సంపాదకీయం

న్యాయ ప్రమేయం న్యాయమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాసన నిర్మాణ శాఖ-లెజిస్లేచర్, న్యాయశాఖ-జ్యుడీషియరీ-మధ్య అధికార పరిధికి సంబంధించిన వివాదం అనేక ఏళ్లుగా కొనసాగుతోంది! వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యురాలు రోజా సస్పెన్షన్ వ్యవహారంలో హైదరాబాద్ హైకోర్టు చెప్పిన మధ్యంతరమైన తీర్పు ఈ వివాద ధ్యాసను మరో సారి కలిగించింది! రోజాను సస్పెండు చేస్తూ గత సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానం సభా నిర్వహణ నియమాలకు విరుద్ధమన్నది ఉన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు సారాంశం! ఒక సభ్యుడిని, సభ్యురాలిని ఒక విడత సమావేశాల కాలపరిమితి ముగిసే వరకు సస్పెండ్ చేయవచ్చునన్నది ఆ నిబంధన. ఆ నిబంధన కింద ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి రోజాను సమావేశాలు ముగిసే వరకు మాత్రమే సస్పెండ్ చేసి ఉండినట్టయితే న్యాయస్థానాలు బహుశా జోక్యం కలిగించుకొని ఉండేవి కాదు! కానీ ఆ నిబంధన కింద ఆమెను సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ శాసనసభ తీర్మానించింది! అందువల్ల సభా నియమావళికి భంగం కలిగిందన్నది హైకోర్టు చెప్పిన మాట! అందువల్ల రోజాను సస్పెండ్ చేసిన తరువాత ఆ సమావేశాలు ముగిసిపోయాయి. కనుక ప్రస్తుతం నడుస్తున్న సమావేశాలకు ఆ సస్పెన్షన్ వర్తించదు. హైకోర్టు ఇలా స్పష్టీకరణ ఇవ్వడం లెజిస్లేచర్ అంతరంగ వ్యవహారాలలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నట్టు కాగలదన్న వాదం రాజ్యాంగ బద్ధమా కాదా అన్నది కొత్త వివాదానికి ప్రాతిపదిక కావచ్చు! రాజ్యాంగంలోని 212వ అధికరణాన్ని ఉటంకిస్తున్న వారు న్యాయస్థానాలు అసెంబ్లీ వ్యవహారాలలో జోక్యం చేసుకొనడానికి వీలులేదని వాదిస్తున్నారు! అయితే 212వ అధికరణం గురించి గతంలో కూడ చర్చ జరిగింది. రాజ్యాంగంలోని 212వ అధికరణం, 122వ అధికరణం కూడ లెజిస్లేచర్-శాసన నిర్మాణ శాఖ- అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదని నిర్దేశిస్తున్నాయి! 122వ అధికరణం పార్లమెంటు అంతర్గత వ్యవహారానికి సంబంధించినది కాగా, 212వ అధికరణం శాసనసభల కలాపాలకు చెందినది! విధానపరమైన అక్రమ పద్ధతులు చోటుచేసుకున్నప్పటికీ శాసనసభలో జరిగిన కార్యాకలాపాల సామంజస్యాన్ని న్యాయస్థానంలో సవాలు చేయడానికి వీలులేదని 212-ఎ-అధికరణం నిర్దేశిస్తోంది! కానీ ఈ అధికరణాలకు ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తుండడం అనేక ఏళ్లుగా నడిచిపోతున్న ప్రహసనం! కాని సాధికారికంగా రాజ్యాంగ నియమాలను వ్యాఖ్యానించే బాధ్యత 143వ 147వ అధికరణ ప్రకారం ఇతర అధికరణాల ప్రకారం సర్వోన్నత న్యాయస్థానానికి మాత్రమే ఉంది! అందువల్ల శాసన నిర్మాణ శాఖ-లెజిస్లేచర్-, కార్యానిర్వహణ శాఖ-మంత్రివర్గాలు-ఎక్జిక్యూటివ్-, న్యాయశాఖ-జ్యుడీషియల్-రాజ్యాంగ విభాగాలు ఒకరి అధికార పరిధిలోకి మరొకరు చొరబడినారా-అన్న సందేహాలు ఏర్పడినప్పుడు వాటిని నివృత్తి చేయగలిగింది సర్వోన్నత న్యాయస్థానం మాత్రమే! ఈ సందేహాలు 2006లో లోక్‌సభ పదకొండు మంది సభ్యులను బహిష్కరించిన నాటినుంచి కొనసాగుతున్నాయి!
రోజా శాసనసభలో మరో రాజకీయ పక్షానికి చెందిన మరో సభ్యురాలి గురించి అశ్లీల పదజాలంతో అసభ్యకరమైన వ్యక్తిగతమైన నిందా పూర్వకమైన వ్యాఖ్యలు చేయడం ఆమెను శాసనసభనుంచి బహిష్కరించడానికి కారణం! హైకోర్టు ఈ దుష్ప్రవర్తన గురించి ఇప్పుడు నిర్ణయించలేదు. సభా నిబంధనను ఉల్లంఘించిన రీతిలో శాసనసభ తీర్మానం జరగడం చెల్లదని మాత్రమే హైకోర్టు నిర్ధారించింది! అందువల్ల సభలో రోజా చేసిన అసభ్యకర ప్రసంగాన్ని హైకోర్టు ఆమోదించినట్టు కాలేదు. ఆ ప్రసంగంలోని ఉచితానుచితాలు అందువల్ల ఈ తీర్పు పరిధిలో లేవు! ఆమెను నిబంధన ప్రకారం ఒక విడత సమావేశాల పరిమితికి లోబడి బహిష్కరించి ఉండినట్టయితే బహుశా హైకోర్టు తీర్పు వేరే విధంగా ఉండేది! తీర్పును వ్యతిరేకిస్తున్న శాసనసభ వారు తమ కార్యదర్శి ద్వారా హైకోర్టు ధర్మాసనానికి కాని, సుప్రీంకోర్టునకు కానీ అప్పీలు చేసుకోవచ్చు! స్పీకర్ ఆ ప్రక్రియను ప్రారంభించినట్టు కూడ ప్రచారమైంది! అందువల్ల అప్పీలు దాఖలయ్యే వరకు హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పును శాసనసభలో అమలు చేయడం తప్పదు...
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం మేరకు మాత్రమే రోజా సస్పెన్షన్ వివాదాన్ని విచారించి హైకోర్టు తీర్పు చెప్పిందన్నది స్పష్టం! ఇలా విచారించడం తమ అంతర్గత అధికార పరిధిలోకి న్యాయస్థానం చొరబడినట్టు ఆంధ్రప్రదేశ్ శాసనసభ వారు భావించి ఉండినట్టయితే అసలు విచారణ జరుపరాదని వాదించి ఉండాలి! రోజా పిటిషన్‌ను విచారణకు స్వీకరించరాదని కోరి ఉండాలి! కానీ సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ తరఫున ఇప్పుడు వాదన వినపడలేదు! హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువడిన తరువాత కూడ శాసనసభ తరఫున ఆధికారికంగా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు! అప్పీలు చేయాలని మాత్రమే శాసనసభ నిర్ణయించినట్టు ప్రచారవౌతోంది. సభ్యులు బహిష్కృతులైన సమయంలోను, సభ్యత్వాలు రద్దయిన సమయంలోను న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటుండడం దశాబ్దికి పైగా నడుస్తున్న వ్యవహారం! 2006లో పదకొండుమందిని లోక్‌సభనుండి బహిష్కరించారు. రాజారామ్‌పాల్ అనే సభ్యుడు మాత్రం ఈ బహిష్కరణను సుప్రీంకోర్టులో సవాలుచేశాడు. సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడమే కాక సమాధానం చెప్పవలసిందిగా అప్పటి లోక్‌సభ స్పీకర్ సోమనాధ్ చటర్జీకి నోటీసును పంపించింది! అంటే ఇలా బహిష్కరణల గురించి రద్దుల గురించి విచారణ జరపడం 122వ, 212వ రాజ్యాంగ అధికరణాలకు భంగం కాదని సర్వోన్నత న్యాయస్థానం 2006లోనే అభిప్రాయపడిననట్టు అయింది! ఇప్పటివరకు అమలులో ఉన్న పూర్వ ఉదాహరణ-ప్రిసీడెంట్-ఇది. అంతకు ముందు 2005 మార్చిలో ఝార్ఖండ్‌లో సంయుక్త బలపరీక్ష-కాంపోజిట్ ఫ్లోర్ టెస్టింగ్-జరపాలని కూడ సుప్రీంకోర్టు ఆదేశించడం రాజ్యాంగ నిబంధనలకు మరో స్పష్టీకరణ! కర్నాటక శాసనసభ్యుల అనర్హత వ్యవహారాన్ని సైతం గతంలో కర్నాటక హైకోర్టు విచారించింది! తీర్పు చెప్పింది...
రాజ్యాంగంలోని మూడు విభాగాలు ఒకరి అంతర్గత వ్యవహారాలలో రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా మాత్రమే జోక్యం చేసుకోరాదన్నది ప్రజాస్వామ్య స్ఫూర్తి! రాజ్యాంగ నిబంధనలు అనుమతించిన మేరకు మూడు విభాగాలు పరస్పరం నియంత్రించుకోవచ్చునన్నది నిరోధం, సమతుల్యం-చెక్స్ అండ్ బాలెనె్సస్ ప్రజాస్వామ్య వౌలిక సూత్రం! ఇందుకు అనుగుణంగా 102వ రాజ్యాంగ అధికరణాన్ని పార్లమెంటు సవరించవచ్చు! అలాగే 190వ అధికరణాన్ని సవరించవచ్చు! న్యాయస్థానాల ప్రమేయాన్ని నిరోధించవచ్చు! కానీ అలా న్యాయస్థానాల ప్రమేయాన్ని నిరోధించడం వల్ల రాజకీయ అక్రమాలకు దీర్ఘకాలంలో అవకాశం ఏర్పడుతుంది! మెజారిటీ పార్టీవారు మొత్తం మైనారిటీ పార్టీల సభ్యులను సభలనుండి బహిష్కరించినట్టయితే అన్యాయాన్ని అడ్డుకునేది ఎవరు? న్యాయాన్యాలను నిర్ధారించేది ఎవరు?