నిజామాబాద్

కాళేశ్వరంతో గుంతగుంతకు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగంపేట్, ఫిబ్రవరి 2: తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గాను ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎల్లారెడ్డి ప్రాంతంలో గుంతగుంతకు నీరు అందిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మెంగారం గ్రామంలో టి.రాజయ్య కుమార్తె లక్ష్మీ-రాజుకుమార్ వివాహనికి ఎమ్మెల్యే దంపతులు హాజరై నూతన దంపతులను ఆశీర్వాదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాళేశ్వరం నీటితో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి నియోజక వర్గాన్ని మోతె సమీపంలో 4 టిఎంసిలు, గుర్జల్ సమీపంలో రెండున్నర టిఎంసిలు, అమర్లబండ సమీపంలో 44 టిఎంసిలు, కాటెవాడి వద్ద 5 టిఎంసిల సామర్థ్యంతో నీటి నిల్వ గ్యారెజ్‌ను నిర్మిస్తామని తెలిపారు. లింగంపేట్ మండలంలోని శట్పల్లి అటవీ ప్రాంతంలో గల ఆగా చెరువులోకి నీటిని మళ్లించి ఆ చెరువు నుండి శట్పల్లి సంగారెడ్డి పరిధిలో గల 4చెరువులు, పర్మళ్ల పరిధిలోని చెరువులకు నీటిని అందిస్తామన్నారు. రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మంజులరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లమయ్య, మైనార్టీ నాయకులు మోహిద్, అఫ్రోజ్, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముదాం సాయిలు, టిఆర్‌ఎస్ సినియర్ నాయకులు వెంకటేశం, దేవేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సాయిలు, రాజశేఖర్‌రెడ్డి, బాబు పాల్గొన్నారు.

చెరువులో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
నిత్యకృత్యంగా మారుతున్న ‘జల సమాధి’ ఘటనలు

నిజామాబాద్, ఫిబ్రవరి 2: చిన్నారుల నిండు ప్రాణాలను చెరువులు బలిగొంటున్నాయి. మిషన్ కాకతీయ పుణ్యమా అని చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టిన మాటేమో కానీ, క్రమపద్ధతిన ఈ పనులు కొనసాగకపోవడంతో చెరువులు పిల్లల నిండు ప్రాణాలను కబళిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు ఘటనలు చోటుచేసుకుని నలుగురు మృత్యువాతపడ్డారు. వారం క్రితమే కామారెడ్డి పెద్ద చెరువులో నీట మునిగి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. దీనికి పక్షం రోజుల ముందు మాధవనగర్‌లోనూ తరుణ్ అనే బాలుడు నీటి మునిగి చనిపోయాడు. తాజాగా, నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పోతంగల్ చెరువులో మరో ఇద్దరు విద్యార్థులు జల సమాధి అయ్యారు. జల్లాపల్లి గ్రామానికి చెందిన సాయికుమార్(11), అఫ్సర్(10) అనే విద్యార్థులు ఈత కోసం చెరువులో దిగి పూడికతీత కోసం లోతుగా తవ్విన గుంతలో కూరుకుపోయి ఊపిరాడక మృతి చెందారు. వసంత పంచమిని పురస్కరించుకుని ప్రతిఏటా పోతంగల్ గ్రామంలోని సాయిబాబా ఆలయంలో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పెద్దఎత్తున జాతర ఏర్పాటవుతుంది. దీంతో జాతరను తిలకించేందుకు స్నేహితులైన సాయికుమార్, అఫ్సర్‌లు బుధవారం జల్లాపల్లి నుండి పోతంగల్‌కు వచ్చారు. జాతరను చూసిన అనంతరం తిరుగు ప్రయాణం అవుతూ పోతంగల్ చెరువు వద్దకు చేరుకోగానే, సరదాగా ఈత కొట్టాలనే కోరిక వారికి కలిగింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఇరువురూ తమ దుస్తులను విప్పి గట్టుపై ఉంచి చెరువులోకి దిగారు. ఈ క్రమంలోనే లోతైన గుంతలో కూరుకుపోయి ఊపిరాడక నీట మునిగి మృతి చెందారు. సాయికుమార్, అఫ్సర్‌లు చీకటి పడే వరకు కూడా తమతమ ఇళ్లకు చేరుకోకపోవడంతో కుటుంబీకులు ఒకింత ఆందోళనకు గురై వారి కోసం గాలింపులు మొదలుపెట్టారు. బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి వాకబు చేసినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం పోతంగల్ చెరువు గట్టు పైన వారి దుస్తులు కనిపించడంతో స్థానికులు మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆఘమేఘాల మీద వారు అక్కడికి చేరుకోగా, పోలీసులు జాలర్ల సహాయంతో చెరువులో గాలింపులు జరిపించగా, సాయికుమార్, అఫ్సర్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి.
నిండు ప్రాణాలను బలిగొంటున్న గుంతలు
ఇష్టానుసారంగా చెరువుల్లో పూడిక మట్టి తొలగిస్తుండటంతో వాటి స్వరూపమే మారిపోతోంది. మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరణ పనులు చేపట్టిన ఏ చెరువు చూసినా గుంతలమయంగా కనిపిస్తున్నాయి. పూడిక మట్టి తొలగింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెరువుల్లో ఏటవాలుగా పూడికమట్టిని తీయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా పొక్లెయినర్ల సహాయంతో ఎక్కడ పడితే అక్కడ గుంతలు తీస్తూ మట్టిని తరలిస్తున్నారు. దీంతో చెరువు లోతు ప్రాంగణమంతా గుంతలమయంగా మారిపోతోంది. నాణ్యమైన మట్టి ఉన్నంత వరకు లోతు తీస్తూ పని ముగిసిన వెంటనే ఇతర ప్రాంతాల్లో గుంతలు తీస్తున్నారు. ఈ పరిణామం కాస్త అభంశుభం ఎరుగని చిన్నారుల నిండు ప్రాణాలను కబళిస్తోంది.

ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటిమట్టం
వరద కాల్వకు నీటి విడుదలకు పెరుగుతున్న ఒత్తిడి

నిజామాబాద్, ఫిబ్రవరి 2: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లో నీటిమట్టం శరవేగంగా పడిపోతుండడం ఒకింత ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో రబీ సీజన్‌లో పంటల సాగుకు ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ, రానున్న ఖరీఫ్‌లో మాత్రం ఎస్సారెస్పీ ద్వారా ఆయకట్టుకు సాగునీరందడం అనుమానమేనని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ సకాలంలో వర్షాలు కురిసినా, జూన్ నెలాఖరు దాటిన తరువాత జూలై మాసంలోనే శ్రీరాంసాగర్‌లోకి గోదావరి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి చేరుతుంది. ఆలోపు ఖరీఫ్ పంటలు విత్తేందుకు అవసరమైన సాగునీటిని అందించేందుకు సరిపడా నీటి నిల్వలు ఎస్సారెస్పీలో మిగిలి ఉంటాయని ఆశాభావం వ్యక్తమైనప్పటికీ, ప్రస్తుతం వేగంగా పడిపోతున్న నీటిమట్టం ఆ ఆశలను ఆవిరి చేస్తోంది. 1091.00 అడుగులు, 90టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో, గురువారం నాటికి 1081.00 అడుగులు, 55 టిఎంసిల వరకే నీరు నిల్వ ఉంది. రబీ పంటల సాగు కోసం ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన ఏప్రిల్ 17వ తేదీ వరకు నీటిని విడుదల చేసేలా ప్రణాళికలు రూపొందించారు. అంటే ఆ సమయం వరకు ఎస్సారెస్పీలో కేవలం 15 టిఎంసిల వరకే నీటి నిల్వలు మిగిలి ఉంటాయని అంచనా వేశారు. ఇవి దాదాపుగా తాగునీటి అవసరాల కోసమే అట్టిపెట్టేందుకు ఉపయోగపడనున్నాయి. నిల్వ ఉన్న నీటిలో ఐదు టిఎంసిలను డెడ్‌స్టోరేజీగా పరిగణిస్తారు కాబట్టి, అందుబాటులో ఉండే 10 టిఎంసిలను తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంటుందని స్పష్టమవుతోంది. వాస్తవానికి మూడేళ్ల విరామం తరువాత ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లోకి ఎగువ గోదావరి నుండి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఈసారి ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకుంది. అయితే అక్టోబర్ నెలాఖరున గోదావరి ఎగువన మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మూసివేయడంతో, అప్పటి నుండి చుక్క నీరు కూడా ఇన్‌ఫ్లో రూపంలో ఎస్సారెస్పీలోకి వచ్చి చేరడం లేదు. అదే సమయంలో రబీ పంటల సాగు కోసం రిజర్వాయర్ ప్రధాన కాల్వలతో పాటు వరద కాలువ ద్వారా విడతల వారీగా నీటిని విడుదల చేస్తుండడంతో ప్రాజెక్టులో నీటి మట్టం శరవేగంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా 6వేల క్యూసెక్కులు, సరస్వతి కెనాల్ ద్వారా 800 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా వంద క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నారు. అదేవిధంగా అలీసాగర్, అర్గుల్ రాజారాం(గుత్ప) ఎత్తిపోతల పథకాలకు 640 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. వీటికితోడు వేంపల్లి, జలాల్‌పూర్ వంటి లిఫ్టులకు కూడా ఎస్సారెస్పీ జలాలే ప్రధాన ఆధారంగా నిలుస్తున్నాయి. మరోవైపు దిగువ ప్రాంతాలకు చెందిన రైతుల ఒత్తిడి మేరకు తరుచూ వరద కాల్వకు కూడా నీటిని విడుదల చేయాల్సి వస్తోంది. కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యాం ఎగువ భాగాన ఉన్న పెద్దపల్లి, సుల్తానాబాద్, రామడుగు, గంగాధర్, మల్యాల, కథలాపూర్ తదితర ప్రాంతాల్లో వరద కాల్వకు ఆనుకుని ఇరువైపులా సుమారు లక్ష ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్న రైతులు పూర్తిగా వరద కాల్వనే నమ్ముకుని సేద్యం సాగిస్తున్నారు. అనేక మంది నేరుగా వరద కాల్వలోకి మోటారు పంపుసెట్లను బిగించుకుని పంటలకు నీటిని మళ్లించుకుంటుండగా, మరికొందరు రైతులు తమ బోరుబావుల్లో భూగర్భ జలాలు రీచార్జ్ అయ్యేందుకు వరద కాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవలి కాలంలోనే పై ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు సైతం చేపట్టడంతో వారి డిమాండ్‌కు తలొగ్గి వరద కాల్వకు మూడు రోజుల క్రితం వరకు కూడా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం వరద కాల్వలో నిలిచిఉన్న నీటి నిల్వలు అయిపోయిన మీదట రైతుల నుండి మళ్లీ నీటిని విడుదల చేయాలనే డిమాండ్ తెరపైకి రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సారెస్పీ రిజర్వాయర్‌లో నీటిమట్టం శరవేగంగా తగ్గుముఖం పడుతోంది.

సుందర పట్టణంగా తీర్చిదిద్దుతాం
* ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి, ఫిబ్రవరి 2: కామారెడ్డి పట్టణాన్ని రాష్ట్రంలోనే అత్యంత సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు ప్రభుత్వంతో చేయి కలిపి ముందుకు సాగాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కామారెడ్డి పట్టణ సుందరీకరణలో భాగంగా ఇందిరనగర్ కాలనీలో గల ఇందూరు స్మశాన వాటికను ఆధునీకరించేందుకు వేసుకున్న ప్రాజెక్టు మహాప్రస్థానం నిర్మాణంపై పట్టణ ప్రముఖులు, వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని హంగులతో అత్యాధునికంగా ప్రస్తుతం 5లక్షల 32రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన స్మశాన వాటిక నిర్మాణానికి ప్రముఖులు, వ్యాపారవేత్తలు విరాళాలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. అనంతరం కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, స్మశాన వాటిక ఓ దేవాలయం లాగా ఉండే విధంగా డిజైన్ రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ ముజీబోద్దీన్, జెసి సత్తయ్య, మున్సిపల్ చైర్మన్ పిప్పిరి సుష్మ, రోటరీ, లయన్స్ క్లబ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

బినామీ పేరుతో కాంట్రాక్టర్లుగా ఉద్యోగులు?
కంఠేశ్వర్, ఫిబ్రవరి 2: తెలంగాణ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగులు పని చేస్తూ బినామీ పేర్లతో కాంట్రాక్టర్లుగా ఆర్‌ఎం కార్యాలయ ఉద్యోగులుగా చెలామణి అవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ఉద్యోగులు ఆర్‌ఎం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూనే, బినామీ కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతూ కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డుల పని చేస్తున్న వారి పొట్టకొడుతున్నట్లు తెలిసింది. కార్మిక చట్టం నిబంధనల మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా, చట్టానికి విరుద్ధంగా వేతనాలు చెల్లిస్తూ మధ్యవర్తి ఉద్యోగులు, కార్మికులను శ్రమ దోపిడికి చేస్తున్నారు. ఆర్టీసీ సంస్థలో సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన అసలు కాంట్రాక్టర్ ఇతర జిల్లాలో ఉండగా, బినామీ కాంట్రాక్టర్‌గా ఉద్యోగులే అవతారమెత్తడం కొసమెరుపు. కాంట్రాక్టర్, ఆర్‌ఎం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు కలిసి, అదే సంస్థలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన మూడవ వ్యక్తిని నిమియమించుకుని ఈ తతంగం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ నుండి నిత్యం ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వేలాదిమంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సులో తమ గమ్యాస్థానాలకు చేరుకుంటారు. అయితే ప్రయాణీకుల రక్షణ సౌకర్యార్థం 11మందిని ఔట్ సోర్సింగ్ పద్దతిలో సెక్యూరిటీ గార్డులను నియమించడం జరిగింది. నిబంధనల మేరకు ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రతినెలా అందించాల్సి ఉండగా, ఇక్కడ బినామీగా కొనసాగుతున్న కాంట్రాక్టర్ మూడునాలుగు మాసాలకు ఒకసారి వేతనాలు చెల్లిస్తున్నట్లు సమాచారం. కార్మిక చట్టం, నిబంధనల మేరకు ఒక్కో సెక్యూరిటీ గార్డుకు నెలకు 10,500రూపాయలు చెల్లించాల్సి ఉండగా, కేవలం 6,800రూపాయలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. పైకాగా, ఇందులో నుండే పిఎఫ్, ఇఎస్‌ఐ పేరిట కొంత మొత్తంలో కట్ చేస్తున్నట్లు పలువురు సెక్యూరిటీ గార్డులు తెలిపారు. గత 6నుండి 10సంవత్సరాల కాలంగా ఆర్టీసీ బస్టాండ్‌లో సెక్యూరిటీగార్డులు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు వారి పిఎఫ్, ఇఎస్‌ఐ పేరిట కట్ చేస్తున్న వాటికి సంబంధించిన పత్రాలను ఇవ్వలేదని సెక్యూరిటీ గార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ సంస్థ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినా, తమకు న్యాయం జరుగడం లేదని వారు వాపోయారు. ఇప్పటికైనా ఆర్టీసీ సంస్థ ఉన్నతాధికారులు స్పందించి, సెక్యూరిటీగార్డుల వేతనాలపై దృష్టి సారించి, సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు బినామీ పేర్లతో కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

వందశాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి
కలెక్టర్ డాక్టర్ యోగితారాణా

ఇందూర్, ఫిబ్రవరి 2: ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా స్పష్టం చేశారు. గురువారం ఉదయం కలెక్టర్ వర్ని మండలం మోస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎఎన్‌ఎంలతో సమావేశమై మార్పు, అమ్మఒడి కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్ధేశిత లక్ష్యాన్ని సాధించేందుకు ఆరోగ్య సిబ్బంది పట్టుదలతో పని చేయాలని సూచించారు. ఎఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు గర్భిణులకు ఆరోగ్య సూత్రాలను వివరించాలని, ఒక్క కేసు కూడా ప్రైవేటు ఆసుపత్రిలో జరుగకుండా చూడాలన్నారు. ఒకవేళా ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పులు జరిగితే సంబంధిత ఎఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మోస్రా పిహెచ్‌సిలో ఇప్పటి వరకు 73శాతం ప్రగతి సాధించారని, మార్చి 1వ తేదీ వరకు 100శాతం లక్ష్యం సాధిస్తే, ఈ ఆసుపత్రికి అల్ట్రాసౌండ్‌ను అందిస్తామన్నారు. ప్రత్యేకంగా మూడు నెలల క్యాలెండర్‌ను అందరికి ఇచ్చినందున జాబితాలో ఉన్న గర్భిణులతో మాట్లాడితే వందశాతం లక్ష్య సాధన సులభమవుతుందన్నారు. శిశు మరణాలను తగ్గించి, ఎంఎంఆర్ పెరిగేందుకు కృషి చేయాలన్నారు. రక్తహీనతతో ఉన్న గర్భిణు లకు, రక్తం పెంపొందించేందుకు అవసరమైన మందులను అందించాలన్నారు. అంతకంటే ముందు ఆసుపత్రికి వచ్చే పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించాలని, కోపంతో విసుకోవద్దని కలెక్టర్ సూచించారు. వైద్య సిబ్బంది ఆలోచనలో మార్పు రావాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ సిక్తాపట్నాయక్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ తదితరులు ఉన్నారు.

ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ దాడులు
* ఇద్దరిపై కేసు నమోదు
పిట్లం, ఫిబ్రవరి 2: పిట్లం మండలంలో గురువారం కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ టాస్క్ఫోర్స్ సిఐ బీర్‌సింగ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. మండలంలోని చిన్నకొడప్‌గల్‌లో అక్రమంగా కల్తీకల్లు విక్రయిస్తున్న దుకాణంపై దాడి చేసి, 320లీటర్ల కల్లును ధ్వంసం చేసి, నిర్వాహకుడు మారుతిగౌడ్‌పై కేసు నమోదు చేశారు. అలాగే కుర్తి గ్రామంలో బెల్టుషాప్‌పై దాడులు చేసి, అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్టుషాప్ నిర్వాహకుడు మహేందర్‌పై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ టాస్క్ఫోర్స్ ఎస్‌ఐ పటేల్‌బానోత్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

డిపో-1 ఎదుట ఎంప్లారుూస్ యూనియన్ ధర్నా
కంఠేశ్వర్, ఫిబ్రవరి 2: పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆర్టీసీ డిపో-1 ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు జివి.చారి, సాయిలు మాట్లాడుతూ, సకల జనుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సమ్మె చేసిన రోజులకు సంబంధించి ప్రభుత్వం కార్మికులకు వేతనం చెల్లించాలన్నారు. 2013నుండి 2016వరకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లించాలని, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను వెంటనే భర్తీ చేసి, కార్మికులపై పని భారం తగ్గించాలన్నారు. రిటైర్డ్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. 50శాతం ఏరియల్స్ బాండ్స్ అందజేయాలన్నారు. జోనల్ వర్క్‌షాప్ నందు బిబియును మెరుగుపర్చాలన్నారు. ఈ ధర్నాలో డిపో-1 అధ్యక్ష, కార్యదర్శులు రామడుగు గంగాధర్, అబ్బయ్య, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్
వినాయక్‌నగర్, ఫిబ్రవరి 2: కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉందని, దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఓనగూరిందేమీ లేదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆరోపించారు. గురువారం నగరంలోని సిఐటియు కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నిరాశే మిగిల్చిందన్నారు. ప్రజలపై పరోక్షంగా పన్ను భారం మోపడంతో పాటు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై చిన్నచూపు చూడటం జరిగిందన్నారు. కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు నిరసనగా ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు నిరసనలు తెలుపాలని ఆయన పిలుపునిచ్చారు.