నిజామాబాద్

ఆధునాతన హంగులతో కలెక్టరేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 5: పరిపాలన సౌలభ్యంకోసం నూతన సమీకృత భవ న సముదాయాలకు ఆయా జిల్లాల అధికారుల కసరత్తు అనంతరం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయా జిల్లాల సమస్యలపై ముఖ్యంగా సంక్షే మ పథకాల అమలుతీరుపై ఆరా తీసి దిశానిర్దేశం చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడి వంద రోజులు పూర్తయినా పలు జిల్లాల్లో ఇప్పటికీ పరిపాలనపై పట్టు బిగించకపోవడం, కార్యాలయాల్లో అసౌకర్యాలు, అధికారుల అవస్థల నేపథ్యంలో ఆధునిక హంగులతో సమీకృత కార్యాలయాలు నిర్మించాలని, ఇందుకోసం నిధుల కొరత లేకుండా చూస్తామని ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారు. ఇందుకోసం విశాలమైన స్థలాన్ని సేకరించి, భవనాల నిర్మాణం ఆధునిక హంగులతో వేగవంతం చేయాలని, ఈనెల 10వ తేదీలోగా పూర్తి ప్రణాళికతో ప్రతిపాదనలు నివేదించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ కార్యాలయంతోపాటు వివిధ శాఖల కార్యాలయాలను ఒకేచోట నిర్మించి, అధికారులకు వసతి కల్పించే లా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో పాత కలెక్టరేట్ కార్యాలయం అందరికి అనువుగా ఉన్నప్పటికీ ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంటున్న నేపథ్యంలో పట్టణ శివారు 25ఎకరాల వరకు భూమి సేకరించి, అన్ని కార్యాలయాలు ఒకే చోట నిర్మించాలని జిల్లా యంత్రాంగం భూసర్వే నిర్వహించింది. 18ఎకరాల 20గుంటల స్థలాన్ని ఇప్పటికే సేకరించి ఉన్నందునా 44కార్యాలయాల భవనాలు నిర్మించేలా అంచనాలు సిద్దంచేశారు. జిల్లా పోలీసు కార్యాలయం కూడా అక్కడే ఉండేలా ఎస్పీ శ్రీనివాస్ సైతం స్థలాన్ని పరిశీలించారు. నిర్మల్‌లో పాత ఎమ్మార్వో కార్యాలయం పరిసరాల్లో రెండు ఎకరాల భూమిని గుర్తించగా ఇది సరిపోదని ఉన్నతాధికారులు తేల్చిచెప్పడంతో తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వగ్రామమైన ఎల్లపల్లి శివారులో 11 ఎకరాల సర్కారు భూమిని గుర్తించగా మిగిలిన 10ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు సాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రస్తుత కార్యాలయం ఏమాత్రం అనుకూలంగా లేనందున దానివెనక కళాశాల రోడ్డులో బూదాన్ వద్ద ఎట్టకేలకు 28ఎకరాల స్థలంలో సువిశాలంగా భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనూ ఇదే భూమి సర్వే ప్రతిపాదనను కలెక్టర్ ముఖ్యమంత్రికి సమర్పించినట్లు తెలిసింది. ఇక ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాల్లో సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి, 30 ఎకరాల స్థలంలో సువిశాలంగా కలెక్టరేట్, జిల్లా ఎస్పీతో పాటు మిగతా 40 శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సర్వే నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీలతో పాటు మంత్రులు, ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ఎమ్మెల్యేల అంగీకారం తెలిపిన పిమ్మటే పూర్తి స్థాయి నివేదికలను సిఎంకు సమర్పించారు. ఈ నాలుగు జిల్లాల్లో ఏడాదిలోగా భవన నిర్మాణాలు పూర్తిచేసి అప్పగించాలని ప్రభుత్వం ఇప్పటికే భావించి ఇందుకోసం శరవేగంగా టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తోంది.

మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
* నేడు సిర్పూర్ నియోజకవర్గానికి రాక
కౌటాల, ఫిబ్రవరి 5: సిర్పూర్ (టి) నియోజక వర్గంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మాల నాగేశ్వర రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర దేవదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిల పర్యటన సోమవారం జరగనుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక శ్రద్దతో ఏర్పాట్లను పూర్తి చేసారు. రోడ్డు భవనాల శాఖ తరుపున మొత్తం 155కోట్ల పనులకు సంబంధించి మంత్రులు భూమి పూజాలు చేయనున్నారు. ఇందులో ప్రాణహిత నదిపై చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద నిర్మించే రూ.55 కోట్ల అంతరాష్ట్ర వంతెన పెద్దది. పెద్దవాగుపై మరో వంతెనతో పాటు పలుచోట్ల స్థానికంగా అత్యవసరం ఉన్న రహదారులను డబుల్ రోడ్లుగా మార్చే పనులకు మంత్రులు భూమి పూజాలు చేయనున్నారు. దీంతో పాటే విద్యుత్ శాఖ తరుపున మంజూరు అయి నిర్మిణం పూర్తి చేసుకున్న మూడు విద్యుత్ సబ్‌స్టేషన్‌ల నిర్మాణం జరిగిన నేపథ్యంలో మంత్రులు ప్రారంభించడమే కాక కాగజ్‌నగర్‌లో రైతులకు విద్యుత్ కనెక్షన్ల మంజూరు పత్రాలను అందజేయనున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో రైతులతో ముఖాముఖి మాట్లాడటంతో పాటు గూడెం వంతెన పనులను పరిశీలించి మంత్రులు అక్కడే ప్రజలతో సభలో మాట్లాడేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనప్ప తన స్వంతంగా విద్యార్థులకు అందజేస్తున్న కళాశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి మంత్రులు హాజరై కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భోజనాన్ని చేయనున్నారు. ఆపై పలు చోట్ల వివిధ కార్యక్రమాలలో పాలు పంచుకోనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు బిజిబిజిగా సాగనున్న మంత్రుల పర్యటనలో మంత్రుల పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నియోజక వర్గంలోని కాగజ్‌నగర్, పెంచికల్‌పేట, బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో ఈ పర్యటన సాగనుండగా మంత్రుల పర్యటన ప్రారంభోత్సవాల కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తెరాస శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కోరారు. ఆదివారం గూడెం వద్ద ఎమ్మెల్యే పర్యటనలో ఆర్ అండ్ బి శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ నజీర్ అహ్మద్, ఇంజనీర్ వెంకటేష్, నాయకులు జగ్గాగౌడ్, డోకే రాజన్న తదితరులు ఉన్నారు.

బాసర భక్తజన సంద్రం
బాసర, ఫిబ్రవరి 5: బాసర క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం బాసరకు భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన భక్తులతో గోదావరి నది తీరం భక్తజన సంద్రంగా మారింది. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు, చిన్నారులు అమ్మవారి అక్షరాభ్యాస మండపంలో అక్షరాభ్యాస పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు చిన్నారులకు వేద మంత్రోచ్చరణల మద్య అక్షరాభ్యాస పూజలను ఘనంగా జరిపించారు. భక్తులు,చిన్నారులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి అన్నదాన సత్రంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. సుమారు 20 వేల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని పూజలుచేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. లడ్డూప్రసాదాలు, ఆర్జిత సేవల ద్వారా ఆలయానికి రూ. 5 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

నిర్వాసితులను ఆదుకుంటాం
* మంత్రి జోగు రామన్న
ఉట్నూరు, ఫిబ్రవరి 5: స్థానిక గోపాయి చెరువు ఆయకట్టును మిని ట్యాంక్ బండ్‌గా నిర్మిస్తుండడంతో పలువురు నివాస గృహాలు కోల్పోతున్న నేపథ్యంలో ఆదివారం ఉట్నూరుకు వచ్చిన అటవీ శాఖ మంత్రతి జోగురామన్నకు తమను ఆదుకోవాలంటు వార్డు మెంబర్ గట్క రమేష్ అధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్భంగా జోగురామన్న మాట్లాడుతూ మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గోపాయి చెరువు అభివృద్దికి కృషి చేస్తూ మిని ట్యాంక్‌బండ్‌గా నిర్మిస్తున్నామని, ఆయకట్టు ఎత్తు పెంచడం వల్ల నివాస గృహాలు కోల్పోయే వారికి ఇతర చోట స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసి నివాస గృహాలు అందించేలా కృషి చేస్తామని అన్నారు. ఏ అభివృద్ది అయిన ప్రజల సహకారం ఉంటేనే జరుగుతుందని, నష్టపోయిన వారు అందోళన చెందకుండా సహకరించినట్లయితే వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు.

ఎస్సీ కార్పొరేషన్ రుణాలివ్వాలి
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 5: 2015-16 సంవత్సరానికి గాను ఆదిలాబాద్ జిల్లాలో స్వయం ఉపాధి రుణాల కోసం ఎస్సీ కార్పోరేషన్ కార్యాలయానికి 11,322 మంది అర్హులైన దళిత నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంత వరకు 584 మంది లబ్దిదారులకు మాత్రమే సబ్సిడి విడుదల చేయడం జరిగిందని, మిగిలిన అభ్యర్థులకు కూడా సత్వరమే సబ్సిడీ నిధులు అందించాలని ఎమ్మార్పీ ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ మాదిగ, అధికార ప్రతినిధి నక్కరాందాస్ వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో 1833 దరఖాస్తులను ఎంపిక చేసి కేవలం 584 మంది లబ్దిదారులకు మాత్రం సబ్సిడి అందించడం వల్ల మిగిలిన వారికి అన్యాయం జరిగిందన్నారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకొని ఏడాది గడుస్తున్నప్పటికీ సబ్సిడి నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో ఎస్సీ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అధికారులు స్పందించి సత్వరమే ఎస్సీ కార్పోరేషన్ రుణాలు లబ్దిదారులకు అందే విధంగా చూడాలని వారు కోరారు.

19న ఎస్సెస్సీ మోడల్ టెస్ట్
* ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కిరణ్
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 5: ఈనెల 19వ తేదీన ఎస్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో నిర్వహించే పదవ తరగతి మోడల్ టెస్ట్‌ను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సుందరయ్య భవనంలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న సంధర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని, పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షకు సిద్దమయ్యేందుకు ఈ మోడల్ టెస్ట్ ఎంతో ఉపయోగడపడుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ విద్యావంతుల అధ్వర్యంలో ప్రశ్నపత్రం తయారు చేయడం జరిగిందని, ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. విద్యార్థులు ఎంట్రీ ఫీజు రూ.15 చెల్లించాల్సి ఉంటుందని, ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజు, కార్తీక్, కపిల్, జయశ్రీ, చందన తదితరులు పాల్గొన్నారు.

ఉభయ రాష్ట్రాలకు వారధి.. గూడెం వంతెన
కౌటాల, ఫిబ్రవరి 5: తెలంగాణ-మహారాష్ట్ర ప్రాంతాలకు వారథిగా నిలిచే గూడెం హైరి వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు కేటాయించడంతో ఇరు రాష్ట్రాల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలోని గూడెం గ్రామం వద్ద గల ప్రాణహిత నదిపై రూ.54 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అంతరాష్ట్ర వంతెన నిర్మాణంతో ఒక్కసారిగా రవాణా సంబంధాలు రూపుమారనున్నాయి. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు అనుసంధానం కానుంది. మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ల నుండి తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు ముఖ్య పట్టణాలకు వెళ్లేవారికి దూరభారం తగ్గనుంది. గతంలో 600 నుండి 650 కి.మీటర్ల వరకు దూరం ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉండగా గూడెం వంతెన నిర్మాణంతో 100 నుండి 150 కి.మీటర్ల మేర రవాణా దూరం తగ్గడంతో పాటు అత్యంత సౌలభ్యంగా మారనుంది. ముఖ్యంగా స్థానిక ప్రజలకు, రైతులకు, అన్ని వర్గాల వారికి ఈ వారథి అనేక విధాలుగా మేలు చేయనుంది.
వాణిజ్య కారిడర్‌కు మార్గం
గూడెంహైరి వంతెన నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తయిన తరువాత అత్యంత వెనకబడ్డ సిర్పూర్ నియోజకవర్గం, కుమురంబీం ఆసిఫాబాద్ జిల్లాలు అభివృద్ది పరంగా రూపురేఖలను మార్చుకునే పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం ఎటువంటి వాణిజ్య వ్యాపారాలకు అంతంత మాత్రం అనువుగా ఉన్న సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్, చింతలమానెపల్లి, గూడెం, దిందా, కర్జెల్లితో పాటు కౌటాల, సిర్పూర్ మండలాలకు అత్యంత మేలు జరగనుంది. మన రాష్ట్రానికి స్టీల్ ఎక్కువగా చత్తీస్‌ఘడ్ నుండే రావాల్సి ఉన్న పరిస్థితుల్లో రవాణాపరంగా చార్జీలు కూడా తగ్గి అత్యంత మేలు జరగనుంది. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతం వాణిజ్యానికి, వ్యాపారాలకు కారిడర్‌గా ఏర్పాటు కావడం స్థానికులకు ఎంతగానో మేలుచేకూర్చనుంది.
శరవేగంగా నిర్మాణ పనులు
చింతలమానెపల్లి మండలంలోని గూడెంహైరి వంతెననిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. రోడ్లు భవనాల శాఖ తరుపున స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అత్యంత చొరవతో ముఖ్యమంత్రి కెసి ఆర్‌ను ఒప్పించి ఈ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరి చేయించారు. ఈ పరిస్థితుల్లో రూ.54 కోట్లతో కొనసాగుతున్న ఈ నిర్మాణ పనులు ఒక కి.మీటర్ ప్రాణహిత నదిపై పొడవుతో నిర్మించనుండగా మొత్తం 24 ఫిల్లర్లు, రెండు బ్లాక్‌లుగా నిర్మించనున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించి సుమారు 5 నెలలు పూర్తవుతుండగా కాంట్రాక్ట్ పొందిన వల్లభనేని కన్‌స్ట్రక్షన్ వారు, ఆర్ అండ్‌బి అధికారులు ఎమ్మెల్యే ఆదేశాలతో పనులను వేగంగా పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా నీటిని మళ్ళించి తెలంగాణ భూభాగంలో 13 ఫిల్లర్లను నిర్మించేందుకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తిచేశారు. వీటిలో 3 ఫిల్లర్ల నిర్మాణం పూర్తికాగా మరో 6 ఫిల్లర్లకు సంబంధించి కందకాలను, బెడ్‌లెవల్ పనులు పూర్తయ్యాయి. 24 మీటర్ల ఎత్తుతో, 40 మీటర్ల వేడల్పుతో నిర్మిస్తున్న ఈ వంతెనను అత్యధునిక టెక్నాలజీతో 2018 మార్చి నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో పనులను కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా మారుమూల ప్రాంతంలో గూడెంహైరి వంతెన నిర్మాణం అభివృద్దికి బాటలు వేయనుండడం హర్షించదగిన పరిణామమని, దీనికి సహకరించిన ఎమ్మెల్యేకు, ముఖ్యమంత్రికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అభివృద్ది ఊహించలేని విధంగా ఉంటుంది
* ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
సిర్పూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత వెనకబడ్డ ప్రాంతం. కాగా ఇక్కడ అన్ని విధాల అభివృద్ది సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి గూడెంహైరి వంతెన ఎంతగానో దోహదపడనుంది. నాలుగు లైన్ల రహదారికి అనుసంధానం కానున్న ఈ వంతెనతో ప్రస్తుతం ఉన్న మారుమూల గ్రామాలు ఒక్కసారిగా పట్టణాలను వెనక్కినెట్టే పరిస్థితులు ఉన్నాయి. దీనికి సహకరించిన ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరుపున రుణపడి ఉంటాను.

ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
* జిల్లా ఎస్పీ శ్రీనివాస్
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 5: ఆన్‌లైన్ లావాదేవీలు జరిపేటప్పు డు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు వహించాలని, బ్యాంకు ఖాతా నెంబర్, పిన్ నెంబర్లు ఇతరులకు తెలియజేయరాదని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయం నుండి టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీసు అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో ఆన్‌లైన్ ద్వారా జిల్లా ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను ఇంటివద్ద నుండి కొనుగోలు చేస్తుండడంతో ఆన్‌లైన్ ద్వారా కొనుగోళ్ళు చేసే ప్రజల సంఖ్య పెరగడంతో పాటు ఆన్‌లైన్ వ్యాపారం నిర్వహించే సంస్థలు అధికమవుతున్నాయని అన్నా రు. ఆన్‌లైన్ వ్యాపారంలో జరిగే లోపాలను అందిపుచ్చుకొని కొన్ని ముఠాలు మోసాలకు పాల్పడడంతో వినియోగదారులు నష్టపోతున్నారని అన్నారు. ప్రస్తుత తరుణంలో నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలు దృష్టిపెట్టిన నేపథ్యంలో జిల్లా ప్రజలు ఆన్‌లైన్ మోసాల భారిన పడకుండా జాగృతపర్చేందుకు జిల్లా పోలీసు అధికారులు బాధ్యతగా తీసుకోవాన్నారు. పోలీసులు గ్రామస్థాయిలో నిర్వహించే కార్యక్రమాల్లో ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు తప్పకుండా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా జిల్లాలోని నిరక్షరాస్యులు, గ్రామీణులను జాగృతపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి సైబర్ నేరాల పరిశోధనతో పాటు సైబర్ నేరాల నిరోధన, ముందస్తు జాగ్రత్తల విషయంలో హైదరాద్‌లోని పోలీసు రాష్ట్ర కార్యాలయంలో సత్వర శిక్షణ ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు తమ పిన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఏటి ఎం నెంబర్లను ఇతరులకు తెలుపకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ఖాతాదారులు ఏటి ఎం ద్వారా కొనుగోలు చేసి స్వైప్ చేస్తున్న సమయంలో పిన్ నెంబర్ వ్యాపారస్తునికి చెప్పవద్దని సూచించారు. ఖాతాదారుల స్వయం జాగ్రత్తలే మన డబ్బుకు రక్షణగా భావించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడే మోసాలకు గురికావడానికి ఆస్కారం ఉందన్నారు. ఫోన్‌లోనే లావాదేవీల సమాచారం ఉన్నందునా ఫోన్‌లు ఇతరులకు ఇవ్వకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. ఈ సంధర్భంగా పోలీసు అధికారులు గ్రామ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి, వినియోగదారులను చైతన్యపర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ బి.ప్రవీణ్, ఎస్సైలు అన్వర్ ఉల్ హఖ్, జి.రామన్న, సిసిఎం పోతరాజు తదితరులు పాల్గొన్నారు.

క్రీడల అభివృద్ధికి కృషి
* అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
ఉట్నూరు, ఫిబ్రవరి 5: తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ది కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర అటవీ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్ మైదానంలో క్రికెట్ క్రీడాకారుడు రజనీకాంత్ స్మార క క్రికెట్ టోర్నమెంట్‌ను మంత్రి రామన్న ప్రారంభించారు. ఈ సందర్భం గా మూడు రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడా జట్లతో కరచాలనంచేసి క్రీడలను ప్రారంభించారు. ఏర్పాటుచేసిన సభ లో మంత్రి రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్సాహిస్తూ క్రీడాకారులను వెలికితీసేకుందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. కేవలం క్రికెట్ పోటీలే కాకుండా అన్ని రకాల గ్రామీణ క్రీడలను వెలుగులోకి తెచ్చేందుకు ముందుకు వెళ్తున్నామని అన్నారు. క్రీడారంగమే కాకుండా అన్ని రంగాల అభివృద్దికి ముఖ్యమంత్రి కెసిఆర్ కంకణం కట్టుకొని బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారన్నా రు. యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ వారిని ప్రోత్సాహిస్తున్నారని అన్నారు. ఈ క్రికెట్ పోటీల్లో గెలిచిన వారు మరో గెలుపుకోసం, ఓడిన వారు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకొని గెలుపు కోసం కృషిచేస్తూ క్రీడాస్పూర్తిని చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు సలీమోద్దిన్, అబుజర్, భీంరావు, అంజత్‌ఖాన్, ఎంపిపి విమల రాథోడ్, జడ్పీటీసీ జగజీవన్, దాసన్న ప్రభాకర్, క్రిడాకారులు పాల్గొన్నారు.