శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

దడ పుట్టిస్తున్న దోమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 22: ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు, తాగి పారేసిన కొబ్బరిబొండాల నిల్వలు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్తకుప్పలు, కాలువల ఆక్రమణలతో రహదారులపైనే మురుగునీరు ప్రవాహంతో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైంది. ఈక్రమంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారడంతో దోమల సంతతి పెరిగిపోయి నెల్లూరు నగర ప్రజలను దడ పుట్టిస్తున్నాయి. గత రెండేళ్లలో పారిశుద్ధ్యానికి రూ.కోట్లు నిధులు ఖర్చు చేశారు. కేంద్ర, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ఈ జిల్లాకు చెందినవారే. వీరు ప్రజల సమస్యలు వింటారు. సానుకూలంగా స్పందిస్తారు. వచ్చిన చిక్కల్లా వర్షం ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడినప్పుడే నెల్లూరు అసలు రంగు బయటపడుతుంది. పంట కాలువల ఆక్రమణల వల్ల వర్షపు నీరు పోవడానికి వీలు లేకుండా పోవడంతో మురుగునీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతుంది. జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో సుమారు 8 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో విష జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగరంలో ప్రధానంగా డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో మురుగుపారే వీలు లేకుండా పోయింది. మస్సూర్‌నగర్, సంతపేట, అలంకార్ సెంటరు, కోర్టు సెంటర్, సిఎఎం స్కూల్, కోటమిట్ట, జాకీర్ హుస్సేన్‌నగర్, సుందరయ్యకాలనీ, చంద్రబాబుకాలనీ, తదితర ప్రాంతాలలో మురుగునీరు చెరువులను తలపిస్తున్నాయి. పందులు సంచరిస్తున్నా పట్టించుకున్నవారే కరవయ్యారు. నగరపాలక అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించి పందుల పెంపకందారులకు హెచ్చరికలు జారీ చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆఖరుకు పందుల పెంపకందార్లపై పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టినా భయపడడంలేదు. చెత్తాచెదారాల విషయంలో కూడా ఇదే పరిస్థితి. పంట కాలువలను ఆక్రమించి అక్రమ కట్టడాలను నిర్మించడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. పాలకులు మారుతున్నారు, ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. కాని సమస్యల తీరు మాత్రం మారడం లేదు.
ఫలితమివ్వని పర్యటనలు
నెల్లూరు నగరంలో ఎక్కడ సమస్య ఉందని తెలసినా నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అధికారులతో కలసి పర్యటించి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని వీటిలో పరిష్కారమయ్యేది కొన్ని సమస్యలు మాత్రమే. చాలావరకు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. మంత్రి నారాయణ, మేయర్ అజీజ్‌లు పర్యటనలు చేస్తున్నారు. ఎంత చేసినా చెత్త కదలటం లేదు. దోమలు వదలడంలేదు. ఏకంగా డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
కోట్లు వెచ్చించినా ఫలితమేదీ?
నగరంలోని 54 డివిజన్లలోని పారిశుద్ధ్య పనులకు గత రెండేళ్లలో రూ.కోట్లు ఖర్చు పెట్టారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, దోమల నిరవాణకు ఫాగింగ్ యంత్రాలు, బ్లీచింగ్, చెత్త సేకరణ ఇలా అన్నింటికి కలిసి నిధులు ఖర్చు అయిపోయాయి. సమస్యలు అలాగే మిగిలిపోయాయి. ఇప్పటికైనా పాలకవర్గం, ఉన్నతాధికారులు స్పందించి నగరంలో పారిశుద్ధ్య పనులను సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, దోమల బారినుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు.