శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నిఘా మాటున నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 15: జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం జరిగిన బాంబు పేలుడు ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసులు జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నెల్లూరు నగరంలో గతంలో కంటే గణనీయమైన సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. నగరంలోకి ప్రవేశించే రహదారులతో పాటు ప్రధాన కూడళ్లలో సాధారణ పోలీసులతో పాటు సాయుధ దళాలకు చెందిన పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. నగరంలో ధ్రువపత్రాలు లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి నిలిపి అటువంటి వాహనాలను పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పేలుడు జరిగిన జిల్లా కోర్టు ప్రాంగణంలోకి గురువారం ప్రవేశించే ప్రతి ఒక్కరిని మెటల్ డిటెక్టర్ ద్వారా పూర్తిగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. స్కానర్లు, డిటెక్టర్లను ఉపయోగించి తనిఖీలు చేపడుతున్నారు. కోర్టు ప్రాంగణంలో పోలీసులు చేపట్టిన జాగ్రత్త చర్యలపై కొందరు పెదవి విరుస్తుండగా మరికొందరు మొదటి నుంచి ఇదే విధంగా చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతవరకు రాదంటూ గుసగుసలాడుతున్నారు. మరోవైపు పేలుడు ఉదంతంపై దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. సోమవారం కోర్టు ఆవరణలోకి ఎవరెవరు వచ్చారు, ఏ యే వాహనాలు వచ్చాయనే వివరాలు సేకరిస్తున్నారు. కోర్టు ప్రాంగణంలో ఎటువంటి సిసి కెమెరాలు లేకపోవడంతో సమీపంలోని దుకాణాల వద్దనున్న సిసి టివి పుటేజీలను సేకరించే పనిలో పడ్డారు. పేలుడుకు పాల్పడ్డ నిందితుడు ఎటువైపు నుంచి కోర్టు ఆవరణలోకి వచ్చాడనే విషయంపై పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. పాత జిల్లా జైలు వైపు నుంచే నిందితుడు వచ్చి బాంబును అమర్చి ఉండే అవకాశముందని భావిస్తున్నారు. అటువైపు జనం తాకిడి తక్కువగా ఉండటం, ప్రత్యేకంగా వచ్చే వ్యక్తిని ఎవరూ గమనించే అవకాశం ఉండదు. కోర్టు ప్రధాన ద్వారం వైపు నుంచి వస్తే కోర్టు క్యాంటిన్‌తో పాటు న్యాయవాదులు కూడా గమనించే అవకాశం ఉండటంతో నిందితుడు పడమర వైపు నుంచే వచ్చి ఉంటాడనే నిర్ధారణకు పోలీసులు వస్తున్నారు. నిందితుడు ఒకరా, లేక మరికొందరు ఉన్నారా అనే విషయంపై కూడా తర్జనభర్జనలు పడుతున్నారు. పేలుడు సాధారణ స్థాయిదే అయినప్పటికీ పరిశీలనకు వచ్చిన పలువురు దర్యాప్తు బృందాల అధికారులు ఉగ్రవాదులే ఈ దారుణానికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే భావనకు వచ్చినట్లు సమాచారం. దీంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన ఇదే తరహా దాడులన్నంటిని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు.
పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం
కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు జరిగిన ప్రాంతాన్ని హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరి (ఎఫ్‌ఎస్‌ఎల్) అధికారుల బృందం గురువారం పరిశీలించింది. పేలుడు జరిగిన ప్రాంతంతో పాటు బాంబు పేలుడుకు ప్రభావితమైన ప్రాంతం మొత్తాన్ని బృందం క్షుణ్ణంగా అణువణువు పరిశీలించింది. పరిశీలన తర్వాత వారు ఒక ప్రాథమిక నిర్ధారణకు కూడా వచ్చినట్లు సమాచారం. అయితే వారు తమ అభిప్రాయాలను మీడియా ఎదుట వెల్లడించలేదు. పేలుడులో ఉపయోగించిన అమ్మోనియం నైట్రేట్ మోతాదు తక్కువగా ఉండటం వల్ల దీనిని సాధారణం కంటే తక్కువ స్థాయి విస్ఫోటనంగా అధికారులు భావిస్తున్నారు. చిత్తూరు తదితర ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్లకు, ప్రస్తుతం నెల్లూరులో జరిగిన బాంబు పేలుడుకు సారూప్యత ఉన్నట్లు వారు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం.

జగమొండి బండికి ముక్కుతాడు
* కాలం చెల్లిన వాహనాలు నిలిపివేసేందుకు రంగం సిద్ధం
ఆంధ్రభూమిబ్యూరో
నెల్లూరు, సెప్టెంబర్ 15: కాలుష్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. కాలుష్యాన్ని ఏవిధంగా కట్టడి చేయాలో వ్యూహాలు సిద్ధం చేస్తుంది. కాలం చెల్లిన వాహనాల నుంచి వస్తున్న పొగ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలకు చెక్ పెట్టడానికి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా 15 ఏళ్లు దాటిన వాహనాలన్నింటిని కాలం చెల్లిన వాహనాలుగా గుర్తించి రోడ్డు ఎక్కకుండా కట్టడి చేయడానికి ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల జాబితాను సంబంధిత రవాణాశాఖ అధికారులు తయారుచేస్తున్నారు. జిల్లాలో 15 ఏళ్లు దాటిన ద్విచక్ర వాహనాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ అవి రోడ్లపై తిరుగుతున్నాయి. రవాణాశాఖ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన వాహనాలు పనికిరానివిగా లెక్కించాలి. వాటిని రోడ్లపైకి తీసుకురావడం వల్ల వివిధ రకాల ఇబ్బందులు తప్పడం లేదు. ఇందులో ప్రధానమైనది పొగ కాలుష్యం. వాహనాలు వెళుతుంటే అందులో నుంచి దట్టమైన నల్లటి పొగ, మరికొన్ని వాహనాలకు తెల్లటి పొగ వస్తుంది. దీనిని రవాణాశాఖ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు యథేచ్ఛగా కాలం చెల్లిన వాహనాలను రోడ్లపైకి తీసుకొస్తున్నారు. కాలం చెల్లిన వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అలాంటి వాటిని షెడ్లకు తరలించాలి. చాలామంది ఇప్పటికీ ఆ వాహనాలనే ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాల వల్ల పొగ కాలుష్యం ఉంటుందని తెలిసినప్పటికీ నడుపుతుండటం గమనార్హం. నెల్లూరు నగరంలో సిటీ బస్సులు రోడ్డుపై వెళ్తుండగా నల్లటి పొగ గుప్పుగుప్పున వస్తుంది. జిల్లాలో కాలం చెల్లిన వాహనాల్లో అత్యధికంగా ద్విచక్రవాహనాలు ఉన్నాయి. తరువాతి స్థానంలో ఆటోలు, సిటీ బస్సులు, కార్లు, జీపులు ఉన్నాయి. 15 ఏళ్లు దాటినప్పటికీ నడుపుతున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వాహనాలు ఉన్నాయి. కార్ల యజమానులు తమ ఉపాధి పోతుందన్న ఉద్దేశంతో తిరిగి కొత్త వాహనాలు కొనుగోలు చేయలేమనే కారణంతో కాలం చెల్లిన వాహనాలను తిప్పుతున్నారు.
నియంత్రించగలరా...
జిల్లాలో ఉన్న కాలం చెల్లిన వాహనాలను అధికారులు నియంత్రించగలరా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 15 ఏళ్లు దాటిన వాహనాల చిరునామాలు తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ఇప్పుడు ఆ వాహనాలు ఉన్నాయో, లేదో తెలియదు. వీటిని కట్టడి చేయడం రవాణాశాఖ అధికారులకు తలకు మించి భారమే అవుతుంది. అధికారులు కఠినంగా వ్యవహరిస్తే తప్ప 15 ఏళ్లు దాటిన వాహనాలను నియంత్రించే పరిస్థితి లేదు. దీని కోసం ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉంది.

వెంకయ్య, చంద్రబాఋ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు
* వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి ధ్వజం
వేదాయపాళెం, సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేకహోదాను సాధించి ఆంధ్రాను అభివృద్ధి చేయాల్సిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబులు ప్రత్యేక ప్యాకేజిల ద్వారా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందే తప్పా ప్రత్యేక ప్యాకేజితో ఎటువంటి పురోగతిని సాధించలేదన్నారు. 14వ ఆర్థిక బిల్లును గురించి పదేపదే మాట్లాడుతున్నారని, 14వ ఆర్డినెన్స్‌ను ప్రజల ముందర ఉంచి ఆ ఆర్డినెన్స్‌లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని రద్దు చేసి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లి ఆంధ్రా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చినట్లు ఆంధ్రాకు అర్ధరాత్రి ప్రత్యేకహోదా ఇవ్వమని అరుణ్‌జైట్లి వ్యాఖ్యానించడం విడ్దూరంగా ఉందన్నారు. కావేరి జలాల విషయంలో తమిళనాడులో అన్ని ప్రతిపక్షాలు ఏకమై పోరాటం చేశాయని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రత్యేకహోదా సాధించడంలో అందరూ కలసి పనిచేయాల్సిన పార్టీలు వౌనంగా ఉన్నాయన్నారు. ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులందరూ కలసి పోరాడి ఆంధ్రుల హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రత్యేకహోదా కోసం ఎవరూ పోరాటం చేసిన వారితో కలసి పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకహోదా సాధించేందుకు మొదటి నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. ప్రత్యేకహోదా సాధించేంత వరకు వైసిపి పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికైనా వెంకయ్యనాయుడు, చంద్రబాబులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేకహోదాను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్, ఎల్లసిరిగోపాల్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్, రూప్‌కుమార్‌యాదవ్, జడ్పిటిసి వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు హిందీలోనే జరపాలి
* రాజ భాష హైవపర్ కమిటీ సభ్యులు సునీల్ బలిరామ్ గైక్వాడ్ ఆదేశం
వేదాయపాళెం, సెప్టెంబర్ 15: జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర, ప్రత్యుత్తరాలను హిందీ భాషలోనే జరపాలని రాజభాష హైపవర్ కమిటీ సభ్యుడు సునీల్ బలిరామ్ గైక్వాడ్ కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో గురువారం కేంద్రప్రభుత్వ అధికారులైన రైల్వే, తపాలా, భారత ఆహార సంస్థ, షార్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన నాలుగు శాఖాధికారులతో విడివిడిగా సమావేశం ఏర్పాటు చేసి సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ భాషతో సమానంగా హిందీ భాషకు ప్రాముఖ్యత ఇవ్వాలని అధికారులను కోరారు. ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా కచ్చితంగా హిందీ భాషలోనే అమలు అయ్యేలా చూడాలని ఆయన సూచించారు. అనంతరం ఆయా శాఖలకు సంబంధించి కార్యాలయాల్లోని పేర్ల ప్లేట్ల నమూనాలను ఫొటోల ద్వారా పరిశీలించారు. భారత ఆహార సంస్థ అధికారులను ఆయన అభినందించారు. రైల్వే స్టేషన్ మేనేజర్ ఆంథోని జయరాజ్, పోస్టల్ సూపరింటెంటెంట్ విశ్వనాథంల సేవలను ఆయన కొనియాడారు. ఆయాశాఖల్లో హిందీ భాషకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

సర్పంచ్‌లకు శిక్షణా శిబిరాలు
* డ్వామా పిడి పి.హరిత వెల్లడి
నెల్లూరుటౌన్, సెప్టెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం అదేశాల మేరకు జిల్లాలోని ఐదు సబ్‌డివిజన్‌ల పరిధిలో వివిధ తేదీల్లో ఆయా మండలాలకు చెందిన సర్పంచ్‌లకు శిక్షణ, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పిడి పి.హరిత వెల్లడించారు. జిల్లా కేంద్రం దర్గామిట్టలో ఉన్న డ్వామా కార్యాలయంలో ఆమె ఛాంబర్‌లో ఏపిఓలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ముందుగా ఆయా గ్రామ సర్పంచ్‌లకు పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చిందని, అందులో నుంచి 10 మంది శిక్షకులను మన జిల్లాకు పంపించారని, వివిధ గ్రామాల్లోని సర్పంచ్‌లకు పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, జిల్లా పంచాయతీ, ఉపాధిహామి, డిఆర్‌డిఏలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఒక్కరోజు పూర్తిగా ఈ శిక్షణ శిబిరం జరుగుతుందని, అందుకోసం ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని డ్వామా కార్యకాలాపాలపై వీడియో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. డ్వామాలో అమలు అవుతున్న అన్ని రకాల పథకాలపై సర్పంచ్‌లకు పుస్తకాలు అందచేస్తారన్నారు. నెల్లూరు డివిజన్ పరిధిలో ఉన్న 234 మంది, నెల్లూరు, పొదలకూరు, టిపిగూడూరు, కోవూరు మండల పరిషత్ కార్యాలయాల్లో శిక్షణా శిబిరాలు ఉంటాయన్నారు. కావలి డివిజన్ పరిధిలోని 129 మంది సర్పంచ్‌లకు కావలి, దుత్తలూరు మండల పరిషత్ కార్యాలయాల్లో శిక్షణ ఉంటుందన్నారు. గూడూరు డివిజన్ పరిధిలో 218 మంది సర్పంచ్‌లకు గూడూరు, వాకాడు, వెంకటగిరి, బాలాయపల్లి మండల పరిషత్ కార్యాలయాల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని 193 మంది సర్పంచ్‌లకు ఆత్మకూరు, సంగం, చేజర్ల, ఉదయగిరి మండల పరిషత్ కార్యాలయాల్లో, నాయుడుపేట డివిజన్ పరిధిలోని 125 మంది సర్పంచ్‌లకు సూళ్లూరుపేట, నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయాల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. సర్పంచ్‌లకు ఏరోజు ఎక్కడా హాజరుకావాలో తెలియజేయడం జరుగుతుందన్నారు. దాని ప్రకారం సర్పంచ్‌లు తప్పనిసరిగా శిక్షణా శిబిరానికి హాజరు కావాలన్నారు. శిక్షణా శిబిరానికి వచ్చే సర్పంచ్‌లు తమ గ్రామానికి సంబంధించిన అభివృద్థి సంక్షేమ పథకాల గురించి పూర్తిస్థాయిలో ప్రణాళిక తయారు చేసుకొని హాజరుకావాలన్నారు. ఈ సమావేశంలో అదనపు పిడి ప్రభాకర్‌రావు, ఏపి ఓలు, పాల్గొన్నారు.

నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలపై విచారణ: కలెక్టర్
సూళ్లూరుపేట, సెప్టెంబరు 15: నకిలీ పట్టాదారు పాసుపుస్తకాల విచారణకు విజిలెన్స్ విచారణ చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు స్పష్టం చేశారు. గురువారం ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి విచ్చేసి పలు రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలపై పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు విజిలెన్స్ అధికారులకు అప్పగించామన్నారు. విచారణ పరిశీలన అనంతరం సంబంధిత వారిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. దొరవారిసత్రం మండలంలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు పొందినట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వమని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. ప్రజల సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీజన్‌లో వచ్చే వ్యాధులపై అన్ని వైద్యశాలల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెవెన్యూలో వెబ్‌ల్యాండ్ తప్పుల తడకగా ఉన్నాయని, దీనిని సక్రమమైన రీతిలో సరిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధికారులు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూ రికార్డులను వెబ్‌లో పొందుపరిచే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. ముందుగా ఆయన గోపాల్‌రెడ్డి, గొల్లలమొలువు గ్రామానికి వెళ్లి అక్కడ కాళంగి పొర్లుకట్లను పరిశీలించి ఆర్డీఓ శీనానాయక్‌ను వివరాలడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవీంద్రబాబు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

దైవ దర్శనానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం
* కుటుంబ సభ్యుల ఆందోళన
ముత్తుకూరు, సెప్టెంబర్ 15: తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన మండల పరిధిలోని పంటపాళెం గ్రామానికి చెందిన తినె్నలపూడి రామచంద్రయ్య అదృశ్యమైన సంఘటన గురువారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు పంటపాళెం గ్రామానికి చెందిన రామచంద్రయ్య 16 మంది కుటుంబ సభ్యులతో కలిసి 11వ తేదీన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. మధ్యాహ్నం 2.40 గంటలకు దర్శనానికి క్యూలైన్‌లోకి వెళ్లిన కుటుంబ సభ్యులు రాత్రి 8.45 గంటలకు కంపార్టుమెంట్ల గేట్లు తెరవగా 8.56 గంటల సమయంలో రామచంద్రయ్య అదృశ్యమైనట్లు ఆయన భార్య మాధవి ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో తన భర్త కోసం మిగతా కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజులపాటు తిరుమలలో గాలించినా, ఆచూకీ కనిపించలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అదృశ్యమైన వ్యక్తికి మద్యం సేవించే అలవాటు ఉన్నందున దర్శనానికి వెళ్లిన అనంతరం రెండు రోజులుగా మద్యం సేవించనందున మతిభ్రమించినట్లుగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ తండ్రిని తమకు వెతికి పెట్టమని చిన్నారులు పూజిత, శృతిలతోపాటు కుటుంబ సభ్యులు పోలీసు శాఖను కోరుతున్నారు.

మాస్ కాపీయింగ్‌ను అడ్డుకున్న ఎబివిపి విద్యార్థులు
గూడూరు, సెప్టెంబర్ 15: గూడూరు రెండో పట్టణంలోని ఓ కళాశాలలో డిస్టింక్షన్ పిజి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న సమాచారం అందుకున్న ఎబివిపి విద్యార్థులు కళాశాలకు వెళ్లి దానిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ తమకు సదరు కళాశాలలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టు సమాచారం రావడంతో అక్కడకు వెళ్లి పర్యవేక్షకులను ఆరా తీయడం జరిగిందని, స్వయానే ఆయనే ఇక్కడ మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టు ఒప్పుకొన్నారన్నారు. విద్యార్థుల నుండి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి వారికి పాఠాలు చెప్పకుండా పుస్తకాలు ఇచ్చి రాసిస్తామని మభ్య పెట్టి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారన్నారు. ఈ పరీక్షా కేంద్రం వద్ద అనేక దూర విద్యా కేంద్రాల యజమానులు ఉన్నారని, అదేమని ప్రశ్నించినందుకు తమను అసభ్య పదజాలంతో దూషించారన్నారు. పరీక్షా కేంద్రానికి వెళ్లి తనిఖీ చేయగా దాదాపు 400 పుస్తకాలు కొన్ని వందల చిట్టాలు బయట పడ్డాయన్నారు.

చందా ఇవ్వలేది కుటుంబం వెలి
గూడూరు, సెప్టెంబర్ 15: చవితి చందా డబ్బులు ఇవ్వలేదన్న నెపంతో ఓ కుటుంబాన్ని గ్రామం వెలివేసిన సంఘటన గూడూరు మండలంలో చోటు చేసుకొంది. బాధితుల కథనం మేరకు మండల పరిధిలోని వేములపాలెం గ్రామంలో లక్ష్మయ్య గత 18 ఏళ్లుగా తన కుటుంబంతో నివసిస్తున్నాడు. కొనే్నళ్లుగా ఇతను క్రైస్తవ మతం పుచ్చుకొని ప్రార్థనలకు వెళుతున్నాడు. ఈ క్రమంలో 2012లో వేములపాలెం గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు చందా చెల్లించవలసినదిగా గ్రామస్థులు కొందరు లక్ష్మయ్య వద్దకు రాగా తాను కట్టనని చెప్పినందుకు గతంలో ఓ మారు లక్ష్మయ్య కుటుంబాన్ని వెలివేసినట్టు కుల వివక్షనిర్మూలనా పోరాట సమితి నాయకులు తెలిపారు. మరలా 2016 సెప్టెంబర్ 5న వినాయక చవితి సందర్భంగా చందా చెల్లించనందుకు లక్ష్మయ్య కుటుంబాన్ని వెలివేసినట్టు వారు తెలిపారు. బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని, ప్రభుత్వ అధికారులు స్పందించి బాధిత లక్ష్మయ్య కుటుంబానికి న్యాయం చేయాలని సమితి సభ్యులు జోగి శివకుమార్, దాసరి సురేష్, చైతన్య కోరారు.

సింగపేట గ్రామంలో ఉద్రిక్తత
* పోలీసుల రాకతో సద్దుమణిగిన వ్యవహారం
అల్లూరు, సెప్టెంబర్ 15: మండలంలోని సింగపేట గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెల్లా చెదురుచేసారు. గురువారం పంచాయతీ కార్యాలయంలో ఇఓపిఆర్‌డి బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శి మస్తాన్‌రెడ్డి సంబంధిత నాలుగు పంచాయతీ గుంటలకు వేలం పాట నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి దండోరా, నోటీసు లేకుండా సమాచారం లేకుండా వేలం పాట ఎలా నిర్వహిస్తారని ప్రజలు నిలదీయడంతో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. అధికారులు అన్నిగుంటలకు ఒకేసారి దరావత్తు చెల్లించాలని నిబంధన పెట్టడం మంచి పద్ధతి కాదని అనడంతో వాదోపవాదాలు జరిగాయి. ఎట్టకేలకు వైసిపికి చెందిన దండా కృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన అమర్‌రెడ్డితో ఎస్‌ఐ వాసు, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంప్రదింపులు జరిపి వ్యవహారాన్ని చక్కబెట్టి ఇరువర్గాలను శాంతింప చేసారు.

నేడు న్యాయవాదులు కోర్టు విధుల బహిష్కరణ
నెల్లూరు లీగల్, సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ శుక్రవారం కోర్టు విధులు బహిష్కరించాలని నెల్లూరు న్యాయవాదులు గురువారం నిర్ణయించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి ఫణిరత్నం ఆధ్వర్యంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మెజారిటీ న్యాయవాదుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం పట్టణంలో న్యాయవాదులు గాంధీ బొమ్మ వరకు స్కూటర్ ర్యాలీ కూడా నిర్వహించాలని తీర్మానం చేశారు. జిల్లా కోర్టు ఆవరణలో బాంబు పేలిన సంఘటన అనంతరం జిల్లా జడ్జి వౌలానా జునైద్ అహ్మద్ స్పందించిన తీరుపట్ల బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. తక్షణమే జిల్లా కోర్టు ఆవరణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నందుకు జిల్లా జడ్జిని సమావేశం అభినందించింది. బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ రోజారెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి నిర్వహించారు.

జాతర నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
* ఎమ్మెల్యే కురుగొండ్ల పిలుపు
వెంకటగిరి, సెప్టెంబర్ 15: వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునే విధంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని త్రిపురసుందరీ కల్యాణ మండపంలో ఆనవాయితీగా వస్తున్న శాంతిసంఘం సమావేశాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి సంఘం సభ్యులు, పట్టణ ప్రముఖులు, అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. శాంతి సంఘం సభ్యులు బలరామయ్య మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా అమ్మవారికి రాబడి, ఖర్చు, ఆభరణాల విలువలు అడుగుతూనే ఉన్నామని, అడిగిన ప్రతిసారి వచ్చే సంవత్సరం తెలియజేస్తామని చెబుతున్నారే తప్ప వివరాలు తెలియపరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు మాట్లాడుతూ విఐపి టికెట్‌ను 500 రూపాయలుగా ఎమ్మెల్యే సొంతంగా నిర్ణయం తీసుకొని పెట్టారని, అందరికీ ఆమోదయోగ్యంగా లేదని, దానిని ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. దేవాదాయశాఖ సిబ్బంది ప్రతి సమావేశాల్లో లెక్కలు చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదన్నారు. ఇకనైనా ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలన్నారు. ఎమ్మెల్యే దీనికి సమాధానం చెబుతూ ఈ సంవత్సరం నుంచి అమ్మవారి రాబడి, ఆస్తులపై ఆడిట్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ చైర్మన్ దొంతు శారద మాట్లాడుతూ ఈ ఏడాది పాసులు లేకుండా చేయడాన్ని అందరూ దానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పాసుల వల్ల క్లూలైన్లలో రద్దీ ఎక్కువగా పెరిగి మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దానిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే ఈ పాసులు రద్దు చేశారని తెలిపారు. వైసిపి నాయకులు నెమళ్లపూడి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అమ్మవారి జాతరను కులమతాలకు అతీతంగా చేసుకుంటారని, అదే విధంగా పార్టీలకు కూడా అతీతంగా కూడా చేసి అమ్మవారి వైభవాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలిని సూచించారు. క్లూ లైన్ల ఎంట్రన్స్‌లో బయట ప్రాంతాల నుంచి వచ్చే పోలీసులను ఏర్పాటు చేస్తుండటంతో వారు తమకు తెలిసినవారిని దర్శనానికి పంపుతున్నారని, స్థానికులను మాత్రం పక్కకు తోసేస్తున్నారన్నారు. ఈ విషయాలను స్థానిక సిఐ గుర్తుంచుకుని అలా జరగకుండా చూడాలని సూచించారు. స్థానిక యంగిస్థాన్ అసోసియోషన్ ఆధ్వర్యంలో దర్శనం చేసుకుని వచ్చే 10 వేల మంది భక్తులకు పులిహార పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన నివాసం వద్ద 5వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయం వద్ద భక్తులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నెలూర్లు డిఆర్ ఉత్తమ్ అధినేత, పలువురు నేతలు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారని తెలిపారు. ఇంకా ఎవరైనా సేవా కార్యక్రమాలు చేసేవారు ముందుకు రావాలని ఆయన కోరారు. 500 రూపాయల టికెట్‌ను పలువురి సూచనలు, సలహాల మేరకు 250 రూపాయలకు మార్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, గౌరవ సలహాదారుడు పులకొల్లు రాజేశ్వరరావు, ఆలయ చైర్మన్ తాండవ చంద్రారెడ్డి, తహశీల్దార్ మైత్రేయ, సిఐ శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో ఎడిఇ శ్రీనివాసులు, బిఎస్‌పి నాయకులు దంపెళ్ల రామకృష్ణ, కమిటీ సభ్యులు, శాంతి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వార్డు పర్యటన
పోలేరమ్మ జాతర జరిగే ప్రాంతాలైన కాంపాళెం, జీనిగలవారివీధి, కుమ్మరవీధిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గురువారం వార్డు పర్యటన చేశారు. ఆయా ప్రాంతాల్లో జాతర సందర్భంగా చేయాల్సిన పనులు పరిశీలించారు. వాటిని వెంటనే చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.