నిజామాబాద్

దిగుబడులకు దీటుగా పెరిగిన సేంద్రియ ఎరువుల ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, జనవరి 13: అధిక దిగుబడులే లక్ష్యంగా రైతులు చేస్తున్న ప్రయత్నాలు వారి ఖర్చులను రెట్టింపు చేస్తున్నాయి. ప్రతియేటా సేంద్రియ ఎరువుల దిగుబడులు పెరగడం దీనికి అద్దంపడుతోంది. దశాబ్దకాలం క్రితం కేవలం గ్రామాల్లో పోగు చేసిన సేంద్రీయ ఎరువులను రైతులు వినియోగించేవారు. ఆ సమయంలో ప్రారంభమైన సేంద్రియ ఎరువుల దిగుబడి, ప్రస్తుతం ఊపందుకుంది. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 8మండలాల్లో కోట్లాది రూపాయల సేంద్రియ ఎరువుల వ్యాపారం సాగుతోంది. ప్రధానంగా ఈ ప్రాంత రైతులు పసుపు పంటపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. భూసారం బలంగా ఉంటేనే పసుపు పంటలో అధిక దిగుబడులు వస్తాయన్నది రైతుల ఆలోచన. దీని కోసం రైతులు చెరువుల్లోని పూడిక మట్టిని కూడా భారీగానే పంట పొలాల్లో వేయించుకుంటారు. ఒక్కో రైతు ఐదారు ఎకరాల విస్తీర్ణంలో పసుపు పంటను పండిస్తాడు. గరిష్టంగా 15ఎకరాల విస్తీర్ణంలో కూడా పసుపును సాగు చేసే రైతులు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. ప్రతియేటా పంట మార్పిడి విధానాన్ని అమలు చేస్తూ పసుపు పండిస్తున్న రైతులు, దీనికి అనుగుణంగా భూసారం పెంపుదలపై దృష్టి సారించారు. పశువుల పేడ, మేకలు, గొర్రెలు, కోళ్ల విసర్జక పదార్థాలు సేంద్రియ ఎరువులుగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు వాటి దిగుబడులపై దృష్టి కేంద్రీకరించారు. మహారాష్ట్ర, వరంగల్, ఖమ్మం, విజయవాడ తదితర ప్రాంతాల నుండి ఎక్కువగా సేంద్రియ ఎరువులు ఈ ప్రాంతానికి దిగుమతి అవుతోంది. ఒక సమయంలో రైతులే ఆయా ప్రాంతాలకు వెళ్లి, ఎరువులను కొనుగోలు చేసి లారీల్లో తెచ్చుకునేవారు. రైతుల ఆసక్తిని గమనించిన వ్యాపారులు ప్రస్తుతం లారీలను తీసుకవచ్చి గ్రామాల్లోనే అమ్మకాలు చేపడుతున్నారు. రమారమీగా ప్రతిరోజు ఒక్కో గ్రామానికి 4నుండి 10లారీల సేంద్రియ ఎరువులు దిగుబడి అవుతోంది. అంటే 8మండలాల్లో దాదాపు 600లారీల సేంద్రీయ ఎరువులు వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అధిక విస్తీర్ణంలో భూమి ఉన్న రైతులు 15నుండి 20లోడ్‌ల సేంద్రియ ఎరువులను సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కనిపించే వ్యాపారం, ప్రస్తుతం రబీ నుండే కొనసాగుతోంది. రైతులు కూడా సేంద్రీయ ఎరువులను కొనుగోలు చేసి, పంట భూముల పక్కన రాసులుగా నిల్వ పెట్టుంటున్నారు. రైతుల అవకాశాన్ని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు, ఈసారి ధరలను భారీగా పెంచేశారు. పశువుల పేడ గతంలో 8వేల రూపాయలకు ఒక లోడ్ లభించగా, ప్రస్తుతం 12నుండి 15వేల రూపాయల వరకు పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రధానంగా మేకలు, గొర్రెల సేంద్రియ ఎరువుకు భారీ డిమాండ్ ఉంది. ఒక్కో లోడ్ ధర 18నుండి 20వేల రూపాయల వరకు పలుకుతోంది. ప్రస్తుతం లారీ డ్రైవర్లే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రైతుల చిరునామాలు తెలిసిపోవడంతో ఆయా ప్రాంతాల్లోని లారీ డ్రైవర్లే లోడ్‌ను నింపుకవచ్చి, గ్రామాల్లో సిద్ధంగా ఉంచుతున్నారు. ఉదయం 6గంటల కల్లా ఏ గ్రామంలో చూసినా రోడ్డు ప్రక్కన నిలిపి ఉంచిన సేంద్రీయ ఎరువుల లారీలే కనిపిస్తాయి. లారీ డ్రైవర్లకు, రైతులకు మధ్య వారధులుగా కొంతమంది ఏజెంట్లు కూడా సిద్ధమయ్యారు. సదరు ఏజెంట్లే సేంద్రీయ ఎరువుల లారీని నేరుగా రైతుల వద్దకే తీసుకెళ్లి అప్పగిస్తున్నారు. సమయానికి డబ్బులు అందుబాటులో లేకపోయినప్పటికీ, ఏజెంట్ల పూచీకత్తుపైనే నిర్వాహకులు ఎరువులను అప్పగించి వెళ్తున్నారు. డబ్బులు వసూలు చేయడం ఏజెంట్ల బాధ్యతే. దీనికి గాను ఏజెట్లకు 5శాతం వరకు డబ్బులను కమీషన్ రూపంలో అందజేస్తున్నట్లు తెలిసింది. సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ఎక్కువగా వినియోగించవద్దని వ్యవసాయ అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ, దాని ప్రభావం మాత్రం గ్రామాల్లో కనిపించడం లేదు. మోతాదుకు మించి సేంద్రీయ ఎరువులు వినియోగించిన భూముల్లో పసుపు పండిస్తే దుంపకుళ్లు, తెగుళ్లు సోకే అవకాశం ఉంటుందని అధికారులు ప్రస్తుతం నిర్వహిస్తున్న పసుపు రైతుల అవగాహన సదస్సుల్లో స్పష్టం చేస్తున్నారు.