నెల్లూరు

పూసలు వీడిన హారం ( కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంధాలకు దూరం అవటమే నాగరికతా? నిన్న ఆ ఫోను వచ్చినప్పటికి నుండి ఈ ఆలోచనే నా మనసును తొలిచేస్తుంది. ‘‘్ఛ.. ఏం కాలమిది? మంచికి కాలం కాదు’’!
‘‘అత్తమామ, అన్నదమ్ములు అందరు ఒకే ఇంట్లో ఉంటే, మా అమ్మాయికి కష్టంలేండి! ఈ సంబంధం వద్దని చెప్పండి’’, అవతల నుండి ఫోను. అప్పటి నుండి నాకు అదే ధ్యాస.
శ్రీకాంత్, ఆఫీసులో నా కోలిగ్. మంచి కుర్రాడు. ఇచ్చిన పని సవ్యంగా చేస్తాడు. పనిలో ఇతరులకు కూడా సాయం చేస్తుంటాడు.
‘‘ఇంకెమోయ్ శ్రీకాంత్.. ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకోకూడదంటోయ్’’ అన్నాడు మా ఆఫీసులో ఇంకో కొలీగ్ పరంధామయ్య, శ్రీకాంత్‌కి ఉద్యోగం వచ్చిన మొదట్లో.
‘‘మా చెల్లెలు ఉంది సార్ తనకి చేసిన తర్వాతే’’... నవ్వుతూ చెప్పాడు, శ్రీకాంత్.
శ్రీకాంత్‌కి చెల్లితో పాటు ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. వాళ్లకు, శ్రీకాంత్‌కు వయస్సులో చాలా తేడా. కాబట్టి వాళ్ల పెళ్లిళ్లకు చెల్లెలు పెళ్లి అడ్డురాలేదు. పెద్దన్నకు ఇద్దరు పిల్లలు, రెండో అన్నయ్యకు ఓ బాబు అందరు కలిసే ఉంటారు. అమ్మానాన్న, అన్న వదినలు, వాళ్ల పిల్లలు, శ్రీకాంత్, తన చెల్లెలు... పెద్ద సంసారం అంతమందీ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు అంటే.. అబ్బో! ఇప్పటి కాలానికి చాలా గొప్ప విషయం! అదీకాక శ్రీకాంత్‌కి మేనత్తలు కూడా ఎక్కువే. అపుడపుడు వాళ్లూ వచ్చిపోతూండటంతో, ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది.
అన్నట్టుగానే శ్రీకాంత్, చెల్లెలి పెళ్లి కూడా చేసేశారు. ఇక ఇపుడు వంతు శ్రీకాంత్‌ది. తన చెల్లిలి పెళ్లికి మా ఆఫీసువాళ్లం అందరం వెళ్లాం. ఇంట్లో వాళ్లందరూ మర్యాదస్తులు, ఆప్యాయంగా పలకరించారు. మర్యాదలు చేశారు. నిజంగా నాకైతే, వాళ్ల ఇంటికి పోతే, చాలా ఆనందంగా ఉంటుంది, అంతమందిని ఒకే ఇంట్లో చూసేసరికి. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే... ముగ్గురు, నలుగురు ఉంటే గొప్ప. ప్రైవసీ పేరుతో పెళ్లి కాగానే అమ్మనాన్నలను వదిలేసి వేరుకాపురం పెట్టడం ఫ్యాషన్ అయిపోయిందిపుడు. అందుకే నాకు శ్రీకాంత్ అన్నా, వాళ్ల కుటుంబం అన్నా చాలా ఇష్టం.
నాకు అంత ఇష్టమైన ఇల్లే, శ్రీకాంత్ పెళ్లికి అవరోధంగా తయారైంది.
మనిషి మంచివాడు, మంచి ఉద్యోగం ఉంది. అందంలో అంత తీసేసేవాడు కాదు. ఇన్ని ఉన్నా ఉమ్మడి కుటుంబం కారణంగా అమ్మాయిని ఇవ్వటానికి తల్లిదండ్రులు జంకుతున్నారు.
అసలు ఇప్పుడు ఉండే సౌకర్యాలు అప్పుడు ఉన్నాయా! మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు.. ఇలా ఎన్నో గృహోపకరణాలు ఉన్నాయి. ముందుకంటే శ్రమ తక్కువే అని చెప్పాలి. ఆ కాలంలో ఒక పచ్చడి చేయాలంటే రోలు, రోకలి, రుబ్బురోలు ఇలా ఎన్నింటికో పనిచెప్పాలి. ఊదరగొట్టం తీసుకొని కట్టెలపొయ్యిని ఉఫ్.. ఉఫ్‌మంటూ ఊదేవారు పాపం. ఇప్పుడు గ్యాస్‌స్టౌ.., ఆడవాళ్లయినా, మగవాళ్లు అయినా మైళ్లకి మైళ్లు నడవడం.. లేదా సైకిల్ తొక్కడం. కానీ ఇపుడు స్కూటర్ల సుఖం మరిగి రోడ్లోకి రావాలన్నా స్కూటర్ తీయాల్సిందే..
ఇంతకీ ఇంత సోది చెప్పటానికి కారణం ఏంటంటే.. నాకు తెల్సిన వాళ్ల ఇంట్లో అమ్మాయి ఉందంటే శ్రీకాంత్ విషయం చెప్పాను.
అమ్మాయి వాళ్ల నాన్న ఆఫీసుకు వచ్చి శ్రీకాంత్‌ని చూసాడు. అబ్బాయి బాగున్నాడు అంటూ వివరాలకు నా దగ్గరికి వచ్చాడు.
‘‘చాలా మంచి సంబంధం అండి, ఫ్యామిలీ అంతా మంచివాళ్లు. అందరూ కలిసి ఉంటారు. అబ్బాయి పెద్దలను గౌరవిస్తాడు’’... ఇలా అన్ని విషయాలు ఉత్సాహంగా చెప్పాను. శ్రీకాంత్‌ని చేసుకోవటం అమ్మాయి అదృష్టం అని నా అభిప్రాయం.
ఇంట్లో ఆడవాళ్లతో కూడా మాట్లాడి చెపుతానంటూ వెళ్లిన అతను మరుసటిరోజు.. ‘‘అంతమందితో ఇంట్లో ఉండాలంటే అమ్మాయికి కష్టమండి. సంబంధం వద్దులేండి’’ అని ఫోను చేశాడు.
నాకైతే ఇంట్లో వాళ్ల సంబంధం మిస్సయినంత బాధేసింది. దాని కంటే ఎక్కువగా నాకసలు ఆ.. ఆలోచనే దిగులుగా ఉంది. మా అమ్మనాన్నలు చివరి వరకు నాతోనే ఉన్నారు. అమ్మ మంచాన పడినా, నా భార్య ఓపిగ్గా సపర్యలు చేసింది. పిల్లలు కూడా అవ్వ, తాత అంటూ వాళ్లతో సంతోషంగా గడిపేవారు. నాన్న కూడా మనవడు, మనవరాళ్లతో.. కథలు, కబుర్లు చెప్పుకుంటూ ఉత్సాహంగా ఉండేవారు. మా సంసార జీవితానికి వాళ్లెప్పుడూ అడ్డురాలేదు.
మరి ఇప్పుడేంటి, పెళ్లైన వెంటనే విడికాపురం పెట్టడం? అలా పెట్టకపోతే.. విడాకుల వరకు వెళ్లడం! అత్తమామలను వద్దు అనుకునే అమ్మాయి తల్లిదండ్రులు.. వాళ్ల వరకు వస్తే ఏం చేస్తారు?
అప్పటి కాలంలో అయితే ఈ సంబంధాన్ని ఎగిరి గంతేసి చేసుకుంటారు. మరి ఇప్పుడు కాలం మారిపోయింది. మార్పు సహజమే కానీ ఆ మార్పు మంచితనానికి, మానవత్వానికి దారితీయాలి, కానీ ఇలాంటి వింతపోకడలకు దారితీయకూడదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోయింది.
***
ప్రతిరోజు ఆఫీసు అయిపోయిన వెంటనే శ్రీకాంత్, నేను క్యాంటిన్‌లో టీ తాగేవాళ్లం. ఆ సమయంలో పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. కనీసం అరగంట అయినా, ఏదో ఒక విషయం..రాజకీయాల నుండి మనుషుల మనస్తత్వాల వరకు, అభిప్రాయాలు పంచుకోందే అక్కడ నుండి లేవం. మిగతా కొలీగ్స్ అప్పుడప్పుడు కలుస్తారు కానీ, ఎక్కువ మేమిద్దరమే మాట్లాడుకుంటాము.
ఈరోజు విషయంగా ఇదే ప్రస్తావించాను. ‘‘మీరందరు కలిసి ఉన్నందున సంబంధం ఆగిపోయింది శ్రీకాంత్’’ చెప్పాను.
శ్రీకాంత్ నవ్వి ఊరుకున్నాడు.
ఉదయం పడ్డ ఆవేదన అంతా వెళ్లగక్కాను.
‘‘ఏంటి శ్రీకాంత్ నిశ్శబ్ధంగా ఉన్నావ్! అందరు కలిసి ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటామే. కానీ కలిసి ఉంటే మనస్పర్థలు వస్తుంటాయ్, విడివిడిగా ఉంటే బాగుంటుంది. పైగా ప్రైవసీ కూడా దొరుకుతుంది అని కొందరంటారు. నిజంగా ఏది రైట్ అంటావ్?’’ అడిగాను.
‘‘ఏమో సార్ నాకైతే మాత్రం, ఇంట్లో వాళ్లు ఎక్కడికైనా వెళ్తే ఆరోజు ఇల్లంతా బోసిపోయినట్లు ఉంటుంది. నాకు ఇల్లంతా సందడిగా ఉండడం ఇష్టం. అందరు కలిసి తలా ఒక పని చేయడం, బాధ్యతలు పంచుకోవటం.. ఇలా అయితే కాలం ఎలా వెళ్లిపోతుందో తెలీదు. చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినా... అంతా మనవాళ్లే అనుకుంటే, గాలికి ఎగిరిపోయే ప్లాస్టిక్ కాగితంలా సమస్యలు సమసిపోతాయి.
ఈ సందర్భంగా నాకొకటి గుర్తుకు వస్తుంది సార్, నేను చదువుకునేటపుడు మా పెద్ద అన్నయ్యకు స్కూటర్ యాక్సిడెంట్‌లో కాలు విరిగింది. అప్పటికే అన్నయ్యకు పెళ్లి అయిపోయింది. బంధువులు వచ్చి చూసివెళ్లారు, కానీ అన్నయ్యను హాస్పిటల్ నుండి ఇంటికి నాన్న, నేను, చిన్నన్నయ్య తీసుకువచ్చాం. మేం ముగ్గురమే అన్నయ్యను బెడ్ మీదకు చేర్చాం. అన్నయ్యది కాస్త భారీ శరీరం, తనేమో నడవలేని పరిస్థితి. బెడ్ మీదకు తీసుకొచ్చే సరికి చాలా కష్టం అయింది. అమ్మ, వదిన, మేమందరం కలిసి అన్నకు కావాల్సిన అవసరాలన్నీ చూశాం. మొదట్లో వదిన అమ్మవాళ్లు వేరే కాపురం అంటూ నసిగారట, కానీ అన్నయ్య ఒప్పుకోక పోయేసరికి ఆ ఆలోచన మానుకున్నారు. యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి తిరిగి పెద్దన్నయ్య నడిచే వరకు అందరు చేసిన పనులు చూసి, వదిన కన్నీరు కారుస్తూ.. మా అమ్మతో అంది ఇలా...‘‘మొదట్లో వేరుకాపురం అన్నాను కానీ ఇక్కడ ఉన్నంత ఆనందం, భరోసా నాకు అక్కడ దొరికే సమస్య లేదు అత్తగారు’’ అని అంది. చిన్నప్పుడు విన్న ఆ మాటలు నాలో బలంగా నాటుకుపోయాయి సార్’’ చెప్పాడు, శ్రీకాంత్.
‘‘మరి ఈ మార్పుకి కారణమేంటి శ్రీకాంత్. అందరు కలిసి ఉంటే పనులెక్కవ అని అనుకుంటారు, అది పక్కన పెట్టినా.. అసలు చిన్నచిన్న పనులకే తెగకష్టపడిపోతున్నట్లు అనుకోవటమేంటి?
‘‘శ్రమ పట్ల గౌరవం లేకపోవటం సార్, అపుడే ఫాల్స్ ఇగో వస్తుంది. టాల్‌స్టాయ్ ఫాంలో, గాంధీ కస్తుర్బాలు టాయ్‌లేట్స్ శుభ్రం చేసిన విషయాలు ఎంతమంది చదివి మనసుకు పట్టించుకుని ఉంటారంటారు సార్?
‘‘అవును శ్రీకాంత్ నీవు చెప్పింది నిజం. శ్రమించడం వలన కలిగే లాభాలు ఎన్నోకదా! కాని ఇపుడు కష్టపడటం ఎవరికి ఇష్టం లేకుండాపోయింది.
‘‘ఇష్టం లేకుండానే కాదు, చిన్నచూపు చూస్తున్నారు. నన్నడిగితే డ్రైనేజి క్లీన్ చేసే వాళ్లు నా దృష్టిలో దేవుళ్లు.. వారు కొన్ని రోజులు పనిమానిస్తే మన పరిస్థితి ఏంటి సార్? కాస్త దుమ్ము చేతికి అంటగానే కడుక్కునే వరకు అనీజిగా ఉంటుంది కదా! వాళ్లు చేసే శ్రమ ముందు మనదేపాటి సార్’’
అంగీకారంగా తలూపుతూ ఉండిపోయాను.
క్యాంటిన్ కుర్రాడు అపుడు టీ తెచ్చి ఇచ్చాడు. మా సంభాషణలాగే టీ కూడా వేడిగా ఉంది.
సిప్ చేస్తూ.. ఫాల్స్ ఇగొ అంటే గుర్తొస్తుంది. ఈ మధ్యకాలంలో జరిగే పెళ్లిళ్లు గమనించావా!
ఎంత డబ్బు వృథా చేస్తున్నారంటావ్! కల్యాణ మండపం నుండి భోజనాల వరకు ఎంత దండగ చేస్తున్నారో...!
‘‘అవునుసార్ మన దేశంలో పెళ్లిళ్లకు, చావులకు చేసే కార్యక్రమాల వలన అప్పుల పాలవుతున్నారన్న సర్వే కూడా ఉంది.
‘‘నాకు నువ్వు వస్తుంది శ్రీకాంత్. ఒకరు భోజనాల్లో 20 అయిటమ్స్ అంటే ఇంకొకరు 30 అయిటమ్స్ అంటారు. అసలు అంత తినగలమా! అన్న ఆలోచన లేదు.
‘‘అవును సార్ ఒకరిని చూసి ఇంకొకరు డబ్బుని వృథా చేస్తున్నారు సార్, నన్నడిగితే, ఖర్చు తక్కువలో సింపుల్‌గా మారేజ్ చేసకుంటే బాగుంటుంది. కానీ వినే వాళ్లు ఎవరుసార్? గొప్పల కోసం తిప్పలు తప్ప అనవసర ఖర్చులకు డబ్బుని తగలెడుతున్నారు.
‘‘ఇక్కడ నాకు ఒక విషయం అర్ధం కావట్లేదు శ్రీకాంత్. ఒక వైపు డబ్బుని వేస్టు చేసేవారే దాని మీద విపరీతమైన యావను కల్గి ఉంటారు. మరి ఈ వృథా ఎలా చేస్తున్నారు?
‘‘అవసరాలు, ఆడంబరాలు ఎపుడైతే పెరిగిపోతాయో అపుడు ఇలాగే జరుగుతుంది. అవసరాలు తీర్చుకోవటం కోసం కక్కుర్తిగా డబ్బుని సంపాదించటం, ఆడంబరాల కోసం అతిగా ఖర్చు పెట్టడం’’.
అవును శ్రీకాంత్, ఎపుడైతే మనుషులను ప్రేమించటం మానేసి డబ్బుని ప్రేమిస్తామో.. అపుడు ఇలాంటి పరిస్థితులే ప్రత్యక్షవౌతాయి. చిన్నచిన్నగా దాని మత్తులోకి జారిపోయిన తర్వాత, ఇక ఏం చేయాలన్నా, అదే డిసైడ్ చేస్తుంది’’.
‘‘అవును సార్ ఎపుడైతే డబ్బుని అతిగా ఇష్టపడతారో, అప్పుడు స్వార్థం పెరిగిపోతంది. ‘‘నేను’’ అనే భావం మనం అనే భావాన్ని డామినేట్ చేస్తుంది. అపుడు ఎవరికి వారుగా బంధమనే దారాన్ని తెంపేస్తారు. ఇంకేముందు అందమైన కుటుంబ హారం పూసల్లా విడిపోతుంది.
ఏది ఏమైనా సంబంధాలు పోతున్నాయని, నా అభిప్రాయాన్ని మార్చుకోలేను. చూద్దాం నాలా ఆలోచించేవారు దొరక్కపోతారా? అంతవరకు వేచి ఉంటాను’’ అంటూ కూర్చీలోంచి లేచాడు శ్రీకాంత్.
ఈరోజు టీ బాగుందంటు క్యాంటిన్ అతనికి చెప్పి, డబ్బులిచ్చి ఇద్దరం బయటకు వచ్చాం.
సాయంసంధ్య గాలి చల్లగా తగిలి, మనసుకు హాయినిచ్చింది.

- అవ్వారు శ్రీధర్‌బాబు, నెల్లూరు
చరవాణి : 8500130770

మనోగీతికలు

మేరా జవాన్ మహాన్
నీ ప్రాణాల్ని గాలికొదిలి
నా దేశ సరిహద్దుల్ని
నీ సర్వస్వాన్ని ధారపోసి
నా దేశ భద్రతను
పరిరక్షిస్తున్న నా జాతి రక్షకుడా!
ఓ జవాన్! నీకు.. నా రెడ్ శాల్యూట్
ఉగ్ర ముష్కరుల్ని హద్దు దాటనీయక
నియంత్రణ రేఖలో... నియంతవై
నిలువుకాళ్లపై నిర్విరామ యాగం చేస్తున్న
ఓ మహర్షీ నీకు నా పాదాభివందనం
గుండెల్ని కత్తులు చీల్చివేస్తున్నా
చివరాఖరి వరకు పోరాడే పందెం కోడిలా
శరీరాన్ని ఆయుధాలు తూట్లు పొడుస్తున్నా
చివరి ఊపిరి వరకు పోరాడే
నీ తెగువకు నా లాల్‌సలాం
నీ నిత్య యుద్ధ సన్నద్ధత
మా బ్రతుకులకెంతో ప్రశాంతత
నీ రెప్పవాల్చని అప్రమత్తత
మా జీవితాలకెంతో సార్థకత
మంచు పులితో కరచాలనం చేస్తూ
స్నైపర్ తూటాల మృత్యుకౌగిలి నడుమ
నీ నిర్నిద్ర నిశిరాత్రులు
మాకు నులివెచ్చని గాఢనిద్రను ప్రసాదిస్తున్నాయి.
భయంకర నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ
ఇసుక తుఫానుల నడుమ ఆసేతు
హిమాచల పర్యంతం
నింగిలో.. నేలలో.. నీటిలో నీ పరాక్రమ
విన్యాసాలు
మాకు స్వేచ్ఛా వాయువులందిస్తున్నాయి.
సహచరుల తలలు తెగిపడుతున్నా
నీ శరీరం రక్తమోడుతున్నా
రణక్షేత్రంలో సమర సింహనాదం చేసే
నీ దేశభక్తి ముందు
మృత్యువు సైతం మోకరిల్లుతుంది.
సరిహద్దు ఆవల అంగుళం నేల కోసం
నీవు యుద్ధం చేస్తుంటే
సరిహద్దు ఈవల అందినంత నేలను
ఆక్రమించే అక్రమార్కులకు నెలవైన ఈ దేశంలో
నీ ఆత్మబలిదానాలు కాలగర్భంలో
కలుస్తున్నాయి.
అయినా...
వీరత్వంతోనే అమరత్వం
పొందాలనుకునే
నీ దృఢ సంకల్పం
నీ జాతి జనుల నీరాజనాలందుకుంటోంది.
నువ్వు జవానువు కాకముందు
నీ కుటుంబానికి అధినేతవు
నువ్వు జవానువి అయ్యాక
ఈ దేశానికి ప్రాణదాతవు
యావత్ జాతికి స్ఫూర్తిప్రదాతవు
జై జవాన్.. మేరా భారత్ మహాన్
మేరా జవాన్ మహాన్!

కుర్రా ప్రసాద్‌బాబు, ఒంగోలు
చరవాణి : 9440660988

అమృత కలశాలు
కళ్లలో నిలుపుకొన్న ప్రతిరూపం
కళ్లను కాటేస్తున్నా
పండిన కడుపంత మమకారం
కారుచిచ్చై రగులుతున్నా
వాళ్లకు అతడు
తనువు మనసుల మధనంలోంచి
పుట్టిన అమృతభాండమే..!
ఎండిన ఆశలు ఎడారులై జ్వలిస్తుత్నా
కరిగిన కలలు కన్నీటి అలలై
ఆవిర్లవుతున్నా
అమ్మ కడుపంత చల్లగా
వారికి ప్రభవించిన ఓ చంద్రోదయమే..!
అలముకొన్న నిర్వేదం
అంతరంగంలో చీకట్లను చిమ్ముతున్నా
వారి వెచ్చని ఒడిలో
నులివెచ్చగా ఎదిగిన ఓ అరుణోదయమే..!
పూలుకడిగిన
ఓ తొలికిరణపు సంధ్యారాగమే
చేరువకు అందక, చేర్పుకు పొందక
చొరకకు దక్కక, చేజారినా
అతడు వాళ్లముంగిట నడయాడే
ఓ చంద్రబింబమే..!
--
భ్రాంతులు తొలగినా మారని భావాలు
నిజాలు నిప్పులై కురుస్తున్నా
సడలని నమ్మకాలు
కళ్లలో వెలుగు నిండే ఆ క్షణం కోసం
చివరంటి క్షణం దాకా
అలసిన ఆ కంటిపాపలు
కళ్లల్లో వత్తులు వేసుకొని
ఎదురుచూస్తూనే వుంటాయి
దాగిన మమకారం వెటకారమై
వెక్కిరిస్తున్నా
పొంగిపొరలే ఆ కన్నీటి సంధ్రాన్ని
కనురెప్పల మాటునే కప్పేస్తారు
అందుకే వాళ్లు
ఎక్కడైనా ఎవ్వరికైనా ఎప్పటికైనా
ఎల్లడలా
కొలువుదీరిన ఆ భగవంతుని అమృత కలశాలే
ఎందుకంటే వ్రతాలు చేసి నోములు నోచి
దేవుళ్లను వరమడిగి
మరీ బిడ్డల్ని కంటారు గనుక!

కె రవీంద్రబాబు, పాకాల
చరవాణి : 9052778989

కవిత

మానవుడు - దానవుడు
మానవుడు దానవుడుగా మారి
ఎన్నో వర్షాలు గతించాయి
మనుష్యులలో మానవత్వం మృగ్యమైపోయింది
అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు
అనుబంధాలు - బాల్యంతో ఆగిపోయాయి
అసూయ, ద్వేషాలు భగ్గుమంటున్నాయి
బాల్యం నాటి ప్రేమలు, ఆప్యాయతలు
కనుమరుగవుతున్నాయి
మనిషి ముందు - ఆహా.. ఓహో అని పొగడ్తలు
మనిషి వెనుక - వెక్కిరింతలు, హేళనలు
ఎవరు హితుడో - ఎవరు అహితుడో
తెలుసుకోవడం మహాకష్టం
కంటికి కనబడని శత్రువులతో
బయటికి కనిపించని యద్ధం చేస్తున్నా
కృతజ్ఞులు కరువైపోయారు
కృతఘ్నలు పెరిగిపోయారు
ఔరా! జీవితం - దుర్భరం అయిపోయింది
మంచివానికి, మనుగడే లేకుండా పోయింది
ఓ దైవమా! ఈ మానవజాతికి సద్బుద్ధిని ప్రసాదించు
అసురత్వాన్ని విడనాడి, దైవత్వాన్ని
ఆహ్వానించి
మానవత్వాన్ని ప్రదర్శించే, సంస్కారవంతమైన
నవసమాజం వైపు
నడిపించు..!

- కొడవలూరు ప్రసాదరావు, గూడూరు. చరవాణి : 8500757622

స్పందన

గొప్ప కథ ‘పక్షిశాపం’
గతవారం మెరుపులో ప్రచురించిన పక్షి శాపం కథ చాలా బాగుంది. కథలో రచయిత పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. ఒక మహావృక్షాన్ని నేలకూల్చడం, అందులో నివసిస్తున్న పక్షులు, ఉడతలు ఇతర జీవులు విలపించడం వంటి సంఘటనలు కంటతడిపెట్టించాయి. చెట్టు జీవరాశికి చేసే మేలు చెప్పనలిగికాదు. కథలో చెట్టును కూడా ఎంతో గొప్పగా అభివర్ణించారు రచయిత. రావిచెట్టు, వేపచెట్టు అనోన్యదాంపత్యం. వేపచెట్టు ఎండిపోవడం, పిచ్చివాడు చెట్టుతో మాట్లాడడం వంటి సంఘటనల సమాహారంగా సాగిన కథ ఆధ్యంత్యం ఆలోచింపచేసింది. ఈరోజుల్లో దేవుడ్ని కూడా వ్యాపారచక్రంలోకి లాగేశారని రచయిత ఆవేదన అర్ధవంతమైంది. చివరికి రావిచెట్టును కొట్టేసి కల్యాణమండపం కట్టడం చూస్తే భవిష్యత్‌లో మానవజాతి మనుగడను ప్రశ్నించింది. గొప్ప కథను అందించిన కావేరిపాకం రవిశేఖర్ గారికి హృదయపూర్వక అభినందనలు.
- కోన వెంకటచలమయ్య, సంతపేట, నెల్లూరు
- సుప్రజ కొల్లు, చీరాల
- అనసూయమ్మ, రచయిత్రి, శ్రీకాళహస్తి

రాయి విలువ తెలిపిన కవిత
గతవారం మెరుపులో ప్రచురించిన రాయి విలువ కవిత చాలా బాగుంది. నిజంగా రాయిపైన కూడా గొప్పగా కవిత రాయవచ్చు అని రచయిత కంచనపల్లి ద్వారకానాథ్ గారు నిరూపించారు. రాయి గొప్పతనాన్ని వర్ణించడానికి ప్రతి లైనూ పోటీపడ్డాయి. రాయి గర్భగుడిలో దేవుడై మనల్ని మొక్కిస్తుంది అనే వాక్యం కవిత గొప్పతనాన్ని తెలియజేస్తుంది. రచయితకు ధన్యవాదములు.
- తిరువీధుల వెంకటరామకృష్ణ, కనిగిరి
- సుజాత, నాయుడుపేట

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net
email: merupunlr@andhrabhoomi.net

- అవ్వారు శ్రీధర్‌బాబు