నిజామాబాద్

కలకలం రేపిన మున్సిపల్ ఇంజనీర్ ఆత్మహత్య ఉదంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 21: లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడిన నిజామాబాద్ నగర పాలక సంస్థ మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది. ఎసిబి అధికారులకు ఉదయం వేళలో పట్టుబడిన సదరు ఎం.ఇ, సాయంత్రం సమయంలో వారి కస్టడీలో ఉన్న సమయంలోనే తాను నివాసం ఉంటున్న కంఠేశ్వర్ ప్రాంతంలోని సత్యం అపార్ట్‌మెంట్‌లో ఐదంతస్తుల భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం ఎసిబి వర్గాలను సైతం విస్తూపోయేలా చేసింది. ఇదివరకు ఎంతోమంది అధికారులు ముడుపులు స్వీకరిస్తూ పట్టుబడినప్పటికీ, ఈ తరహా సంఘటన తొలిసారిగా చోటుచేసుకోవడం అవినీతి నిరోధక శాఖ అధికారులను కూడా ఉలికిపాటుకు గురి చేసిందనే చెప్పాలి. కస్టడీలో ఉన్న సమయంలో ఎం.ఇ బలవన్మరణానికి పాల్పడడంతో, ఈ సంఘటనకు ఎసిబి అధికారులను బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఉద్యోగులు మూకుమ్మడిగా జిల్లా ఆసుపత్రి వద్ద ఆందోళనకు బైఠాయించడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. వాస్తవంగానే లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఎం.ఇ వెంకటేశ్వర్లును అప్పటికప్పుడే ఎసిబి డిఎస్పీ నరేందర్‌రెడ్డి నేతృత్వంలో సిబ్బంది తమ కస్టడీలోకి తీసుకున్నారు. అతనిని వెంటబెట్టుకుని మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం మూడు గంటల సమయం వరకు దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలన జరిపి వాటిని సీజ్ చేశారు. అనంతరం తదుపరి విచారణ కోసం ఎం.ఇని అతను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వద్దకు తీసుకెళ్లగా, ఆ సమయంలో ఎసిబి డిఎస్పీ నరేందర్‌రెడ్డి వెంట వెళ్లకుండా ఇద్దరు కిందిస్థాయి సిబ్బందిని మాత్రమే పంపించినట్టు తెలిసింది. కస్టడీలోకి తీసుకున్న ఓ మున్సిపల్ ఇంజనీర్ స్థాయి అధికారిని కిందిస్థాయి సిబ్బందికి అప్పగించి ఎసిబి డిఎస్పీ తన ఇంటికి వెళ్లిపోవడాన్ని మున్సిపల్ ఉద్యోగులు తప్పుబడుతున్నారు. అన్నింటికి మించి ఆత్మహత్య చేసుకున్న ఎం.ఇ వెంకటేశ్వర్లు ఇతర అధికారులతో పోలిస్తే ఎంతో సౌమ్యుడని, విధుల పట్ల నిక్కచ్చిగా వ్యవహరించే వారని, అతని వైఖరిని జీర్ణించుకోలేకనే కొందరు కాంట్రాక్టర్లు కక్షగట్టి కుట్రపూరితంగానే అతను ఎసిబికి చిక్కేలా వ్యూహం రచించారని ఆరోపిస్తున్నారు. పనులు సకాలంలో, నాణ్యతతో పూర్తి చేయాలంటూ ఎం.ఇ వెంకటేశ్వర్లు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చేవారని, పనులు సక్రమంగా చేయని వారికి బిల్లుల చెల్లింపులను నిలిపివేయించి వారని, అందుకే అతనిని అడ్డు తొలగించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎసిబి అధికారులచే దాడి చేయించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, మృతుడు వెంకటేశ్వర్లు ఇదివరకు ప్రజారోగ్య శాఖలో నిజామాబాద్ జిల్లాలోనే ఎ.ఇ, డి.ఇగా విధులు నిర్వర్తించారు. అనంతరం పదోన్నతిపై వనస్థలిపురం, నల్గొండ మున్సిపాలిటీల్లో ఎం.ఇగా కొనసాగారు. నిజామాబాద్‌లో ఎం.ఇ పోస్టు ఖాళీగా ఉండడంతో ఏరికోరి మరీ గత ఏడాదిన్నర కాలం క్రితం ఇక్కడ పోస్టింగ్ వేయించుకున్నారు. అప్పటి నుండి ఎం.ఇ వెంకటేశ్వర్లు ఒంటరిగానే కంఠేశ్వర్‌లోని సత్యం అపార్ట్‌మెంట్‌లో ఐదవ అంతస్తులోని 502 ఫ్లాట్‌లో అద్దెకు నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబీకులు వనస్థలిపురంలో నివసిస్తుండగా, సెలువుల్లో వారి వద్దకు వెళ్లి వచ్చేవారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహం ఇటీవలి కాలంలోనే జరుగగా, కుమారుడు హైదరాబాద్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. మరో రెండేళ్ల సర్వీసు ఉండగా, రిటైర్మెంట్‌కు చేరువైన సమయంలో ఎసిబి అధికారులకు పట్టుబడడంతో తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడడం బాధిత కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింది. రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో మృతుడి భార్య, పిల్లలు, ఇతర బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని బోరున విలపించారు. తన భర్త ఎలాంటి అవినీతికి పాల్పడేవాడు కాదని, అతని మృతికి కారణమైన ఎసిబి డిఎస్పీ, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య డిమాండ్ చేసింది. కాగా, ఈ సంఘటనపై అధికార వర్గాలు ఎలా స్పందిస్తాయనే విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కస్టడీలో తీసుకున్న అనంతరం ఎం.ఇ వెంకటేశ్వర్లు మృతి చెందినందున ఎసిబి డిఎస్పీ నరేందర్‌రెడ్డిని కూడా బాధ్యుడిగా పరిగణిస్తారా? లేక అతని వెంట వెళ్లిన ఇద్దరు కిందిస్థాయి సిబ్బందిపైనే శాఖాపరమైన చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటారా? అన్నది మునుముందు తేలనుంది.

ప్రజల సౌకర్యార్థం ఇసుక అమ్మకాలు
వ్యవసాయశాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి, జనవరి 21: కామారెడ్డి ప్రాంత ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం తరపున ఇసుక విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నర్సన్నపల్లి గ్రామ చౌరస్తాలో టిఎస్‌ఎండిసి ద్వారా ఏర్పాటు చేసిన ఇసుక విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇసుక విక్రయంలో కొనుగోలు దారులతో సామరస్యంగా వ్యహరించాలన్నారు. టన్నుకు 600 రూపాయల చొప్పున విక్రయించడం జరుగుతుందన్నారు. ఆన్‌లైన్ ద్వారానే వ్యాపారం కొనసాగుతుందన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఇసుక కేంద్రాన్ని రెండు జిల్లాల్లో కామారెడ్డిలోనే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో వ్యవసాయశాఖ ద్వారా మంజూరైన ఆరు ట్రాక్టర్లు, ఒక హర్వేస్టర్‌ను సబ్సిడీపై లబ్ధిదారులకు అందించారు. మొత్తం 70 లక్షల 77వేల రూపాయల విలువ గల ఆరు ట్రాక్టర్లను 50శాతం సబ్సిడీ రూపంలో 38 లక్షల 32 వేల రూపాయలకు అందించడం జరిగిందన్నారు. లింగుపల్లికి చెందిన భాగ్యలక్ష్మీ, వడ్లం గ్రామానికి చెందిన భీంరావు, ర్యాగట్లపల్లికి చెందిన మదుసుధన్‌రెడ్డి, కాచాపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి, రాజంపేటకు చెందిన రామక్రిష్ణరెడ్డి, దుర్కికి చెందిన నర్సాగౌడ్‌లకు ట్రాక్టర్లను అందించారు. బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర రైతు సంఘానికి 95 శాతం సబ్సిడీపై ఎస్సీ కాంపొనెంట్ కింద ట్రాక్టర్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, కలెక్టర్ సత్యనారాయణ, జెసి సత్తయ్య, ఆర్‌డిఓ నగేశ్, మున్సిపల్ చైర్మన్ సుష్మ, ఎంపిపి మంగమ్మ, జడ్పీటిసి సభ్యులు నంద రమేశ్, మదుసుధన్‌రావు, టిఆర్‌ఎస్ నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, గైని శ్రీనివాస్‌గౌడ్, బల్వంత్‌రావు, లక్ష్మీనారాయణ, అధికారులు రాజశేఖర్‌రెడ్డి, రవి, తదితరులు పాల్గొన్నారు.