నెల్లూరు

రియల్ పరదాల (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి పనె్నండు గంటలు కావస్తోంది. పరదాలకు నిద్రపట్టట్లేదు. తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. అతన్ని విషాదం ఆవరించి ఉన్నది. నిన్నటి నుంచి జరుగుతున్న విషయాలు అతనిని భయపెడుతున్నాయి. భవిష్యత్ గురించి అతను తీవ్రంగా ఆలోచిస్తూ, జరిగిన దాన్ని మననం చేసుకుంటున్నాడు.
అది పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద వ్యాపారస్థులు, పెద్దపెద్ద సినిమాస్టార్స్, పేరుపొందిన పెద్ద ధనవంతులు నివాసం వుండే ప్రాంతం.
పెద్దపెద్ద భవనాలు వాటి చుట్టూ ప్రహరీలు.. గేట్లు.. వాటి ముందు సెక్యూరిటీలు. పోస్టు, కొరియర్, పేపర్, పాలప్యాకెట్లు వేసే వాళ్లు తప్ప మిగిలిన వారు ఎవరూరారు. కాలినడకన అక్కడికి రావడం కూడా చాలా అరుదుగా కనబడుతుంది.
పరదాల అనే నేమ్‌బోర్డు ఉన్న ఇంటి ముందు పోలీసు జీపు ఆగింది. అప్పుడు సమయం ఆరుగంటలు కావొస్తోంది. పెద్దగా జనాలు అలికిడి లేదు. వచ్చిన పోలీసులు వాచ్‌మెన్‌ను దాటుకొని లోపలికి అడుగుపెట్టారు. పోలీసుబూట్ల చప్పుడు, డేగ రెక్కల చప్పుడులా ఉన్నది. తలుపు తీసిన పరదాల ఒక్క క్షణం నిర్ఘాంతపోయి, ఆ తర్వాత ఏం కావాలన్నట్లు చూశాడు.
‘‘మీ కొడుకు పర్వేష్ ఉన్నాడా!’’
‘‘ఉన్నాడు.. ఎందుకు?’’ అడిగాడు పరదాల.
‘‘కొద్దిగా పనుంది, అతన్ని ఒకసారి పిలవండి’’ అన్నాడు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కన్నయ్యనాయుడు.
‘‘విషయమేమిటో నాతో చెప్పండి.. నేను సమాధానమివ్వగలను’’ అన్నాడు పరదాల.
‘‘నిన్నరాత్రి సత్యవేడు దగ్గర హర్సీలీ గెస్ట్‌హౌస్ సమీపంలోని రోడ్డు పక్కన మీ అబ్బాయి సెల్‌ఫోన్ మా పోలీసులకు దొరికింది. అది ఇచ్చిపోదామని వచ్చాం పిలవండి’’.
‘‘్ఫను ఇవ్వడానికి అయితే ఇంత ఉదయానే్న ఇంతమంది పోలీసులు రావడమెందుకో పరదాలకు అర్థం కాలేదు’’ అతని మనస్సు ఏదో కీడును శంకించింది.
తన కుమారుడు ఏదో కేసులో చిక్కుకున్నాడేమో అనే అనుమానం కలిగింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఒక్కగానొక్క కొడుకు. వాడికి కావాల్సినవన్నీ సమకూర్చాడు. ఇప్పుడేంది ఈ పోలీసులు. ఇంతలో పై నుంచి ‘‘నా కోసం ఎవరు నాన్నా!’’ అంటూ పర్వేష్ హాల్లకి తొంగిచూశాడు.
పోలీసులను చూసిన పర్వేష్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన గదిలోకి వెళ్లి బయటకు పారిపోవడానికి ప్రయత్నించాడు. దీనిని గ్రహించిన పోలీసులు పరిగెత్తి అతన్ని చుట్టిముట్టి పట్టుకున్నారు. చేతికి ‘బేడీలు’ వేసి జీపు వద్దకు లాక్కెళ్లారు.
సెల్‌ఫోన్‌ను ఇచ్చి వెళ్తామన్న పోలీసులు తన కొడుకును అరెస్టు చేయడమేమిటో అతనికి అర్థం కావడం లేదు. తన కుమారుడు ఏ నేరమూ చేసి ఉండడు. ఎవరో వాడ్ని ఇరికించి ఉంటారు. అదే విషయం పోలీసులను నిలదీశాడు.
‘‘మీ సెల్‌లో వాట్సప్ ఉందా?’’ అని అడిగాడు సిఐ కన్నయ్యనాయుడు, పరదాలను.
‘‘ఉంది’’
‘‘అయితే ఒక వీడియోని మీ వాట్సప్ నెంబరుకు పంపిస్తాను. అందులో మీ కొడుకు చేసిన నేరం ఏమిటో ఆ వీడియోలో ఉన్నది. చూసుకోండి, ఇది కూడా పోగొట్టుకున్న మీ కుమారుడి సెల్‌ఫోన్‌లో రికార్డయి ఉంది. ఇప్పుడు మీకు పంపించిన వీడియో మీ కుమారుడి సెల్‌ఫోన్ నుంచే’’ అంటూ పర్వేష్ సెల్‌ఫోన్‌ను చూపారు సర్కిల్ ఇన్స్‌పెక్టర్.
కొడుకు పర్వేష్‌ను తీసుకుని పోలీసులు జీపు ఎక్కారు. లాయర్ సత్యనారాయణకి ఫోన్ చేసి, ఆ సెల్‌ఫోన్‌లో ఉన్న వీడియోలో ఏముందోనని చూడటానికి ఇంట్లోకి పరిగెత్తాడు పరదాల.
పర్వేష్ నేటి నాగరిక సమాజానికి ప్రతినిధి. చదువుకుంటున్నప్పుడే లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనే కొద్దిమందికి నాయకుడు.
చేతినిండా డబ్బులు, మోడ్రన్ బైక్‌లు, కొత్త కొత్త కార్లు, డిస్కోలు, పబ్‌లు వీటితోపాటు గ్లాస్ అండ్ గాల్స్‌చీర్స్.. ఇదీ అతని లైఫ్‌స్టయిల్.
ఈ మధ్యే డ్రగ్స్ వాడటం కూడా అలవాటయ్యింది. ఎంతోమంది అమ్మాయిలు పర్వేష్ కంపెనీని ఇష్టపడేవారు. అతనితో కలిసి డేటింగ్, మేటింగ్ దేనికైనా రెడీ, అనేవారు.
కానీ, ఇందుహాస అనే ఒక అమ్మాయి అతనిని ఛీ పో అంది. నా జోలికి వచ్చారంటే ప్రిన్సిపాల్‌కి చెబుతానంది. చెప్పింది, కాలేజ్ క్యాంపస్‌లో అందరి ముందు అవమానించింది. అతని చెంప ఛెల్లుమనిపించింది.
దీనికి పర్వేష్ కూడా పగ సాధించడానికి మిత్రుల ఎంకరేజ్‌మెంట్‌తో రెడీ అయ్యాడు.
రెండ్రోజుల క్రితం రాత్రి బాగా తాగారు. అతను, అతని స్నేహితులు అంబర్, కుంతల్, గురువీరా, తనీవర్థన్ మొత్తం ఐదుగురు కలిసి ఆ అమ్మాయి ఇందుహాస కథేంటో చూడాలని నిశ్చయించుకున్నారు.
హాస్టల్‌లో ఉన్న ఆ అమ్మాయిని వాచ్‌మెన్ గురవయ్య ద్వారా బయటకు పిలిపించారు. వాళ్ల అమ్మా, నాన్న వచ్చారని చెప్పడం.. ఇందుహాస బయటకు రావడం.. అపహరణకు గురవడం ఈ రాక్షసుల కరాళకామకేళి ఘడియల్లో జరిగిపోయింది.
మిత్రుల్లో కుంతల్ అనే ఒకడు ఈ తతంగాన్ని పర్వేష్ సెల్‌ఫోనులో రికార్డు చేశాడు. దీనితో ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేయాలనేది వారి ఉద్దేశ్యం.
కాని ఆ అమ్మాయి ఇందుహాస వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. వీరితో పెనుగులాడి, ప్రతిఘటించే ఓపిక లేక చనిపోయింది.
ఇందుహాస చనిపోయిందని తెలిసిన తర్వాత భయంతో వారి గుండె వేగంగా కొట్టుకుంటోంది. తాగిన మత్తు వదిలింది. ఆ స్థితిలో వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నారో అని కూడా తెలియటం లేదు. వారి ఆలోచనలకు వారి తల పగిలిపోతుంది. భయంతో అక్కడ నుంచి జారుకున్నారు.
భయాందోళనతో అక్కడ నుంచి వేగంగా పరిగెత్తడం వలన కుంతల్ పర్వేష్ సెల్‌ఫోన్‌ను అక్కడే పడేసుకున్నాడు. గప్‌చుప్‌గా ఎవరిండ్లకు వారు వెళ్లిపోయారు. ఏమి తెలియనట్లుగా.
అనాథ శవంలా రోడ్డుపక్కన ముప్పయి అడుగుల దూరంలో పొదలచాటున పడి ఉన్నది ఇందుహాస.
పోలీసులకు సమాచారం అందింది. వారు స్పాట్‌కు చేరుకుని డెడ్‌బాడీని కలెక్ట్ చేసుకుని పోస్టుమార్టం కోసం గోషా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆధారాల కోసం చుట్టుపక్కల గాలించారు. ఆ శవం పక్కన గోల్డ్ చైన్, షర్ట్‌బటన్లు, ఇరవై అడుగుల దూరంలో ఒక సెల్‌ఫోన్‌ను గుర్తించారు.
వాటిని తీసుకుని ఆ సెల్‌ఫోన్‌లో ఉన్న రికార్డు చేయబడిన వీడియోను చూశాను. సెల్‌ఫోన్లో ఉన్న ఫోన్ నెంబర్ల ఆధారంగా పర్వేష్ వారి ఇంటి అడ్రస్సును కనుగొన్నారు.
ఆ సెల్‌ఫోన్‌లో ఉన్న అమ్మాయిని, అబ్బాయిలను గుర్తించడం.. పర్వేష్ మిత్రులను, వీరికి సహకరించిన వాచ్‌మెన్ గురవయ్యను కూడా అరెస్టు చేయడం వరుసగా జరిగిపోయాయి.
సెల్‌ఫోన్లో ఉన్న అమ్మాయిని, సెల్‌ఫోన్‌లో ఉన్న వీడియోలోని దృశ్యాలను వీక్షించి పరదాల తన కుమారుడిలోని రాక్షసత్వాన్ని చూసి భయపడ్డాడు.
కాలేజిలో చదువుకుంటున్నాడు, బైక్‌రేస్‌లు, పార్టీలు మాములే కదా అని అనుకున్నాడు. కాని ఒక రేప్‌కేసులో నిందితుడిగా హంతకుడిగా, రాక్షసుడిగా మారతాడని తను ఊహించలేదు.
వాడికి అంతటి క్రూరత్వం ఎలా అలవాటయ్యింది. బాగా చదువుకుని తన వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని ఆరాటపడ్డాడు. వాడికోసం అన్నింటినీ సమకూర్చాడు.
పర్వేష్‌ను కేసు నుంచి రక్షించడం గురించి అతను ఆలోచించడం లేదు. వాడు అలా మారడానికి కారణాలేమిటా అని ఆలోచిస్తున్నాడు. వాడి ప్రతి కోరికా సులభంగా తీరడమా, జల్సాలకు కావాల్సిన డబ్బు సమకూరడమా, నయా నాగరికత మోజులో చెడుతిరుగుళ్లు తిరగడమా! పరదాలలో అంతర్మథనం మొదలైంది. తనలో తనే అనే్వషించుకుంటున్నాడు.
‘ఏదీ దీనికి కారణం?’ అతనికి ఒకటే కారణం తోచింది.
‘డబ్బు. వాడి అవసరాలకు డబ్బులు అతిగా లభించడమే. అవసరమైన దాని కంటే ఎక్కువ దొరకడమే’. అసలు కారణం.
డబ్బు.. ఈ డబ్బులు తనకు ఎలా వచ్చాయి. ఒకనాడు ఏమీలేని పరదాల నేడు కోటీశ్వరుడెలా అయ్యాడు. కష్టపడితే పైకి రావడం తేలిక అన్నది పాత సామెత. కష్టపడే వాడు పైకి రావాలంటే చాలా రోజులు పడతాయి. కాస్త మోసం, మరికాస్త దౌర్జన్యం కలిస్తే అత్యంత వేగంగా కోటీశ్వరుడిగా మారవచ్చు అనడానికి పరదాలే నిలువెత్తు సాక్ష్యం.
‘బ్రోకర్‌గా’ చేరి రియల్ ఎస్టేట్ రంగంలోని కుయుక్తులన్నింటిని నేర్చుకున్నాడు. పట్టణాల శివారు భూములను తక్కువ రేటుకు కొనడం, వాటిని ఎక్కువ రేటుకు అమ్మడం వృత్తిగా ఎంచుకొని, బ్రోకర్ కాస్త రియల్ వ్యాపారిగా ఎదిగాడు.
అన్నింటికంటే అతనికి ఎక్కువ లాభాలు సంపాదించి పెట్టిన వెంచర్ ‘‘అతిరథ రియల్స్’’ పట్టణానికి చాలా దగ్గరలో ఉన్న ఈ వెంచర్‌లో అన్ని ప్లాట్లు కేవలం పదిరోజుల్లో సేల్ అయ్యాయి.
ఒక్కో ఫ్లాటు పెట్టుబడిపై వందరెట్లు లాభాన్ని ఆర్జించాడు. అందుకు అతను చేసిందల్లా ఈ వెంచర్‌కు ప్రక్కనే ఇంటర్నేషనల్ ఎయిల్‌పోర్టు, మెడికల్ కాలేజ్, ట్రిపుల్ ఐటి, ఐటిపార్కు వస్తుందని కొంతమంది వ్యక్తుల ద్వారా ప్రకటనలు ఇప్పించాడు.
నిజానికి అక్కడ ఎలాంటి నిర్మాణాలు వచ్చే అవకాశం లేదు. కనీసం కొన్నవారు ఇళ్లు కట్టుకోవడానికి కూడా అనువుగా లేని పరిస్థితి. కొన్నవారు కొన్నాళ్లు ఎదురుచూశారు.
ఇల్లు కట్టుకోలేని చౌడు నేలలు, అమ్ముకోవడానికి అవకాశం లేకపోవడంతో లక్షలాది రూపాయలను నష్టపోయారు.
అంతేకాకుండా అవన్నీ ఏవో పనికిరాని భూములని తేలడంతో ఇద్దరు, ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాని పరదాల వీటిని అస్సలు పట్టించుకోలేదు.
ఎంతో డబ్బు సంపాదించాడు తను. ఇంత డబ్బు ఎందుకు సంపాదించాడు. బాగా ఆలోచిస్తున్నాడు పరదాల. కొడుకు పర్వేష్‌ను రక్షించుకునే ప్రయత్నం కంటే తనను గురించి తను తెలుసుకొనే ప్రయత్నం.. అయినా ఇంత మొత్తంలో డబ్బు ఎందుకు సంపాదిస్తారు ఎవరైనా..
వ్యాపార అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు, అధికారం కోసం పార్ట్ఫీండ్‌గా ఇవ్వడానికి, సుఖంగా బ్రతకడానికి మరో నాలుగైదు తరాలు సరిపోయేలా.. వీటి కొరకేనా డబ్బులు సంపాదించేది.
కాదు.. కాదు.. డబ్బు సంపాదన ఒక రకంగా పిచ్చిలాంటిదే, భారీ బ్యాంక్ బ్యాలన్స్, పెద్ద బంగళా, కారు, నగలు, భూములు అన్నీకొన్న తర్వాత కూడా మరలా డబ్బు సంపాదనపైనే యావ ఎందుకో? విశ్రాంతి లేకుండా మోసం, దోపిడీ అన్నింటి ద్వారా ఈ సంపాదన ఎవరి కోసం.. తన ఒక్కగానొక్క కొడుకు కోసమే కదా! మరి వాడు ఇలా మారాడే?
ఇందుకు కారణం డబ్బే గదా! అయినా రాబోయే తరాలకు సరిపోయే డబ్బును మనం ఇప్పుడే సంపాదించడం వలన లాభమేమిటి వాళ్లూ ఎదిగి అభివృద్ధిలోకి వస్తారుగదా.
తను సంపాదించిన డబ్బులు కొడుకు ఖర్చు పెట్టడం వలనే గదా ఇప్పుడు జైలు పాలయ్యాడు. తన వలన చితికిపోయిన కుటుంబాల శాపనార్థాల ఫలితమేనా! వారి ఉసురు తీసిన తన మోసాలు, వంచన వలనేనా ఈ వేదన.
అసలు నేను ఎవరి కోసం డబ్బు కూడబెడుతున్నాను. తన కొడుకు, వాడి పిల్లలు, వాళ్ల పిల్లలు సుఖంగా బ్రతకాలనా! అవునా! మరి నా వలన మోసపోయిన వారి సంగతి. వారి పిల్లలెలా బ్రతకాలి?
నేను సంపాదించిన డబ్బులతోనే వీడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. ఈజీ మనీ వలన రాబోయే తరం ఇంకెలాంటి అన్యాయాలు చేస్తుందో.. డబ్బు సంపాదించడానికి ఒక హద్దు లేదా! ఎవరికోసం ఎందుకోసం కూడబెడుతున్నామో కూడా తెలియకుండా మోసం చేసి సంపాదించడం నేరం కాదా!
తను కూడబెట్టిన డబ్బును ఉపయోగించి, తన కొడుకు చెడుతిరుగుళ్లు తిరుగుతాడు, మనుషుల్ని చంపుతాడు.
తానేమో వాడిని బెయిల్‌పై విడుదల చేయించి, సాక్షుల్ని తారుమారు చేసి, నిర్దోషిగా నిరూపిస్తాడు. వాడు మళ్లీ దర్జాగా ఈ ప్రపంచంలో బ్రతుకుతాడు. వాడు మరలా, నా వ్యాపారాన్ని నిర్వహించి మరిన్ని మోసాలు చేసి మరింతమందికి కన్నీళ్లు తెప్పిస్తాడు.
పరదాలలో పాపభీతి పెరిగిపోయింది. తనలాంటి వాళ్లు చాలామంది ఇదే రొంపిలో కూరుకొనిపోయి తప్పుమీద తప్పులు చేస్తూ ఉన్నారు. ఒక ఆలోచన వచ్చిన వాడై నిద్రపోయాడు.
ఆ ప్రాంతమంతా సందడిగా ఉన్నది. పరదాల ‘అతిరథ రియల్స్’లో ప్లాట్‌లు కొన్నవారందరూ సమావేశమయ్యారు. వారు ఈ ప్లాట్ల పుణ్యమా అని చితికిపోయి వున్నారు. తీసుకున్న సొమ్ముకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి తరపున బంధువులు హాజరయ్యారు. పరదాల తనకు అంటుకున్న పాపపు పంకిలంను కడిగేయాలనుకున్నాడు.
వారి ప్లాట్లను వారు కొన్న రేటుకంటే రెట్టింపు ఇచ్చి అన్ని ప్లాట్లు తనే కొనుక్కున్నాడు. వారి కళ్లల్లో మరలా కొత్త జీవం కనబడింది. యేళ్ల తరబడి వర్షం కోసం వేచిన నేల ఒకేసారి కుంభవృష్టికి ఎంత సంతోషపడుతుందో, ఆ విధంగా వారు ఆనందపడ్డారు.
కొన్న మొత్తం భూమిని అనాథ ఆశ్రమాలకు, ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు, మరికొంత భూమిని ఇల్లులేని నిరుపేదలకు ఉచితంగా రాసిచ్చాడు.
తన కుమారుడు పర్వేష్ మూలంగా చనిపోయిన అమ్మాయి ఇందుహాస తల్లిదండ్రులకు తన కొడుకు పేరిట ఉన్న మొత్తం ఆస్తిని రాసి ఇచ్చేశాడు పరదాల.
ఇప్పుడు పరదాల వద్ద తన శేష జీవితానికి సరిపోయేలా ఉండటానికి ఇల్లు, తిరగడానికి కారు, ఖర్చులకు సరిపోయేంత డబ్బు ఉన్నది. ఇది చాలు తన జీవితానికి. డబ్బును తనవద్దే ఉంచుకోవడం వల్లే ఎంతోమందికి కన్నీళ్లు తెప్పించాడు. నేడు వారి కళ్లల్లో సంతోషాన్ని చూశాడు. అదిచాలు అనుకున్నాడు.
పరదాల లాయర్ సత్యనారాయణకు ఫోన్‌చేశాడు.. ‘‘లాయర్ గారూ! నిన్న మీరు అడిగారు గదా! పర్వేష్‌కి బెయిల్ పిటిషన్ వేద్దామా అని. ఆ ప్రయత్నాలేవీ చేయవద్దు. చట్టాన్ని తన పని తాను చేసుకుపోనివ్వండి. ఉంటాను. అది కాదండి, ఇదే విషయమైతే క్షమించండి’’ అంటూ ఫోన్ కట్ చేశాడు.
మహిళాసంఘాలు, పాఠశాల, కళాశాలల విద్యార్థి, విద్యార్థినులు, స్వచ్ఛంద సంస్థలు, అందరూ కలిసి అత్యాచారానికి పాల్పడిన నిందితులను నపుంసకులుగా మార్చాలని కోర్టులో కేసు వేశారు. దేశవ్యాప్తంగా బాధిత మహిళలకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టారు.
అత్యాచారం చేసిన నిందితుల పట్ల ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఎలాంటి శిక్షలు విధిస్తాయోననేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ శిక్ష విధించే ముందు బాధిత మహిళ కుటుంబసభ్యులను, సమాజంలో ఉండే మాతృసమానులైన మహిళలను దృష్టిలో పెట్టుకుని తీర్పును వెలువరించాలి.
మరోసారి ఏ అమ్మాయికి, ఏ తల్లికి అన్యాయం జరగకుండా ఆడబిడ్డల జీవితాలతో చెలగాటం ఆడే, అమానుషంగా ప్రవర్తించే వ్యక్తులకు తగిన బుద్ధిచెప్పాలి. మరోసారి ఆ తప్పు చేయాలన్నా భయపడాలి. శిక్ష కఠినంగా ఉండేటట్లు చట్టాల్లో మార్పులు తీసుకుని రావాలి. చట్టం అంటే గౌరవం, భయం ఉండాలి.. అత్యాచార నిందితులకు వారి కుటుంబ సభ్యులు ప్రోత్సాహం ఉండకూడదు. ఇంటాబయట సంఘం నుండి బహిష్కరించాలి.
నీతి, నిజాయితీ, సత్యానికి, న్యాయానికి, ధర్మానికి, చట్టానికి కట్టుబడి జీవిద్దాం. సభ్య సమాజంలో ఉత్తమ పౌరులుగా, గౌరవంగా బతికేటట్లు నడుచుకుందాం. విలువలతో కూడిన సమాజాన్ని నిర్మిద్దాం’’
ఈ సమాజంలో స్ర్తిలను ఎప్పుడు గౌరవిస్తామో, తల్లులుగా చూస్తామో, ఆరోజు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు, ఆరోజే నిజమైన పండుగ.

- ఆలకుంట రెడ్డిప్రసాదు,
వాల్మీకిపురం, చిత్తూరుజిల్లా.
చరవాణి : 9848672587

స్పందన

నిజంగా
భగవంతుడున్నాడు..!
గత వారం మెరుపులో భగవంతుడా.. ఇక చాలు కథ చాలా బాగుంది. ఇటీవల వచ్చిన కథల కంటే కాస్త భిన్నంగా అనిపించి. చిన్నప్పటి నుంచి ఎటువంటి కోరికలు తీరని సీత నిరాశనిస్పృహలతో కుంగిపోకుండా, భర్త పెట్టే బాధలను భరిస్తూ కాలం వెళ్లదీయడం, పిల్లలు లేని ఒంటరి జీవితం గడపడం వంటి కథనంతో సాగిన కథ గొప్ప సందేశాన్ని అందించింది. చివరకు సీతమ్మ భర్త చనిపోయిన తరువాత ఆమె ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని వారి పెళ్లి చేసి వారి పిల్లలకు పేర్లు పెట్టి..్భగవంతుడా ఇక చాలు ఈ జీవితానికి అనుకోవడం గొప్ప పరమార్థం. నిజంగా దేవుడు ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో ఆయనే ఇచ్చేస్తాడు, కాకపోతే కాస్త ఓపిగ్గా ఉండాలి..అంతే అని ఈ కథ మరోసారి నిరూపణ చేసింది. రచయిత డా. జ్ఞానేశ్వర్ గారికి హృదయపూర్వక అభినందనలు.
- కాశీభట్ల రంగనాయకమ్మ, పుట్టవీధి, నెల్లూరు
- బాలచందర్, వైఎస్ బొమ్మ సెంటర్, ఏర్పేడు
- ఇసనాకుల చంద్రావతి, కనిగిరి

రా..కదలిరా..!
గత వారం మెరుపులో ప్రముఖ రచయిత లక్కరాజు శ్రీనివాసరావు గారు రాసిన రా..కదలిరా కవిత సాగిన తీరు, వాక్యనిర్మాణం అదరహో అన్నట్లు సాగింది. వర్షం కురవాలని అతడు పడిన తాపత్రయం, విన్నవించిన తీరు సూపర్. పదాలతో ఆడుకోవడం లక్కరాజుకు వెన్నతోపెట్టిన విద్య. కొండలు, కోనలు, పర్వతాలను దాటుకుంటూ రా..కదలిరా..వచ్చి నేలతల్లిని సస్యశామలం చెయ్యి... జనాల నీటిబాధలు తీర్చు అంటూ చినుకును కోరిన విధం బాగుంది.
- శ్యామలాదేవి, కలిగిరి, కావలి
- అనంత రాంబాబు, కందుకూరు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

బడి బాటలు కాదు
చిన్నారులతో ఆటలు
ఏటేటా పెరిగే ఫీజులు
పుస్తకాల బరువులు
ఉత్తమ ఫలితాలు పొందాలని
యాజమాన్యం ఒత్తిళ్లు..
వ్యాపార ధోరణులు..
తగ్గేదెప్పుడు?
క్రమశిక్షణ పేరుతో
బడి చుట్టూ
వందల సంఖ్యలో ప్రదక్షణలు..
మోకాళ్లపై గంటల తరబడి
ఎర్రటెండలో చదవడాలు..
మాతృభాషలో
అస్సలు మాట్లాడవద్దనే
మాధ్యమాల గొడవ లు
ఇంటిపని చేయలేదని
వ్రేళ్లపై వాతలు
వీపులపై మోతలు
తొలగేదెన్నడు?..
సమ దుస్తులు ధరించినా
తప్పని వివక్షలు..
వర్గ భేదాలు..
అమాయక బాలికలపై
హెచ్చుమీరుతున్న అకృత్యాలు
రాజకీయ భావాలమాటున
రగిలే అనేక వైషమ్యాలు
పసి మనుసుల్లో
చిమ్ముతున్న పచ్చి విషాలు...
పచ్చని పాఠశాలల్లో
అంతమయ్యేదెప్పుడు?..
పనికెళ్లే దుస్థితి రాకుండా
ప్రతి విద్యార్థి
పాఠశాలలో చదివేలా
ప్రత్యేక శ్రద్ధ పెట్టేదెప్పుడు?..
చూసిరాతల పరీక్షలకు
స్వస్తిపలికి
చిత్తసంస్కారాన్ని పెంచే
విలువల చదువులకు
ఒరవడి దిద్దేదెప్పుడు?...
ముళ్లబాటలవుతున్న
బడిబాటలు..
పూలబాటలయ్యేదెప్పుడు?
స్వేచ్ఛాసంతోషాలతో
విద్యార్థులు..విజ్ఞాన ఫలాల్ని
అందుకునేదెప్పుడు?..
ఇందుకు స్పందించాల్సిందెవరు?
ఇంకెన్ని చట్టాలు రావాలి?
ఇంకెంత కాలం గడవాలి?..!

- కొండూరు వెంకటేశ్వరాజు, గూడూరు, చరవాణి : 9492311048

మామిలు

పాపాలు చేశావా?
దిగులు పడుతున్నావా?
ఉన్నాయిలే..మరో పుష్కరాలు

తెలుగంటే వద్దు దడ
‘తల్లి’ చేతిలో వుందిగా
తియ్యని చెరకు గడ

ఇదేం చిత్రమో
ఆ వైపు ఆకలితో పాపల శోకాలు
ఈవైపు రాయికి పాలాభిషేకాలు

కెమెరా ట్రిక్కులు
గ్రాఫిక్ జిమ్మిక్కులు
చేయని హీరోలు..సైనికులు

దారిలో వున్న గతుకులు
నాకు కనబడలేదు
నా ప్రియురాలి సొట్టబుగ్గల ముందు

దామెర్ల గీత,
నెల్లూరు
చరవాణి : 9912391196

సాహిత్యం
మానవజాతి జీవనంలో
సఖ్యత, ఐక్యత పెంచాలి సాహిత్యం
‘‘ప్రపంచం ఒక గ్రామం’’
భావనతో విశ్వమానవతత్వాన్ని పంచాలి సాహిత్యం..
కానీ - విచిత్రంగా నేటి కవిత్వం
కులానికి పెద్దపీట వేస్తోంది
మతానికి కొత్తపాట రాస్తోంది
జాతీయతకు కత్తిగాటు వేస్తోంది...

కవిత్వం సాధించాల్సింది
విబేధాలతో విద్వేష భావాలు కాదు
కవిత్తం సంధించాల్సింది
విరోధాల అస్తశ్రస్త్రాలు కాకూడదు..
సాహిత్యపరమార్థం
మానసిక వికాసం తెచ్చే
ఉత్తమ స్పందనల సంపుటి
కానీ - నేడవుతోంది
వికృత జ్వాలల కుంపటి..
మిత్రమా! నిజమైన సాహిత్యం
వాదాల వివాదాలకతీతంగా
అక్షర ఉషస్సు తేవాలి
విలువల దారి చూపుతూ
మానవతాగమ్యం చేర్చే
అనంత తపస్సు కావాలి..

- బొగ్గవరపు రాధాకృష్ణమూర్తి, నెల్లూరు
చరవాణి : 9885481939

మరణ శాసనం
పడుగు, పేకల
పాత బతుకులు
కూడు బెట్టక, గూడు నిలపక
నిన్న నేసిన జరీ చీరన
తారల రీతి తళుకులద్ది
వెనె్నలవనె్నలనెన్నో దిద్ది
ఆకలికార్చిన అశ్రువులెన్నో
మామిడి పిందెల హారములైనవి
చిందిన చెమట చుక్కలన్నీ
పువ్వుల తీగల దారములైనవి
జిలుగులు, సొగసులు ఎన్నున్నా
జరీచీరన ఘనతున్నా
ఆకలి మంటల జ్వాలల్లో
ఆహుతైనవి జీవితాలు
బతుకులేక, బతకలేక
మగ్గం గుంటలే
మరణ వేదికలైతే
ఆ మరణశాసనం రానిదెవరో?

- కె.రవిశేఖర్, నాయుడుపేట
చరవాణి : 9849388182
email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- ఆలకుంట రెడ్డిప్రసాదు