నిజామాబాద్

సొంతగూటికి బిజెపి కౌన్సిలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, ఫిబ్రవరి 10: కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల్లో రాబోయే అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుందని బిజెపి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి దీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, గత ఏడాది క్రితం బిజెపి నుండి గెలిచి పార్టీకి దూరంగా ఉన్న ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్‌లు అయిన ప్రభాకర్ యాదవ్, చల్లరాధిక, పుల్లురి జ్యోతి సొంత గూటికి చేరడంతో వారికి పార్టీ ఖండువాలు కప్పి స్వాగతం పలికారు. బిజెపి రాష్ట్ర నాయకుడు పుల్లురి సతీష్ స్థానిక నాయకులు పంపరి లక్ష్మణ్, అశోక్‌లకు కూడా పార్టీ ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి, రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలో వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కష్టపడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 11తేది నుండి 17వ తేది వరకు జిల్లాలోని 22 మండలాల్లో ఆ జీవన సహయోగుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. పార్టీకి చందాలు ఇచ్చే వారు 2వేల రూపాయలు నగదు లేదా చెక్కు రూపంలో అందచేయాల్సిందిగా సూచించారు. అనంతరం బిజెపి అభివృద్ధి కమిటీ రాష్ట్ర చైర్మన్ ఉప్పునూతల మురళీధర్‌గౌడ్ మాట్లాడుతూ, పార్టీ పరంగా చిన్నపాటి విషయాలపై కొంతమంది కౌన్సిలర్‌లు కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ, పార్టీకి వ్యతిరేకంగా ఏలాంటి కార్యక్రమాలు చేపట్టక పోవడంతో రాష్ట్ర హైకమాండ్ సూచనల మేరకు వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం జరిగిందన్నారు. పార్టీలోని ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు సమిష్టింగా చర్చలు జరిపిన తరువాత పార్టీ కోసం ముందుకు పోవడం జరుగుతోందని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోతే కృష్ణగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నీలంరాజు, సాయిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతల రమేష్, నాయకులు తేలు శ్రీను, లడ్డురమేష్, నరేష్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.

నిజాయితీగా పని చేసే ఉద్యోగులకు అండగా ఉంటా
కలెక్టర్ యోగితా రాణా
కంఠేశ్వర్, ఫిబ్రవరి 10: విధి నిర్వాహణలో నిజాయితీతో పని చేసే ఉద్యోగులకు ఎల్లవేళలా అండగా ఉంటానని కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ క్రీడా మైదానంలో నిర్వహించిన 26వ జిల్లాస్థాయి డిపార్ట్‌మెంటల్ స్పోర్ట్స్ మీట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగులు సమష్ఠిగా కృషి ఫలితంగానే జిల్లాకు అవార్డుల పంట పండిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర అమోఘమన్నారు. విధి నిర్వాహణలో ఉద్యోగులు సమర్ధవంతంగా పని చేస్తే, అలాంటి వారికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, అదే సమయంలో విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించే వారిపట్ల ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తూ, అర్హులైన లబ్ధిదారులకు అందించాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉందన్నారు. ఉద్యోగులు తప్పు చేయకుండా సస్పెన్షన్‌కు గురైతే, అలాంటి వారి సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు తాను కృషి చేస్తానని అన్నారు. నిత్యం విధి నిర్వాహణలో ఉన్న ఉద్యోగులు అనేక ఒత్తిళ్లకు గురవుతుంటారని, అప్పుడప్పుడు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. అంతకు ముందు కలెక్టర్ జెండాను ఆవిష్కరించి జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీఓల గౌరవ అధ్యక్షుడు దేవిశ్రీప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి రాజేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్, మహిళా విభాగం చైర్మన్ రేచల్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, సతీష్‌రెడ్డితో పాటు ఉద్యోగులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

అస్తవ్యస్తంగా జలమణి
ఫిల్టర్ వాటర్ ఎరుగని సర్కారీ బడుల విద్యార్థులు

కంఠేశ్వర్, ఫిబ్రవరి 10: సర్కారీ బడుల్లో శుద్ధి చేయబడిన రక్షిత మంచినీరు విద్యార్థులకు అందని దాక్షగానే ఉండిపోతోంది. దాతలు స్పందించి కొన్ని పాఠశాలల్లో వాటర్ ఫిల్టర్‌ను సమకూర్చగా, జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో మరికొన్ని బడులలో మాత్రమే వీటిని నెలకొల్పగలిగారు. మిగతా 80శాతం బడుల్లో ఫిల్టర్ వాటర్ వ్యవస్థ మచ్చుకైనా కానరావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలబాలికలకు రక్షిత మంచినీటి సదుపాయాన్ని కల్పించాలనే సదుద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలమణి పథకం అమలు మూన్నాళ్ల ముచ్చటకే పరిమితమైంది. విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించి వారి ఆరోగ్యాలను కాపాడాలనే ఉద్దేశ్యం నెరవేరడం లేదు. జిల్లాలో సుమారు 2500 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, మొదటి విడత కింద 158 పాఠశాలలను జలమణి పథకం కింద ఎంపిక చేశారు. శాశ్వత ప్రాతిపదికన వాటర్ ఫిల్టర్ ప్లాంట్లను నెలకొల్పడం ద్వారా విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించాలని సంకల్పించారు. ఇందుకోసం జిల్లాకు 31.40 లక్షల రూపాయల నిధులు సైతం విడుదలయ్యాయి. ఈ పథకం ప్రవేశపెట్టిన సమయంలోనే పాఠశాలల్లో తరగతుల ప్రారంభానికి ముందే ఎంపిక చేసిన బడులలో యూనిట్లను నెలకొల్పాల్సి ఉండగా, అధికారులు తాపీగా అర్ధ సంవత్సరం గడిచిన తరువాత కానీ స్పందించలేకపోయారు. అది కూడా నిర్ధారించిన 158 యూనిట్లకు గాను అతికష్టం మీద 83 పాఠశాలల్లో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ యూనిట్లను చేరవేశారు. మిగతా పాఠశాలల ప్రతిపాదనలను అటకెక్కించారు. కనీసం పరికరాలు చేరిన పాఠశాలల్లోనూ వాటిని భిగించి, వినియోగంలోకి తేవాల్సి ఉండగా, సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడంతో జలమణి పథకం అమలు జిల్లాలో పూర్తిగా నీరుగారిపోయింది. యూనిట్లు చేరవేసిన 81పాఠశాలలకు గాను వాటిలో 41యూనిట్లు మాత్రమే కొన్ని రోజుల పాటు విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించగలిగాయి. అనంతరం అందులోనూ సగానికి పైగా జలమణి యూనిట్లు మూలనపడ్డాయి. ఈ పథకం కోసం ప్రభుత్వం కేటాయించిన 31.40 లక్షల రూపాయల నిధులకు గాను కేవలం 13.72 లక్షల రూపాయలను వెచ్చించి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేకపోయింది. నిధులు అందుబాటులో ఉన్నందున వాటిని సద్వినియోగం చేస్తూ విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించే అవకాశాలు ఉన్నప్పటికీ, అధికారులు ఈ పథకం అమలు పట్ల నిస్తేజంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. జలమణి పథకం గురించి పట్టింపులేనితనం ప్రదర్శిస్తున్న అధికారులు, పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పన పేరిట కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. వాటిలో తాగునీటి వసతి కల్పన పేరిట పెద్దఎత్తున నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద జిల్లాలో విద్యాశాఖ పనితీరు అస్తవ్యస్తంగా మారడం వల్లే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాల అమలు సక్రమంగా జరగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగానే గతంలో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మూడు పర్యాయాలు వరుసగా మొదటి స్థానాల్లో నిలిచి హ్యాట్రిక్ సాధించిన నిజామాబాద్ జిల్లా ఉత్తీర్ణతలో వెనుకంజలో ఉండిపోతూ వస్తోంది. కనీసం ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు నిర్లిప్త వైఖరిని విడనాడి, విద్యార్థుల ఆరోగ్యాల పరిరక్షణకు దోహదపడే జలమణి వంటి పథకాల అమలులో అలసత్వాన్ని వీడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.