శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నూతన విధానాలతో తిరోగమనంలో విద్యారంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, అక్టోబర్ 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా విధానంలో తీసుకొస్తున్న సరికొత్త మార్పులు విద్యారంగాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నాయని, విద్యా ప్రమాణాలు పతనం అవుతున్నాయని ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని కట్‌పీసెస్ కల్యాణ మండపంలో నూతన జాతీయ విద్యా విధానంపై ఉపాధ్యాయులతో సెమినార్ నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దీర్ఘకాలిక, పటిష్ట ప్రయోజనకర విధానం అంటూ లేకుండా కన్సల్టెన్సీ ఇచ్చిన సూచనలన్నీ అమలుచేస్తూ విద్యా విధానాన్ని పాలకులు అస్తవ్యస్తం చేస్తున్నారన్నారు. అదృష్టంకొద్దీ విద్యార్థులకు అవకాశాలు రావాల్సిందే కాని ప్రస్తుతం అమలవుతున్న విధానాల కారణంగా ఉపాధి అవకాశాలలో ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని తట్టుకొని స్థానం పొందగలిగే పరిస్థితి లేదని చెప్పారు. ప్రైవేటు పెట్టుబడులకు అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా కల్పిస్తూ ప్రమాణాలను గాలికి వదిలివేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం పదో తరగతి వరకు అమలవుతున్న సిసిఇ బోధనా విధానం అర్థంపర్థం లేకుండా ఉందన్నారు. పరీక్ష పేపర్లు దిద్దే విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయని, దీనికోసం టెక్నాలజీని వాడుకుంటామని చెబుతున్నారని, అయితే అది అమలుచేస్తే తీవ్ర ప్రతికూల ప్రభావాలు తప్పక వుంటాయన్నారు. అన్సర్ పేపర్లలను స్కాన్ చేసి కంప్యూటర్లకు అప్‌లోడ్ చేసి డిజిటల్ విధానంలో స్పాట్ వాల్యుయేషన్ చేసేందుకు పథకం రూపొందిస్తున్నారని, ఇందులో సాంకేతికపరమైన అవరోధాలు ఎన్నో ఇమిడి వున్నాయని, అంతిమంగా విద్యార్థులు నష్టపోక తప్పదని హెచ్చరించారు. ప్రతిభకు పాతర పడుతోందన్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకునేది విలువలు, ప్రమాణాలు దిగజారుడికా అని ప్రశ్నించారు.
త్వరలో మలేషియా దేశానికి చెందిన సంస్థలతో పాఠశాలల పరిస్థితి, ఉపాధ్యాయుల పనితీరు తదితర అంశాలపై ప్రత్యేక పరిశీలన చేయనున్నారని, అనంతరం పాఠశాలకు, ఉపాధ్యాయులకు గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు చెబుతూ ఇది కూడా దిగజారుడు విధానంగానే మిగిలిపోగలదన్నారు. మరోవైపు ప్రతి తరగతిలో తప్పనిసరి పాస్ మార్కులు సాధించేలా డిటెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఇది అమలైతే డ్రాప్ అవుట్స్ స్థానంలో పుష్ అవుట్స్ వుంటాయని, దీంతో అక్షరాస్యత తిరోగమనంలో పడే అవకాశం వుంటుందని చెప్పారు. వీటన్నింటిని సమగ్రంగా పరిశీలించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, సామాజిక స్థితిగతులు, దేశీయ సాంకేతిక అవసరతలు తదితర సమగ్ర అంశాలను చేర్చుకొని ప్రపంచంలోనే అత్యున్నతమైన దీర్ఘకాలిక అవసరాలు తీర్చగల విద్యావిధానం రావాలని, జ్ఞాన జ్యోతులను అట్టడుగు వాడలకు కూడా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇందులో యుటిఎఫ్ నాయకులు తులసి రాంబాబు, ఎ రమణయ్య, డాక్టర్ బి రవికుమార్, ఎస్‌బిఐ నారపరెడ్డి, టివిఎంఎన్ ప్రకాష్‌రావు, చలపతిశర్మ, రామ్మూర్తి, కొండాచారి, శ్రీనివాసులు, జానకిరామ్‌తో పాటు 300మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు.