నిజామాబాద్

బోధన్ - బీదర్ రైల్వే లైన్‌కు పచ్చజెండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 30: ప్రతి ఏటా రైల్వే శాఖకు సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వచ్చేది కాగా, ఈసారి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే మంత్రిత్వ శాఖ అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రస్తావించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడంతో ఇతర అంశాలను పక్కనబెడితే, ఎప్పటిలాగే రైల్వే మంత్రిత్వ శాఖ నుండి ఎలాంటి వరాలు సమకూరుతాయోననే దానిపైనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజానీకం దృష్టి కేంద్రీకృతమై ఉంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన తరువాతనే కొత్త ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిన నేపథ్యంలో, ఉమ్మడి జిల్లాల్లోని ప్రతిపాదిత రైల్వే మార్గాలకు మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాల వారు కూడా గట్టి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారు ఆశిస్తున్నట్టుగానే పెండింగ్ ప్రాజెక్టులకు ఈసారి బడ్జెట్‌లో మంజూరులు తెలిపితే ఉత్తర తెలంగాణ జిల్లాలలో కీలకంగా ఉన్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు నలువైపులా అన్ని ప్రాంతాలతో అనుసంధానించబడతాయని చెప్పవచ్చు. గత ఏడాది కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెద్దగా వరాలేవీ కురిపించినప్పటికీ, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉండిపోతూ వచ్చిన పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే మార్గాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి ఒకింత ఎక్కువగానే ప్రాధాన్యతను ఇచ్చారు. గత బడ్జెట్‌లో 142కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు. ఈ నిధులతో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేసేందుకు రైల్వే శాఖ వర్గాలు కూడా ఎంతో చొరవ కనబరుస్తున్నాయి. ఫలితంగా ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ వరకు రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తవగా, గత నెల రోజుల నుండి జగిత్యాల - మోర్తాడ్‌ల మధ్యన రైలు పరుగులు పెడుతోంది. మిగతా ఆర్మూర్ నుండి నిజామాబాద్ వరకు కూడా పనులను శరవేగంగా చేపట్టి ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి పెద్దపల్లి - నిజామాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకల కలను పూర్తిస్థాయిలో సాకారం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అక్కడక్కడా పనులకు అడ్డంకిగా నిలుస్తున్న కోర్టు వ్యాజ్యాలు, సాంకేతిక అంశాలు, ఇతరత్రా అవరోధాలను త్వరితగతిన చక్కబెట్టుకుని పెద్దపల్లి - కరీంనగర్ - నిజామాబాద్ మార్గంలో సాధ్యమైనంత త్వరగా రైళ్ల రాకపోకలను ప్రారంభించేందుకు రైల్వే అధికారులు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలాఉండగా, ఇటీవలే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు రైల్వే మంత్రి సురేష్‌ప్రభుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించి ఆర్మూర్ నుండి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్ నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదిత అంశం నిజాం కాలం నుంచీ ప్రభుత్వాల వద్ద పెండింగ్‌లో ఉందని, దీనిని చేపట్టినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటాగా సగ భాగం సహకారాన్ని అందజేసేందుకు సిద్ధంగా ఉందని తెలియజేశారు. అయితే ఈ ప్రతిపాదనకు రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందిస్తుందా? అన్నది ప్రశ్నార్ధకంగానే మారింది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైన నేపథ్యంలో ఆర్మూర్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ గురించి బడ్జెట్‌లో ప్రస్తావించే అవకాశాలు అంతంతమాత్రమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బిబి.పాటిల్ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ, బోధన్ - బాన్సువాడ - బీదర్ రైలు మార్గం పనులకు సంబంధించి నిధుల కేటాయింపునకు రైల్వే మంత్రిత్వ శాఖ సుముఖంగా ఉందని, ఈ అంశం గురించి ప్రస్తుత బడ్జెట్‌లోనే ప్రస్తావించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి లిఖితపూర్వకంగా ఇప్పటికే తనకు స్పష్టమైన సమాచారం అందిందని వెల్లడించారు. ఎంపి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే బోధన్ - బీదర్ రైల్వే లైన్‌కు ప్రస్తుత బడ్జెట్‌లోనే మోక్షం కల్పించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జహీరాబాద్ నుండి బీదర్ వరకు రైలు మార్గం ఉండగా, ప్రస్తుతం బోధన్ నుండి జహీరాబాద్ వరకు కొత్తగా రైల్వే ట్రాక్ నిర్మాణం చేపడితే ఈ మార్గంలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుంది. దీంతో బోధన్ నుండి బీర్కూర్, ఎల్లారెడ్డి, నారాయణ్‌ఖేడ్‌ల మీదుగా జహీరాబాద్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నిజానికి ఈ మార్గంలో రైల్వేలైన్ కోసం 2014లోనే సర్వే ప్రక్రియ పూర్తయ్యి ప్రాజెక్టు రిపోర్టును కూడా సిద్ధం చేశారు. కానీ గడిచిన మూడేళ్ల నుండి నిధుల కేటాయింపులు లేకపోవడంతో బోధన్ - బీదర్ రైల్వే లైన్ ప్రతిపాదనలు సర్వేకే పరిమితం అయ్యాయి. ప్రస్తుత బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశాలుండడంతో ఎట్టకేలకు ఈ పనులకు శ్రీకారం చుట్టనున్నారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దేశం గర్వించదగ్గ వ్యక్తి
మహాత్మాగాంధీ
కంఠేశ్వర్, జనవరి 30: స్వర్గీయ జాతిపిత మహాత్మాగాంధీ దేశం గర్వించదగ్గ వ్యక్తి అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో గాంధీజీ వర్ధంతి వేడుకులను నిర్వహించగా, తాహెర్‌తో పాటు ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ, భారతదేశంలో బ్రిటీష్ పాలకులు వ్యాపారం పేరిట వచ్చి, దేశానే్న ఆక్రమించిన విషయం అందరికి తెలిసిందేనని అన్నారు. దాంతో భారతీయులపై ఆంగ్లేయుల ఆగడాలను సహించలేని గాంధీజీ, దక్షిణాఫ్రికాలో తన ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేసి స్వదేశానికి తిరిగి రావడం జరిగిందన్నారు. అనేక ఉద్యమాలు చేపట్టినా, అహింసా అనే సిద్ధాంతంతో బ్రిటీష్ పాలకులను దేశం నుండి తరిమికొట్టడం జరిగిందన్నారు. ఉద్యమ సమయంలో బ్రిటీష్ వారి వస్తువులను బహిష్కరించడంతో పాటు ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించి దేశ స్వాతంత్రోధ్యమానికి పూనాని వేయడం జరిగిందన్నారు. అతివాదంతో స్వాతంత్య్ర సిద్ధించదని భావించిన గాంధీజీ, శాంతియుత పద్దతిలో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకరావడం జరిగిందన్నారు. గాంధీజీ బాటలోనే అప్పటి ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పయనిస్తున్నారని తాహెర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తం చేసిన, పార్టీకి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానీయుల ఆశయాల సాధనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ, మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణం ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. అనంతరం నగరంలోని గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు, మీసాల సుధాకర్, నాగరాజ్, విఫుల్‌గౌడ్, బంటు బాల్‌రాజ్, బంటు రాం తదితరులు పాల్గొన్నారు.