నిజామాబాద్

‘మధ్యాహ్న భోజనం’లో అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 16: సర్కారీ బడుల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ, పాఠశాలల పట్ల వారిలో ఆసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో లెక్కకుమించిన అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతీనెల లక్షలాది రూపాయల నిధులు మధ్యాహ్న భోజనం నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఇదివరకు కూడా పలు ఆధారాలతో సహా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సమాచార హక్కు చట్టం కార్యకర్తలు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా, బాధ్యులపై నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది. అక్రమాలు జరిగినట్టు ఆధారాలతో సహా నిరూపితమైన సందర్భాల్లో అధికారులు బాధ్యుల నుండి నిధులను రికవరీ చేసేందుకు నోటీసులు జారీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో మధ్యాహ్న భోజన పథకం కాస్తా అక్రమార్కులకు అడ్డదారిలో ఆదాయం సంపాదించుకునేందుకు వరంలా నిలుస్తోంది. ప్రభుత్వం గత కొన్నాళ్ల నుండి హైస్కూల్ స్థాయి విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తుండడం, సన్నబియ్యం కేటాయిస్తుండడంతో అక్రమాలు మరింత తారాస్థాయికి చేరాయి. ఎక్కడైనా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తే తప్ప, సంబంధిత శాఖ అధికారులు ఈ పథకం అమలు తీరుపై పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మారుమూల, సుదూర ప్రాంతాల్లో ఈ పథకం అమలు తీరు ఏ స్థాయిలో ఉందన్నది పక్కనబెడితే ఉన్నతాధికారులు బస చేసే జిల్లా కేంద్రంలోనూ అక్రమాలు ఊహకందని స్థాయిలో కొనసాగుతున్నాయని తెలుస్తోంది. అధికారులు విచారణ జరిపిన ప్రతీసారి ఈ అవినీతి తతంగం బట్టబయలవుతున్నప్పటికీ, అక్రమార్కులు తమ పనితీరును ఏమాత్రం మార్చుకోకుండా విద్యార్థులకు ఉద్దేశించిన మధ్యాహ్న భోజనం నిధులను ఎంచక్కా భోంచేస్తుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. క్షేత్రస్థాయిలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలిసి, కొంతమంది విద్యాశాఖ అధికారులను మచ్చిక చేసుకుని తప్పుడు బిల్లులతో నెలనెలా లక్షలాది రూపాయలను గడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడ్డదారిలో ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలను దక్కించుకుని పాఠశాలల్లో ఈ పథకం అమలు విషయంలో ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థుల సంఖ్య స్వల్ప మొత్తంలో ఉంటే, దానిని రెట్టింపు కంటే ఎక్కువగా రికార్డుల్లో చూపిస్తూ బిల్లులు దిగమింగుతున్నారు. గల్లీ స్థాయి లీడర్లు మొదలుకుని పలువురు చోటామోటా నాయకులు తమ సమీప బంధువుల పేర్లతో ఏజెన్సీల నిర్వహణను దక్కించుకుని నిధులను పక్కదారి పట్టిస్తున్న వైనంపై అధికారులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తుండడం సర్వత్రా అనుమానాలు కలిగిస్తోంది. చివరకు ఉర్దూ స్కూళ్లలోనూ అక్రమార్కులు పాగా వేసి అందిన మేరకు దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలే కాకుండా మదర్సాలలోనూ పలువురు అక్రమార్కులకే మధ్యాహ్న భోజనం నిర్వహణ బాధ్యతలు కట్టబెట్టడం చర్చనీయాంశమవుతోంది. నిజామాబాద్ అర్బన్‌లో దాదాపు 30వరకు మదర్సాలు ఉండగా, ప్రతిరోజు 14వేల మందికి పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నట్టు రికార్డుల్లో పేర్కొంటున్నారు. వాస్తవానికి అనేక మదర్సాలలో ప్రభుత్వం ద్వారా సమకూరుస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నిరాకరిస్తూ, విరాళాల రూపేణా వచ్చే ఆదాయంతోనే బాలబాలికలకు భోజన వసతి సమకూరుస్తున్నాయి. అయినప్పటికీ మదర్సాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను పూర్తిస్థాయిలో పొందుపరుస్తూ, వారంతా మధ్యాహ్న భోజనం చేస్తున్నారని పేర్కొంటూ ప్రతీనెల వేలాది రూపాయల బిల్లులను దిగమింగుతున్నారు. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో ముడుపులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఆయా పాఠశాలకు చెందిన అన్ని తరగతుల్లోనూ విద్యార్థులు సగానికి పైగా మధ్యాహ్న భోజనం చేయనప్పటికీ, అటెండెన్స్‌ను అనుసరిస్తూ పూర్తిస్థాయిలో విద్యార్థులు భోజనం చేస్తున్నట్టుగా నిర్వాహకులు రికార్డుల్లో పేర్కొంటున్నారు. అతికొద్ది మందికి అరకొర స్థాయిలో సమకూరుస్తున్న మధ్యాహ్న భోజనాన్ని సైతం సక్రమంగా అందించకుండా అందులోనూ నిర్వహకులు కక్కుర్తి పడుతున్నారు. నీళ్ల లాంటి చారు, ఉడికీ ఉడకని అన్నం, కుళ్లిపోయిన కూరగాయలతో వండిన ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు. దీంతో అనేక సందర్భాల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఉదంతాలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికే రప్పిస్తున్నారు. దీనిని అవకాశంగా మల్చుకుని అటెండెన్స్‌లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అంతే మొత్తంలో మధ్యాహ్న భోజనం ఆరగించారంటూ నిర్వహకులు బిల్లులు దిగమింగుతున్నారు. ఈ తతంగం గురించి తెలిసినప్పటికీ సంబంధిత అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించాలి
కలెక్టర్ సత్యనారాయణ

కామారెడ్డి, జనవరి 16: ప్రజా సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంతో పాటు అధికారుల మీద నమ్మకంతోనే ప్రజలు పెద్ద ఎత్తున ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి రావడమే నిదర్శనమన్నారు. చిన్నపాటి పిర్యాదులపై విచారణ జరిపి తక్షణమే పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు వచ్చాయి. దీంట్లో భూ వివాదాలు, ఉద్యోగ అవకాశాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, జీవనభృతి, తదితర సమస్యలపై పిర్యాదు వచ్చాయి. నగదురహిత లావాదేవీలు అన్ని శాఖల్లో జరిగే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. విధుల పట్ల అలసత్వం వహించే అధికారులు చర్యలు తప్పవన్నారు. ప్రజావాణికి వచ్చే అధికారులు ఖాదీ వస్త్రాలు ధరించి రావాలని సూచించారు. అన్ని సంస్థల్లో ఆర్టీజిఎస్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, ఇతర సాంకేతిక విధానాలను ఏర్పాటు చేసుకోని నగదురహిత లావాదేవీలను నిర్వహించాలన్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా సిబ్బంది చొరవ చూపాలన్నారు. సోమవారం ప్రజావాణిలో అనిత అనే మహిళ ఆవేశపూరితంగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుందని, ఇలాంటి పద్దతులు మానుకోవాలని సూచించారు. ఎవరికైన అన్యాయం జరిగితే సంబంధిత శాఖ అధికారులు ఫిర్యాదు చేయాలన్నారు. అప్పటికి న్యాయం జరగపోతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. చిన్నపాటి విషయాలకు ప్రజలకు ఆందోళనకు గురి కావద్దని తెలిపారు. ఈ సమావేశంలో పిడి చంద్రమోహన్‌రెడ్డి, డిఆర్‌ఓ మణిమాల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.