నిజామాబాద్

పిల్లలందరినీ బడుల్లో చేర్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 28: చదువుకునే వయస్సు కలిగి ఉన్న చిన్నారులను గుర్తిస్తూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విద్యాబుద్ధులు నేర్చుకునేలా వారిని బడుల్లో చేర్పించాలని కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. బాల కార్మిక వ్యవస్థ, పెండింగ్ ఆడిట్ పేరాలు, పెన్షన్ల పంపిణీ, ఉపాధి హామీ పనులు, ఓడిఎఫ్ తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బడి ఈడు బాలలందరినీ పాఠశాలల్లో చేర్పించి, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో 5682మంది బాలలు బడి బయట ఉన్నట్టు గుర్తించడం జరిగిందని, వారిని వివిధ పాఠశాలల్లో చేర్పించాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. వీరే కాకుండా ఇంకా ఎవరైనా 6 నుండి 14సంవత్సరాల లోపు వయస్సు గల బాలలు బడి బయట ఉంటే అలాంటి వారందరిని తప్పనిసరిగా బడుల్లో చేర్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణం పనులు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, చెరకు తోటలు, ఇతర వ్యాపార సముదాయాల్లో పని చేసే బాలలను గుర్తించి వారికి విద్యాబుద్ధులు నేర్పించేందుకు చొరవ చూపాలన్నారు. ఎవరైనా పనులను వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే, అలాంటి కుటుంబాలకు చెందిన పిల్లలను వసతి గృహాల్లో చేర్పించాలన్నారు. తల్లిదండ్రులు లేని అనాథలను, ఎయిడ్స్ బాధితుల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక తరగతుల ద్వారా వారికి నాణ్యమైన విద్య అందేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. పద్నాలుగేళ్ల లోపు బాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ పనుల్లో ఉండకుండా బడుల్లో చేర్పించాలని, బాలలను చదివించేందుకు ఆసక్తి చూపని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. బాలలను బడుల్లో చేర్పించడంతోనే సరిపెట్టుకోకుండా డ్రాప్‌అవుట్స్‌ను పూర్తిస్థాయిలో నివారించేందుకు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, డిసెంబర్ 5వ తేదీలోగా బాలలను బడుల్లో చేర్పించేందుకు చేపట్టనున్న కార్యక్రమాల వివరాలతో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా, జిల్లాలోని అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించినందున డిసెంబర్ నెలాఖరు నాటికి కనీసం లక్షన్నర మంది కూలీలకు పనులు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి కూలీకి 150రూపాయలకు తక్కువ కాకుండా కూలీ వేతనం అందేలా చూడాలన్నారు. గాంధారి, జుక్కల్, నందిపేట్, పిట్లం, లింగంపేట తదితర మండలాల్లో వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని, వెంటది వెంట పే ఆర్డర్ జనరేట్ అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమ్‌గల్, బీర్కూర్, జుక్కల్, నందిపేట, నవీపేట, రెంజల్ తదితర మండలాల్లో ఉపాధి పనుల్లో వేగం పెంచాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం కనబర్చే టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే విధుల నుండి తొలగించాలన్నారు. ఉపాధి హామీ సిబ్బంది తప్పనిసరిగా కార్యస్థానాల్లో ఉండేలా చూడాలని, ప్రతి మండలంలో 10వేలకు తగ్గకుండా కూలీలకు పని కల్పించాలన్నారు. వికలాంగులు 25శాతం పనులు చేస్తే వారికి వంద శాతం కూలీ చెల్లించేందుకు ఉపాధి హామీ చట్టంలో వెసులుబాటు ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో యుద్ధప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పక్కా కార్యాచరణతో ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషించి అవలంభించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు జె.సి రాజారాం, డిఆర్‌ఓ మోహన్‌లాల్, ఎన్‌సిఎల్‌పి పి.డి సుధాకర్, డిసిఓ శ్రీహరి, ఐకెపి పిడి వెంకటేశం, డ్వామా పిడి వెంకటేశ్వర్లు, జిల్లా ఆడిట్ అధికారి రాము పాల్గొన్నారు.