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు, పోలీసులతో కలిసి గోపురం పైనున్న వ్యక్తితో మాటలు కలిపేందుకు ప్రయత్నిస్తుంటే అగ్నిమాపక సిబ్బంది డేవిడ్‌సన్, రామ్మూర్తి, సుధాకర్‌రెడ్డి, మురళి చాకచక్యంగా గోపురం పైకి ఎక్కి అతన్ని గట్టిగా పట్టుకుని కిందకు తీసుకురాగలిగారు. ఈ సమయంలో వారు చూపిన చొరవను ప్రతిఒక్కరూ అభినందించడం విశేషం.

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైవే దిగ్బంధం
నెల్లూరు సిటీ, సెప్టెంబర్ 10: జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చింతారెడ్డిపాళెం వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి కంటే హోదానే ముఖ్యమని డిమాండ్ చేస్తూ భారీఎత్తున నిరసన, రాస్తారోకో చేపట్టారు. దీంతో సుమారుగా అరగంట సేపుట్రాఫిక్‌కు అంతరాయం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి మాట్లాడుతూ బిజెపి, టిడిపిలు ఆంధ్రా ప్రజలను రెండు సంవత్సరాలపాటు పూర్తిగా మోసగించి ప్రత్యేక ప్యాకేజి పేరిట మరో మోసానికి తెరతీశాయని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం సాగుతుందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన చంద్రబాబునాయుడు వౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ మూలంగానే ప్రత్యేక హోదా అంశం వెలుగులోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఎంపి కెవి రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన తరువాత మాత్రమే కేంద్రం స్పందించిందన్నారు. కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి అధికార తెలుగుదేశంకు లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. సిఎం హెరిటేజ్ సంస్థ, వెంకయ్యనాయుడు ట్రస్టులకు మాత్రమే ఉపయోగమన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని వెంకయ్యనాయుడు ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్‌కళ్యాణ్‌కు తమ మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘురామ్ ముదిరాజ్, దేవకుమార్‌రెడ్డి, సివి శేషారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ లోక్ అదాలత్‌లో 1,416 కేసులు పరిష్కారం
నెల్లూరు లీగల్, సెప్టెంబర్ 10: జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా భవన్‌లో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లావ్యాప్తంగా 1,416 కేసులు పరిష్కరించారు. దీనికి సంబంధించి నెల్లూరు కోర్టు పరిధిలో 926 కేసులు, గూడూరు పరిధిలో 180, కోవూరులో 51, కావలిలో 156, ఆత్మకూరులో 32, వెంకటగిరిలో 5, కోటలో 10, సూళ్లూరుపేటలో 13, నాయుడుపేటలో 12, ఉదయగిరిలో 31 కేసులు పరిష్కరించారు. ప్రమాదాల కేసుల క్లయిమ్‌లకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా రెండు కోట్ల ఐదు లక్షల అరవై రెండు వేల ఏడు వందల పదిహేను రూపాయలు పరిహారం పరిష్కరించారు. ఈ లోక్ అదాలత్‌ను జిల్లా జడ్జి వౌలానా జునైద్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌ల ద్వారా ప్రజలకు సత్వరమే న్యాయం జరుగుతుందన్నారు. ఈ లోక్‌అదాలత్‌లను పెండింగ్ కేసులోని కక్షిదారులు విరివిగా వినియోగించుకొని సత్వరమే న్యాయం సహాయం పొందాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి పట్టణంలోని వివిధ న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన వివిధ లోక్ అదాలత్ బెంచ్‌ల ద్వారా కేసులు పరిష్కరించారు. కాగా, నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ బెంచ్‌లలో మెంబర్లుగా న్యాయవాదులను నియమిస్తున్నారు. వీరికి గౌరవ భృతిగా రూ. వెయ్యి చెల్లిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ప్రతి దఫా నియమించిన న్యాయవాదులనే తిరిగి మెంబర్లుగా నియమిస్తుండటంతో పేద, మధ్యతరగతికి చెందిన న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో మధ్యతరగతి న్యాయవాదులకు గౌరవ భృతి వెయ్యి రూపాయలు కూడా అందటం లేదు. దీనిపై భవిష్యత్‌లో లోక్ అదాలత్ బెంచ్ మెంబర్లుగా అందరు న్యాయవాదులకు అవకాశం ఇచ్చి రొటేషన్ పద్ధతిలో నియామకాలు జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు న్యాయవాదులు కోరుతున్నారు.

నగరంలో ఎపి విద్యార్థి జెఎసి బైక్ ర్యాలీ
వేదాయపాళెం, సెప్టెంబర్ 10 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బంద్‌లో భాగంగా శనివారం ఏపి విద్యార్థి జెఏసి ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విఆర్‌సి కూడలిలో రాస్తారోకో నిర్వహించి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపి విద్యార్థి జెఏసి రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.ఆదిత్యసాయి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని అంగీకరిస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా ప్రకటించాల్సిందేనన్నారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి ప్రత్యేకహోదా సాధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తేజ, చందు, సాయి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

గణేష్ నిమజ్జనానికి తరలిన జిల్లా పోలీసులు
నెల్లూరు, సెప్టెంబర్ 10: హైదరాబాద్‌లో జరగనున్న గణేష్ నిమజ్జనానికి జిల్లా నుంచి 255 మంది పోలీస్ సిబ్బంది శనివారం తరలివెళ్లారు. బందోబస్తుకు తరలివెళ్లిన వారిలో ఇద్దరు డిఎస్పీలు, ముగ్గురు సిఐలు, 15 మంది ఎస్సైలు, 25 మంది ఎఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు, 150 మంది కానిస్టేబుళ్లు, 60 మంది హోంగార్డులు ఉన్నారు.

గురువు లేని శిష్యులు ఉండరు
ఎజెసి సాల్మన్‌రాజ్‌కుమార్ స్పష్టం
వేదాయపాళెం, సెప్టెంబర్ 10 : గురువులు లేని శిష్యులు ఉండరని, ఉపాధ్యాయులందరూ ఉత్తమ ఉపాధ్యాయులేనని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సాల్మన్‌రాజ్‌కుమార్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని సెయింట్ జోసెఫ్ కమ్యూనిటీ హాలులో శనివారం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఎజెసి-2, జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎజెసి-2 మాట్లాడుతూ తాను ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన వాడినేనన్నారు. తల్లిదండ్రులు జీవం పోస్తే, ఉపాధ్యాయులు జీవితం ఇస్తారని ఉపాధ్యాయ వృత్తిని కొనియాడారు. అంకితభావం, సేవాభావంతో కొనసాగే ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని అంత గొప్ప వృత్తిలో ఉన్న ప్రతిఒక్కరు ఉత్తమ ఉపాధ్యాయులేనన్నారు. సమాజానికి బాధ్యత కలిగిన పౌరులను అందించేందుకు క్రమశిక్షణతో బోధించే ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రేమతత్వం అలవర్చాలన్నారు. డిఇఓ మువ్వా రామలింగం మాట్లాడుతూ ఏ స్థాయిలో ఉన్నవారైనా లేచి వెన్ను వంచి నమస్కరించేది ఒక్క ఉపాధ్యాయునికేనన్నారు. అంత గొప్ప వృత్తిలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు కీర్తింపతగినవాడన్నారు. అనంతరం 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్రిష్టియన్ మత గురువు ఎండి.ప్రకాశం, ఫాదర్లు సాల్మన్‌రాజ్, జోసెఫ్, తదితరులు పాల్గొన్నారు.

గిరిజన సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం
నాయుడుపేట, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో వెనుకబడిన గిరిజనుల సంక్షేమానికి దశలవారీగా పోరాటాలు సాగిస్తామని ఎపి యానాదుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రయ్య తెలిపారు.