నిజామాబాద్

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 8: అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షణమని, తన నాయకత్వ పటిమతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశంసించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. బుధవారం వర్ని, కోటగిరి మండలాల్లో మంత్రి పోచారం సుడిగాలి పర్యటన జరిపారు. సుమారు 6.13కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి పోచారం మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడితే ఏమొస్తుంది అనే వారికి నేడు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని మంత్రి పోచారం పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైతే రాష్ట్రం అంధకారంగా మారుతుందని కొందరు సమైక్యాంధ్ర నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. వారి హయాంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక తెలంగాణలో సేద్యపు రంగం పూర్తిగా కుంటుపడిపోయిందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని, ఫలితంగా ప్రస్తుతం వ్యవసాయ రంగానికి ఉదయం వేళలోనే 9గంటల విద్యుత్‌ను అందించగల్గుతున్నామని అన్నారు. భవిష్యత్ అవసరాలను సైతం పరిగణలోకి తీసుకుంటూ 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం 91వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ప్రభుత్వం విద్యుదుత్పాదక కేంద్రాలను నిర్మిస్తోందని వివరించారు. 2018నాటికి విరివిగా విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, రాబోయే యాభై సంవత్సరాల వరకు కూడా విద్యుత్ కొరత తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు. రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ్ధాకారిని నియమించామని అన్నారు. రాష్ట్రంలో మొత్తం కోటి ఎకరాలకు గాను ఇదివరకు ఉన్న వేయి మంది ఎఇఓలకు, అదనంగా మరో వేయి మందిని నియమించామన్నారు. ఎఇఓలు స్థానికంగానే రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారని అన్నారు. భూసార పరీక్షలను స్థానికంగా చేయడం కోసం ప్రతి ఎఇఓ పరిధిలో ఒక మినీ భూసార పరీక్ష పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పుతామని అన్నారు. రైతులు పండించే పంటల వివరాలను సేకరించి ఎఇఓలు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని, వాటి ఆధారంగా వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేసి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేస్తామని చెప్పారు. కాగా, వర్ని మండలం చింతకుంట, తిమ్మాపూర్, లక్ష్మాపూర్, కారేగాం గ్రామాల్లో ప్రజలతో భేటీ అయిన సందర్భంగా వారు పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. వాటి పరిష్కారం పట్ల అధికారులు చొరవ చూపడం లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా, మంత్రి పోచారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. జలాల్‌పూర్‌లో 13లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, గిడ్డంగి నిర్మాణానికి భూమిపూజ చేశారు. కూనిపూర్, అక్బర్‌నగర్‌లలో నూతనంగా నిర్మించిన 33/11కెవి సబ్‌స్టేషన్లను ప్రారంభించారు. కోటగిరి మండల కేంద్రంలో 3కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహానికి శంకుస్థాపన, 25లక్షలతో నిర్మిస్తున్న ముదిరాజ్ కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ చేశారు. సైదాపూర్‌లో కొనసాగుతున్న జగదాంబ భవాని, శ్రీ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి వెంట జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, డిసిసిబి చైర్మెన్ గంగాధర్‌రావు పట్వారి, వర్ని ఎంపిపి భాస్కర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

వేగం పెరిగితేనే లక్ష్యం నెరవేరేది
* ‘్భగీరథ’ నిర్దేశిత లక్ష్యం డిసెంబర్..
* వేగం పుంజుకున్న పనులు
* ఇప్పటికే పలుమార్లు గడువుల పొడిగింపు

ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, ఫిబ్రవరి 8: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలలో 2017 డిసెంబర్ చివరి నాటికి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అయితే ఈ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న పనులను మరింత వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. మిషన్ భగీరథకు వైస్ చైర్మన్‌గా నిజామాబాద్ జిల్లాకే చెందిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కొనసాగుతున్నారు. దీంతో సహజంగానే ఆయన సొంత జిల్లాలో పనులు గత కొన్నాళ్ల నుండి పుంజుకున్నాయి. హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే, స్థానికంగా కూడా క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలిస్తూ అధికారులు, గుత్తేదార్లకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో గడపగడపకు శుద్ధి జలాలు అందించాలంటే మాత్రం పనుల్లో తప్పనిసరిగా మరింత వేగం పెరగాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే తొలిదశలో పలు గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తామంటూ గడువులు ప్రకటిస్తూ, తీరా పనులు పూర్తి కాకపోవడంతో వాటిని పొడిగిస్తూ వస్తున్నారు. కనీసం డిసెంబర్ చివరి నాటికైనా ఈ పరిస్థితి ఉత్పన్నం కాకూడదంటే పనులను రెట్టింపు వేగంతో చేపట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. నిజానికి ఉమ్మడి జిల్లాలో 2016 జూన్ 30వ తేదీ నాటికే 121 గ్రామాలు, డిసెంబర్ 31వ తేదీ నాటికి 148 గ్రామాలకు శుద్ధి జలాలు అందిస్తామని ఇదివరకు ప్రకటించారు. అలాగే ఈ ఏడాది జూన్ 30 నాటికి 444గ్రామాలు, 2017 డిసెంబర్ నాటికి మిగిలిన 932 గ్రామాలకు మిషన్ భగీరథ కింద ఇంటింటికి నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించారు. కానీ ఇంతవరకు తొలివిడత గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని అందిచలేదు. ఈ పథకానికి సంబంధించి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు మొత్తం 2611కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని మొదట్లోనే అధికారులు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి రోజుకు 100లీటర్లు, మున్సిపల్ పట్టణాల్లో 135లీటర్లు, నగరాల్లో 150లీటర్ల చొప్పున నీటిని అందించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలు, మున్సిపాలిటీల పరిధిలోని 785 గ్రామాలకు సింగూరు రిజర్వాయర్ నుండి, నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి సెగ్మెంట్లు, బల్దియాల పరిధిలోని 860 ఆవాసాలకు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ద్వారా నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించి పనులు చేపడుతున్నారు. పై రెండు జిల్లాలలో మొత్తం 3410 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ మెయిన్ గ్రిడ్ పైప్‌లైన్లు, గ్రామాల్లో అంతర్గతంగా నిర్మించే పైప్‌లైన్ల పొడవు 5200 కిలోమీటర్లు, అంతర్గత పైప్‌లైన్లకు ఏర్పాటు చేసే జాయింట్లు 2.09 లక్షల కిలోమీటర్ల పొడవు, ఇంటింటికి ఇచ్చే నల్లా కనెక్షన్ల సంఖ్య 5 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఐటిఐ అభ్యర్థులను ఎంపిక చేసి వారికి అవగాహన కల్పించారు. మెయిన్ గ్రిడ్ ఫిట్టర్స్ 60 మంది, అంతర్గత పైప్‌లైన్ల ఏర్పాటుకు 500 మంది ఫిట్టర్లు, 1500 మంది హెల్పర్లు, మరో 500 మంది ప్లంబర్లు అవసరమవుతారని అంచనా వేస్తూ, వారిలో ఇప్పటికే కొంతమందిని ఎంపిక చేసుకుని పనులు పురమాయించారు. ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసిన అనంతరం పథకాల నిర్వహణకు 1734 మంది సిబ్బంది అవసరమవుతారు. వారిని పదేళ్ల కాల పరిమితి ఒప్పందంపై నియామకాలు చేపడతామని, సమర్థవంతంగా పని చేసే వారి సేవలను దీర్ఘకాలం పాటు పొడిగిస్తామని ఐటిఐ అభ్యర్థులకు అవగాహన తరగతుల సందర్భంగా అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఆయా గ్రామాల్లో అభ్యర్థులు అంతర్గత పైప్‌లైన్‌ల పనులను చేపడుతున్నారు. ఇవి సకాలంలో పూర్తి కావాలంటే మరింత వేగవంతంగా చేపడుతూ, అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగిస్తేనే డిసెంబర్ నెలాఖరు నాటికి ఇంటింటికి తాగునీరందనుంది.
మెడికల్ కాలేజీలో ఎంసిఐ బృందం పరిశీలన
* అన్ని విభాగాలపై ఆరా తీసిన సభ్యులు
* అనుమతి వస్తుందని వైద్య సిబ్బంది ఆశాభావం
* రెండో రోజు వైద్య సిబ్బంది ధ్రువపత్రాల పరిశీలన

కంఠేశ్వర్, ఫిబ్రవరి 8: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతులు మంజూరు చేసేందుకు వీలుగా సరిపడా వౌలిక వసతులు, సదుపాయాలను పరిశీలించేందుకు భారత వైద్య మండలి(ఎంసిఐ) ప్రతినిధుల బృందం బుధవారం ఇక్కడికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. 2012లోనే మెడికల్ కాలేజీ ఏర్పాటవగా, ప్రస్తుతం ఎంబిబిఎస్ చివరి సంవత్సరం అనుమతుల కోసం ఈ పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. తొలి దఫా పరిశీలన జరిపిన సందర్భంగా సరైన బోధనా వసతులు, సౌకర్యాలు లేవనే సాకుతో ఎంసిఐ అనుమతిని నిరాకరించింది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు సదుపాయాలను కొంతవరకు మెరుగుపర్చి మరోమారు దరఖాస్తు చేశారు. దీంతో ఎంసిఐ ప్రతినిధులు తాజా పరిశీలన కోసం హాజరయ్యారు. ముంబైలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల గైనకాలజిస్టు విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ ఆనంద్, చెన్నై కెఎంసి కళాశాల మైక్రో బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ లీలా, నాగ్‌పూర్ ప్రభుత్వ కళాశాల ఫిజియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్‌ఎల్.కామ్లెలు మెడికల్ కళాశాలతో పాటు, దానికి అనుబంధంగా ఉన్న జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని పరిశీలించారు. ఎంసిఐ నిబంధనలకు అనుగుణంగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, క్లినికల్ పాథలాజీ, మెడిసిన్, ఫోరెన్సిక్ విభాగాలే కాకుండా ప్రభుత్వాసుపత్రిలోని గైనిక్, పిడియాట్రిక్, ఐసియు, ఎన్‌ఐసియు, ఎంఐసియు, మేల్, ఫిమేల్, సర్జికల్ వార్డులను, అత్యవసర విభాగంలో ఉన్న వసతి, సౌకర్యాలను నిశితంగా పరిశీలన జరిపారు. జిల్లా ఆసుపత్రిలో ఏవిధంగా వైద్య సేవలందిస్తున్నారనే వివరాలను రోగుల ద్వారా ఆరా తీశారు. అంతకుముందు ఫైనలియర్ అనుమతికి సంబంధించిన వౌలిక వసతుల విషయంలో మెడికో విద్యార్థులను కలిసి పలు వివరాలు సేకరించారు. కాగా, గురువారం కూడా ఈ బృందం స్థానికంగానే ఉండి అన్ని విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు మెడిసిన్ అభ్యసించిన పట్టాలతో పాటు వైద్య సిబ్బంది ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. పరిశీలన అనంతరం ఎంసిఐకు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శాఖకు నివేదికను అందజేయడం జరుగుతుందని ఎంసిఐ సభ్యులు తెలిపారు. వారి వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర, సూపరింటెండెంట్ రాములు, ఆర్‌ఎంఓలు ప్రతిమారెడ్డి, బాల్‌రాజ్, లక్‌పతి, జలగం తిరుపతిరావు, ఇ-ఆసుపత్రి ఇన్‌చార్జి డాక్టర్ బన్సీలాల్, గోపాల్‌లతో పాటు అధికారులు ఉన్నారు.

విఆర్‌ఓ దారుణ హత్య
* హతుడు బీర్కూర్ గ్రామ రెండో విఆర్‌ఓ రాములు
* వివాహేతర సంబంధమే కారణం!?
బీర్కూర్, ఫిబ్రవరి 8: మండల కేంద్రంలోని ఓల్డ్ వాటర్ ట్యాంక్ కాలనీలో బుధవారం ఉదయం బీర్కూర్ గ్రామ రెండో విఆర్‌ఓ ఎ.రాములు (46) దారుణ హత్యకు గురయ్యాడు. డిఎస్పీ నర్సింహారావు కథనం ప్రకారం బాల్కొండ మండలం సుర్బిర్యాల్‌కు చెందిన ఎ.రాములు గత ఏడాదిన్నర క్రితం బీర్కూర్ గ్రామ రెండో విఆర్‌ఓగా విధుల్లో చేరారు. ఈ క్రమంలోనే బుధవారం ఒంటిపై దుస్తులు లేకుండా, తలపై బలమైన గాయాలతో శవమై కనిపించాడు. గ్రామస్థులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ను రప్పించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని బాన్సువాడ డిఎస్పీ నర్సింహారావు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించామని అన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. బీర్కూర్ గ్రామానికే చెందిన ఓ మహిళా విఆర్‌ఎతో రాములు సాన్నిహిత్యం పెంచుకుని గత కొన్నాళ్ల నుండి ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడని స్థానికులు పేర్కొంటున్నారు. ఆమె విఆర్‌ఎగా విధులు నిర్వర్తిస్తున్న గ్రామానికి కొన్నాళ్ల క్రితం నుండి రాములు ఇన్‌చార్జి విఆర్‌ఓగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే మహిళా విఆర్‌ఎతో ఆయనకు అక్రమ సంబంధం ఏర్పడినట్టు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి రాములు బీర్కూర్‌లోని మహిళా విఆర్‌ఎ ఇంటికి వెళ్లిన సమయంలోనే ఆయన హత్యకు గురై ఉంటాడని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. మృతుడి ఒంటిపై దుస్తులు లేకుండా, నగ్నంగా మృతదేహాన్ని తెచ్చి పడవేయడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. పోలీసు జాగిలాలు సైతం సంఘటనా స్థలం నుండి విఆర్‌ఎ ఇంటి వరకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో పోలీసులు మహిళా విఆర్‌ఎతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డిఎస్పీ నర్సింహారావు పేర్కొన్నారు. డిఎస్పీ వెంట సిఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి, తహశీల్దార్ కిష్టానాయక్, గ్రామ సర్పంచ్ దూలిగ నర్సయ్య, ఆయా గ్రామాల విఆర్‌ఓలు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

మొక్కలను సంరక్షించాలి
* కామారెడ్డి ఎస్పీ శే్వత
ఆంధ్రభూమి బ్యూరో
కామారెడ్డి, ఫిబ్రవరి 8: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా ఎస్పీ శే్వత అన్నారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తన వంతుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం గతంలో కూడా హరితహారంలో లక్షలాది మొక్కలను నాటించడం జరిగిందని, వాటిని కాపాడడంలో అధికారులు దృష్టి సారించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, కలెక్టరేట్ ఆవరణలో వందలాది మొక్కలను అధికారులు, సిబ్బంది నాటారని, వాటి సంరక్షణ బాధ్యత ఒక్కో కార్యాలయ సిబ్బంది చూస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు మొక్కల సంరక్షణకై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో పిడి చంద్రమోహన్‌రెడ్డి, జెసి సత్తయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

స్ట్ఫా నర్సులకు అందని వేతనాలు
కంఠేశ్వర్, ఫిబ్రవరి 8: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని గైనిక్, అత్యవసర విభాగం, మేల్, ఫిమేల్, సర్జికల్ వార్డులలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్న స్ట్ఫా నర్సులకు వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన మూడు మాసాల నుండి వేతనాలు చెల్లించకుండా సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ బుధవారం మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణను కలిసి తమకు రావాల్సిన వేతనాలను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనపై డిడి స్పందిస్తూ, సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి వెంటనే వేతనాలు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సమస్యల పరిష్కారానికే క్యాంపు ఆఫీస్‌లు
కామారెడ్డిలో కోటి నిధులతో 8 నెలల్లో పూర్తి * ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
ఆంధ్రభూమి బ్యూరో
కామారెడ్డి, ఫిబ్రవరి 8: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లను ఏర్పాటు చేస్తోందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. బుధవారం ప్రొబెల్స్ పాఠశాల సమీపంలోని ఎస్పీ కార్యాలయం ఎదురుగా 1200 గజాలలో నూతన క్యాంపు కార్యాలయం, వసతి గృహ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, క్యాంపు ఆఫీస్ నిర్మాణానికి కోటి రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 8 నెలల్లో క్యాంపు కార్యాలయాన్ని పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. అంతకు ముందు ఇంద్రనగర్ కాలనీలోని శ్మశాన వాటిక అభివృద్ధికి భూమి పూజ నిర్వహించారు. అక్రమణకు గురైన భూమిని వెంటనే స్వాధీనం చేసుకోని ఫెన్సింగ్ వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో శ్మశాన వాటికలో పార్కు, తాగునీరు, స్నానాల గదులు, తదితర వసతులను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ, జెసి సత్తయ్య, ఐడిసిఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, మున్సిపల్ చైర్మన్ పిప్పిరి సుష్మ, ఎంపిపి లద్దూరి మంగమ్మ, జడ్పిటిసిలు మదుసుధన్‌రావు, లక్ష్మీ, మున్సిపల్ వైస్ చైర్మన్ మసూద్ ఎంపిడిఓ చిన్నారెడ్డి, తహశీల్దార్ రవిందర్, సిఐలు శ్రీధర్‌కుమార్, కోటేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

మార్క్‌ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయాలి

* పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహంనాయుడు

ఆర్మూర్, ఫిబ్రవరి 8: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మార్క్‌ఫెడ్ ద్వారా పసుపు పంటను కొనుగోలు చేయాలని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహంనాయుడు కోరారు. బుధవారం ఆర్మూర్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాల్‌కు 15 వేల రూపాయల మద్దతు ధరను ఇవ్వాలని అన్నారు. ఎంఐఎస్ ద్వారా నష్టాన్ని భరించే అవకాశం ఉందని అన్నారు. గతంలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే పసుపు ధర అమాంతం క్వింటాల్‌కు 15 వేల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇదే విధానాన్ని ప్రస్తుతం అనుసరించాలని అన్నారు. పసుపు రైతులకు 15 వేల రూపాయల మద్దతును ధరను ఇస్తున్నామంటూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆయన కోరారు. ఇప్పటికే మార్కెట్లో 25 శాతం పసుపు విక్రయాలు జరిగాయని, మిగిలిన 75 శాతం పసుపు పంటకు మద్దతు ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ యోగితారాణా పసుపు క్వింటాల్‌కు 7500 రూపాయలకు కొనుగోలు చేయాలని చెప్పడం సరికాదని అన్నారు. ఏ ప్రాతిపదికన 7500 రూపాయల ధరను నిర్ణయించారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రకటన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని అన్నారు. కలెక్టర్ ప్రకటనతో పసుపు పంటకు ధర పెరగకుండా పోతుందని చెప్పారు. కలెక్టర్ వెంటనే తన మాటను ఉపసంహరించుకోవాలని సూచించారు. పసుపు అభివృద్ధి బోర్డు, మద్దతు ధర విషయంలో ఇటీవల హైదరాబాద్‌లో 9 జిల్లాల పసుపు ప్రతినిధులతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర్‌రావుతో సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. పసుపుకు శాశ్వతమైన పరిష్కారం కనుక్కోవడానికి చర్యలు తీసుకుందామంటూ హామీ ఇచ్చారని చెప్పారు. కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్, నిర్మల సీతారామన్‌లను నిజామాబాద్ జిల్లాకు రప్పించి పసుపు పంటపై స్పష్టమైన హామీ కోరదామని అన్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల కేంద్ర మంత్రులు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అప్పటిలోగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పసుపు రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పసుపు రైతుల సంఘం నాయకులు ఎం.మనోహర్‌రెడ్డి, నక్కల చిన్నారెడ్డి, కొట్టూర్ అశోక్‌లు పాల్గొన్నారు.

ప్రైవేట్ దవాఖానాల్లో ఫీజుల బోర్డులు తప్పనిసరి
* డిసిఐసి చైర్మన్ రాజేశ్వర్
కంఠేశ్వర్, ఫిబ్రవరి 8: ప్రజలకు అందించే వైద్య సేవలకు ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానాలు నిర్ణీత స్థాయిలో మాత్రమే ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున, ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్‌లలో ఫీజుల బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డిసిఐసి చైర్మన్ రాజేశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సవరించిన క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్-2010 యాక్ట్‌ను అమలు చేయనుందన్నారు. ఆరోగ్య సేవలను అందించే వైద్యశాలలు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తూ పోకడలు పోకుండా నిరోధించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా పేదల నుండి భారీగా ఫీజులు వసూలు చేసేందుకు ఇక కాలం చెల్లనుందని చెప్పారు. అలాగే ల్యాబ్, స్కానింగ్ సెంటర్లలో కూడా ఫీజుల బోర్డులు పెట్టాలన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్-2010 యాక్ట్‌కు పలు సవరణలు చేసి కేంద్రం తాజాగా గెజిట్ విడుదల చేసిందని, దీనిని యథాతథంగా స్వీకరించేందుకు రాష్ట్రం రంగం సిద్ధం చేసిందన్నారు.